అభినవ త్యాగయ్య - శ్రీ మైసూరు వాసుదేవాచార్య - అచ్చంగా తెలుగు

అభినవ త్యాగయ్య - శ్రీ మైసూరు వాసుదేవాచార్య

Share This
అభినవ త్యాగయ్య  --  శ్రీ మైసూరు వాసుదేవాచార్య
మధురిమ 


1865 వ సంవత్సరం మే 28వ తేదీన  మైసూరు కోటలో ఉన్న వరాహ స్వామి గుడిలో "వాసుదేవా, వాసుదేవా"ఒక పండితుడు పచారీలు చేస్తున్నాడుట.ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి హడావిడిగా వచ్చి "అయ్యా తమరికి మనవడు పుట్టాడయ్యా" అని చెప్పాడుట సంతోషంగా, చెప్పగానే భగవంతుని ఎదుట సాష్టాంగ ప్రణామం చేసి "నేను వాసుదేవా అని నిన్ను తలుచుకుంటుండగా ఆ పిల్లవాడు జన్మించాడు కాబట్టి అదే అతని పేరు అవుతుందని ఆనందాశృవులతో భగవంతునికి కృతజ్ఞతలు అర్పించుకున్న ఆ పండితులెవరో కాదు ఆ పిల్లవాడి తాతగారు.(తల్లి యొక్క తండ్రి).ఆ విధంగా ఆ పిల్లవాడికి వాసుదేవాచారి అని నామకరణం చెయ్యబడింది.వీరి తండ్రి గారి పేరు సుబ్రహ్మణ్యాచార్యులు. సుబ్రహ్మణ్యాచార్యులవారు మైసూరు సంస్థానములో మూడవ కృష్ణరాజ వొడయార్ గారి దగ్గర పౌరాణిక విద్వాంసులుగా ఉండేవారు.అయితే విధి నిర్ణయానికి అందరు తలవంచి తీరవలిసినదే కదా, వాసుదేవాచార్యులు గారికి మూడేళ్ళు ఉన్నప్పుడే వారి తండ్రిగారు హరివాసం చేరుకొన్నారు.అప్పుడు ఆయన బాగోగులు పోషణ చూసుకునే భాద్యత తాతగారైన గోపాలాచార్యులవారు చేపట్టారు.
తాతగారికి తన మనవడిని తండ్రికంటే గొప్ప సంస్కృత పండితుడిగా తయారుచెయ్యాలని అభిలాష.అందుకేవారు ప్రఖ్యాత సంస్కృత పండితులైన పెరిస్వామి తిరుమలచారి గారి దగ్గర శిష్యునిగా  చేర్పించారు.అయితే వాసుదేవాచారి గారికి చిన్నప్పటినుంచీ సంగీతం అంటే ఎనలేని అభిమానం,మక్కువ కూడా...
తాతగారికి వీరు సంగీతం పై ఎక్కువ సమయం ఖర్చు పెట్టడం కూడా ఇష్టంలేదు,కాని ఎవరేమి అన్నా... అనుకున్నా... ఆయనమాత్రం సంగీతమే తన ప్రాణం గా ఉండేవారు..అందుకే తాతగారి ఇష్టానికి విరుద్ధంగా సుబ్బరాయర్ అనే వ్యక్తి దగ్గర విద్యార్ధిగా చేరారు.  
తన పదమూడవ ఏట మహారాజవారి సంస్కృత పాఠశాల కి వెళ్ళడం ప్రారంభించారు.అక్కడ రెండు విషయాలలో తర్ఫీదు పొందారు. ఒకటి సంస్కృతం,రెండవది ఆయనకి అతి ఇష్టమైన సంగీతం.వారికి ఆ రోజుల్లో సంగీతపాఠాలు శ్రీ వీణా పద్మనాభయ్యగారు  భోదించేవారు.ఇలా ఉండగా 16వ ఏట వాసుదేవాచారి గారికి వివాహం జరిగింది కాని విధ్యాభ్యాసం కూడా కొనసాగుతూనే ఉంది. జీవితం లో మొట్టమొదటి మలుపు తన  పందొమ్మిదవ ఏట జరిగిందని చెప్పవచ్చు.
