శ్రీ సీతా రామ స్వామి
కురాడ విజయ
“ఈ సారన్నా భద్రాచలానికి వెళ్ళాలి”, రఘుకి గట్టిగా చెప్పాను. ఏముంది? లండన్ లో ఫ్లైట్ ఎక్కి ఒక పది గంటలు కళ్ళు మూసుకుని కూర్చుంటే, హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆ తరువాత అక్కడినుంచి భద్రాచలం వెళ్లడం కష్టం కాదు.
ఫ్లైట్ ఎక్కిన తరువాత గుర్తుకొచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రిందటి మాట.
“కాకికి ఒక అన్నం ముద్ద పెట్టవే”. మా అమ్మమ్మ గావు కేక కూరగాయాలబ్బాయి అరుపులో కలిసిపోయింది కానీ, చందమామ చదువుకుంటున్న నా చెవిని దాటి పోలేదు. కాకి కోసం ఒక ముద్ద పరాపెట్ వాల్ మీద పెట్టాను. అలాగే, ప్రతి రోజు వచ్చే అతిధులు, అదే, ఊర పిచుకలు, వాటి కోసం కూడా, కొన్ని వడ్లు ఒక గిన్నెలో పెట్టాను. ఆకులు గాలికి కదిలిన శభ్డానికి తలెత్తి మా పెరట్లో ఉన్న మావిడి చెట్టు, వేప చెట్టు వంక చూసాను. శ్రీ రామ నవమి టైం ఏమో, పూతతో కళకళలాడుతున్నాయి.
మావిడి కాయని పొడుస్తున్న రామ చిలుక, కూయాలా వద్దా అని ఆలోచిస్తున్న కోకిల కనిపించాయి. పక్షులని చూస్తే అదో ఆనందం. కానీ ఇక్కడేమి చూసారు? అదే మా సీలేరులో అయితేనా?
సీలేరు అంటే ముందు గుర్తుకు వచ్చేది మా స్కూల్ ముందు ఆడే నెమలే. మరీ బడాయి కాకపోతే స్కూల్ ముందర నెమళ్ళు ఏంటి? అనుకుంటున్నారా? మరి అప్పుడు మేము సీలేరు నది ప్రవహించే అడవిలోనే కదా ఉండేవాళ్ళము. ,మరి అడవిలో నెమళ్ళు, పులులు, పాములు, పక్షులు, ఇవేగా ఉండేవి? మేము ఎందుకు అడవిలో ఉండాల్సి వచ్చింది అనుకుంటున్నారేమో? మా నాన్న పేరు శ్రీ రామ మూర్తి. అయినా, మా తాతయ్య పేరు మాత్రం దశరధుడు కాదు లెండి.
మా నాన్న సీలేరు హైడ్రో పవర్ ప్లాంట్లో ఇంజనీర్ అవ్వడం వలన మాకు సీలేరులో ఉండే అదృష్టం దక్కింది. అలాగే మన్యం ప్రజలతో గడిపే అవకాశం కూడ. మా ఉరి పేరు డొంక రాయి. మీకు తెలుసా, “అల్లూరి సీతా రామ రాజు’ సినిమా మా ఉరి దగ్గర్లోనే తీశారు. ఎందుకంటే సీతా రామ రాజు మా మన్యం వాడే మరి. అసలే సీలేరు నది, అడవి, పక్షులు, చెట్లు.
సినిమా ఒక్కటే ఏంటి? మా అడవికి బొటానికల్ టూర్ కి కూడా వస్తారు తెలుసా. మరి నెమళ్ళ గురిన్చేగా మీ సందేహం? అవొక్కటే కాదు. ఎన్నో పక్షులు, జంతువులూ, చెట్లు, అన్ని మా స్కూల్ ముందర ఉండేవి. మా స్కూలే వాటి మధ్యలో ఉండేది అంటే కరెక్ట్ ఏమో? మా స్కూల్ అంటే ఒక్కటే రూమ్, ఒక్కరే టీచర్. ఆ ఒక్కరి దగ్గర మేము ఏం నేర్చుకున్నాము అనుకుంటున్నారేమో? ఆవిడొక్కరేనా? పిచ్చబ్బాయి అంటే మా పాలేరు, వీధి చివర ఉండే చిల్లర కొట్టు సాయిబు, పెరట్లో అమ్మ దొండ పాదు, పక్కింటి అత్తయ్యగారి కోడి పిల్ల, నది, ఆ నది ఇంటి ముందర ఒక పాయగ ప్రవహిస్తే, దాని మీద వేసిన చెట్టు దుంగ బ్రిడ్జి, అడ్డ చుట్ట కాల్చే ముసల్ది, అంటే మాకు అడవి లోనించి, చింత పండు, పుట్ట తేనే, తెచ్చిచ్చే అవ్వ, అందరు టీచెర్లే. చెట్టు కొమ్మల మీంచి దూకే కోతులు. ఆ కోతుల వెనక పరిగెత్తే మేము. ఇంటి ముందర గేట్ మీద నాన్న చేయి వేస్తె, అక్కడే రెస్ట్ తీసుకుంటన్న బుసలు కొట్టే పాము, పులి కనిపేస్తే, జీప్ ఆపేసి, నిశబ్దంగా కూర్చోవాలని హితబోధ చేసే మా డ్రైవరు, అందరూ, మా చదువులో భాగమే.
