అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-7 వ భాగం - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-7 వ భాగం

Share This

అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల-7 వ భాగం 
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)

 
(తన మనుమరాలి పోషణకు కావలసిన ధనం కోసం కుమారుడి సాహిత్యాన్ని అమ్మాలనుకున్న మార్చ్ అన్న మిలిటరీ వానికి సాయం చేయటానికి న్యాయవాది కూతురైన నాన్సీ ఒప్పుకొని తన స్నేహితురాళ్ళతో ప్లెజెంట్ హెడ్జెస్ కి వెళ్ళి ఆ భవంతి మొత్తం గాలిస్తుంది. కానీ ఆమెకు మాయమైన ఫిప్ సాహిత్యం కనబడదు గానీ తక్షణ సాయంగా అటకమీద ఒక పాత బల్ల, మంచి చిత్రాలు గీసి ఉన్న అరడజను అట్టపెట్టెలు కనిపిస్తాయి. వాటిని పురాతన వస్తువుల దుకాణంలో అమ్మగా కొంత సొమ్ము వస్తుంది. అదేసమయంలో స్నేహితురాలు యింట్లో ఉన్న మిలిటరీ వాని మనుమరాలు తట్టురోగంతో యింటికి వచ్చేస్తుంది. దానివల్ల ఆ పాపకు సంరక్షకురాలిగా ఎఫీ అన్న అమ్మాయిని తెచ్చి పెడుతుంది నాన్సీ. ఎఫీ భయస్తురాలు. ఒకరోజు యింటి వద్ద ఉన్న నాన్సీకి ఎఫీ ఫోను చేసి ఉన్నపాటున బయల్దేరి రమ్మని, రాత్రి జరిగిన విషయం చెప్పాలని చెబుతుంది. ఆ కబురు విన్న నాన్సీ అఘమేఘాలమీద అక్కడకు చేరుకొన్నాక, ముందురోజు అర్ధరాత్రి ఒక ఆగంతకుడు ఆ ప్రాంగణంలో తచ్చాడాడని ఎఫీ చెబుతుంది. 'దొంగిలించటానికి ఆ పాత భవనంలో ఏమున్నాయని ' ఎఫీని సంతృప్తిపరచినా, అనుమానంతో ఆ ప్రాంగణంలో అన్వేషించే నాన్సీకి అడుగుజాడలు కనిపించి బిత్తరపోయింది. తరువాత అటకమీద అన్వేషించిన ఆమెకు పాతభోషాణం పెట్టెలో అమ్మకానికి పనికొచ్చే డజను పాతచిత్రాలు కనిపించాయి. వాటిని మార్చ్ అనుమతితో ఫేబర్ దుకాణంలో అమ్మి, భయపడుతున్న ఎఫీకి తోడుకోసం ఆ రాత్రి ప్లెజెంట్ హెడ్జెస్ కి తిరిగి వస్తుంది. ఆ రాత్రి అటకమీద బట్టలబీరువాలో నాన్సీకి అస్తిపంజరం కనిపిస్తుంది. అది హలోవీన్ ఉత్సవానికి ఫిప్ బంధువొకడు తెచ్చాడని పెద్దాయన చెబుతాడు. దాన్ని ఫిప్ అందులో దాచాడంటే తన సాహిత్యం యితరుల కళ్ళబడకుండా దానికి కాపలాగా దాచాడా? అని నాన్సీ అనుమానిస్తుంది. మరునాడు ఉదయం తన యింటికి వెళ్ళిన ఆమెకు తండ్రి మరొక కొత్త కేసు గురించి చెబుతాడు. బుకర్ కంపెనీలో తయారయే ఆడపిల్లల పట్టుకండువాలను పోలిన కండువాలను డైట్ కంపెనీ కూడా తయారుచేస్తోందని, కొన్నాళ్ళు బుకర్ కంపెనీలో పనిచేసిన బుషీట్రాట్ అన్న వ్యక్తి డైట్ కంపెనీలో జేరాడని, అతనే ఈ పట్టుకండువాల మూలపదార్ధపు