ఆడుతా బాడుతా నీతో నట్టే ముద్దు గునుసుతా
డా.తాడేపల్లి పతంజలి
(తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తనరేకు: 268-2 సంపుటము: 3-390)
వేంకటేశ్వరుని ఎలా చూడాలో, ఎలా భావించాలో అన్నమయ్య ఈ కీర్తనలో మనకు ప్రబోధిస్తున్నాడు.
ఆడుతా బాడుతా నీతో నట్టే ముద్దు గునుసుతా
వోడక నీదండ చేరి వున్నారమయ్యా ॥పల్లవి॥
01.ఆస దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు
యే సుఖదుఃఖములు దా మెరగనట్టు
వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మ దలచుక
యీసుల పుణ్యపాపము లెఱగమయ్యా ॥ఆడు॥
02.యేలినవారు వెట్టగా నేపున దొత్తులు బంట్లు
ఆలకించి పరుల బోయడుగనట్టు
తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించగా
యేలని యేమియు గోర నెరగమయ్యా ॥ఆడు॥
03.చేత జిక్కి నిధానము చేరి యింటగలవాడు
యేతుల గలిమిలేము లెరగనట్టు
ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండగాను
యీతల నే వెలుతులు నెరగమయ్యా ॥ఆడు॥
******
తాత్పర్యం
అయ్యా!ఓ వేంకటేశ్వరా ! నీతో నేను ఆడుతాను. పాడుతాను. అలాగే ముద్దు ముద్దు మాటలు సణుగుతాను. (=గునుసుతా) భయపడకుండా ఉండటానికి( =వోడక) నీదగ్గరికి (= నీదండ) చేరి ఉన్నాము.
01.తల్లిదండ్రుల మోములు అదేపనిగా ఆశగా చూస్తూ పిల్లలు ఏ సుఖదుఃఖములు తాము పట్టించుకోరు. అలా చూడటంలో ఒక ఆనందముంది. అలా-ప్రసిద్ధికి ఎక్కిన (=వాసుల) ఓ లక్ష్మీ పతీ ! మిమ్ములను వేగంగా ఆత్మలో తలచుకొంటూ - ఈర్ష్యలు,(=ఈసుల) పుణ్యపాపములుమొదలయినవాటిని మేము పట్టించుకోము.
02.తన యజమాని తనకు కావలసినవన్నీ సమకూరుస్తుండగా- అతని సేవకులు - అతని మాట వింటూ- ఇతరుల దగ్గరకు తమ అవసరాల నిమిత్తం వెళ్లరు.. అలాగే- క్షమాధైర్యములు (= తాలిమి) బాగా ఎక్కువగా ఉన్న మా యజమానివైన నువ్వు మమ్మలిని బాగా రక్షిస్తుండగా ఇతరులను మేము అడుగుట అనేది తెలియదు. (ఇతరులను శరణుకోరమని భావం)
03.తన చేతికి నిధి దొరికి, దానిని ఇంట్లో పెట్టుకొన్నవాడు - ఎక్కడా -(=ఏతల) కలిమి లేముల బాధలు పొందడు. అలాగ- మా ఆత్మలో - ఓ వేంకటేశ్వరా ! నిధివైన నువ్వుండగా - ఇక్కడ (=ఈతల) ఈలోకంలో మాకు ఏ వెలితి - ఏ లోపం లేదయ్యా !
****
విశేషాలు
దాస్య, సఖ్య, వాత్సల్య, శాంత, మధుర అని అయిదు రకాలుగా భక్తిని భాగవతం వివరించింది.
ఈశ్వరుడి పట్ల పరమ ప్రేమే భక్తి అని నారదుడు నిర్దేశించాడు. ఈ భక్తి అమృతస్వరూపం.
మూగవాడు రుచి అనుభవాన్ని చెప్పలేనట్లు, ప్రేమ స్వరూపాన్నికూడా నోటితో చెప్పలేమని పెద్దలు చెబుతారు. అన్నమయ్య కీర్తనలోని రుచి అనుభవంకూడా వివరణకు అసాధ్యం.
పూజాదులలో అనురాగమే భక్తి అని పరాశరుడు, [పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః] భగవత్కథలో అనురాగమే భక్తి అని గర్గుడు, [కథాస్వితి గార్గ్యః] అవిరోధమైన ఆత్మరతి అని శాండిల్యుడు. [ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః] చెప్పాడు
నారదుడు భగవంతుడిపై భావస్థాపనని నారదుడు ఆసక్తి అన్నాడు. గుణమహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సుఖాసక్తి, కాంతాసక్తి, వాత్సల్యాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయాసక్తి, పరమవిరహాసక్తి, అనే పదకొండురూపాలు ఈ ఆసక్తికి ఉన్నాయి. ఈ ఆసక్తులలో వాత్సల్యాసక్తి ఈ కీర్తనలో మొదటి చరణంలో కనబడుతుంది.తన్మయాసక్తి ద్వితీయ చరణంలో, గుణమహాత్మ్యాసక్తి తృతీయ చరణంలో ఉన్నాయి
భగవంతుడిని కేవలం నా పుత్రుడు అని కోరుకోవటం వాత్సల్యశాంతం. సంతానభావంతో సేవించటం వాత్సల్యదాస్యం.
అన్నమయ్య తన అనేక కీర్తనల్లో స్వామికి వాత్సల్య దాస్యం చేసాడు. ఈ గీతంలో బిడ్డగా తాను మారి స్వామి దయను కోరుకొన్నాడు.
గునుసు’ అనునది కళింగాంధ్ర మాండలికం .’సణుగు’ అని ఈ పదానికి అర్థం. ‘నిశ్చయం అయిన తర్వాత గునిసి యేం లాభం.” అని గురజాడ అప్పారావుగారి కన్యాశుల్క ప్రయోగం.అన్నమయ్య ఈ పద ప్రయోగం చేసి ఈ “పద” స్థాయిని పెంచాడు.స్వస్తి.
***
No comments:
Post a Comment