జ్యోతిష్యమా! మజాకా! - అచ్చంగా తెలుగు
demo-image

జ్యోతిష్యమా! మజాకా!

Share This
జ్యోతిష్యమా!మజాకా!
ఆదూరి హైమవతి  
    
'హలో! లావణ్యా! వెంటనే బయల్దేరిరా!వెరీ అర్జెంట్ 'టెలిగ్రాం లాంటి ఈమేసేజ్ చూసుకుని నాకు ఎక్కడ లేని దడా పట్టుకుంది . ఏమైనా జరగరానిది జరగలేదుకదా!' అనేభయంతో కాలు నిలువలేదు.
రా.సీ.రావు  నైజం నాకెరికే! ఎంత గింజుకున్నా మరే మేసేజ్ కానీ కబురుకానీ చేయడు, ఫోనెత్తడు.  
మీకు అనుమానం రావచ్చు  రా.సీ.రావు  అంటే ఏంటాని! మరేమో అనుకోకండి, రామ సీతా రావు.  
  ఆపేరు కలిసిరాదనీ ' సీత ' రాముని భార్యగా పడరాని కష్టాలు పడిందనీ అందుకని పొడిగా రా.సీ .రావు  అని వాడుకలో ఉంచుకోమని ఏజ్యోతిష్కుడో చెప్పాట్ట. 
అందుకని అలా షార్ట్ కట్ చేసేసుకున్నాడు. చిన్నతనంలోనే  స్నేహితులంతా’ సీతా సీతా చీవిడి ము క్కు ల సీతా ‘ అని పిలిచేవారనీ   తనపేరు మార్చుకుంటానని ఏడ్చిగొడవ పెట్టాడు. 
ఐనా వాళ్ళబామ్మ’ ససేమిరా! ‘అంది . దాంతో హైస్కుల్ వరకూ ఎలాగో నెట్టుకొచ్చాడు కానీ  ఆతర్వాత ఉత్త ' రావ్ 'అని చెప్పేవాడు. 
కాలేజీ గనుక అటు స్టూడెంట్స్ కూ ఇటు లెక్చరర్లకూ షార్ట్ కట్ పేర్లూ, నిక్ నేంసూ వాడుకగనుక  గనుక ఇబ్బందిలేకుండా కాలేజ్  చదువు పూర్తైంది. 
ఉద్యోగంలో చేరాక అస్సలు ఇబ్బందన్నమాటే ఎరుగడు.' రావ్ గారు’గా వెలగబెడుతున్నాడు ఉద్యోగం  పర్వం. 
ఐతే ఒక దుర్ముహూర్తాన ఎవరో జ్యోతిష్కుడు తగులుకుని నీకు ఉద్యోగం, వివాహజీవితం,  ప్రొమోషన్ అంతా బావుండాలంటే నీపేరు మార్చుకు తీరాల్సిందేని ఖరా ఖండీగాచెప్పాక పాలిపోక కనీసం షార్ట్ కట్ గా మార్చుకుంటే  దోషం చాలావరకూ తగ్గుతుందని ఆ జ్యోతిస్సిరోమణి ఒప్పుకున్నాక రా.సీ. రావయ్యాడు. ఆంగ్లంలో ఆర్.ఎస్ .రావ్ గా చలామణీ అవసాగాడు.    
  వివాహం నిశ్చయ మయ్యాక అందమైనదీ, చదువుకున్నదీ, కట్నకానుకలివ్వగల మాతాపితరులు న్నదీ,  మర్యాదలు చేయనూ, ఆదరించనూ, బ్యాగులుమోయనూ బావమరదులున్నదీ, ఉద్యోగం చేయ గలదీ ఐన అమ్మాయితో పెళ్ళి కుదరడం ' రావ్ ' అదృష్టం గా భవించాడు. 
ఇదంతా తన పేరుమార్పు మహిమని మహా  ఆనందించాడు. ఐతే ఒకే ఒక్క చిక్కు వచ్చిపడింది.ఆ అంద మైన అమ్మాయిపేరు  ' సీతారావమ్మ ' కావటం ' ఒక్కటే బాధనిపించింది. 
‘ఈబామ్మలూ, అమ్మమ్మల నందరినీ ఒకే వేటుకు కైలాసం పంపాలన్నంత కోపమూ వచ్చింది. కానీ పాపం బాధ పడటం తప్ప ఏమీ చేయలేని అశక్తుడు . పోనీ ఆ అమ్మాయిని వద్దం దామా అంటే 'పేరు 'తప్ప మరే  లొసుగూ లేదాయె!' బాగా ఆలోచించి ,పెళ్ళాయ్యాక, , ఆమెపేరు మార్చేసు కుంటే సరీ అనుకున్నాడు కూడానూ.
