“రామ రామ రామ”
శ్రీమతి పోడూరి కృష్ణకుమారి
సుజాత వంటింట్లో తంటాలు పడుతోంది. సంక్రాంతి పండగైపోయాక కూడా మరో మూడు రోజులు స్కూళ్ళకి శలవలు అవడం వల్ల పిల్లలింట్లోనే ఉన్నారు. ఆఫీసులూ గట్రా మాత్రం మామూలే. అందువల్ల పిల్లల స్కూలు హడావిడి లేక పోయినా సుజాతకి హడావిడి పనులు తప్పట్లేదు. పనులు చేసుకుంటూనే డ్రాయింగ్ రూములో చేరి పిల్లలు రమేష్, రమ్య వేస్తున్న వేషాలు సుజాత గమనిస్తూ నే ఉంది. పిల్లలంటే మరీ చిన్న పిల్లలేం కాదు. రమేష్ పదో క్లాసు, రమ్య ఏడో క్లాసు. సెలవలు సంపూర్తిగా ఆనందంగా అనుభవించాలంటే పరమ తీరిగ్గా మహా అల్లరిగా గడపాలని తీర్మానించు కున్నట్టున్నారు.
సుజాతకి ఒళ్ళుమండిపోతోంది. ‘ఎంత సెలవురోజై తే మాత్రం మరీ అలా వేషాలెయ్యాలా? పనవనీ చెప్తా వీళ్ళపని! తేల్చేస్తా సంగతేంటో! ఏంటా కిటికీ దగ్గర చేరి ఏంటా పిచ్చినవ్వులూ?‘ విసుక్కుంది మనసులోనే.
రమేష్, రమ్య కిటికీ దగ్గరున్న సోఫా వెనుక ఆనుకునేవైపు ఎక్కి కూచున్నారు. సోఫాలో కూచునేచోట వాళ్ళ పుస్త కాలు, పెన్నులూ అస్తవ్యస్తంగా దిక్కులేనట్టు పడున్నాయి. ఇద్దరూ కిటికీ తలుపు కొంచెం తెరిచీ మూసి, బయటికి చూడ్డం, మళ్ళీ చటుక్కున మూసేసి మూతికి చేతులడ్డం పెట్టుకుని కిసుక్కున నవ్వుకోడం చేస్తున్నారు.
సుజాతకి ఒళ్ళు మండుకొస్తోంది. ఓ పావుగంటక్రితం కాబోలు ఇవే చేష్టలు చేసారు. ఇప్పటికీ కోతి చేష్ట చెయ్యడం మూడోసారి. ‘ప్రతిపావు గంటకీ ఇలాగే చేస్తారా ఇంకివాళంతా?‘ గట్టిగా కేక పెట్టబోయింది. కేక గొంతులోంచి పైకి రాకముందే,
“అమ్మాయ్ సుజాతా! గుడికెళ్ళి అర్చన చేయించుకొస్తాం“ అంటూ, చీర సవరించుకుంటూ అత్తగారొస్తుంటే, “రెండు ఇడ్లీలు తిని వెళ్ళండి. ఆ గుడికి పదిహేను మెట్లెక్కాలి“ అరిచింది. అప్పుడే పిల్లలమీద అరుద్దామనుకుందే మో, ఆ లెవెల్లోనే గొంతు పైస్థాయిలో పెరిగి పలికింది. భయపడిపోయినట్టు బిత్తర చూపులు చూసింది అత్తగారు.
“అ..అ..అదే ......అసలే మీరిద్దరూ షుగర్ పేషెంట్లూ.. నీరసాలొస్తాయనీ... “ గొంతు తగ్గించి ఏడుపు మొహం పెట్టింది సుజాత.
పెద్దలిద్దరూ లెక్కల మేష్టార్ని చూసి దడుచుకున్న స్కూలుపిల్లల్లా బల్లముందు కూచుని నోరెత్తకుండా పెట్టినవేవో లాగించేసి జారుకున్నారు.
సుజాతాపతి సుబ్రహ్మణ్యం స్నానం ముగించుకొచ్చి పెళ్ళాం వైపు భయంభయంగా చూస్తూ డైనింగ్ టేబుల్ చేరాడు. “ చాల్లెండి ఓవరాక్షన్!“ ఒఖ్ఖ కసురు కసిరి, వడ్డించాల్సినవన్నీ వడ్డించింది - ప్లేటులో. తరవాత పెట్టాల్సినవన్నీ పెట్టి టిఫిన్ బాక్సందించింది. తినేసి, అందుకుని మాయమయ్యాడు పతిపుంగవుడు.
