శ్రీమద్భగవద్గీత -20 - అచ్చంగా తెలుగు
 ఓం శ్రీ సాయిరాం

శ్రీమద్భగవద్గీత -20 

రెడ్లం రాజగోపాల రావు
పలమనేరు

 
అక్షర పరబ్రహ్మయోగము
8వ అధ్యాయం 

సర్వద్వారాణి సంయమ్య
మనోహృది నిరుధ్యచ
మూర్థ్న్యాధాయాత్మనః
ప్రాణమాస్థితోయోగధారణమ్
12 వ శ్లోకం

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్ మామనుస్మరన్
యః ప్రయాతి త్వజస్దేహం
సయాతి పరమాంగతిమ్
13వ శ్లోకం
ఎవడు ఇంద్రియ ద్వారములన్నింటినీ శాంతింపజేసి(అరికట్టి) మనస్సును హృదయమందు స్థిరపరిచి, శిరస్సు నందు ప్రాణవాయువు నుంచి, ఆత్మను గూర్చిన ఏకాగ్రత చింతనము (ఊర్థ్వ కుండలినీ ధారణ)గలవాడై పరబ్రహ్మనాదమైన ఓంకార శబ్ధములో లీనమై శరీరమును వదులునో అతడు మానవజన్మ సార్థకమునకు అవసరమైన మోక్షమును పొందుచున్నాడు.
పరమగతియగు మోక్షమును బొందు విధానమిచట, చెప్పబడుచున్నది. ఈ విధానమును అంత్యకాలమున, మాత్రమే చేయవలెనని అర్థముకాదు. జీవిత కాలమంతయు క్రమశిక్షణతో సాధనచేయుచున్న యోగయుక్తునికి,అంత్యకాలమునందు గూడ అట్టి స్థితి లభించునని భావము.
ఇచట నాల్గు విషయములను విమర్శనాత్మకంగా వివరించాలి. భగవద్గీత యొక్క గొప్పతనము, సనాతన ధర్మమునందలి గొప్ప రహస్యములు దెలిసికొన వీలగును. సనాతన యోగులు విధించిన నియమముల వలన అట్టి గొప్ప యోగరహస్యాలను బహిర్గతపరచుట నిషిద్ధము.కానీ వాటి ప్రస్థావన మాత్రము తప్పక చేయవలసినదే. 
1.ఇంద్రియ ద్వారములనరికట్టుట- ఇంద్రియముల చర్యలకు మనస్సు మూలము. మనస్సు తన స్వస్థానమైన ఆత్మలో లీనమైనప్పుడు సంకల్పములు జ్వలించవు.సంకల్పరహితమైన మనస్సు నిర్మల సరోవరము. అట్టి నిర్మల సరోవరములో ఆత్మకాంతి స్పష్టముగా చంద్రబింబమువలె గోచరించును.కుక్కను బలవంతంగా తాళ్ళతో కట్టినచో ఎక్కువగా మొరుగుతుంది.ఇంద్రియములను బలవంతంగా అరికట్టే ప్రయత్నము చేయరాదు.నిరంతన సాధన వలన అవి ప్రశాంతమై నిర్మలమైన ఆనంద స్థితిని అందుకొనగలవు.తాబేలు అవయవములు ముడుచునట్లుగా ఇంద్రియములు లోనికి ముడుచుకొనిపోవును.
2.మనస్సును హృదయమందు జేర్చుట- సంకల్పముల తేనెతుట్టె మనస్సు అట్టి మనస్సు సాధన వలన స్థిరపడును.(సంకల్ప రహిత స్థితి). భగవంతుని దర్శించుటకు విశ్వమంతా వెదుకనక్కరలేదు. తనలోనే రస స్వరూపుడైయుండి, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు మరియు శరీర విధులన్నియు చక్కగా నడిపించుచున్న శివుని, తన స్థిర నివాస స్థానమైన ఆజ్ఞాచక్రములో హాయిగా దర్శించవచ్చును.
3. ప్రాణవాయువును శిరస్సునందు (బ్రహ్మరంద్రము) నిలపుట-
  ప్రాణవాయువును శిరస్సున నిలుపుట అనగా సామాన్యవిషయము కాదు. మూలధార చక్రములో నిబిడీకృమై యున్న అధోకుండలినీ శక్తిని యోగధారణా బలముచే ప్రాణాయామ సాధన ద్వారా భృకిటిస్థానమున(కూటస్థము) నిలిపి, నిరంతర సాధన చేసిన యోగి(అష్టాంగ యోగము) యొక్క ఇడ,పింగళ.సుషుమ్న అనే దివ్యనాడులు ఆజ్ఞాచక్రంలో సంగమించి బ్రహ్మనాడిగా పరివర్తనచెంది, ఊర్థ్వముఖంగా పయనించి సహస్రారానికి చేరుకుంటుంది.అలా సహస్రారానికి చేరిన యోగాగ్ని అచట మంచులా గడ్డకట్టిన సోమరసాన్ని తాకి,దాన్ని కరిగించి సాధకుని జీవన్ముక్తుని చేయును. ఇదియే అమృతపానము.
4.ఓమిత్యేకాక్షరం బ్రహ్మ- అట్టి అమనస్క స్థితిపొందిన ముక్తపురుషుడు తనలో ఉత్పత్తియైన దశవిధ నాధములను వినుచూ, వాటికి మూలమైన ఓంకార ధ్వని తన శరీరములో అన్ని కణముల ద్వారా, అణువుల ద్వారా వింటూ బ్రహ్మానందాన్ని పొందును. ఓంకార ధ్వని ద్వారా విశ్వంలోని ఓజశ్శక్తి శరీరంలో ప్రవేశించి ఆ శక్తితో శరీరము పునర్ణవము చెందును.

గమనిక : వ్రాయుటకు ఇంకా మిగిలి ఉన్నప్పటికి సమయాభావం వలన వీలుకాలేదు. మిగతా వచ్చేసంచికలో వివరించగలను. 
 (సశేషం)

No comments:

Post a Comment

Pages