ఆమెను  వివాహమాడను అంగీకరించి, సీతారామమ్మ  మెడలో తాళి కట్టాక, సీతారావమ్మను --తారా రావ్ గా మార్చే శాడు.’  అయ్యో అదేం పేరండీ ' తార ' అంటే వాలి భార్యండీ!’ అని ఆమె ఎంత మొర పెట్టుకున్న ఒప్పుకున్నాడు కాదు.   
మా వాడికి పట్టింపు లెక్కువ. దిన, వార , మాస, సంవత్సర ఫలాలు చూడంది ఎక్కడికీ చివరకు బాత్ రూం కైనా కదలడు. 
మావాడి ఈపిచ్చితగ్గించను వ్యర్ధ ప్రయత్నాలెన్నో చేశాం.   వాడిని ఒక్క మిల్లీ మీటరంతైనా మార్చలేక పోయాం.
ప్రస్తుతానికి వద్దాం…
ఇప్పుడింత హటాత్తుగా ఎందుకు రమ్మని మెసేజ్ పెట్టాడో తెలీక బుర్ర బద్దలు కొట్టుకునే కంటే వెళ్ళి రావటం మేలని, ఆఫీసుకు ఓగంట పర్మిషన్  పెట్టి బయల్దేరాను. 
నన్ను చూడగానే చెల్లెమ్మ సీతమ్మ , కాదుకాదు తారా రావ్   మొహం విప్పారింది. 
చెల్లెమ్మ కూడా ఆఫీసుకెళ్ళకుండా  ఇంట్లోనే ఉందంటే  ఏదో పెద్ద కధే ఉందన్నమాట!  
 " రండి అన్నయ్యగారూ! మిమ్మల్నిచూశాక  నాప్రాణం లేచొచ్చింది.ఐనా ఇదేం మనిషండీ!ఈ నవనాగరిక యుగంలో కూడా ఈ పిచ్చి నమ్మకాలూ, రాసిఫలాలూనూ! .పోనీ సం.ఫలాలంటే సరి, మాస, వార, దిన ఫలాలు చూసుకుంటూ ఎలా కదులు తామండీ! ఇంకా గంట ఫలాలు లేవు నాప్రాణానికి,ధాంక్ గాడ్ ! నీరు త్రాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, డ్రెస్  వేసుకోవాలన్నా అన్నీపట్టింపు లేనండీ ! ఉన్నవి చాల వన్న ట్లు ఇప్పుడు మరోకొత్త  పెద్ద చిక్కొచ్చి పడిందండీ!" అంటూ కళ్ల నీళ్ళ పర్యంతమైంది.  
" కంగారు పడకమ్మా! ఇలాంటిదేదో ఉండే ఉంటుందనుకు న్నాను లేమ్మా! అందుకే అలా  షార్ట్ మేసేజ్ కొట్టి కూర్చున్నాడు. ఇంత కూ ఏడీ ఈ ఘటం! కనిపించడేం!" అంటూ లోపలికి నడిచాను.   
  "ఇదేనండీ ఇప్పుడొచ్చిన చిక్కు. "అంటూ తానూ లోపలికి దారి తీసింది చెల్లెమ్మ.    
మా రా.సీ రావు మూడో అంతస్తులో ఉన్నవారి ఇంటి టెర్రేస్ మీద కూర్చుని ఉన్నాడు.
"ఏరా! ఇంతర్జంట్ గా రమ్మని మేసేజ్  పెట్టావ్! ఏమైందేం?" అన్నాను. విషయం తెల్సినా తెలీనట్లే. "నీ చెల్లెలు ఊద లేదా ఏం రాగానే!"అన్నాడు గుర్రుగా  ఆమె వైపుచూస్తూ.   
" చెల్లాయ్ విషయం అటుంచి నీ విషయం చెప్పిచావు. అవతల ఆఫీస్ లో జరూర్ మీటింగ్ ఉన్నా ఏమైందోని పరుగు మీద వచ్చాను." అంటూ , అంతే గుర్రుగా వాడివైపు చూశాను.        
నాతో చెప్పను మొహమాట పడుతున్నట్లున్నాడు, తిట్టి పోస్తానని కాస్తంత భయమూ ఉందిలే. 
