సుబ్బుమామయ్య కబుర్లు - అచ్చంగా తెలుగు
మనం-యంత్రం

పిల్లలూ, యంత్రాలూ పని చేస్తాయి. మనమూ పని చేస్తాం. ఇంతకీ వాటికి, మనకి ఏంటి తేడా?
ఏంటంటే, మనం పని చేయడంలో ఆలోచన, అనుభవం ఉంటుంది. యంత్రానికి అది ఉండదు. చెప్పిన (ఫీడ్ చేసిన) పని చేసుకుపోతుంది అంతే. అర్థం కాలేదా? చెబుతా వినండి. మనింట్లో టీ వీ ఉంటుంది కదా, ఆన్ చేస్తే దానిపాటికది ప్రోగ్రాములు చూపించుకుంటూ పోతుంది. అంతే తప్ప చూసిన వాళ్లు విసిగిపోతున్నారా, కాస్త ఏమన్నా మార్చి చూపిద్దామా అనేది ఉండదు. ఇహ వాషింగ్ మెషిన్. ఆన్ చేస్తే బండెడు బట్టలు ఉతుకుతుంది తప్ప ఈ బట్టలకు ఇక్కడ మురికి పోలేదు, ఇంకోలా ఉతుకుదాం, పాపం కాస్త ఆరేసి పెడదాంలాంటి ఆలోచనలు ఉండవర్రా. మరి మనం ఒక పని చేసే ముందు, చేస్తున్నప్పుడు, చేశాక ఆలోచిస్తూనే ఉంటాం కదా. యంత్రాలు పని చేసుకుంటూ పోతాయి అంతేకాని అభ్యాసం, అనుభవం ఉండవు. మనకి అలాకాదు. ఏ పని చేయాలన్నా చక్కగా నేర్చుకుంటాం, మెళకువలు/ సులువులు తెలుసుకుంటాం, నైపుణ్యం సంపాదించుకుంటాం, అనుభవజ్ఞులమవుతాం.
రవివర్మ అందమైన చిత్రాలు గీసింది, సుబ్బలక్ష్మి సంగీత సరస్వతి అయింది నిరంతర అభ్యాసంతోటి, అనుభవంతోటీ. కంప్యూటర్ అలాంటి చిత్రాలు గీస్తుందా? అంత గొప్ప రాగాలు పాడుతుందా?
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనలో కొంతమంది యంత్రాల్లానే పని చేస్తారర్రా. లేకపోతే రోజూ స్కూలుకెళ్లి పాఠాలు నేర్చుకునే మనం పాస్ అవుతామా? ఫెయిల్ అవుతామా అని బెంబేలు పడడమేమిటి? పాసై తీరాలి కదా! అంటే మన శరీరం క్లాసులో, మనసు మరెక్కడో అన్నమాట. అంతేగా!
అంతేకాదు కొన్ని నచ్చని పనులు అలా చేసుకుంటూ పోతాం, ధ్యాస వాటిమీద ఉండదు.
యంత్రాలకి శ్రద్ధ, ఏకాగ్రత, ఏదైనా సాధించాలన్న తపన ఉండదు. మనకి ఉండాలిగా. అదేగా మనకూ వాటికీ తేడా. మనం యంత్రాలమవుతామా? 
ఇహనుంచీ మనం ఏపని చేసినా దీక్షగా మనసు పెట్టి చేద్దాం సరేనా. అలా చేసి చూడండి మీరెంత గొప్పవారవుతారో. ఒకనాటికి మీలోంచి ఒక అబ్దుల్ కలామ్, విరాట్ కోహ్లీ, ఎస్ పి బాలు, ఐన్ స్టిన్..ఇలా ఎందరెందరో మేధావులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, క్రీడాకారులు, నాయకులు మీలోంచి బయటకొస్తారు. అది మీమీదే అధారపడివుంది. మీరు యంత్రాలు కాకూడదంతే!
మీరంతటి గొప్ప వారవ్వాలి. అది మీ మామయ్య చూడాలి.
ఉంటానర్రా మరి.
-మీ 

సుబ్బుమామయ్య

No comments:

Post a Comment

Pages