శ్రీ రామ కర్ణామృతం -40 - అచ్చంగా తెలుగు

శ్రీ రామ కర్ణామృతం -40

Share This
శ్రీరామకర్ణామృతం - 40
  సిద్ధకవి
  డా.బల్లూరి ఉమాదేవి.



91.శ్లో:సాకేతే స్వనికేతనే సురతరోర్మూలే లసద్వేదికే
       పద్మం రత్నమయం దధాన మపరం హస్తాంబుజం జానుని
       సీతాం పార్శ్వగతాం సరోరుషకరాం విద్యున్నిభాం రాఘవం
    పశ్యంతం పరిపూర్ణచంద్రవదనం భాస్వత్కిరీటం భజే.
భావము:అయౌధ్య యందు తనయింటిలో ప్రకాశించుచున్న యరుగు గల కల్పవృక్షము యొక్క మెదటినుండి రత్నవికారమగు పద్మము నొకచేతను మరియొక చేయి మోకాలునందును ధరించినట్టియు పద్మములవంటి హస్తములు గలిగినట్టిదియు,మెరుపుతో సమానురాలును అగు సీతను చూచుచున్నట్టియు పూర్ణచంద్రునివంటి మొగము కల్గినట్టియు ప్రకాశించుచున్న కరీటము గల రాముని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:ప్రకటాయోధ్యను చందనాంతికమునన్ రత్నోజ్జ్వల ద్గేహమం
    దకలంకంబగు వేదికన్ మణికిరీటాలంకృతుండై సము
    త్సుకతన్ జానువు మీద హస్తమిడి విద్యుద్భాతి పంకేరుహాం
  తకరున్ మైథిలి పార్శ్వమందుగను సీతారాము భావించెదన్.
92.శ్లో:విద్యుద్వర్ణోపమాంగీం వికచవర ముఖీం విద్రుమా భాధరోష్ఠీం
         వేదండౌ ద్ధత్య కుంభ ప్రతికుచ యుగళాం వేదమధ్యావతాంసామ్
     శ్యామాం సంపుల్ల పద్మచ్ఛద నిభనయనాం చారుహాసాం సునాసాం
       సీతాం శ్రీరామ దేవీం శ్రితజనవరదాం చింతయేనంతమూర్తిం.
భావము:మెరుపుయొక్క రంగు సామ్యముగల శరీరము కలిగినట్టియు వికసించిన శ్రేష్ఠమైన మొగము గలిగినదియు పగడము యొక్క శోభగల పెదవి గలిగినదియు ఏనుగు యొక్క గర్వయుక్తమైన కుంభస్థలముల నెదిరించు స్తనద్వంద్వము గలిగినట్టియు యజ్ఞవేదిక వంటి నడుము గల స్త్రీలకు శిరోభూషణమైనదియు యౌవన మధ్యస్థురాలును వికసించిన పద్మపు రేకులతో తుల్యములగు నేత్రములు గలదియు సుందరమగు నవ్వు గలదియు మంచి ముక్కు గలదియు ఆశ్రయించిన జనులకు వరములనిచ్చునదియు
నగునంతములేని స్వరూపముగల రాముని భార్యయగు సీతను ధ్యానించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:తతసంఫుల్ల సరోజ నేత్ర హరివేదండాభ కుంభస్తనిన్
    శ్రితచింతామణి విద్రుమోష్ఠి నవరాజీవానన్ జంచల             ద్యుతి గాత్రిన్ హరి రాజ మధ్య నిగమస్తోత్రాద్భుతాకార భా
  సిత సుశ్యామ సునాసికన్ గొలిచెదన్ శ్రీరామ దేవిన్ మదిన్.
93.శ్లో:మాణిక్య మంజీర పదారవిందాం
   రామార్క సంపుల్ల ముఖారవిందామ్
   భక్తభయ ప్రాపి కరారవిందాం
  దేవిం భజే రాఘవ వల్లభాం తామ్.
భావము:మణివికారములైన యందెలు పాదపద్మములందు కలదియు రాముడనెడు సూర్యునిచే వికసించిన ముఖపద్మము కలదియు భక్తులకు నీగితో కూడిన హస్తపద్మము కలదియు రాముని భార్యయు నగు ప్రసిద్ధురాలైన సీతాదేవిని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చ:అనుపమ రామభాను వికచానన పంకజ నూత్నరత్న కాం
    చన నవనూపురాంఘ్రి నవసారసయుగ్మ నిజాశ్రితేష్ట దా
   యి నవకరాంబుజాత మిథిలేశ్వర పుత్రిని రాముదేవి          నె
   మ్మనమున నిష్టసిద్ధికి సమాహితబుద్ధి దలంతు నెంతయున్.
94..శ్లో:జయతు విజయకారీ జానకీ మోదకారీ
        తపనకులవిహారీ దండకారణ్యచారీ
      దశవదనకుఠారీ దైత్యవిచ్ఛేదకారీ
      మణిమకుట ధారీ చండకోదండ ధారీ.
భావము:జయమును కలిగించునట్టియు సీతకు సంతోషము కలుగ చేయునట్టియు సూర్యవంశమందు విహరించునట్టియు దండకారణ్యమునందు సంచరించునట్టియు రావణుని శిరము నరకు గొడ్డలిని ధరించినవాడైనట్టియురాక్షససంహారము చేయునట్టియు రత్నకిరీటమును ధరించినట్టియు తీక్షణమగు ధనస్సును ధరించినట్టియు రాముడు జయించు గాక.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:ధారణిజా సుతోషకరు దామరసాప్త కులప్రదీపకున్
