లలితా మోహిత్ - అచ్చంగా తెలుగు

లలితా మోహిత్

Share This
లలితా మోహిత్
 లక్ష్మణ రావు 

         రోజూ ఉదయం కంపెనీ బస్ లో వెళ్ళే మోహిత్, ఆ రోజు కొంచెం లేటుగా లేవడం వలన ఆటోలో వెళ్ళాడు. అది షేరింగ్ ఆటో కావడం వలన ముందే ఓ అమ్మాయి కూర్చొని ఉంది. ఆఫీస్ కి వెళ్ళే తొందర్లో ఉన్న మోహిత్ పక్కన ఎవరు కూర్చున్నారో ఏంటో ఏమి పట్టించుకోలేదు!

                 ఆటో కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఏదో కాలేజీ రావడంతో ఆపండి, ఆపండి  అని ప్రక్కన కూర్చున్న అమ్మాయి ఆటోని ఆపమని దిగేసింది అప్పుడు చూసాడు మోహిత్ ఆ అమ్మాయిని ఎంత బాగుందో ఎవరో గాని అనుకుంటూ ఉండగా ఫోన్ మ్రోగింది. ఆ రింగ్ టోన్ "నువ్వక్కడుంటే,నేనిక్కడుంటే ప్రాణం విల,విలా.."

       అదే రింగ్ టోన్ మోహిత్ ది కూడా తన ఫోన్ చూస్కుంటే ఏ కాల్ రాలేదు కానీ ఫోన్ మ్రోగుతోంది వెతికితే అది వాళ్ళు కూర్చున్న సీటు క్రిందకి జారిపోయి ఉంది. ఇది ఆ అమ్మాయిదే అయ్యుంటుంది ఆటో డ్రైవర్ కి ఇస్తే ఆ అమ్మాయికి ఇస్తాడో లేదోనని "నిజాయితీకి మారుపేరు ఐన మోహిత్" ఆ ఫోన్ ను భద్రంగా తన జేబులో ఉంచుకున్నాడు !

      కొంత సేపటికి ఆ అమ్మాయికి తన ఫోన్ గుర్తొచ్చిందో... . ఏమో గాని మరలా రింగ్ సౌండ్ రావడంతో మోహిత్ తన ఫోన్ కాదని గుర్తించి ఆ అమ్మాయి ఫోన్ ని చూస్తే రచన అని పేరు కనబడుతోంది ఓహో! ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ చేసి  ఉంటుందని ఈ ఫోన్ ఆ అమ్మాయికి ఎలాగైనా ఇచ్చేయాలనే ఉద్దేశ్యంతో మోహిత్ లిప్ట్ చేసాడు.

          అటునుండి ఫోన్ లో రచన హాయ్ లలిత సారీ లేటయిందే లేవడం ఈ రోజు నీ బర్త్ డే కదా హాపీబర్త్ డే టూ యూ అంటూ ఏవేవో మాట్లాడెస్తోంది .

            తిరిగి రిప్లై ఇవ్వకుండా మోహిత్ ఆ అమ్మాయి మాటల ప్రకారం సాయంత్రం ఓ అడ్రస్ కి వెళితే అది ఓ అనాధ శరణాలయం! అక్కడ ఉదయం ఆటోనుండి తొందరగా దిగడంలో ఫోన్ మర్చిపోయిన అమ్మాయి ఉంది. ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరూ "లలిత, హేపీ బర్త్ డే  టూ యూ" అంటుంటే ఓహో ఈ అమ్మాయి పేరు లలిత  అన్నమాట అని అర్ధమైంది మోహిత్ కి.

        మోహిత్  వెంటనే ఉదయం ఆటోలో దొరికిన ఫోన్ లలితకి అందచేస్తూ, "హేపీ బర్త్ డే లలిత గారు, ఇది మీ ఫోన్. మీరు ఆటో దిగే తొందర్లో ఉదయం ఆటోలో  మర్చిపోయారు.", అని అందజేసి వెళిపోబోతుంటే "హలో, కాసేపు ఆగి భోజనం చేసి వెళ్ళండి. మీరు ఈ రోజు మా అతిధి. నాకు అత్యంత విలువైన కానుక నేను పోయిందనుకున్న నా ఫోన్, అందిచారు. మీకు నేను ఋణపడి ఉంటాను," అంది లలిత చాలా లలితంగా.