ఐనా తప్పదన్నట్లు" ఈరోజు నేను పైనుంచీ ఉత్తర దిశగా తిరిగి క్రింది కెళ్ళాలి.నీలం బట్టలు ధరించాలి. నుదుట సింధూరం పెట్టుకోవాలి, విష్ణు సహస్రనామం చదువుతూ వెళ్ళాలి. ఎలా దిగాల్రా?! " అంటూ బిక్క మొహం వేసిన వాడ్ని, బిర్రుగా లాగిచ్చి చాచి చెంప పగుల కొట్టాలనిపించింది.  
  ఎలాగో సెల్ఫ్ కంట్రోల్  చేసుకుని , ఆచుట్టూ చూశాను .వారి టెర్రేస్ కు క్రిందనే విండో షేడ్ ఉంది దాని మీంచీ తేలిగ్గా దిగవచ్చు.అక్కడే లిఫ్ట్ ఉత్తరం వైపే ఉంటుంది. వాడు నీలం రంగు డ్త్రెస్ వేసుకుని సింధూరం ధరించి ఉన్నాడు. 
ఆదోవ చూపి " జాగ్రత్తగ దిగిచావు." అన్నాను కోపం పట్టలేక.  దిగేందుకు చేయి ఆధారంగా ఇచ్చి..  నేను చేతులు పట్టుకోగా షేడ్ మీదకు దిగాడు. 
అక్కడనుంచీ రెండో అంతస్తు బాల్కనీ లోకి దూకి , తిరిగి చూడకుండా  ఉత్తరం వైపున్న లిఫ్ట్ ఎక్కి , దిగి కారెక్కి  ఆఫీస్ కెళ్ళా డు, విష్ణు సహస్రనామం చదువుతూ,  నన్నలావదిలేసి. 
లోపలికొచ్చి  చెల్లెమ్మ పెట్టిన  టిఫిన్, కాఫీ సేవించాను." అన్నయ్యగారూ ! మీరు ఏదోఒకటి చేయాలి , నా వల్ల కావట్లేదు. ప్రతిదానికీ ముందు ఫలాలు చూట్టం, ఫలాలు  అంటే పండ్లు  తిననూ కూడానూ. నేను  వేగలేకపోతున్నానన్నయ్యా! ఆయన మారి తీరాలి, లేకపోతే నేను మా తండ్రి గారింటి కెళ్ళిపోతా నిక." అంటూ కళ్ళుతుడుచు కుంది.            
  " ఈరోజిలా ఎలాగో మీరు వచ్చికాపాడారు. ఆమధ్యని, మీరు క్యాంపు మీద బెంగుళూరు వెళ్ళారు.  అప్పుడు జరిగింది. ఆరోజు కళ్ళు మూసుకుని ఆఫీసుకెళ్ళాలని ఎక్కడో దిన ఫలంలో చదివారుట ! చచ్చి పోయా ననుకోండి! మీరూ లేరాయె! ఒక డ్రైవర్ను పిలిపించి పంపాను ఆఫీసుకు. 
అది చాలదన్నట్లు ,లైఫ్ నెంబరుట ! తన పేరులో మా ఆయనది కుజ గ్రహానికి సంబంధించిన సంఖ్య అట!  అందు కని ఈయనకు దూడుకు స్వభావం, ఆత్మబలం, శక్తి వంతమైన వ్యక్తిత్వం ఉంటాయిట, డేటాఫ్ బర్త్  వైబ్రేషన్స్ బాగా లేవుట! ఈయన్ని పిలిచే పేరు లో కూడా వైబ్రేషన్స్ బాగాలేవుట! పేరు లో సీత తీసేస్తే మిగిలిన ‘రామా రావు’ కూడా సరిపోదుట! దీనిలోని రెండు వైబ్రేషన్సుకూడా మంచివి కావు ట!. అందువల్ల పేరును రాం రావ్ అనిరాసుకోవాలిట!. దీని వైబ్రేషన్ బావుంటుందిట! ఇలా చేస్తే చక్కటి భవిష్యత్ ఉంటుందిట!.  ఈస్పెలింగ్ తో రోజూ 64 సంఖ్య కు తగ్గకుండా ‘నామకోటి ‘రాస్తూ ఉండాలిట!. కోటి పూర్తి కాగానే మంచి అదృష్టం తన్నుకొస్తుందిట!. ఇలా ‘నామకోటి ‘తానొక్కడే వ్రాయలేనని , నన్నూ వ్రాయ మంటాడు. నా ఇంటిపనీ ఆఫీస్ పనీ ఏంకాను అన్నయ్యగారూ! ఇంతే కాదండీ! ఏదిక్కుగా ఆఫీసు కువెళ్ళాలీ,ఏదిక్కుగా తిరిగి రావాలీ,ఎటు తిరిగి ఆఫీసులో కూర్చుని పని చేయాలీ, రోజువారీగా మారి పోతుంటాయి. లక్కీ నెం.1,5,6., లక్కీ కలర్స్ రోజ్, ఆరెంజ్, వైట్, క్రీమ్, గోల్డెన్, బ్లూ!.అట! రోజుకో రకం బొట్టు, కట్టూ, జుట్టూనూ.ఎక్కడ చావను అన్నయ్య గారూ! నాకు ఈయనతో రోజూ ఒక్కోరకం, నరకమై పోతున్నది. చిన్నపిల్ల లైతే నాల్గు లాగిచ్చి పడేయవచ్చు.ఏంచేయను చెప్పండీ! " అంటూ చెంగు కళ్ళ కడ్డం పెట్టుకుని ఏడ్వసాగిందా ఇల్లాలు.  
