శ్రీదేవి దశమహావిద్యలు - 11
శ్రీరామభట్ల ఆదిత్య
10. శ్రీ కమలాత్మిక ( కమలా )
సదాప్రియే దేవీ శుక్లపుష్ప వరప్రియే |
గోమయాది శుచిప్రీతే మహాలక్ష్మీ నమోస్తుతే ||
శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలోని అష్టమ అధ్యాయంలో అమ్మవారి జననానికి సంబంధించి ఒక కథ చెప్పబడి ఉంది. అమృతం కోసం దేవదానవుల క్షీరసాగరమథనం చేయగా ఆ సమయంలో అమ్మవారు సముద్రం నుండి ఉద్భవించి శ్రీ మహావిష్ణువును వరించింది. మహావిద్యలలో అమ్మవారు పదవ స్థానంలో పరిగణించబడుతుంది.
అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి కాబట్టి వైష్ణవి. స్థితికి ఈ శక్తే కారణం, కాబట్టి నిగమాగమాలలో అమ్మవారి గురించి విస్తృతంగా చర్చించబడింది. అమ్మవారు స్వర్ణవర్ణంలో దర్శనమిస్తుంది. మంచు వంటి తెల్లని రంగు కలిగిన నాలుగు ఏనుగులు స్వర్ణ కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ కనిపిస్తాయి. అమ్మవారు తన రెండు చేతులతో కమల పుష్పాలను పట్టుకొని, మిగిలిన రెండు చేతులతో అభయముద్రలను ప్రదర్శిస్తుంది.
పుత్రపౌత్రాది వృద్ధి కోసం, జీవితంలో స్థిరత్వం కోసం అమ్మవారి ఉపాసన తప్పనిసరి. అమ్మవారినే లక్ష్మి లేదా షోడశి అని కూడా అంటారు. భార్గవుడి చేత పూజించబడింది కాబట్టి భార్గవి. సకలైశ్వర్యాల కోసం అమ్మవారి పూజ అత్యంత ఫలదాయకం. శ్రీ మంత్ర జపం, కనకధారా స్తోత్రం, శ్రీసూక్తం, బిల్వపత్రాలతో అమ్మవారి హోమం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది.
స్వతంత్రతంత్రంలో కోలాసుర వధకై అమ్మ ఉద్భవించినట్లు చెప్పబడింది. వారాహీతంత్రంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చేత పూజింపబడిన కారణంగా త్రిపుర అనే వచ్చిందని చెప్పబడింది. కాళికా పురాణం ప్రకారం ఒకసారి శివుడు తాను ఏకరూపం నుండి మూడురూపాలుగా పరివర్తన చెందాడట. ఆ రూపంలోని ఊర్ధ్వభాగం గౌరవర్ణంతో చతుర్భుజాలతో, చతుర్ముఖ బ్రహ్మగా పిలవబడింది. మధ్యభాగం నీలవర్ణంతో ఏకముఖంతో చతుర్భుజాలతో శ్రీమహావిష్ణువుగా పిలవబడింది. అధోభాగం పంచముఖాలతో, దశభుజాలతో శివుడిగా పిలవబడింది. అందువల్లే మహాదేవున్ని త్రిపురుడిని ఆయన శక్తిని త్రిపురా అని చెప్పబడింది. భైరవయామల తంత్రంలో వీరి పూజా విధానము చెప్పబడింది.
పురుష సూక్తములో 'శ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యాః' అని అని అమ్మవారి గురించి చెప్పారు. అమ్మవారు గుర్రము, రథము ఇంకా ఏనుగులతో కలసి కనిపించడం రాజ్యవైభవానికి సంకేతం. అమ్మవారి నిత్యం పంచకార్యాలు నిర్వర్తిస్తుంది అవి
1) తిరోభావము
2) సృష్టి
3) స్థితి
4) సంహారమ
5) అనుగ్రహము
ఇలా ఆ నారాయణుడి ప్రతీ కార్యాము అమ్మవారే చేస్తుంది.
ఇలా దశమహావిద్యలు 1) సృష్టి - వ్యష్టి, 2) గతి, 3) స్థితి, 4) విస్తారము, 5) భరణము - పోషణము, 6) నియంత్రణ, 7) జననము - మరణము, 8) ఉన్నతి - అవనతి, 9) బంధనము మరియు 10) మోక్షమునకు ప్రతిరూపాలు.
సర్వం శ్రీసీతారామచంద్ర చరణారవిందార్పణం
సమాప్తం.
No comments:
Post a Comment