జర్నీ ఆఫ్ ఏ టీచర్ -6
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి అనుభవాలను వారితో పంచుకుంటూ ఉంటాడు.)
కాలనిర్ణయ పట్టిక ప్రకారం బెల్ కాగానే నేను క్లాసుకు వెళ్లాను. ఖాళీ బెంచీలు దర్శనమిచ్చాయి. ఆశ్చర్య పోయాను.
కాలనిర్ణయ పట్టిక ప్రకారం బెల్ కాగానే నేను క్లాసుకు వెళ్లాను. ఖాళీ బెంచీలు దర్శనమిచ్చాయి. ఆశ్చర్య పోయాను.
నా పరిస్థితి గమనించి క్రాంతికుమార్ నవ్వుతూ వెనక్కి రమ్మంటూ చేత్తో సంకేతాలు పంపాడు.
“మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తయ్యే వరకు పిల్లలెవరూ రారు సార్.. నాల్గు రోజులాగండి” అంటూ టీ తాగడానికి తీసుకెళ్ళాడు.
టీ తాగుతూ మెల్లిగా నాగమణి విషయం కదిలించాను. ఆమెనలా అష్టకష్టాలు పెట్టారెందుకని ప్రశ్నించాను.
“మ్యాథ్స్ సార్.. నేనొకటి చెబుతాను.. వింటారా..” అన్నాడు క్రాంతికుమార్. చెప్పమన్నట్లుగా తలూపాను. మరో మారు టీ స్విప్ చేస్తూ.
ఎవరిదైనా మొదటి దృష్టి మన హృదయానికి హత్తుకు పోతుంది. ‘ఫస్ట్ సైట్ ఈజ్ ది బెస్ట్ సైట్’ అన్నట్లు. నాగమణి కాలేజీలో జాయిన్ కావడానికి వచ్చినప్పుడు ఒక టూవీలర్‍పై వచ్చింది. అదీ.. బండి నడిపే వాణ్ణి హత్తుకొని.. వెనుక కూర్చున్న మరొకన్ని ఒత్తుకొని. ఆ దృశ్యం జుగుప్సాకరంగా ఉంది. నేరుగా కాలేజీ ముందర దిగింది.
విద్యార్థులంతా విజిల్స్ వేస్తుంటే.. ఎవరా అని మేము బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాం.
ఆమె మ్యాథ్స్ మేడం అని మాకు మాత్రం ఏం తెలుసు?.. నిర్ఘాంతపోయి చూస్తున్నాం. నేరుగా ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్తుంటే నేను, తెలుగు సార్ కలిసి వెళ్లాం. అప్పుడు తెలిసింది.. ఆమె కొత్తగా జాయినవడానికై వచ్చిన మ్యాథ్స్ లెక్చరరని.
ఎంతైనా సార్.. వాళ్ళ నాగరికతకు మన నాగరి కతకు సరిపడదు. ఆరోజు నుండి ఆమంటే అందరికీ చులకన భావమే..”
అంటూ క్రాంతికుమార్ టీ తాగిన ఖాళీ గ్లాసును బెంచీపై పెడ్తుంటే.. ప్రభుత్వ జూనియర్ కళాశాల మునిపల్లి అని బల్లపై తెల్లని పెయింట్ చేసిన అక్షరాలు సూర్యరశ్మికి మెరుస్తున్నాయి. నేను తలగోక్కుంటూ చూస్తున్నాను. అది గమనించి క్రాంతికుమార్ “నిజమే సార్..ఇది మన కాలేజీ బెంచీయే.. మన రాములు అటెండర్ అమ్ముకొని ఉంటాడు. తాగడానికి డబ్బులు లేకుంటే ఏం చేస్తాడు మరి..?” డస్టరుతో బ్లాక్ బోర్డుపై ఉన్న చాక్ పీస్ గీతలను చేరిపేసినంత సులభంగా చెప్పాడు.
“ఆ..!” అంటూ నేను నోరు తెరిచాను. టీ ఒకింత ఒలికి కింద పడబోతుంటే జాగ్రత్త పడ్డాను. నేనూ గ్లాసు అదే బల్లపై పెడ్తూ అన్నాను..
“వాళ్ళూ.. వీళ్ళని కాదు సార్.. నేటి తరమే అలా తయారవుతోంది.
అది సరేగానీ..కాలేజీ లైబ్రరీ బుక్స్ లేవంటూ డబ్బు తీసుకున్నారని చెప్పింది నాగమణి. రశీదు కూడా ఇవ్వలేదట. బ్యాంకులో కట్టాలి కదా.. ప్రిన్సిపాల్ పర్సనల్‍గా ఎలా తీసుకుంటాడు”
క్రాంతికుమార్ గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లు గిజ, గిజ లాడాడు.