       అలా మోహిత్ కి  పరిచయమైన లలితతో చాలా తొందర్లోనే ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఒకరి ఇష్టా అయిష్టాలు పంచుకున్నారు. 

ఇద్దరూ కావల్సిన వాళ్ళని అయిన వాళ్ళని పోగొట్టుకుని, అనవసర బంధువులకి దూరంగా ఉంటూ అనాధశరణాలయంలో పెరిగారు. దానివల్ల ఒకరితోడు మరొకరికి చాలా కావాల్సి వచ్చింది. అందుకే వెంటనే కల్సిపోగలిగారు. మోహిత్ కెమికల్ ల్యాబ్ లో అసిస్టంట్ మేనేజర్ గా ఉద్యోగం. లలిత ఓ ప్రవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తోంది.

          చాలా తొందర్లోనే దగ్గర దగ్గర దూరంలోనే విడివిడిగా ఉంటున్న ఇద్దరూ  ఒక్కజంటగా అయ్యారు - లలితామోహిత్.
              
కానీ కేరీర్ లో బాగా స్థిర పడ్డా నిజ జీవితంలో ఒంటరితనం బరించలేక ఇద్దరూ త్వరగానే ఒక్కటవ్వాలని నిశ్చయంతో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీక్రృష్ణ మందిరంలో ఒక్కటయ్యారు.

       ఇలా పాలు, నీళ్ళలా కలిసిన వారి సంసారం బాగా పొంగి పొర్లుతున్న రోజుల్లో మోహిత్ పని ఒత్తడిలో పడి లలితకి కొంచెం దూరమవుతున్నాడు అది లలిత తట్టుకో లేక పోయింది.

         నిరంతరం షిఫ్ట్ డ్యూటీల వల్ల చాలా బిజీగా సెలవు కూడా వాడుకోకుండా ల్యాబ్ లో పనిచేస్తున్న మోహిత్ తో లలిత, "ఈ రోజు నా మనసేం బాగోలేదు. కాలేజీకి కూడా సెలవు పెట్టాను. త్వరగా మీ పనులు ముగించో లేక పక్కన పెట్టో రండి. మీతో మాట్లాడాలి, మనం మాట్లాడుకుని కూడా చాలా కాలమైంది," అని ఫోన్ చేసింది.

                 అటునుండి మోహిత్, "వస్తాను కానీ, కాస్త లేటవుతుంది. మా కంపెనీకి అమెరికా టీమ్ వస్తోంది. వాళ్ళను నేనే రిసీవ్ చేసుకోవాలి. ఆ ఏర్పాట్లన్నీ చూసే బాధ్యత నా మీద ఉంచింది మా మేనేజ్మెంట్. సో, సారీ, లేటవుతుంది. అంత వరకూ మీ రచనతో కబుర్లు చెబుతూ ఉండు. తను చాలా హ్యుమరస్ జోకులు బాగా వేస్తుంది." అన్నాడు ఆమెను మామూలు స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ. 

     "లేదండి మీరు వస్తేనే నా లోన్లీనెస్ తగ్గుతుంది. లేగదూడ చుట్టూ ఆవుల మంద ఎంతున్నా, తల్లి ఆవుకోసమే ఎలా ఎదురు చూస్తుందో, అలాగే ఈ లలిత చుట్టూ ఎంతమంది స్నేహితులున్నా సరే మగవాళ్ళను సహితం మోహింపచేసే మనోహర సుందరుడు నా మోహిత్ తప్ప ఇంకెవరున్నా అనవసరం నాకు ఇంతకీ మీరు వస్తారా... రా.. ? రా...?" కోపంగా గద్దించింది లలిత.