ఘోరనిశాచరాంబురహకుంజరు నచ్యుతు దండకాటవీ
చారు తరప్రచారు ధృతచాపు దశానను మర్ధనున్ మణి స్ఫార కిరీటధారి రఘుసత్తము డుర్వి జయంబు పొందెడున్.
95.శ్లో:చేతః స్థితం చింతక చింతనీయం
       చింతాహరం చింతిత పారిజాతమ్
      అచింతనీయం బహుచింతయేహం
      తమేవ రామం భువనాభి రామం.
భావము:చిత్తమందున్నట్టియు భక్తులకు ధ్యానింపదగినవాడును విచారము హరించువాడును కోరిన వస్తువులిచ్చు కల్పవృక్షమైనవాడును ఊహింపశక్యము గానట్టివాడును లోకములకు మనోహరుడైనవాడునగు రాముని నేను విస్తారముగా ధ్యానించెదము.
.
తెలుగు అనువాదపద్యము:
మ:సకలాత్మస్థితు సర్వచింతితుని దాసప్రాంగణ ప్రాంతక
   ల్పకమున్ శౌరి నచింత్యు నచ్యుతు బరబ్రహ్మంబు జింతాహరున్
   బ్రకటానందకరున్ బరాత్పరు బరున్ రామున్ ఘనశ్యాము దా
 రకనామున్ రవికోటిధాము మది నశ్రాంతంబు చింతించెదన్.
96.శ్లో:సాకేత శరదిందు కుందధవళే సౌధే మహామంటపే
       పర్యస్తాగరు ధూపధూమ పటలే కర్పూర దీపోజ్జ్వలే
      సుగ్రీవాంగద వాయుపుత్ర సహితం సౌమిత్రిణాసేవితం
      లీలా మానుష విగ్రహం రఘుపతిం రామం భజే శ్యామలమ్.
భావము:అయోధ్యాపురమందు శరత్కాలచంద్రుని వలెను తెల్లనైన మేడయందు వ్యాప్తమైన అగరుధూపపు పొగలసమూహము గలిగినట్టియు కర్పూరదీపములచే ప్రకాశించుచున్న గొప్పమంటపమందుండి సుగ్రీవునితో అంగదునితో ఆంజనేయునితో కూడినట్టియు లక్ష్మణునిచే సేవింపబడుచున్నట్టియు రఘుపతియైనట్టి శ్యామలవర్ణముగల రాముని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:ఘనసాకేతమునందు గుంద సుమ రాకాచంద్ర దీప్తంబు వా
  సనలన్ జెన్నగు ధూపధూమ నిబిడాచ్ఛాదంబు కర్పూర దీ
 పనిరూఢంబగు సౌధమంటపునన్ భ్రాతల్ కపుల్ గొల్వ మిం
చిన లీలామనుజాకృతిం బరగు నా శ్రీరాము జింతించెదన్.
97.శ్లో:రామః పితా రాఘవ ఏవ మాతా
   రామోసుబంధుశ్చ సఖాహితశ్చ
   రామో గురుర్మేపరమం చదైవం
   రామం వినా నాన్య మహం స్మరామి.
భావము:నాకు రాముడే తండ్రి రాముడే తల్లి
.రాముడే చుట్టము రాముడే యిష్టమిత్రుడు రాముడే గురువు రాముడే గొప్ప దైవము రాముని దక్క నితరుని నేదలంపను.
తెలుగు అనువాదపద్యము:
ఉ:రాముడు తండ్రి మజ్జనని రాముడె బంధుడు రామచంద్రుడే
రాముడు మిత్రుడున్ గురుడు రాఘవుడే పరదైవతంబగున్
రాముడె మాకు దిక్కెపుడు రామునిగొల్చెద సంతతంబు శ్రీ
రాముని దప్ప నన్యుల నిరంతర మెంచి తలంచ నెమ్మదిన్.
98.శ్లో:యాకృపా ముని సంత్రాణే యాకృపాకపినాయకే
 యావిభీషణ రక్షయాం సారామ మమ దీయతామ్.
భావము:మునులను రక్షించుట యందే దయకలదో,సుగ్రీవుని యందే దయకలదో విభీషణుని రక్షించుటయందే దయకలదో ఆదయ నోరామా నాయందుంచుము.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:ఏ దయచేత దాపసుల నేలితో వానర శేఖఱాళిపై
    నేదయ కల్గియుండునో రహిన్ దశకంధర సోదరావనం
   బేదయచేత నయ్యె నను నిప్పుడు నాదయ బ్రోవుమయ్య దా
మోదర రామ రాఘవ సముజ్జ్వల భూషణ భక్త పోషణా.
99.శ్లో:దయానిధే రాఘవ రామచంద్ర
 నిరస్య పాపాని మమాఖిలాని
   త్వయ్యేవ భక్తిం సుదృఢాం ప్రయచ్ఛ
    సైవప్రసూతేహ్యఖిలానభీష్టాన్.
భావము:దయకు స్థానమైన యో రామచంద్రా!నాపాపములనెల్ల త్రోసి వేసి నీయందే మిక్కిలి ధృఢమైన భక్తినిమ్ము.అదియో యెల్ల కోరికలను ఫలింప చేయుచున్నది.
.
తెలుగు అనువాదపద్యము:
చ:ప్రకట దయానిధీ వరద రాఘవ రామ మదీయ కల్మష
   ప్రకరములెల్ల బాపి తమ పాద సరోజములందు భక్తి మా
  మక హృదయంబునందు ననుమానము లేక యొసంగు మయ్య  సే
   వకులకభీష్ట సంపద లవారిగ సంభవమందు నెప్పుడున్.
100.శ్లో:అక్హీణబాణ తూణీర సమారోపిత కార్ముకః
        దశగ్రీవ శిరోహంతా శ్రీరామ శరణం మమ.
      