ఇంక అప్పుడు విసవిసా నడుచుకుంటూ పిల్లలవైపు వెళ్ళింది. “ఏంట్రా కోతుల్లా ఆ కిటికీ దగ్గరచేరి ఇకిలింపులూ? నిన్నకూడా ఇలాగే వేషాలేసారు. ఎవర్ని చూసి ఆ వెక్కిరింతలూ? వాళ్లు కనిపెట్టారంటే మీవీపులమీద విమానాలు పేల్తాయి!“ శాంపుల్ చూపించడానికన్నట్టు చెయ్యెత్తింది.
ఇద్దరూ సోఫా మీంచి దూకి దూరంగా గెంతారు. రమేష్ నోటిమీద వేలేసుకుని “ ష్! అమ్మా, వాల్యూమ్ డౌన్!“ అన్నా డు గొంతు బాగా తగ్గించి. “అమ్మక్కూడా చెప్పేద్దాంరా అన్నయ్యా. ఎంజాయ్ చేస్తుంది తనుకూడా“అంది రమ్య. రెండు క్షణాలు ఆలోచించాడు బాస్. అసిస్టెంటు వైపు చూసి “ హోఖే“ అన్నాడు. ఇద్దరూ సుజాత కి చెరాపక్కా చేరి చెరో చెయ్యీ పట్టుకుని ఒకే సోఫామీద కూచోబెట్టారు.
“అమ్మా! కిటికీకి ఇటుపక్క చేరి ఈ ఏంగిల్లో కొంచెం కర్టెన్ తీసి చూస్తే మనం అవతలి వాళ్ళకి కనిపించంగానీ, వాళ్ళు మనకి చక్కగా కనిపిస్తారు. వాళ్ళు అంటే మన ఎదుటి ఫ్లాట్ వాళ్ళన్నమాట. ఎదుటి ఫ్లాట్ అంటే సుశీలా ఆంటీ వాళ్ళ ఫ్లాట్“.
“ఒరేయ్! ! “ సుజాత గావుకేకకి సరిజోడీగా చెయ్యికూడా పైకి లేచింది. షరా మామూలుగా రమేష్ దూరంగా గెంతాడు.
“విను మరీ. అన్నింటికీ కోపమే నీకు. చెప్తున్నాగా? ఆ సుశీలాఆంటీ వాళ్ళ సుభాష్ ఇంటరుకదా? మేం స్కూలు కెళ్ళే ముందే కోచింగుక్లాస్ కి వెళ్ళిపోతాడు. రైట్?అప్పుడూ, ఎంత బిజీగా ఉన్నాసరే మేం ఇద్దరం ఓ సారి తొంగి చూస్తాం. మాకు హాలీడే ఉన్న రోజుకూడా అతను వెడతాడు. అతను వెళ్ళేటప్పుడు ఒకటోస్సారి! తరవాత ఆ అంకుల్ ఆఫీస్ కి బయల్దే రతారు. అప్పుడు సెకండ్ టైమ్ – రెండోస్సారి!“
“ఏంట్రా వేలంపాటలాగా ఒకటోస్సారి రెండోస్సారి?“కసిరింది సుజాత
“కూ ల్ డౌన్! శాంతం సహనం!“ ఓదార్చాడు రమేష్.
“తంతాను భడవా! అసలు సంగతి చెప్పేడు“
“ అక్కడికే వస్తున్నా. సరే, ఇందాక మనబామ్మ, తాతగార్లతో ఆ బామ్మగారు...ఆ బామ్మగారంటే ఆ ఆంటీ వాళ్ల మదరిన్లా“
“ తెలుసులే కోతీ! అసలు సంగతి చెప్పరా“
“అదే చెప్తున్నా...ఆ బామ్మగారు వెళ్లారుకదా అప్పుడుకూడా చూసాం. అది మూడోస్సారి“
“ ఏం చూసార్రా? ఈ పురాణం కట్టిపెట్టి అసలు సంగతి చెప్పూ“
“ఇంకా కొద్ది నిముషాల్లో నీక్కూడా చూపిస్తాం“
“బాదేస్తానొరేయ్! మీరేం చూసారు? నాకేం చూపిస్తారు?“పళ్ళు పటపటలాడించింది నిస్సహాయంగా.
“నువ్వూర్కోరా అన్నాయ్. నేన్చెప్తా వినమ్మా. ఇంకొంచెం సేపట్లో ఆ తాతగారు ఆఫీసుకు వెడతారు కదమ్మా?““అవునూ.“ ఎదురింటి ముసలాయన బాగా పేరున్న ఆడిటర్. ఎనభైయ్యో పడిలో పడినా ఆఫీసు మెయింటెయిన్ చేస్తున్నారు. అరడజనుమంది పని చేస్తారాయన దగ్గర. “సరే వెడతారు. అయితే ఏవంటావ్? “
“అప్పుడు మా వెనకాల నుంచుని కర్టెన్ సందులోంచి చూడూ... సుశీలాంటీ నోరు స్పీడుగా కదుపుతూంటుంది. ఏదో తిట్టుకుంటుంది కాబోలు. చూడ్డానికి బలే ఫన్నీగా ఉంటుందిలే. చూస్తే నవ్వాపు కోలేం“ తలుచుకుని నవ్వడం మొద లెట్టింది రమ్య. సుజాతకి కుతూహలం పెరిగింది.
