సౌందర్యలహరి - 3
మంత్రాల పూర్ణచంద్రరావు
శారదా శారదాంభోజ
వదనా వదనాంబుజే !
సర్వదా సర్వదాస్మాకం
సన్నిధిః సన్నిధిం క్రియాత్ ll
శ్లో: 26. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతినిధనమ్ l
వితంద్రీ మాహేంద్రీవితతిరపి సమ్మీలిత దృశా
మహా సంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌll
తా: అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు.ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందు చున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా !
శ్లో: 27. జపోజల్పశ్శిల్పం సకలమపి ముద్రా విరచనా
గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతివిధిః l
ప్రణామః సంవేశ స్సుఖ మఖిలమాత్మార్పణ దృశా
సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ll
తా: అమ్మా ! నేను నోటితో వాగు వాగుడు అంతయు నా మాత్రు నిర్మితమయిన నోటినుండి వచ్చినదే కావున అది అంతయు నీకు జపముగాను, ఈ కాయము నీవు ఇచ్చినది కావున నేను చేయు హస్తవిన్యాసాది క్రియలు అన్నియు నీ ముద్రలుగాను,నేను దేశ సంచారిని కావున అదియే నీకు ప్రదక్షణము గానూ, నా అంగాంగ భంగిమలు నీకు ప్రణామములుగానూ, నేను గ్రహించు అన్న పానాదులు, ఇష్ట దైవము కొఱకు నే చేయు హోమములు , నా యొక్క చేష్టారూపము అయిన విలాసములు నీకు పరిచర్యలు అగు గాక .
శ్లో: 28 సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః l
కరాళం యత్ క్ష్వేళం కబలితవతః కాలకలనా
నశమ్భో స్తన్మూలం తవజననితాటంక మహిమా ll
తా: అమ్మా ! మిక్కిలి భయంకరము అయిన ముదుసలి తనమును పోగొట్టుటకు అమృతమును త్రాగిన బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు కూడా ప్రళయ కాలమున అంతము చెందుచున్నారు. భయంకరమయిన కాల కూట విషమును సేవించిన నీ భర్త అగు పరమ శివుడు మాత్రము క్షేమముగా ఉండుటకు నీ చెవులకు ఉన్న తటాకములు కారణము కదా !
శ్లో: 29. కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జమ్బారి మకుటం l
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం
భవ స్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్వి జయతే ll
తా: అమ్మా ! నీ ముందు భాగమున ఉన్న బ్రహ్మ యొక్క కిరీటమును తప్పుకొని, కైటభుడు అను రాక్షసుని వధించినట్టి రత్నములు పొదిగి కఠినముగా ఉన్న విష్ణు మూర్తి కిరీటము కొసను తాకి జారెదవు ఏమో, జంభుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కిరీటమును తప్పుకొని, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలగువారు నమస్కరించుచుండగా, నీ మందిరమునకు వచ్చుచున్న పరమ శివుని కొఱకు నీవు వడివడిగా వెళ్ళు సమయమున నీ పరిచారికలు ఈ విధముగా పలుకుట సమంజసమే కదా !
శ్లో: 30. స్వదేహోధ్భూతాభిర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
నిషేవ్యేనిత్యే త్వా మహమితి సదా భావయతియః l
కిమాశ్చర్యం తస్య త్రినయనసమృద్ధిం తృణయతో
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ll
తా: అమ్మా ! ఆద్యంతములు లేని దానవు అని లోకములచే కీర్తింపబడు ఓ తల్లీ, నీ శరీరమునుండి వచ్చు కిరణములు, అణిమాణిమ సిద్ధులు ఆవరింప బడినట్టి నిన్ను ఏ సాధకుడు ధ్యానించు చున్నాడో, ఈశ్వరుని సంపదను కూడా తృణప్రాయముగా చూచు ఆ సాధకునికి ప్రళయాగ్ని సైతము నీరాజనము పట్టుననుట అతిశయోక్తి కాదు కదా !
శ్లో: 31. చతుష్టష్ట్యా తంత్రైః సకల మతిసంధాయ భువనం
స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః l
పునస్త్వ న్నిర్బంధా దఖిల పురుషార్ధై క ఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితి తలమవాతీతర దిదమ్
తా: అమ్మా ! పశువులగు ప్రాణులను రక్షించు శివుడు అరువది నాలుగు తంత్ర విద్యలను సాధకులకు వారి వారి కోరిక ప్రకారము ఇచ్చి మిన్నకుండిన నీవు ఆ చతుష్షష్ఠి తంత్రముల వలన సాధకులకు మోక్షము రాదని తెలిపి నీ భర్తను ఉత్తమ తంత్రము తెలుపుమని నిర్భంధించగా శివుడు స్వతంత్రమయిన నీ యొక్క తంత్రమును సాధకులకు తెలిపెను కదా !