“మ్యాథ్స్ సార్.. మీరీ కాలేజీకి కొత్త. ఏ విషయాలైనా చూసీ చూడనట్లుగా ఉండండి. పట్టించుకోకండి. పాపారావు సార్ దృష్టిలో పడ్డారంటే కైమా, కైమా చేస్తాడు.
ఊళ్ళో ‘అరుణ పఠనాలయం’ అని స్థాపించారు. దానికి డబ్బులు అవసరముండి నాగమణి నుండి ఒలుచుకున్నారు.. పేరుకే పఠనాలయం గాని అందులో పాపారావు..ప్రిన్సిపాల్ వారి దోస్తులు కలిసి పేకాట ఆడే వారు. మేమంతా దాన్ని పత్తాలాలయమంటాం” అంటూ చిరునవ్వు నవ్వాడు. నేను నివ్వెరపోయాను.
జూనియర్ కాలేజీలో చాలా మతలబులున్నాయి. సరి జేయాలనుకున్నాను. సమయం పడుతుంది.. ఒక రోజులో మార్పు రాదు.
నేను గది అద్దెకు తీసుకొని ఉంటున్నట్లు కాలేజీ మొత్తం ప్రచారమై పోయింది. వారాంతంలో మాత్రమే సనత్‍నగర్ వెళ్ళి వస్తున్నాను.
ఓ రోజు సాయంత్రం పాపారావు నా గదికొచ్చాడు. చాపపర్చి కూర్చున్నాం.
“కాలేజీ నుండి రెండు కుర్చీలు తెచ్చుకోక పోయారా” అంటూ సంభాషణ మొదలు పెట్టాడు.
“బాగుండదు సార్.. నాకు నచ్చదు” అన్నాను.
“సార్.. మీరింత స్ట్రిక్ట్ గా ఉంటే ఎట్ల?.. అనుభవాల మీద గాని తెలిసి రాదు. మీ సర్వీసు మూడేండ్లయిందా? కాలేదను కుంటా.. కొత్తలో అందరూ గిట్లనే ఉంటరు.. పోనూ.. పోనూ.. రాజు గుర్రమే గాడిదైతది.. ఇదంతా ఎందుకు గాని.. కాలేజీ ఫర్నీచర్ ఇంచార్జ్ తీసుకోండి. ఫర్నీచర్ నామ్కే వాస్తే తెప్పించి.. మిగతాది నొక్కేయవచ్చు ” అంటూ ఓరగా నవ్వాడు. సిగరెట్టు తీసి వెలిగిస్తూ..
“మన క్రాంతి చూడు.. బతకనేర్చిన వాడు. జోడు గుర్రాల మీద స్వారి చేస్తుండు” ఒక దమ్ము లాగి ఆయనింట్లో ఫర్నీచరంతా మన కాలేజీదే.. పాపం..అయన మాత్రం ఎన్నని కొంటడు? ఏవైనా రెండు, రెండు కావాలాయే..”
నాకేమీ అర్థంగాక ముఖం తెలేసాను. నా ముఖం చూస్తూ మరో దమ్ము లాగి “క్రాంతి కంచానికొక్కడు.. మంచానికిద్దరు...” అంటూ గుర్రంలా సకిలించాదు.
“ అతడికి ఇద్దరు భార్యలు సార్.. ఒకరేమో మేనమరదలు. ఇంట్లో వాళ్ళు బలవంతంగా మెడకు కట్టారు.
మరొకరేమో ఆయన గారి సెటప్.. కాలేజీలో చదువుతూ వెంట తెచ్చుకున్నాడు. ఇద్దరితో వేగలేక చచ్చిపోదామనుకుంటూ ఉంటాడు. కాని చావడు. కాలేజీలో పాఠాలు సరిగ్గా చెప్పిచావడు. మతిమరుపెక్కువ.
ఒక క్లాసుకు బదులు మరో క్లాసుకు వెళ్తుంటాడు. ఒక సారి మ్యాథ్స్ గ్రూప్ క్లాసుకెళ్ళి బాటనీ పాఠం చెప్పసాగాడు. కొన్నాళ్ళకు పిచ్చిలేవడం ఖాయం. ఆయన చెప్పే మాటలేవీ నమ్మకండి”
నేను విస్తుపోయాను.
***
(సశేషం)
No comments:
Post a Comment