తయారీని యిక్కడ కనుక్కొని, అదే విధానంలో అక్కడ తన కంపెనీ పట్టుకండువాలను పోలిన కండువాలను తయారు చేసి తన వ్యాపారాన్ని దెబ్బ తీస్తున్నారని, దీనిలో డైట్ కంపెనీ యజమాని డైట్ హస్తం ఉందని, అందుకే ఆ కంపెనీపై కేసు వేయాలని బుకర్ భావిస్తున్నాడని డ్రూ తన కూతురికి చెబుతాడు. ఆ కేసులో ముందుకు వెళ్ళాలంటే ముందుగా బుషీట్రాట్ డైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు నిర్ధారించాలి.  దానికోసం నాన్సీ డైట్ కూతురు డయానె ను స్నేహం చేసుకొని, ఆమె ద్వారా వారి కంపెనీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.  తండ్రి చెప్పినది విన్న నాన్సీ  డయానె కు బట్టలు కుట్టే దర్జీ ద్వారా ముందుకెళ్ళాలని తీర్మానించుకొంటుంది.  అలాగే దర్జీని పరిచయం చేసుకొని, ఆమె ద్వారా ఆరోజు 2 గంటల రైలుకు డయానె వస్తున్నట్లు వింటుంది.  వెంటనే స్టేషన్లో డయానెను కలిసి తన మాటల్తో బో్ల్తా కొట్టించి, ఆమెతో డైట్ కంపెనీకి  వెడుతుంది.  డయానె తండ్రి దగ్గరకు వెళ్ళిన సమయంలో ఆ కంపెనీ కార్యదర్శితో ఫాక్టరీలోపల చూడటానికి నాన్సీ వెడుతుంది.  అక్కడ ఆమెకు ఒకచోట " ప్రవేశం నిషిద్ధం" అన్న బోర్డు కనిపిస్తుంది.  తరువాత   ఏం జరిగిందంటే. . . . . . . )

@@@@@@@@@@@@@@@@
 'ఇక్కడ ప్రవేశం నిషిద్ధం- అని ఉన్నదంటే మిస్ జోన్స్ చెప్పిన రహస్య ప్రదేశాల్లో యిదీ ఒకటి కావచ్చు' అనుకోకుండా నాన్సీలో శంక మొదలైంది.  'బుషీ ట్రాట్ ఆ లోపల ఉండి ఉండొచ్చు.'
వాళ్ళు మరొకచోట మెట్లెక్కాక, సెక్రటరీ మిస్ జోన్స్ సింథటిక్ తయారీలో తదుపరి ప్రక్రియను వివరించింది.  "అదిగో! అక్కడ చూడు.  ఒక పెద్ద జల్లెడ ఆకారంలో ఉన్న ఆ యంత్రాన్ని చూశావా?  దాన్ని స్పిన్నరెట్ అంటారు.  దాన్ని ఉపయోగించి దారం తయారుచేస్తారు."
  "ఇది చెప్పుకోదగ్గది" అంటూ నాన్సీ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది.  తాను సెక్రటరీ చూపిస్తున్న వాటిని తప్ప ఫాక్టరీలో మరి దేన్నీ గమనించనట్లు నటిస్తోందామె. 
అదే సమయంలో ఓక గంట పదేపదే మ్రోగసాగింది.
  "ఆ గంట నా కోసమే.  మిస్టర్ డైట్ నా కోసం చూస్తున్నట్లున్నారు.   మనం వెనక్కి వెళ్ళిపోవాలి" మిస్ జోన్స్ అంది.
  "మీకు అభ్యంతరం లేకపోతే, నేను మరికొంతసేపు యిక్కడ చుట్టి వస్తాను" అంటూ యువగూఢచారి చెప్పింది. 
  "సరె!" అంటూ ఆమె కొద్ది క్షణాలు ఆగింది.  "తోడు లేకుండా  నువ్విక్కడేమీ చూడలేవు.  కానీ నువ్వు ఉండాలనుకొంటే ఉండు.  మిస్ డైట్ కనిపిస్తే నువ్వు యిక్కడ ఉన్నావని చెబుతాను."