“సరే. ఆ సీను మొదలైనప్పుడు పిలవండి. గట్టిగా అరవకండి“ చెప్పి మళ్ళీ పనిలో పడింది. సరిగ్గా ఇరవై నిముషాలకి “అమ్మా తొందరగా రా“ రహస్యం గా పిలుస్తూ కిటికీ దగ్గరకి లాక్కెళ్ళింది రమ్య. “ఇదిగో ఈ స్పాట్ లో నుంచో బాగా కనిపిస్తుంది.“ సరే. నుంచోమన్న చోట నుంచుంది.
ఎదురింట్లోంచి పెద్దాయన గొంతు వినబడింది. “సరేనమ్మా సుశీలా నేను బయల్దేరుతున్నా. తలుపేసుకోతల్లీ“ అంటూ ఇవతల కొచ్చాడు. ఆయన లిఫ్టు వైపు నడుస్తున్నాడు. ఆయనకోడలు సుశీల, గుమ్మం దగ్గిరే నిలబడి అచ్చం పిల్లలు వర్ణించినట్టే గబగబ పెదవులు కదుపుతూ శబ్దం పైకి రాకుండా ఏదేదో అనేస్తోంది. పెద్దాయన కారిడార్ చివరికి నడిచి లిఫ్టు స్విచ్ నొక్కి, అదొచ్చి, ఆయనందులోకి ఎక్కి, అది మళ్ళీ భూమ్మీద ఆగిన చప్పుడు వినబడే దాకా సుశీల పెదాల కదలిక ఆగలేదు. తరవాత తలుపేసుకునిలోపలికి వెళ్ళిపోయింది.
“ఫినిష్!“ ఫట్ మని కర్టెనేసేసి సోఫాలో పడీ పడీ నవ్వారు పిల్లలిద్దరూ.
నిర్ఘాంత పోయింది సుజాత. ముసలాయన్ని వెనకనించి తిట్టుకుంటోందా సుశీల? నమ్మ శక్యం కాలేదు. కానీ కళ్ళ ముందు కనిపించిందిగా? నమ్మక తప్పదు.
“రోజూ ఇంతే అమ్మా. రేపు మేం స్కూల్ కి వెళ్ళా క చూడు కావాలంటే“. నవ్వుకుంటూ సోఫాలో కూలబడి పుస్తకాలు తీసారు. ఎందుకో చాలాసేపు సుజాత మనసు తేరుకోలేదు.
ఇంక ఆ తరవాత వారంరోజులపాటు పిల్లల్లాగే సుజాతకదే పని. ఒక్కొక్కరూ ఇంట్లోంచి వెడుతుంటే సుశీల నిశ్శబ్ద శాపాలు గమనించడమే. ‘ఆఖరికి కొడుకుని కూడా వదిలిపెట్టదే! సుశీలకేమన్నా మెంటల్ ప్రాబ్లెమా? ‘ తీవ్రంగా ఆలోచించింది. మరో వారం గడిచిపోయింది. ఇంక భరించలేకపోయింది.
ఒకానొకరోజు మధ్యాహ్నం ఇంట్లో తనుతప్ప ఎవరూలేరు, ఎదురింట్లో సుశీలత్తగారు తప్ప ఎవరూలేరని గ్రహించింది. వెళ్ళి, “ పిన్నిగారూ, చిన్న సమాచారం కావాలి. ఓసారి మాయింటికొస్తారా?“ మర్యాదగా అడిగింది. పెద్దావిడ కుతూహ లంగా మొహం పెట్టి, తమింటితలుపుకి గడియ పెట్టి వచ్చి సోఫాలో కూచుంది.
చల్లని బత్తాయిరసం గ్లాసు ఆవిడ చేతిలో పెట్టి, చీరకొంగు వేలికి చుట్టుకుంటూ అడిగేసింది. “వారం పది రోజులుగా చూస్తున్నానండీ. ఎలా చెప్పాలో తెలియట్లేదుకానీ చెప్పేస్తాను. మీ ఇంట్లోంచి మీరెవరైనా బైటకెడుతుంటే మీ కోడలు గుమ్మం దగ్గర నిలబడి వెళ్ళేవాళ్ళు లిఫ్టులో ఎక్కి, కిందకి దిగే వరకూ ఏదో బాగా తిట్టుకుంటూ నిలబడుతుంది. ఇది వరకు చూళ్లేదుగానీ ఈమధ్యనే చూసా. మీరంతా ఎంతో బాగా చూసుకుంటారుకదా మీ కోడల్ని? మరావిడకెందుకంత కోపం మీ అందరిమీద?చివరికి సురేశ్ ని కూడా...వదలదూ... “ నసిగింది.