  ఆ ఆడకూతురు దుఖః చూసి నాకు చాలా బాధేసింది. “ఈ రాక్షసుడ్ని, దౌర్భాగ్యుడ్ని  ఎలామార్చాలాని ఆలోచిస్తున్నాచెల్లెమ్మా! ఈ ‘రాసి ఫలాల’ బలహీనత తప్ప వీడు చాలా మంచి మనిషమ్మా!అందరికీ చాలా  సాయం చేస్తాడు. ఎవ్వర్నీ దేనికీ ఇబ్బంది పెట్టే వాడూ కాదు.వాడి సీట్లో పని క్షణాల్లో చేసేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడమ్మా! అందరి బాసులకూ వీడంటే  మహా ఇష్టం. మేము చదువుకునే రోజుల్లో నాకు ఫైనల్ పరీక్ష లపుడు టైఫాయిడ్ జ్వరం వస్తే నా నోట్సులన్నీ వ్రాసి,  సబ్ మిట్ చేయటమేకాక నాకు అన్నీ చదివివినిపించే వాడమ్మా! వాడి సాయం తోటే నేను డిగ్రీ పొందగలిగాను.మహా  సేవాభావం, స్నేహ భావం ఉన్నావాడు.అందుకే నాకు వాడి చాదస్తానికి కోపం వచ్చినా ఏమీ అనలేను.  "అని నే నంటుండగానే,   
" ఆ ఒక్క  కారణంగానే అన్నయ్యగారూ ఈయన ఏ రకం వేషా లేసుకు పోయినా, ఎప్పుడు ఆఫీసుకు పోయినా ఏమీ అనట్లేదు. బాధ లన్నీ నాకే!    నవ్వకండి అన్నయ్యాగారూ ఒక్కోరోజూ రాత్రులు  చీర కట్టుకుని చెవులకు దుద్దులు పెట్టుకుని ,బొట్టుపెట్టుకుని పడు కుంటారు. ఇదేంటండీ అంటే తన రాసి ఫలంలో ఇలా చీరకట్టు కోవాలని ఉందనీ, అనుసరిస్తే తనకు గొప్పయోగం పడుతుంద నీ , కట్టు కుంటే పోయేందేంటనీ 'అంటారు. ఒకమారు  చీరకట్టుకున్నపుడు  రాత్రి 9గం.లకు మా మాంగారూ, అత్తమ్మా  వచ్చారు. ఈయనను వెనుక నుంచీ  చీరలోచూసి,"ఏవరమ్మా! మీ అక్కగానీ వచ్చిందా!" అని అడిగారు. ఆతర్వాత విషయం తెల్సుకుని ఆయన్ని చూసి ఒకే నవ్వూ, ఆతర్వాత  చివాట్లేయటమూనూ. నాకు తల తీసేసి నట్లైందనుకోండి. " అని చెల్లెమ్మ చెప్తుంటేనే నాకు నవ్వాగలేదు.    
 "మీరే ఎలాగైనా నన్ను రక్షించాలి అన్నయ్యగారూ! కాస్తంత మీ మాటంటేనే ఆయనకు గురి." అంటూ బ్రతి మాలింది చెల్లెమ్మ.                       