నాన్సీ సరేనన్నట్లు తలాడించి,  అంతవరకూ తనకు ఫాక్టరీని చూపించినందుకు ధన్యవాదాలు చెప్పింది. సెక్రటరీ  స్పిన్నరెట్ ప్రాంతంనుంచి వెళ్ళిపోగానే నాన్సీ త్వరగా నిషేధిత ప్రాంతమని బోర్డు ఉన్న గది మెట్ల దగ్గరకు వచ్చింది. 
  "ఎలాగైనా సరె! నేను లోపలికి చూడాలి" అని నిశ్చయించుకొంది.
  ఆ గది ముందు ఆమె సంకోచంతో తచ్చాడుతుండగా, అకస్మాత్తుగా గదితలుపులు తెరుచుకొన్నాయి.  మాసిపోయిన గళ్ళ లాగు వేసుకొన్న మనిషి ఒక పాకెట్టుతో బయటకొచ్చాడు.  అతడు నాన్సీని గమనించకుండా వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోయాడు.  అతను తీసుకెడుతున్న పాకెట్టులో గుడ్డపీలిక ఉన్నట్లు కనిపించింది. ఆ తలుపులు వెంటనే మూతబడినా, నాన్సీ కళ్ళముందు కొన్ని వస్తువులు మెరిసి మాయమయ్యాయి.  ఆమెకు రసాయనాలను కలియబెట్టే పెద్దపెద్ద పాత్రల వంటివి కనిపించాయి.  వాటిముందు గుబురుపొదలాంటి నల్లనిజుట్టు గల వ్యక్తి కనిపించాడు.  ఆమెకు అతని వీపు మాత్రమే కనిపించినా, తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  "తుప్పలా పెరిగిన జుట్టు.  బుషీట్రాట్ పేరు"
  "బుషీట్రాట్" నాన్సీ ఉత్తేజితురాలైంది.  "బుకర్ ఫాక్టరీలో పనిచేసిన మనిషి యితనే!" 
  తలుపులు బలంగా మూసుకోవటంతో ఆమెకు అంతకన్నా ఎక్కువ కనపడలేదు.  ఆమె ఆ గదిలోనుంచి వచ్చిన వ్యక్తి  క్రింద హాల్లోకి వెళ్ళి మాయమయ్యేవరకూ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసింది. 
  "నేను ఆ తుప్పజుట్టువాణ్ణి బాగా చూడాలి" అని నిశ్చయించుకొందామె.  "ఈ రహస్యాన్ని భేదించటంలో నాన్నకు సాయపడటానికి నాకు దొరికిన అవకాశం యిది. వదులుకోకూడదు." 
  ఆమె ఒకసారి చుట్టూ చూసి ఎవరూ లేరని రూఢి పరచుకొంది.  ఆ తలుపులను సమీపించి జాగ్రత్తగా తోసింది.  కానీ దానికి స్నాప్ లాక్ ఉండటంతో ఆ తలుపులు పిసరంతైనా తెరచుకోలేదు. 
  "నేను తప్పక లోనికెళ్ళాలి" అంటూ ఆమె దృఢనిశ్చయానికి వచ్చింది.  "అదెలా సాధ్యమవుతుందో నాకు తెలుసు" అని తనలో నవ్వుకొంది.
  తన పెదాలను రెండు తలుపుల మధ్య ఖాళీలో ఆనించి, ఆమె గట్టిగా అరిచింది. ఆమె తంత్రం ఫలిచింది.  లోపలున్న వ్యక్తికి ఆమె కేక వినిపించినట్లుంది.  లోనుంచి కంగారుగా వస్తున్న అడుగుల శబ్దం వినిపించింది.
మరుక్షణం తలుపులు బార్లా తెరుచుకొన్నాయి.  వాటికి చేరబడినట్లున్న నాన్సీ తూలుతూ గది లోపలికి ప్రవేశించింది.  సగం తెరిచిన కళ్ళపై చేతినుంచి ఆమె తూలుతూ"నీళ్ళు. . .నీళ్ళు " అని గొణిగింది.
  తలుపులు తెరిచిన తుప్పజుట్టు వ్యక్తి ఆమెను అనుమానంగా చూశాడు.
  "ఒంట్లో బాలేదా?" పీలగొంతుతో అడిగాడు. 