ప్రకృతిని ఆస్వాదించడం అంటే సెల్ఫీలీలు దిగి పేస్ బుక్ లో పెట్టాలని తెలియని రోజులవి. ఆకులో ఆకులై, కొమ్మల్లో కొమ్మ అయి కలసిపోయిన చిన్ని ప్రాణులతో పాటే మేము అడవిలో కలసి పోయాం. మాలో అడవి, అడవిలో మేము. ప్రకృతి, మేము వేరు అనే భావనే లేదు. అది ఒక్కసారి అనుభవిస్తే జీవంతాతం మనతోనే ఉండిపోతుంది. దాన్నే ఎన్లైటెన్మెంట్ అంటారేమో మరి నాకు తెలియదు.
” ఆకులోఆకునై పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా.” (దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు).
కానీ మేము సీలేరులో ఎప్పటికి ఉండిపోలేదు. నా మూడో క్లాసులో అనుకుంటాను. హైదరాబాద్ కి వచ్చేసాము. పెద్ద చదువులు చదవడానికి! ట.
అంతా బాగుంది కానీ, టైటిల్ కి దీనికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? వస్తున్నా. మరి, మేము హైదరాబాద్ కి మారకముందే, మా అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కదా. అప్పుడు మేము సీలేరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వఛ్చి వెనక్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా భద్రాచలం లో ఆగి, శ్రీ రాముడు ని చూసి వెళ్తే కానీ మా నాన్న ఒప్పోకోడు. పైగా హైదరాబాద్ నుంచి భద్రాచలంకి వచ్చి, అక్కడ పడవ ఎక్కి, ఇంకెక్కడో దిగి, ఆ తరువాత బస్సు ఎక్కి, ఆ పైన జీప్ ఎక్కి వెళ్తే కదా డొంక రాయి వచ్చేది. అందుకని, హైదెరాబాబాద్ టూ సీలేరు ప్రయాణంలో రాములవారితో అనుబంధం ఏర్పడి పోయింది. మరి మేము హైదరాబాద్ వచ్చేసిన తరువాత రాముడి మాటో? మా చిన్న పిన్ని పెళ్లి అక్కడేగా అయ్యింది? ఆ వంకన అందరం భద్రాచలానికి వెళ్ళాం లెండి.
“హైదరాబాద్ వచ్చేసింది.”, రఘు మాటలకి లేచాను. మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాము. ఎంతగా మారిపోయింది ఈ నగరం? ఏది హైదరాబాద్? కాకులేవీ? రామ చిలుకలేవి? ఊర పిచుక కనపడదేం?
అటుగా వెళ్తున్న ఒక పదేళ్ల పిల్లాడిని ఆపి అడిగాను.
“ఒరేయ్ అబ్బాయ్. రామ చిలుక ఏదిరా?” అని.
మరి వాడన్నాడుగా, “రామ చిలుక హైదరాబాద్ వదిలేసి రాములోరి దగ్గరికెళ్లి పోయింది” అని.
“మరి ఊర పిచుకో?”
“అది రామ చిలుకని వెతుకుతూ వెళ్ళిందండి” అన్నాడు.
హైదరాబాద్ ని వదిలి వెళ్లి పోయిన రామ చిలుక కోసం వెళ్లిన ఊర పిచుకని ఎక్కడ వెతకను? యాదాద్రి లోన? భద్రాద్రి లోన?
మూసి నది కున్న మురికిని కడగంగా ఉప్పొంగి పొంగింది కన్నీటి గంగ.
***
Thank you for posting my story. Appreciate your encouragement dear editor.
ReplyDelete