శ్లో: 32 శివ శ్శక్తిః కామః క్షితిరథ రవి శీతకిరణః
స్మరోహంస శ్శక్ర స్తదనుచ పరామార హరయఃl
అమీ హృల్లేఖాభిస్తి సృభి రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ll
తా: అమ్మా ! క, ఏ, ఈ , ల కారములగు శివుడు, శక్తి, కాముడు,భూమి ప్రధమ ఖండముగాను, హ, స, క, హ, ల కారములగు రవి, చంద్రుడు, మారుడు, హంస,ఇంద్రుడు ద్వితీయ ఖండముగాను,తదుపరి స, క, ల, కారములగు పరాశక్తి, మన్మధుడు,విష్ణువు తృతీయ ఖండముగాను హ్రీం కారములతో కూడి పంచ దశాక్షరీ మంత్రము అగుచున్నది కదా !
శ్లో: 33. స్మరం యోనిం లక్ష్మీం త్రితయ మిదమాదౌ తవ మనో
ర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాఃl
భజన్తి త్వాం చిన్తామణి గుణ నిబద్ధాక్ష వలయాః
శివాగ్నౌ జుహ్వన్త సురభిఘృతధారా హుతిశతైఃll
తా: అమ్మా ! ఆద్యంతము లేని ఓ జననీ నీ మంత్రమునకు మొదట కామరాజ,భువనేశ్వరి, లక్ష్మీ బీజములు అగు క్లీం, హ్రీం, శ్రీం లను చేర్చి అంతులేని నిత్య సుఖానుభవమును పొందిన సాధుపుంగవులు కొందఱు చింతా రత్న హారముల చేత కట్టబడిన జపమాలికలు ధరించి త్రికోణ నిలయమగు బైండవ స్థానమునందు కామధేనువు యొక్క నేతి ధారలను సహస్ర సంఖ్యలచే నిన్ను సేవించు చున్నారు కదా !
శ్లో: 34. శరీరం త్వం శంభోః శశి మిహిరవక్షోరుహ యుగం
తవాత్మానంమన్యే భగవతి నవాత్మాన మనఘమ్l
అతః శేషః శేషీత్యయముభయ సాధారణతయా
స్థితః సంబంధో వాం సమరస పరానంద పరయోఃll
తా: అమ్మా ! ఆనంద భైరవుడగు శివునకు నీవు సూర్యచంద్రులను స్తన యుగ్మములుగా గల శరీరము అగుచున్నావు అయితే అమ్మా నీ స్వరూపమును ఆనందభైరవాక్రుతిగా నేను తలచుచున్నాను . అందుచే ఇరువురకూ ఐక్యము ఉండుట వలన అతడు శేషము నీవు శేషి,నీవు శేషము అతడు శేషి అను భావ సంబంధము ఉన్నది.సఖ్యతతో కూడిన ఆనంద భైరవ,ఆనందభైరవి రూపములు గలవారు అయిన మీ ఇరువురకూ సమానత్వము ఉన్నది అని నా భావము.
శ్లో:35. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారది రసి
త్వమాపస్త్యం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరంl
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివ యువతి భావేన బిభృషేll
తా: అమ్మా ! ఆజ్ఞా చక్రమునందు గల మనస్తత్వమును,విశుద్ధి చక్రమునందు ఉన్న ఆకాశతత్వము , అనాహత చక్రమునందు ఉన్న వాయు తత్వము నీవే కదా. స్వాదిస్థాన చక్రమునందున్నఅగ్ని తత్వము,మణిపూరక చక్రమందలి జలతత్వము ,మూలాధార చక్రమునందున్న పృధ్వీ తత్వము కూడా నీవే. నీకన్నా వేరైనది ఏదియూ లేదు కదా. నీవే నీ స్వరూపమును జగత్తు యొక్క రూపముగా పరిణమింప జేయుటకు చిదానందాకారమయిన శివ తత్వమును ధరించుచున్నావు కదా !