  నాన్సీ అతని ప్రశ్నలకు జవాబు యివ్వదలుచుకోలేదు.  అందుకే స్పృహ తప్పినట్లు నటించింది.  వెంటనే అతను కంగారుపడి, సాయం కోసం బయట ఉన్న హాలు వైపు పరిగెత్తాడు.  గది తలుపులు మూసుకోగానే నాన్సీ తనలో నవ్వుకొంటూ కళ్ళు తెరిచింది.
  "ఖచ్చితంగా యితనే బుషీట్రాట్.  నేను నాన్నకు వర్ణించి చెప్పగానే యితనేనని నిర్ధారిస్తాడు" అనుకొంది. 
  హుషారుగా పాదాలపైకి ఎగిరి నిలబడి ఆసక్తిగా ఆ గదిచుట్టూ చూసింది.  అది ఒక పరిశోధనశాలలాగ ఉంది.  ఆమెకు దగ్గరగా ఉన్న అనేక తొట్టెలలో సప్తవర్ణాలను పోలిన మిశ్రమాలు కనిపించాయి.  నాన్సీ యింకా పరిశీలనగా చూసేందుకు అవకాశం దొరకలేదు.  బయట మెట్లెక్కుతున్న బలమైన అడుగుల చప్పుడు, ఆ మనిషి తిరిగి వస్తున్నట్లు హెచ్చరించింది.  అతను గదిలోకి వచ్చేలోగా ఆమె హడావిడిగా నేలపై పూర్వపుభంగిమలో పడుకొంది.  దిట్టంగా ఉన్న ఆకారం తన మీదకు వంగి చూస్తూంటే, నాన్సీ అప్పుడే కోలుకొంటున్నట్లు నటించింది.  మెల్లిగా కళ్ళు తెరిచి ఆ భయంకరమైన ముఖాన్ని చూసింది. 
  "ఇంద.  ఇది త్రాగు" ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో చెప్పాడతను. 
  ఆమె అతనిచ్చిన పేపరు కప్పులోని నీటిని కొద్దిగా చప్పరించింది. 
  "కొద్దిగా తగ్గినట్లుంది" అని నీరసంగా గొణుగుతూ లేచి కూర్చుంది.
  "నువ్వు ఈ ఫాక్టరీలో పనిచేస్తున్నదానివి కావు" ఆమె ముఖాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడతను.  "నువ్వు ఈ ఫాక్టరీ లోపలికి యింతదూరం ఎలా రాగలిగావు?" కఠినంగా అడిగాడు. 
 నాన్సీ  బదులిచ్చేలోపునే బయట తలుపు మరొకసారి తెరుచుకొంది.  చక్కగా ముస్తాబైన ఒక లావుపాటి మనిషి లోనికొచ్చాడు.  అతని కళ్ళు గోధుమరంగులో ఉన్నాయి.  అక్కడ నాన్సీని చూడగానే తెల్లబోయాడతను.
"ట్రో! నువ్వు చేసిన పనేమిటి? సందర్శకులను లోనికి రానీయకూడదని తెలీదా? ఈమెనెందుకు లోపలకు  రానిచ్చావు?" బుషీట్రాట్ ను కోపంగా అడిగాడతను. 
  "మిస్టర్ డైట్! ఇది నా పని కాదయ్యా! తనకు తానే లోనికొచ్చింది.  తనకు ఒంట్లో బాగులేదని చెబుతోంది" ట్రాట్ సణిగాడు. 
  "అయితే నీకు తాజా గాలి అవసరం మిస్!" అంటూ నాన్సీ చేతిని గట్టిగా పట్టుకొని లేవదీశాడతను.   ఆమెకు  తోడుగా వెళ్ళి మెట్లను దింపి, ఫాక్టరీలోని ప్రధాన విభాగానికి తీసుకెళ్ళాడు. 
  "ఎవరు నువ్వు?"
  అతని ప్రశ్నకు ఆమె తాను మిస్ డయానెను రైల్వే స్టేషనునుంచి అక్కడకు తీసుకువచ్చానని చెప్పింది.  అంతకు మించి తన వివరాలను చెప్పలేదు. 
  "నీ అంతట నువ్వు ఈ ఫాక్టరీలో తిరగటం ప్రమాదకరం.  మళ్ళీ ఎప్పుడూ యిలా చేయొద్దు" అని ఆప్యాయంగా చెప్పాడు. 