అదేమిటంటే  ఆయన ఒకసారి శ్రీ పట్నంసుబ్రమణ్య అయ్యర్ గారి కచేరి విని ఎంత పులకరించారంటే వెంటనే వారి వద్దకు వెళ్ళి తనని శిష్యునిగా స్వీకరించమని ప్రార్దించగానే వారు ఒప్పుకోవటమేగాదు మైసూరు సంస్థానం నుండీ  కూడా విద్యా పారితోషకం అందేలా కూడా మహారాజావారు ఏర్పాటు చేసారు.ఆ విధంగా లభించిన  విద్యా పారితోషకంతో తిరువయ్యారుకు వెళ్ళి అక్కడ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి దగ్గర ఆరు సంవత్సరాలు ఉత్తమ శిష్యుని వలె గురువు గారి దగ్గర సంగీత జ్ఞానాన్ని సంపాదించారు.
వారి దగ్గర సంగీత అభ్యాసం ఎంత క్రమశిక్షణ తో కొనసాగిందంటే!! అంతకుముందే వాసుదేవాచారి గారికి సంగీతంలో ప్రాథమిక విషయాలలో ప్రవేశం ఉంది కాబట్టి వర్ణాలతో శిక్షణ ప్రారంభించారు.అయితే బేగడ వర్ణం తో మొదలుపెట్టగా అదే వర్ణం మూడు మాసాలు నేర్పించారు.వర్ణం లో ప్రతీ ఆవర్తనం త్రికాలలో ముందుకు,వెనకకు సాధన చేయించేవారు.అదే విధంగా ఒక రాగాన్ని అన్ని స్థాయిలలో పాడించడం వలన రాగాలాపన ,నెరవుల్ వంటి మనోధర్మ అంశాలు వారికి అవలీలగా అలవడ్డాయి.    
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి దగ్గరకు వెళ్ళే సమయానికి వీరికి తమిళం కూడా రాదు.తిరువయ్యారు కి వెళ్ళి అక్కడ పట్నం సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ అని వీధుల్లో అడిగి తెలుసుకుంటూ వెళ్ళారుట.
అంతే కాకుండా గురువుగారు మధ్యాహ్న వేళలో వర్ణాలు,కృతులు మొదలైనవి రచించేటప్పుడు వారి పక్కనే ఉంటూ వారిని గమనిస్తూ మెలకువలు తెలుసుకొనే వారట.ఈ విధంగా గురువుతో సర్వకాల సర్వావస్థల్లో గురువుగారి సాన్నిహిత్యం అనుభవించి వారి సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదాలకు పాత్రులయ్యారు.  
అనుమందర పంచమం నుండి తార షడ్జ్యమం వరకు అవలీలగా త్రికాలాల్లో ఆలపించేవారట.తాను నిత్యవిద్యార్థి గా ఉంటూ ఎందరో విద్యార్ధులకు సంగీతామృతాన్ని బోధించారు కూడా.సహజంగా విద్యార్ధులు గురువు దగ్గరకి రావడం ఆనవాయితీ. కాని ఈయన మాత్రం ప్రత్యేకంగా శిష్యుల ఇళ్ళకు వెళ్ళి పాఠం చెప్పడమే కాదుట, గంటలతరబడి సాధన కూడా చేయించేవారుట.