సుజాత చెప్తున్నది వింటూ, అయోమయంగా చూస్తూ, అప్పుడే సిప్పు చేసిన బత్తాయిరసం మింగకుండా, ఉబ్బిన బుగ్గలమధ్య ఓ నిముషం అలాగే ఉంచింది సుశీలత్త. అంతలో అంతా అర్ధమై, తేటతెల్లమై భళ్ళున నవ్వింది.
ఫెళ్ళున బత్తాయరసం బైటకొచ్చి ఛెళ్ళున సుజాత మొహాన కొట్టింది.
సుజాత లేచెళ్ళి మొహం కడుక్కొచ్చేసరికి కాస్త నవ్వు శాంతించి, “ అయ్యో వెర్రిపిల్లా, మా కోడలు మమ్మల్ని తిట్టు కోడం ఏంటమ్మా పిచ్చిపిల్లా... “ అంటూనే అదృశ్య హస్త మేదో కితకితలు పెడుతున్నట్టు మెలికలు తిరిగి మరీ మరీ నవ్వింది సుశీలత్త మళ్ళీ. నవ్వు ఉధృతం తగ్గాక, గుక్క తిప్పుకు ని, మరో గుక్కెడు సేవించింది.
ఆవిడ గుక్క పూర్తిగా మింగే లోపల సుజాత బీపీ టాపునంటింది.
‘జన్మలో ఇంకే అతిథికీ తాగడానికి ఏ ద్రవపదార్ధమూ ఇవ్వనింక ‘ అని సుజాత స్వగతం(సు.స్వ.) చెప్పుకుంది.
“నీ వెర్రికానీ, మా మీద మాకోడలికి కోపం ఏంటమ్మా పిచ్చితల్లీ“ అంది పెద్దావిడ ప్రకాశముగా (పె.ప్ర.)
సు.స్వ. : ‘నాకు పిచ్చావెర్రా తేల్చిచెప్పరాదూ? అసలు సంగతేంటో చెప్పకపోతే రెండు వ్యాధులూ అంటుకునేలా ఉన్నాయ్! మహాప్రభో! గొంతు చించుకునరవాలనిఉందికానీ ఓపిక లేదు‘
పె.ప్ర. : “ మా కోడలు ఒట్టి వెర్రిపిల్ల!“ (చల్లగా మరో గుక్క లాగించి మరీ సెలవిచ్చింది)
సు.స్వ. : ‘ ఆల్రైట్ సుజాతకి పిచ్చి, సుశీలకి వెర్రి ‘
పె.ప్ర. : “ అసలు సంగతేంటంటే.. “ (మరో గుక్క)
సు.స్వ : ‘క్విక్ క్విక్. కక్కెయ్ తల్లీ అసలుసంగతి. రసం మాత్రం కక్కద్దు. ‘
పె.ప్ర. : “ మా కోడలు తీరిగ్గా టీవీ ముందు కూచున్నప్పుడు ఎప్పుడూ వార్తలే పెట్టుకుంటుంది పిచ్చిపిల్ల! మనందరి లా సీరియళ్ళూ, డ్యాన్సులు గట్రా ఏంచూడదమ్మా వెర్రిది! అటు ఇంగ్లీషు, ఇటు తెలుగూ న్యూసులే న్యూసులు! ఛానెళ్ళు తిప్పుకుంటూంటుంది. మరా వెధవన్యూసుల్లో ఏవుంటాయి? ఎంతసేపూ ఏక్సిడెంట్లూ, నేరాలు, వీలైనప్పుడ ల్లా పరమఘోరాలు. బస్సు బోల్తాలు, కార్లు గుద్దుకోడాలు, బైకు పచ్చడవనూ. ఇవన్నీ చూసి మా వెర్రిపిల్లకి పిచ్చి భయం పట్టుకుంది. అందుకని ఇంట్లోంచి మేమెవరైనా బయటకెడుతుంటే మాకేం కాకూదని శ్రీరామరక్షా స్తోత్రం చకచకా చదివేస్తుంది పిచ్చిపిల్ల! వెర్రిభక్తి పిల్లకి రాముడంటే!“ పెద్దావిడచేతులు పైకెత్తి నమస్కారం చేసింది పరమ భక్తిగా.
“ అదా సంగతీ? శ్లోకాలు చదువుతుంటే శాపాలనుకున్నానా వెర్రిగా? ఎంతపిచ్చిదాన్ని! “ అంది సుజాత ప్రకాశముగా.
***
No comments:
Post a Comment