     "సారీ లలితా అవదు కదా...  అర్ధం చేసుకో అమెరికా టీమ్ అల్రెడీ లేండయ్యే టైమైంది. ఉంటాను, నాకు మా బాస్ ఫోన్ వస్తోంది. ఫోన్ పెట్టెయ్" అన్నాడు. 

" లేదు లేదు మీరు. చాలా  చాలా మారిపోయారు!" అంది లలిత

   లలిత, మోహిత్ గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనల అలల్లో,  "పెళ్ళికి ముందు ఎలాగూ ఆ వర్కింగ్ ఉమన్ హాస్టల్ లో ఉండేదాన్ని. అప్పుడే బాగుండేది. చుట్టూ నా వాళ్ళే అన్నట్టుగా ఉండేవారు అందరూ. అలాంటి సమయంలో పరిచయమై నా మనస్సును కాజేసిన  మోహిత్ చిన్న, చిన్న గిఫ్టులతో, చిరు పొగడ్తలతో నా అందాన్ని వర్ణిస్తూ తనకెన్ని పనులున్నా గానుగ ఎద్దులా నా చుట్టూ తిరిగేవాడు. ఇప్పడేమైంది ఆ ప్రేమంతా ఎటుపోయింది?" 
ఆ "ఇష్టంగా" చూసే చూపులేవి? నా వల్లేమైనా తప్పుజరిగిందా??..ఏంటీ? అలా  జరిగి ఉంటే మార్చుకుంటాను", అని అనుకుంటూ ఉండగా ఆ ఆలోచనల సుడిగుండం నుండి తప్పించేందుకు వచ్చిన కాలింగ్ బెల్ శబ్ధం విని, లలిత "ఎవరూ? ఎవరండి?" అంటూ తలుపు తీసేసరికి షాపింగ్ చేసిన బ్యాగులతో వచ్చిన మోహిత్ ని చూసి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో బెదురు చూపులతో లలిత బుంగమూతి పెట్టి, "రానన్నారుగా మరెందుకొచ్చారు? రమ్మన్న వెంటనే వస్తే మీ ఇగో హర్ట్ అవుతుందా దొరా.." అని ప్రశ్నించింది.

          మోహిత్ కూడా చాలా చక్కగా అభినయిస్తూ "నేనా.. రా..నన్నానా? రాలేనన్నానా.. రాణివాసంలో రాణిగారు పరివారమెవ్వరూలేక. ఒంటరిగా ఉన్నామని చరవాణి ద్వారా వర్తమానం పంపితే రాకుండా ఎలా ఉండగలను? అందుకే కావల్సిన తినుబండారాలతో, అలంకరణకోసం దివ్యాభరణాలతో హాజరయ్యారీ దొరగారు" అన్నాడు కొంటెగా చూస్తూ. 
   
 "మరిందాక ఆఫీసు.... అమెరికా టీమ్ వస్తున్నారు ...రిసీవ్ చేసుకోవాలి.... అంటూ ఏవేవో కబుర్లు చెప్పారు కదా? మరి ఇప్పుడు పర్లేదా? ఈ ధీనురాలిపై ఇంత వలపెలా వచ్చింది స్వామి వారికి?" అని వెటకారంగా అంది లలిత!
  
"ఓహ్ అదా! చెప్పలేదు కదూ. ఆ పని చేయాల్సింది నేనే, ఇంతకముందు వరకూ .. కానీ ఈ రోజునుండి మోహిత్ సార్, మేనేజర్ గా ప్రమోట్ అయ్యారుగా.. ఇక అలాంటి పనులు చేయరు, చేయిస్తారంతే.. ఈ దొరగారు తెల్సా? అది పొరపాటుగా నాకు వచ్చిన మెయిలట. వెంటనే అడ్మినిష్ట్రేషన్ వారు పొరపాటుకు మన్నించమని అపాలజీ తెలిపారు తెల్సా.." అన్నాడు సంతోషంగా.