  'తనని చూసి లారెన్స్ డైట్ కంగారుపడినట్లు ఆమె గమనించింది.  తాను అతని రహస్యాన్ని కనుక్కోవటంలో తడబడిందా?' యువగూఢచారి తలపోసింది.
  ఆమెను ఫాక్టరీ ముఖద్వారం దగ్గర వదిలి అతను వెనక్కి వెళ్ళిపోయాడు.  నాన్సీ కార్లు నిలిపే ప్రాంతం దగ్గరకు చేరుకొంది.  అప్పటికే డయానె నాన్సీ కారు ప్రక్కన నిలబడి ఉంది.
 డయానె యింటికి వెళ్ళే దారిలో యిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు.  నాన్సీ చేసిన సాయానికి ఆమె కృతజ్ఞతలు చెప్పింది.  యువగూఢచారి డయానెకు వీడ్కోలు చెప్పి, వేగంగా తన యింటికి చేరింది. 
  ఇంట్లోకి హుషారుగా పరుగు తీసిన ఆమె హాల్లో కనిపించిన తండ్రికి శుభాకాంక్షలు చెప్పింది. 
 "ఓ నాన్నా!  ఈ రోజు నాకు బాగా కలిసివచ్చింది.  నేను బుషీట్రాట్ ని కనుక్కొన్నాననే అనుకొంటున్నాను."

 

  చదువుతున్న వార్తాపత్రికను బల్లపై వదిలి, న్యాయవాది కూతురివైపు చూశాడు.  "మరొకసారి చెప్పు." 
  నాన్సీ అవే మాటలు మరొకసారి చెప్పి డైట్ ఫాక్టరీలోకి వెళ్ళటానికి ముందు, తరువాత జరిగిన కధనంతా తండ్రికి వివరించింది.  కూతురు చెప్పిన వర్ణనను బట్టి న్యాయవాది అనుమానితుణ్ణి గుర్తించాడు.  ఆమె చేసిన పనికి ఉబ్బితబ్బిబ్బయ్యాడు.  ఆమె ఆడిన నాటకం అతనికి నవ్వు తెప్పించింది. 
  "నాన్సీ!  నువ్వు బాగా ఎదిగావురా! చాలా చురుకైనదానివి" అని మెచ్చుకోలుగా ఆమె తలపై చేయి వేసి నిమిరాడు. 
  "మీ కూతుర్నే కద మరి!" అంటూ తండ్రిని ఆప్యాయంగా చూసింది.
  "నిజంగా అతను బుషీట్రాటే అయినట్లయితే, డైట్ అతన్ని పేరు పెట్టి పిలవబోయాడంటే - నా కేసు బాగానే గాడిలో పడుతోందని అనిపిస్తోంది."
   "తరువాత ఎత్తు ఏమిటి?" నాన్సీ తండ్రిని అడిగింది.
 "ఈ కేసులో విషయాలను కూలంకషంగా గమనించటానికి ఒక వ్యక్తిని నియోగిస్తాను.  అతని ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకోవచ్చు." 
  "ఈ విషయంలో నేను చేయవలసిన సాయం ఉంటే చెప్పండి" నాన్సీ అంది.
  "ఇప్పటికే నువ్వు చాలా సాయం చేశావు.  ఇంకా ఏమన్నా అవసరమైతే నిన్ను అడుగుతాలే!" తండ్రి అన్నాడు.

 
  ఫాక్టరీలో కనుగొన్న విషయాల వల్ల ఆమెకు ఆ కేసుపై ఆసక్తి పెరిగింది.  మున్ముందు తను ఆ కేసును తరిచి చూసే అవకాశం వస్తే, మరిన్ని ఆధారాలను సేకరించి తండ్రికి అందివ్వగలనన్న ఆశ చిగురించింది.  ఈలోపు మార్చ్ కేసులో చుట్టుముట్టిన సమస్యలను అధిగమించేందుకు కష్టపడాలి.
  "ఆ పాత అటక విషయంలో జాగ్రత్తగా అడుగువేయి.  అక్కడ ఏముందో చెప్పనవసరంలేదనుకుంటా!" డ్రూ తన కూతుర్ని హెచ్చరించాడు. 
