శ్రీధరమాధురి - 51 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 51

Share This
శ్రీధరమాధురి - 51
(నేడు మతం పేరుతొ జరుగుతున్న వింత పోకడలపై పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు )


లౌకికమైన ప్రయోజనాలు ఆశించి మతంలోకి ప్రవేశించేవారు చాలా మందే ఉంటారు. మతం అనేది మీ జీవితంలోని ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది. అంటే, ఆధ్యాత్మిక పరమానందాన్ని ఆస్వాదించేందుకు భౌతిక జీవన భాగం ఉండకూడదని కాదు. జీవితంలో భౌతికమైనవన్నీ ఒకరు చూసి, ఆస్వాదించాలన్న నా అభిప్రాయానికి నేనింకా కట్టుబడే ఉంటాను. భౌతిక జీవనంలో సంతృప్తి శిఖరాలను అతడు సాధించాలి, నెరవేరని లౌకికమైన కోరికలు అతడి ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు కాకుండా చూసుకోవాలి.

మతంలో లౌకికమైన కోరికలు తీరేందుకు అన్వేషిస్తున్న వారి కోసం రెండు ప్రవేశ స్థాయిలు ఉంటాయి. ఒకటి ప్రాధమిక స్థాయి, ఒక మామూలు వ్యక్తి తన జీవిత సమస్యలు తీరతాయన్న ఆశతో ఇందులోకి ప్రవేశిస్తాడు. రెండవది ఉన్నత స్థాయి, ఇందులోకి ఒకరు నేరుగా గురువులుగా మారి ప్రవేశిస్తారు, వారి ఏకైక లక్ష్యం – వారిని వారు మార్కెట్ చేసుకుని, వ్యాపారం ద్వారానో, వృత్తిపరంగానో వారు సంపాదించలేకపోయిన ధనాన్ని ఈ విధంగా సంపాదించడం కోసం. అందుకే జాగ్రత్తగా ఉండండి.

 నేడు మతంలో చాలామంది పరిశోధకులు, గణితవేత్తలు, తర్క శాస్త్రజ్ఞులు, ఉండడం శోచనీయం, వీరంతా ప్రశ్నించనలవి కానంత నమ్మకంతో ఉండాల్సిన ఆధ్యాత్మిక మార్గాలను శాస్త్రీయంగా విడగొట్టి, విశ్లేషించి, దాని అసలైన సారాన్ని నాశనం చేస్తున్నారు.

 మతం అంటే ప్రశాంతత, సోదర భావం, సామరస్యం, దయ మరియు సేవ. మతం అనేది అత్యాశను, కలహాలను ఏ విధంగానూ ప్రోత్సహించదు. మతంలో లక్ష్యాలను ఏర్పరచుకున్నారా? అయితే అది వ్యాపారమవుతుంది. మతాన్ని వ్యాపారంలా చెయ్యలేము, వ్యాపారం మతం కాలేదు.

మతం అనేది జీవితం ముగిసాకా పనికొచ్చేది కాదు. అది ప్రస్తుత జీవనానికి కూడా ఉపయోగిస్తుంది. మీ జీవితాన్ని శాంతియుతంగా గడిపేందుకు సహకరిస్తుంది. మతం అనే చుక్కాని ఆధారంగా పయనించేవారు, సత్యానికి దగ్గరగా ఉంటారు, దేవునిచే విశేషంగా గౌరవించబడతారు. మతాన్ని ఔపాసన పట్టిన అటువంటి గురువులు, దైవ వరప్రసాదులు, శాంతి అనే దివ్య సందేశాన్ని వ్యాపింపచేస్తారు. మతం పేరుతో ఎవరో దైవదూత చేసిన ఒక వ్యాఖ్య వలన మీరు భయానికి గురైతే, వారిని వదిలేసే ధైర్యాన్ని కలిగి ఉండండి. కాని, దైవాన్ని, మతాన్ని విడనాడకండి. శాంతికి, సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి వ్యతిరేక ఆయుధంగా మతాన్ని వాడే అవకాశం ఇవ్వకూడదు.

మతం అనేది మిమ్మల్ని సేద తీర్చాలి. ఒకవేళ మతం మిమ్మల్ని మరింత కలతకు గురి చేస్తే, ఆ మతాన్నే వదిలేసి, ముందుకు సాగడం మేలు.

ఒక మత ప్రబోధకుడి ఇంటి బయట ఉన్న బోర్డు...

మీ పాపాలను దైవం వద్ద చెప్పుకుని నివృత్తి పొందండి. పాప ప్రక్ష్యాళనా వారం... 3 పాపాలకు కేవలం రూ. 5000/. మరో 30 రోజుల లోపల మరో మూడు పాపాలను ఒప్పుకుని, పరిహరించుకునే అవకాశం... డబల్ ధమాకా ఆఫర్, మిస్ కాకండి. హ హ హ.

***

No comments:

Post a Comment

Pages