  "ఉండమ్మా! నీవేం, బాధపడకు , నేను ఏదో ఒకటి ఆలోచించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను." అంటూ చెల్లెమ్మను ఓదార్చాను.                                                                                    
  " అన్నయ్యా! చెప్పడం మరచాను.ఇప్పుడు మరో కొత్త పిడుగు పడబోతోంది నాపైన , అదేదో తాటాకుల మీద రాసి ఉంటుందట, అంతా తమిళంలోనే ఉంటుందట! దానికి వెళ్ళి గత జన్మ, విషయాలూ, ఈజన్మ విషయాలూ పూర్తిగా తెల్సుకు వస్తారుట! దానికి తమిళం తెల్సిన నిన్ను తీసుకెళ్ళాలని ఆయన అను కుంటున్నారుట! ఏమవు తుందో ఏమో అన్నయ్యా!"   
   "ఆహా! చిక్కాడు చేతికి, ఇహ ఏమీ కాదులేమ్మా!  అది ‘నాడీగ్రంధ’ మమ్మా!నేనే అంతా సెటిల్ చేసే స్తాను. దీంతో మీఆయన రాసి ఫలాల పిచ్చి అటకెక్కిస్తాను." అంటూ చెల్లెమ్మను ఓదార్చి బయల్దేరాను ఆఫీసుకు ఆలస్యంగా.                                                
ఆతర్వాత నేను ముందుగా చెల్లెమ్మకిచ్చిన మాట ప్రకారం తమిళ్‌నాడులో వైదీశ్వరన్ కోయల్ అనే ప్రాంతం లో ఉండే నాడీ జ్యోతిషా లయానికి వెళ్ళాను .అక్కడ ముందుగా మా వాడి గురించీ అన్నీ చెప్పి ఎలాగైనా ఈగండం గట్టెక్కించి వాడి సంసారాన్ని నిలపమని ప్రార్ధించాను.
ఆ నాడీ జ్యోతిషాల యం ఆచార్యులు నవ్వి " మీ స్నేహితుని తోడ్కొని రండు చూద్దాం" అని తమిళంలోనే చెప్పి పంపారు. 
నేను మావాడితో వెళ్ళి , ముందుగా వాడి వేలిముద్రలు ఇచ్చాము. ఆతర్వాత ఒక  తాళపత్ర  గ్రంధాలు ఉన్నగదిలో కి మమ్మల్ని పిలిచారు. వాడితండ్రి, తల్లి ఇంటి పేరు ఇంకా వ్యక్తిగత వివరాలు ట్యాలీ అయ్యాక వాడికి సంబంధించిన తాళపత్రం వచ్చింది. 
దాన్ని తీసి ఆ పండితుడు తమిళం లో చెప్పసాగాడు.                                   నేను ఇక్కడ చదువరుల సౌలభ్యంకోసం తెలుగులో చెప్తున్నాను.మావాడి వివరాలూ, వ్యక్తిత్వం, చదువు, భార్యపేరు, చివరకు స్నేహితుడినైన నా పేరు కూడా ఖచ్చితంగా చెప్పారు. ఆశ్చర్యపోడం నావంతైంది.  'ఈరోజుతో అన్ని ఇరుకు ఇబ్బందులూ, కష్టాల కడగళ్ళూ తీరిపోయి జీవితం , సంసార జీవితం, అర్ధాంగి జీవితం అన్నీ చక్కబడతాయనీ , ప్రతినిత్యం శివపూజ,అభిషేకం  చేసి , నుదుట విభూది ధరిస్తే చాలనీ , ఏ విధమైన కట్టు, జుట్టు,బొట్టు నిషేధాలేం లేవనీ, ఇహ ఏవిధమైన రాసిఫలాలూ అనుసరించాల్సి నపని లేదని' స్పష్టంగా చెప్పారు.  
దాన్ని తెలుగులోకి అనువదించి సి.డీకూడా ఇచ్చారు. మావాడితో కల్సి తిరి గొచ్చి దాన్ని తెచ్చి మా చెల్లెమ్మకు ఇచ్చాను.
ఆరోజునుంచీ మావాడు తిరిగి తన పేరును- రాం రావ్ నుంచీ రా.సీ.రావు గానూకాక  రామసీతారావుగా మార్చేసుకున్నాడు.  భార్యామణితో  సుఖజీవన యానం సాగించసాగాడు.  
  ************
Comment Using!!

Pages