వెనక్కి తిరిగి చూసుకో!
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
నీదనుకున్నఇంటిని ఆమె ఆక్రమించుకొని,
నీ కన్నకొడుకుని ఆమెకొంగుకు ముడివేసుకొని,
పగ్గాలు తనచేతుల్లోకి తీసుకొని, ఆమెమాటలనే నెగ్గేలా చేసుకొని,
తన మహారాణి పదవిని ఆమె తనకనుకూలంగా మార్చుకొని,
మొగుడనే పరికరాన్నితన నియంత్రణలోకి తెచ్చుకొని,
అతడికి తెలియకుండానే అతడిని తను అనుకున్నట్టు ఆడిస్తుంటే,
ఆమె ప్రతిమాటకు అతడు అవుననే పదాన్ని జోడిస్తుంటే,
కళ్ళల్లో తుఫానులు సుడులు తిరుగుతుంటే,
గుండెల్లో కార్చిచ్చులు చెలరేగుతుంటే,
కలిగే కలతను భరించలేక,భర్తకు నీ బాధను వివరించలేక,
సతమౌతున్న ఓ సతీ!
ఒక్కసారి వెనక్కితిరిగి చూసుకో!
నీ గతప్రవర్తనను వివరిస్తూ నిజాలెన్నో నీకు కనపడతాయి.
వాటి ఫలితాలనే నీకుఅందిస్తూ నేటి పరిస్థితులు నిన్నుపలకరిస్తున్నాయి.
నాటి నీ ప్రతాపమే నేటి నీ పరితాపానికి ప్రేరణమని,
నాటి నీ ప్రవర్తనే నేటి ఈ ఫలితాలకు కారణమని
నీకు తెలియజేస్తూఉన్నాయి.
ఈ నిజాన్ని నీకుగా నీవే తెలుసుకో!
దానికి తగ్గట్టుగా నిన్నునీవు మలుచుకో!
***
No comments:
Post a Comment