  "తప్పకుండా!" నవ్వుతూ బదులిచ్చిందామె. 
  మరునాడు సాయంత్రం నాన్సీ పాత భవనానికి వెళ్ళింది.  పడకగదిలో సుశాన్ తన తాతతో కలిసి రేడియో వింటోంది.  నాన్సీ ఆ గదిలోకి వచ్చే సమయానికి ఒక కొత్తపాట వినబడుతోంది.  ఆ మధురగీతం వింటూ మిలట్రీ ఆయన ఒక్కసారిగా అరిచాడు.
 "అదే!  ఆ పాటను మావాడే స్వరపరిచాడు.  రాగం పేరు తెలియదు గాని యిది ఖచ్చితంగా వాడు కూర్చిన బాణీయే!" 
  "దాని పేరు - గాలిపాట " నాన్సీ చెప్పింది. 
  "ఎవరు రాశారని చెప్పుకొంటున్నారు?" నిలదీశాడతను. 
  "గుర్తు లేదు" క్షమాపణ అడుగుతున్న ధోరణిలో ఆమె చెప్పింది.  కార్యక్రమం పూర్తయ్యాక స్వరకర్త పేరు ప్రకటించకపోవటంతో, నాన్సీ లేచింది. 
  "ఈ పాటను ప్రచురించినట్లుగా గుర్తు.  ఊళ్ళోకెళ్ళి ఈ పాట వివరాలున్న పుస్తకం కాపీని తెమ్మంటారా?" 
  "తక్షణం" అంటూ ఆమెను తొందరచేసి, ఆమె రాక కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తున్నాడు.  పెద్దాయన కోరికపై బయటకెళ్ళిన ఆమె కొద్ది నిమిషాల తరువాత తిరిగివచ్చింది.
  "దీన్ని బెన్ బాంక్స్ అన్న వ్యక్తి స్వరపరిచాడట!" లోనికి వస్తూనే నాన్సీ చెప్పింది.
  "బెన్ బాంక్స్! బెన్ బాంక్స్!" మార్చ్ కోపంతో ఊగిపోయాడు.  "వాడెవడు? ఒక దొంగ! ఈ పాట నా కుమారుడు ఫిప్ ది."
  కోపంతో చిందులేస్తున్న అతన్ని సముదాయిస్తూ, బెన్ బాంక్స్ ని తప్పక పట్టుకొంటానని ఆమె మాట యిచ్చింది.  "గాలిపాట" ను ప్రచురించిన వ్యక్తిని కలిసి స్వరకర్తగా చెప్పుకొనే అతని వివరాలు కనుక్కొంటానని చెప్పింది. 
  "ఆ రాస్కెల్ ని కనుక్కొని రోడ్డున పెట్టేదాక నేను నిద్రపోను" అంటూ మార్చ్ విరుచుకుపడ్డాడు.  "వాడికి పేరుప్రతిష్టలెలా వస్తాయి?  చనిపోయిన నా కుమారుడి కష్టాన్ని వాడు దోచుకోవటమే కాదు, సుశాన్ కి న్యాయపరంగా రావలసిన వారసత్వపుహక్కును కూడా నాశనం చేశాడు"  అంటూ ఆ పెద్దాయన తిట్లవర్షం కురిపిస్తున్నాడు.  ప్రస్తుతస్థితిలో అతన్ని సముదాయించాలంటే సంగీతం ఒక్కటే మార్గం.  నాన్సీ అతనికి యిష్టమైన పాటలను పియానోపై వాయిస్తానని చెప్పి, క్రింద అంతస్తులో ఉన్న సంగీతపుగదికి తీసుకెళ్ళింది.  పాత పియానో సరిగా పలకకపోవటంతో దాన్ని ప్రక్కన పెట్టి ఆమె గొంతు విప్పి పాడటానికి సిద్ధపడింది.  ఇంతలో పై అంతస్తునుంచి రక్తం గడ్డకట్టించే స్థాయిలో పెద్ద కేక వినిపించింది. 
( కధ తరువాయి భాగం వచ్చే నెలలో)

No comments:

Post a Comment

Pages