         శ్రీరామ మే త్వం హి పితాచ మాతా
          శ్రీరామ మే త్వం హి సృహృచ్చ బంధుః
           శ్రీరామ మే త్వం హి గురుశ్చ గోష్ఠీ
            శ్రీరామ మే త్వం హి స్తమేవ.
భావము:నాశనము లేని బాణముల గల అమ్ముల పొదియును ఎక్కుపెట్టబడిన ధనుస్సుగలవాడును రావణుని శిరస్సు కొట్టివేసిన రాముడు నాకు దిక్కు.ఓరామా నాకు నీవే తండ్రియు తల్లియు..ఓరామా నాకు నీవే స్నేహితృడునృ చుట్టమును.ఓరామా నాకు నీవే గురురును ప్రసంగమును.ఓరామా నాకు నీవే సమస్తమును.
.
తెలుగు అనువాదపద్యము:
       ఉ:అక్షయబాణ తూణధరుడై గుణరావము పిక్కటిల్లగా
      రాక్షసరా డ్దళంబుల గరక్కున ద్రుంచిన నీవె దిక్కుసం
       రక్షకుడున్ గురుండును వరప్రదుడంబయు తండ్రి తాతయుం
       బక్షము భ్రాతయున్ సఖుడు బంధుడు సర్వము నీవె రాఘవా.
(సశేషం)
  

1 comment:

  1. ప్రథమాశ్వాస శ్లోకాలు దయచేసి చూపగలరా?

    ReplyDelete

Pages