           లలిత చిరునవ్వుతో, "అబ్బ ఛా..మాకెలా తెలుస్తుంది? మేమేమైనా చదువుకుంటే కదా.. తమరు గాబట్టి మేనేజర్ అయ్యారు. మరి మేమో..ఇదిగో ఈ నాల్గుగోడల మధ్యేగా ఉండేది," అంది సరదాగా.

        "ఎందుకలా నిన్ను నువ్వు చులకన చేసుకుంటావ్! నిజం చెప్పనా నువ్వలా ఫోన్ చేసేసరికి చాలా కంగారు పడ్డాను. కానీ తర్వాత వెంట వెంటనే వచ్చిన మెయిల్స్ చూసి ఎంత తొందరగా నీ దగ్గర వాల్దామా అని చూసా. ఆ ఆనందం ఎవరితో పంచుకో గలను నీతో తప్ప? అందుకే ఎమర్జన్సీగా పర్మిషన్ తీసుకొని వచ్చేసా." అన్నాడు.

        ఏ మనిషైనా, ఎంత కష్టమైన పనులే అయినప్పటికీ తన అనుకున్న వాళ్ళకోసం, వారి పనుల్ని తొందరగా చేయాలనుకుంటాడు. కాబట్టి నా లలిత కోసం ఇదిగో బంగారు ఆభరణం.  మరిదేమో మా అమెరికా టీమ్ కి ముందే చెప్పడం వలన వాళ్ళద్వారా తెప్పించిన, నిన్ను మెప్పించగల స్పెషల్ స్వీట్." అని నోటికి అందించాడు మోహిత్, రేఫర్ తీస్తూ  టేస్ట్ చూడమని.

            అలా స్వీట్ తిన్న తర్వాత మళ్ళీ మాటల్లో పడ్డారిద్దరూ. అప్పృడే లలిత ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చి మోహిత్ అవును లలితా ఇందాక " నా మనసేం బాగోలేదన్నావ్ " ఏమైందీ అనడిగాడు.

 "ఓహ్ అదా.. అదా.. ఏం లేదు", అని చెప్పకుండా దాచే ప్రయత్నం చేసింది.

        ఈ లోగా లలిత ఫ్రెండ్, రచన నుండి ఫోన్ వస్తే మోహిత్ లిప్ట్ చేసాడు. అటునుండి రచన," హాయ్ లల్లీ! నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందట కదా. డాక్టర్ అనురాధ ఇందాకే నేను కల్సినప్పుడు చెప్పింది. నిజమే కదా," అంటూ "హెల్త్ జాగ్రత్తా.. మీ మగాడ్ని అడిగానని చెప్పు," అని ఫోన్ పెట్టేసింది. 

         అది విని మోహిత్," అమ్మ దొంగా. నాకు ముందుగా చెబితే ఏం వేస్ట్ ఖర్చు చేసెస్తానో అని భయపడి చెప్పలేదన్నమాట. అందుకే మనసేం బాగోలేదని అబద్ధం చెప్పావా..." అన్నాడు.

         "అదేం కాదండీ మిమ్మల్ని సర్ఫ్రైజ్ చేద్దామనుకున్నా కానీ నేనే ఓడిపోయా.. మీరే గెలిచారు. మీరే ఒక దాని తర్వాత ఇంకో శుభవార్త చెబుతూ నాకు రవ్వల నెక్లెస్ ఇచ్చి, అమెరికా స్పెషల్ స్వీట్ తినిపించి సర్ఫ్రైజ్ చేసారు," అంది.
              అయితే త్వరలో ఇద్దరం ఉన్న మనం ముగ్గురం అవుతున్నాం కాబట్టి, ఈ అద్దె ఇల్లు ఖాళీ చేసెస్తాం. నీ పుట్టినరోజు నాడే మనం సొంతింట్లో అడుగు పెడతాం. ఇది నీకు మరో శుభవార్త" అన్నాడు. 

ద్విగుణీకృతమైన  ఆనందంతో అతడిని గట్టిగా హత్తుకుంది లలిత.

 ***

2 comments:

Pages