నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -శ్రీ రమిడిపాటి భామాగోపాలం
శారదాప్రసాద్
SSLC పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందరమూ మంచి మార్కులతోనే ఉత్తీర్ణులమయ్యాము.మార్క్స్ లిస్ట్స్ ,టీసీలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అందరమూ కలుసుకున్నాం!అందరమూ భవిష్యత్ ప్రణాళికలను గురించి చర్చించుకున్నాం.నేను నరసరావుపేట లోని SSN కాలేజీలో PUC లో ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ అయ్యాను.ఆ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ ఇలింద్ర రంగనాయకులు గారే మన మార్కులను బట్టి విద్యార్థికి ఏ గ్రూప్ ఇవ్వాలో ఆయనే నిర్ణయించేవారు.ఆయన క్రమశిక్షణకు బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు.ఆ రోజుల్లో ఆ కాలేజ్ చాలా ప్రసిద్ధి.రాయలసీమ నుండి కూడా ఎక్కువమంది విద్యార్థులు వచ్చేవారు.విజయవాడ లయోలా కాలేజీతో ఈ కాలేజీ పోటీ పడేది.చక్కని హాస్టల్ సదుపాయం ఉండేది.విశాలమైన ఆటస్థలం,ఎన్నో విలువైన గ్రంధాలు కల గ్రంధాలయం ఉండేవి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటందుకు ఒక చక్కని ఆడిటోరియం కూడా ఉండేది.వేరొక ఓపెన్ థియేటర్ కూడా ఉండేది.అప్పుడు మా నాన్నగారు నరసరావుపేట లోనే ఉద్యోగం చేయటం చేత ,నేను తల్లితండ్రులతోటే ఉండి చదువుకున్నాను.PUC లోకి రాగానే పూర్తిగా యవ్వనం వచ్చింది.కాలేజ్ వాతావరణం మొదట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది.దానికి కారణం--అప్పటిదాకా తెలుగు మాధ్యమంలో చదువుకున్న మేము ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలో చదవటమే!నెమ్మదిగా అలవాటుపడ్డాం.నాకు చదువు మీద ఉత్సాహం బాగా పెరిగింది.నా అభివృద్ధి తల్లితండ్రులకు సంతృప్తి ఇచ్చింది.అందుచేత ట్యూషన్స్ కు వెళ్ళవలసిన అవసరం రాలేదు.కొత్త స్నేహితులు అలవాటు అయ్యారు.ఆ రోజుల్లో యువకుల్లో రెండే రెండు పార్టీలు ఉండేవి.ఒకటి ఎన్టీఆర్ పార్టీ మరొకటి ANR పార్టీ!నేను ఎన్టీఆర్ కు వీరాభిమానిని.ఆ రోజుల్లో కొత్త సినిమాలు నరసరావుపేటలో రిలీజ్ అయ్యేవి కావు.ఒక 50 రోజుల తర్వాత అక్కడికి వచ్చేవి.సినిమా బాగుంటే,గుంటూరుకు వెళ్లి కూడా చూసేవాళ్ళం. ఎన్టీఆర్ అభిమాన సంఘానికి నేను సెక్రటరీగా పనిచేసాను కూడా!పరీక్షల మధ్యలో సెలవులు వస్తే,ఆ సెలవుల్లో విడుదలైన కంచుకోట సినిమాను కూడా చూసాను.మా అమ్మా నాన్నలు కూడా కోప్పడేవారు కాదు.కారణం-- నాకు మంచి మార్కులు రావటమే!ఆ రోజుల్లో మాకు co-tenant గా ప్రఖ్యాత రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారు ఉండేవారు.వారు కొద్ధి సంవత్సరాల క్రితమే మరణించారు.ఆయన గొప్ప రచయిత అని ఆ రోజుల్లో నాకు తెలియదు.చాలా సరదాగా ఉండేవారు.సినిమాకు వెళ్లివస్తే ,దాని కథను అడిగి చెప్పించుకునేవారు.అలా చెప్పిందే యధాతధంగా వ్రాసి ఇమ్మనేవారు.ఆయనకు నా narration స్టైల్ నచ్చిందేమో!అలా చిన్న చిన్న కధలను వ్రాయించేవారు.అలా నాలో రచనా ప్రవృత్తికి బీజం పడింది ఆయన వలేనేమో!