శ్లో: 36. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరం
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరిచితాl
యమారాధ్య న్భక్త్యా రవి శశి శుచీనా మనిషయే
నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనేll
తా: అమ్మా !నీ ఆజ్ఞా చక్రమునందు ఉన్న కోట్లాది సూర్య చంద్రుల కాంతి ని ధరించి పరయగు జ్ఞానముచే ఆవరింపబడిన రెండు పార్శ్వములు కలవాడునూ పరుడు అను పేరు గల శివునికి నమస్కారము చేయుదును.ఎలయన ఏ శంభుని ప్రీతితో పూజించు సాధకుడు సూర్యచంద్రాగ్నులకు కూడా గోచరము కానిదయి బాహ్య దృష్టికి కానరానిదయి ఏకాంతమయిన సహస్రదళ కమలమునందు నివసిన్చుచున్నాడు కదా !
శ్లో: 37. విశుద్ధౌతే శుద్ద స్ఫటిక విశదం వ్యోమజనకం
శివం సేవే దేవీ మపి శివసమాన వ్యవసితామ్l
యయోః కాన్త్యా యాన్త్యాశశికిరణ సారూప్యసరణే
ర్విధూతాన్తర్ద్వాన్తా విలసతి చకోరీవ జగతీll
తా: అమ్మా !నీ విశుద్ధి చక్రమున దోషము లేని స్ఫటిక మణి వలెనిర్మలుడునూ ఆకాశ తత్వము ఉత్పాదకమునకు కారణమయిన శివతత్వమును, శివునితో సమానమయిన యత్నము గల దేవియగు నిన్ను నేను పూజింతును.అట్టి శివాశివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటి గల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానము కలదయిచకోరపక్షి వలే ప్రకాశించును కదా !
శ్లో:38. సమున్మీలత్సంవిత్కమల మకరందైక రసికం
భజేహంసద్వన్ద్వం కిమపి మహతాం మానసచరంl
యదాలాపా దష్టాదశ గుణిత విద్యాపరిణతిః
ర్యదాదత్తే దోషాద్గుణ మఖిల మధ్భ్యః పయ ఇవ II
తా: అమ్మా : వికసించిన జ్ఞానము అను కమలము నందు ఉన్న పూమధువు నందే ఆసక్తి కలదియు యోగ పుంగవుల మనస్సు అను మానస సరస్సున సంచరించునదియు ఇటువంటిది అని నిర్వచించుటకు వీలు కానిది అగు హంసల రూపమయిన రాజ హంస మిథునమును నేను పూజించు చున్నాను.అ హంస ద్వయముల యొక్క కూతలవలన పరిపక్వత కలుగును.అది నీళ్ళ నుండి పాలవలె దోషములనుండి సద్గుణములను వేరు చేయును .కదా !
శ్లో: 39. తవ స్వాధిష్టానే హుతవహ మధిష్ఠాయ నిరతం
తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాంl
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యాద్దృష్టిః శిశిరముపచారం రచయతిll
తా: అమ్మా ! నీ స్వాదిస్థాన చక్రమందు ఉన్న అగ్ని తత్వమును అధిష్టించి ఎల్లప్పుడూ ప్రకాశించు అగ్ని రూపమయిన పరమ శివుని ఎల్లప్పుడూ ప్రార్ధించెదను. ఆయనతో సమ రూపువయిన నిన్ను కూడా ప్రార్ధించెదను. తేజో రూపమయిన అగ్ని జగములను దహించు చుండగా చల్లనయిన నీ చూపు శీతలములు అయిన ఉపచారములు కలిగించును కదా !
శ్లో: 40. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపన్ధిస్పురణయా
స్ఫుర న్నానారత్నాభరణ పరిణద్దేన్ద్ర ధనుషమ్l
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం
నిషేవే వర్షన్తం హర మిహిర తప్తం త్రిభువనమ్ll
తా: అమ్మా ! నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమయిన నెలవుగా కలిగి అందలి చీకటికి శత్రువు అయిన ప్రకాశములు కలిగిన వివిధ రత్నముల అలంకారములచే అలంకరింపబడిన ఇంద్ర ధనుస్సు కల నల్లని వర్ణము కలిగినట్టిదియు ఈశ్వరుడు అను సూర్యుని చే కాల్చబడిన మూడు లోకములను తన వర్ష ధారలచేత తడుపునట్టి నిర్వచించుటకు వీలు లేనట్టి మేఘమును ( ఈశ్వరుని ) పూజింతును .కదా !
No comments:
Post a Comment