బాలగేయాలు - అచ్చంగా తెలుగు
బాలగేయాలు
వివరణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

వారాల పేర్లు
ఒకప్పుడు  తెలుగు నుడికారంతో ఎంతో హాయిగా, తీయాగా మన ఇళ్ళలో సాగిన బాలగేయాలు నేడు కనుమరుగయ్యాయి. ప్రతి ఇంటిలో అమ్మలు వంట పనులను చేసుకుంటూ కూడా.. పిల్లలకి తనకు తెలిసిన బాలగేయాలను చిన్న చిన్న పద్యాలను నేర్పించేవారు. పిల్లలు తమ చిట్టి చిట్టి నోళ్ళతో చిలకల్లా ఆ అమ్మ పలుకులను తిరిగి పలికేవారు. ప్రతి సందర్భానికి మన పెద్దలు పిల్లలకు ఏవో   బాలగేయాలను నేర్పిస్తూనే ఉండేవారు. అలాంటి శ్రవ్యసుభగమైన బాలగేయాలు ఇప్పుడు పిల్లలకు అందుబాటులో ఉన్నాయా? లేవు. తరతరాలుగా పిల్లల్ని అలరించిన బాలగేయాల జాడ కనుమరుగయి ఎక్కడ దాక్కున్నాయి? కేవలం  సిడిలలో... పుస్తకాలలో.... తెలుగు వాచకాలలోకి రావా? చదువంటే మార్కుల కొలమానంగా మారిన నేటి విద్యావిధానంలో ఆటపాటకి అవసరమైన - పిల్లలు మెచ్చే ఆ బాలగేయాలు ఇటు పాఠశాల గడప త్రొక్కక,  అటు అమ్మ వెంట నడవకపోతే ఎలా?  బడికి వెళ్ళక పూర్వం, అలాగే బడికి వెళ్ళాక కూడా చిన్న పిల్లలకు బాలగేయాలెంతో అవసరం. పిల్లలకు మాటలు రాక ముందునుండే అమ్మగొంతును గుర్తించటం, విన్నదానిని జ్ఞాపకాలలో ఉంచుకోవటం పిల్లల నైజం. అలాంటి సంస్కృతికి దూరమయ్యాం మనం. వారాల పేర్లతో చాలా గేయాలున్నాయి. కానీ కొన్ని వారాల పేర్లతో ఉన్న గేయాలు వినడానికి చాలా సొబగుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ మాసం చూద్దాం.
ఆదివారం పుట్టిన బాలుడు అద్భుతంగా చదువుతాడు. 
సోమవారం పుట్టిన బాలుడు సత్యమునే పలుకుతాడు. 
మంగళవారం పుట్టిన బాలుడు - మంచి పనులు చేస్తాడు. 
బుధవారం పుట్టిన బాలుడు బుద్దిమంతుడై ఉంటాడు. 
గురువారం పుట్టినబాలుడు పరోపకారం చేస్తాడు. 
శుక్రవారం పుట్టిన బాలుడు సహనం కలిగి ఉంటాడు. 
శనివారం పుట్టిన బాలుడు శాంతముగా ఉంటాడు.

ఇటువంటి గేయాలను చెప్పటం ద్వారా పిల్లలలో మంచి గుణాలను పెంచటమే కాక ఆయాపేర్లను తెలుసుకోవటం, వారిలో ఆయా గుణాలకు చెందిన విశ్వాసాన్ని పెంచుకోవటం జరుగుతుంది. కనుక చిన్న పిల్లలకు చెప్పడం వారి చేత పలికించడం చెయ్యాలి.
-0o0-

No comments:

Post a Comment

Pages