వాసుదేవాచార్యులవారికి ఎదైనా నేర్చుకోవాలంటే మొదటి నుంచీ పట్టుదల ఎక్కువ..ఈ విషయాన్ని ఈ సన్నివేశం చక్కగా ఉదాహరిస్తుంది. ఓసారి ప్రఖ్యాత   వీణా విద్వాంసులైన వీణా శేషన్న గారు ఆయన కచేరికి గాను కోయంబత్తూర్ వెళుతూ వాసుదేవాచార్యులవారిని కూడా వెంట తీసుకువెళుతున్నారుట.ఆయనేమో  మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం మన వాసుదేవాచార్యులవారు సాధారణ తరగతిలో ఉన్నారు.ఆ ప్రయాణంలో శేషన్న గారి దగ్గర అటతాళ వర్ణం నేర్చుకోవాలని అనుకున్నారుట.రైలు ఏ స్టేషన్ లో ఆగితే ఆ స్టేషన్ లో ఆయన దగ్గరకి వెళ్ళడం పాఠం నేర్చుకోవడం తిరిగి తన పెట్టిలోకి వచ్చి సాధన చెయ్యడం, ఈవిధంగా కోయంబత్తూర్ వెళ్ళే లోపు మొత్తం వర్ణం నేర్చుకోవడం పూర్తి చేసారుట.ఈ పట్టుదల సాధన నేటి విద్యార్ధులకి కూడా ఆచరణయోగ్యం కాదా మరి.
సంగీతాభ్యాసం ముగిసిన తరువాత తిరిగి మైసూరు సంస్థానంలోనే ఆస్థాన విద్వాంసునిగా నియమింపబడ్డారు.ఏ సంస్థానం వారి ప్రోత్సాహంతో విద్యని అభ్యసించారో అదే సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడటం ఎంతటి అపూర్వ గౌరవం.ఇదంతా ఒక ఎత్తు అయితే ఓ వాగ్గేయకారునిగా వారి సంగీత ప్రస్థానం చాలా వైవిధ్యమైనది ఆదర్శప్రాయమైనది కూడా.
ఎన్నో పదవర్ణాలు,తాన వర్ణాలు,కృతులు,తిల్లానాలు,జావళీలు,రాగమాలికలు రచించి స్వరపరిచారు.వీరి మాతృ భాష కన్నడ అయినా తెలుగు భాషను వీరు వాడినంత పవిత్రంగా ఏ అన్యభాషా వాగ్గేయకారుడూ వాడలేదంటే అందులో ఏ అతిశయోక్తి లేదు. కృతులలో చిట్టస్వరాన్ని చేర్చి రచించడం వీరి విశిష్టత.బ్రోచేవారెవరురా(ఖమాస్ రాగం) కృతిలో ఈ అంశాన్ని మనం గమనించచ్చు.
1930లో మహరాజపురం విశ్వనాథ అయ్యర్ గారు ఒక కచ్చేరీ లో ఈ కృతిని పాడారుట అది విన్న మన వాసుదేవాచార్యుల వారు ఒక సాధారణమైన అమ్మాయిని అద్భుతమైన అందమైన అమ్మాయిగా తీర్చిదిద్దినట్లు నాకృతిని ఆలపించావు అని మురిసిపోయారుట.
సంగీత త్రిమూర్తులు ముగ్గురిపైనా కూడా రాగమాలికలు రచించి వారిపై తనకు గల గౌరవాన్ని,భక్తినీ,అభిమానాన్ని చాటుకున్నారు.వాసుదేవాచరిగారి రచనా శైలిపై త్యాగరాజస్వామి యొక్క ప్రభావం చాలా ఉంది. అందుకే అందరూ అతనిని "అభినవ త్యాగరాజు" అనేవారట.
ఓసారి మైసూరు మహారాజా వారు వాసుదేవాచార్యులవారిని కన్నడ భాష లో రచన చేయమని అడుగగా ఆయన ఇలా సమాధానం చెప్పారుట."నాకు  సంస్కృతం గురువుల దీవెన వలన, తెలుగు త్యాగరాజ స్వామి వారి ఆశీర్వాదం వలన లభించింది.కాని కన్నడ భాష పురందరదాసులవారి సొత్తు అందులో నేను రచన చెయ్యలేను".