ఆ రోజుల్లో ఒక గొప్ప రచయితతో నేను మాట్లాడుతున్నానని తెలిసేది కాదు.ఆయనకు లలిత సంగీతమంటే మక్కువ!గొంతు సన్నగా కొద్దిగా feminine వాయిస్ లో ఉండేది.సాలూరి రాజేశ్వరరావు గారి పాటలను, AM రాజా గారి పాటలను యధాతధంగా పాడేవారు.వాళ్ళింట్లో ఆ రోజుల్లో వారి కుమారుడు,భార్య,air force నుంచి తిరిగొచ్చిన తమ్ముడు ఉండేవారు.వారి అబ్బాయి నా కంటే చాలా చిన్నవాడు. ఆయన తమ్ముడు 35-40 ఏళ్ళ బ్రహ్మచారి.ఆయన ఎక్కువగా వేదాంత గ్రంధాలను చదువుతుండేవాడు.ఆయన ద్వారానే నాకు జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు పరిచయం అయింది.ఈ రామగోపాలం గారిని నేను బాగా ఆట పట్టించేవాడిని.ఆయన పేరుని మార్చి రమిడిపాటి భామాగోపాలం అని పిలిచేవాడిని.ఆ పేరే తనకు బాగుందని అలానే పిలిపించుకునేవారు.తర్వాతి రోజుల్లో ఈయన విశాఖపట్నం చేరారు.ఆయన అభిరుచికి తగినట్లు 'నూట పదహార్లు'అనే పేరుతొ చక్కని తెలుగు సినిమా పాటల క్యాసెట్ ను విడుదల చేశారు.తర్వాత కొంతకాలం తర్వాత 'మరో నూట పదహార్లు 'అనే పేరు మీద మరో క్యాసెట్ ను కూడా రిలీజ్ చేసినట్లు గుర్తు.'భరాగో' గా ప్రసిద్ధి చెందారు.మొదట్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు .ప్రవ్రుత్తి రచన కావటం చేత 1990 వరకు ఆంధ్రజ్యోతి వార పత్రికలో సబ్ ఎడిటర్ గా పనిచేసి,రిటైర్ అయ్యారు.ఆయన వ్రాసిన 'వంటొచ్చిన మొగుఢు,'కథనకుతూహలం ' ,'ఇట్లు మీ విధేయుడు '.....చాలా ప్రసిద్ధి చెందినవి.
ఇట్లు మీ విధేయుడు -- రచనకు గాను భమిడిపాటి రామగోపాలం గారికి సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇట్లు మీ విధేయుడు పుస్తకంలో ప్రధానంగా హాస్యభరితమైన కథలు, మధ్యతరగతి జీవితాలను ఆధారం చేసుకున్న కథలు ఉన్నాయి. నేను పెరిగేటప్పటికి ఆయన త్రివిక్రముడయ్యాడు.రచనా వ్యాసంగంలో మేటి కధకుడయ్యాడు.ఈయన్ను నేను భామాగోపాలం అని పిలవటానికి కారణం ,ఆయన భార్యపేరు సత్యభామ కావటమే! నేను జీవితంలో స్థిరపడిన తర్వాత రెండు మూడు సార్లకు పైగానే ఆయన్ని ప్రత్యేకంగా వెళ్లి కలిసాను.నాలో రచనా వ్యాసంగానికి బీజమేసిన ఈ మహనీయుడు 7-4-2010 న,విశాఖలో స్వర్గస్తులయ్యారు. ఆయన భావాలు-"నేను సున్నా నుంచో... మరీ చెప్పాలంటే మైనస్ నాలుగు నుంచో జీవితం మొదలు పెట్టాను.పేదరికం చాలా గొప్పది. అది పని చేసే ఉద్దేశం కలుగచేస్తుంది. నేను నా జీవితాన్ని సంపూర్ణంగా
జీవించాను. సంతోషంగా బతికాను. బతికినంత కాలం పనిచేస్తూ ఉండటమే నా లక్ష్యం. సాహితీరంగంలో నాకంటే ఘనులు చాలా మందే ఉన్నారు. కానీ నా ప్రత్యేకత నాకుంది. నాకు భోజనం, దుస్తులు, ధనం మీద ఆసక్తి తక్కువ. అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి." ఈ భావాలు నన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి!50 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రభావం నా మీద ఉండటానికి కారణం ,ఆ మహనీయుడు నాకిచ్చిన ప్రోత్సాహమే!ఆ మహనీయునికి అశ్రు నివాళి సమర్పిస్తూ ఇంతటి తో ముగిస్తున్నాను.మరి కొన్ని కబుర్లతో మరో సారి!
***
No comments:
Post a Comment