వాసుదేవాచార్యులవారు రచించిన సుమారు 200 కీర్తనలన్నీ ఆయనే "వాసుదేవ కీర్తన మంజరి"అన్న సంకలనం పేరుతో విడుదల చేసారు.బెహాగ్,ఖమాస్,అభేరి,మోహనం వంటి బాగా సుపరిచితమైన రాగలలో మాత్రమే కాక సునాదవినోదిని,మేఘరంజని,పుష్పలతిక వంటి అపూర్వ రాగాలలో కూడా తన రచనలు చేసారు.
కన్నడ భాషలో కీర్తనలు రచించలేదు కాని నెనపుగళు(జ్ఞాపకాలు),నా కండ కళావిదరు(నేను కలిసిన కళాకారులు)  అనే రెండు పుస్తకాలు రచించారు.రెండవ పుస్తకంలో ఎందరో మహానుభావుల జీవితచరిత్రలు పొందుపరిచారు.
ఈ విధంగా మైసూరు ఆస్థానం లో ఇంచుమించు తన జీవిత కాలమంతా గడిపిన ఆయనకు చివరి దశలో కూడా భగవంతుడు సంగీతంతోనే గడిపే అవకాశం ఇచ్చాడు.అది ఏ విధంగా అంటే??మద్రాసు నగరంలో శ్రీమతి రుక్మణి దేవి అరండల్ స్థాపించిన "కళాక్షేత్ర" సంస్థ  యొక్క సంగీత విభాగానికి సేవలందించవలిసిందిగా ఆమె ఆహ్వానించడంతో  మద్రాసు నగరానికి వచ్చి అక్కడ స్థిరపడడం జరిగింది.సంగీత విభాగానికి ప్రధాన ఆచార్యులుగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో టైగర్ వరదాచారి,వీణా కృష్ణమాచారి మొదలైనటువంటి  దిగ్గజాలతో పని చేసారు.
వారి రచనలలో బహుళజనాదరణ పొందిన కొన్ని కృతులు
బ్రోచేవారెవరురా - ఖమాస్ రాగం
మామవతు శ్రీ సరస్వతి - హిందోళం
భజనచేయరాదా - ధర్మవతి మొదలైనవి
వారి బిరుదులు పురస్కారాలు:సరస గాన శిరోమణి,సంగీత సాహిత్య విద్వన్మణి,
గురుదేవులు రవీంద్రనాథ్ థాగూర్ గారు సంగీత కళా కోవిద అన్న బిరుదుతో సత్కరించగా 
1935లో మద్రాసు సంగీత అకాడమీ వారిచే సంగీత కళానిధి ప్రదానం చేయగా 
మైసూరు మహారాజా వారు సంగీత శాస్త్ర రత్న  అన్న బిరుదుతో సన్మానించి సత్కరించారు. 1954లో సంగీత నాటక అకాడమీ అవార్డ్ కూడా అయనను వరించింది.
ఈవిధంగా సుస్వరాలతో సుసంపన్నమైన 96 సంవత్సరాల జీవితం గడిపిన  ఆచార్యులవారు తన 97వ పుట్టినరోజుకు కొన్నాళ్ళ ముందే మే19వ  తేదీ 1961వ సంవత్సరంలో హరివాసం చేరారు. ఆయన సంస్మరణార్థం మే 29వ తేదీన కళాక్షేత్ర లో ఓ పెద్ద సభ జరిగింది.. ఆసభకి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు,కళాకారులు ఎంతో మంది వచ్చి తమ అనుభవాలు పంచుకుని ఆయనను వేయినోళ్ళ పొగిడారు.వారిలో ప్రముఖులు ద్వారం వేంకట స్వామి నాయుడుగారు, రాజాజీ గారు ,ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గారు,మహారాజపురం విశ్వనాథ అయ్యర్ గారు మొదలైన వారు.

No comments:

Post a Comment

Pages