మొట్టమొదటి భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
అంబడిపూడి శ్యామసుందర రావు .
1950,జనవరి 26న భారతదేశము ఒక రిపబ్లిక్ గా అవతరించిన తరువాత మొట్టమొదటి రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడిగా ఎన్నిక అయినా వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయన ఆ పదవిలో ఉన్నంతకాలము తన విధుల పట్ల చూపించిన నిజాయితీ నిబద్ధతల వల్ల భారతీయుల అభిమానాన్ని చురగొని ఆ పదవికే వన్నె తెచ్చిన రాజకీయ వేత్తగా పేరు తెచ్చుకున్నారు దేశాధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించటానికి పూర్వము స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు అయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానము స్వతంత్ర సమరంలో ఒక సైనికుడిగా ప్రారంభమై దేశములోని అత్యున్నత పదవికి చేర్చింది అటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి రాష్ట్రపతి అయినా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గురించి ప్రస్తుత యువతకు తెలియని ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాము.
1884 అక్టోబర్ 3న బీహార్ లోని జెరదాయి గ్రామములో మహాదేవ్ సహాయ్ కమలేశ్వరి దేవి దంపతలకు జన్మించాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ తండ్రి కోరిక మేర హిందీ,పర్షియన్,గణితం లలో ఒక మౌల్వి వద్ద నేర్చుకున్నాడు. 12 ఏళ్ల వయస్సు లోనే,జూన్ 1896 లో రాజ్ వంశీ దేవిని వివాహమాడారు వారి కొడుకే మృత్యుంజయ్ . ఆయనకుగల చదువుకోవాలనే బలమైన కోరిక ఆయనను కలకత్తా విశ్వ విద్యాలయము దాకా నడిపించింది. ప్రవేశ పరీక్షలో మొట్టమొదటి స్థానము సంపాదించుకోవటం వల్ల నెలకు 30 రూపాయల స్కాలర్ షిప్ ను పొందాడు. తన తెలివితేటలతో ప్రొఫెసర్లను మెప్పించే వాడు.ఒక ప్రొఫెసర్ గారు "పరీక్ష పెట్టినవాడికన్నా పరీక్ష వ్రాసినవాడు గొప్పవాడు" అని బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పరీక్ష పేపర్ మీద స్వయముగా వ్రాశాడు అంటే అయన తెలివితేటలు ఏ ష్టాయివో మనము గమనించవచ్చు.
అయన కాలేజీలో ఉన్నంతకాలము సాంఘిక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు అయన డాన్ సొసైటీలో క్రియాశీలక సభ్యుడు 1906లోఆయన స్నేహితులతో కలసి బిహారీ స్టూడెంట్స్ కాన్ఫెరెన్స్ ను నిర్వహించాడు అప్పటివరకు ఇండియాలో అటువంటి కార్యక్రమము జరుగలేదు ఆ కార్యక్రమమే భవిష్యత్తులో అనుగ్రహ నారాయణ్ సిన్హా, కృష్ణ సింగ్ వంటి అనేక మంది నాయకులను స్వాతంత్ర ఉద్యమానికి అందించింది.ఈయన ప్రతిభను నాయకత్వ లక్షణాలను గుర్తించి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ లో పదవి భాద్యతలను అప్పజెప్పారు కానీ రాజేంద్రప్రసాద్ తనకు ఉన్న కుటుంబ భాద్యతలను బట్టి ఆ పదవులను తిరస్కరించాడు.
ఈ సందర్భముగానే రాజేంద్రప్రసాద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధము మొదటిసారిగా పెట్టుకొని 1911లో పార్టీలో చేరి ,ఆ పార్టీకి అధ్యక్షుడిగా మూడు సార్లు (మొదటిసారి 1934, రెండవసారి 39, మూడవసారి 47) భాద్యతలను సమర్ధవంతముగా నిర్వహించాడు.ఆర్ధిక శాస్త్రములో పట్టా పుచ్చుకొని కొద్దికాలం ఇంగ్లిష్ ప్రొఫెవర్ గా పనిచేసి రిప్పన్ కాలేజీలో లా చదువుతూ కలకత్తా సిటీ కాలేజీలో ఎకనామిక్స్ పాఠాలు చెప్పేవాడు. హై కోర్టులలో ప్రాక్టీస్ చేశాడు ఆ కాలములోనే పాట్నా యూనివర్సిటీ నుండి 1937లో న్యాయ శాస్త్రము లో Ph.D చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయినాడు. అంతకు ముందు 1915 నుండి 1920 వరకు బీహార్ ఒరిస్సా యూనివర్సిటీ లలో సెనేట్ ,సిండికేట్ సభ్యుడిగా ఉన్నాడు. 1916లో మొదటిసారిగా మహాత్మా గాంధీని కలవటం అయన జీవితములో ఒక పెద్ద మలుపు. గాంధీ ఉపన్యాసాలతో ఆశయాలతో ప్రభావితుడై తన లాయర్ వృత్తిని వదలి స్వాతంత్ర ఉద్యమములో చురుకుగా పాల్గొన్నాడు సహాయ నిరాకరణ ఉద్యమములో పాల్గొన్నాడు.అప్పటినుంచి స్వాతంత్ర ఉద్యమములో వెనక్కి తిరిగి చూడలేదు.
బ్రిటిష్ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ స్థాపించిన బీహార్ విద్యాపీట్ వ్యవస్థాపకులలో బాబు రాజేంద్రప్రసాద్ ఒకడు గాంధీజీ పిలుపు ఆధారముగా పాశ్చాత్య విద్యాసంస్థలను వ్యతిరేకిస్తూ రాజేంద్రప్రసాద్ ఈ సంస్థను స్థాపించి తన కొడుకును కూడా ఇందులో చేర్పించాడు. రాజేంద్ర ప్రసాద్ అప్పటి విప్లవాత్మక పత్రికలైన సెర్చ్ లైట్, దేశ్ వంటి పత్రికలకు వ్యాసాలూ వ్రాసేవాడు.అంతేకాకుండా దేశవ్యాప్తముగా పర్యటించి తన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజితులగా చేసి స్వాతంత్ర ఉద్యమములో పాల్గొనేటట్లు చేశాడు ఒక స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా ఒక మానవతా వాదిగా వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు జనవరి 15,1934లో బీహార్ ను కుదిపివేసిన భూకంపము సమయములో జైలు నుండి విడుదల అయిన వెంటనే భూకంప భాధితులను ఆడుకోవటానికి బీహార్ సెంట్రల్ రిలీఫ్ కమిటీని స్థాపించి ఛందా లను ప్రోగుచేసి ప్రజలను ఆదుకున్నాడు. అదే విధముగా సంవత్సరము తరువాత సింధ్ పంజాబ్ ప్రాంతములోని క్వెట్టా లో వచ్చిన భూకంపము వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచాడు.
బాబు రాజేంద్రప్రసాద్ కార్యకలాపాలు బ్రిటిష్ ప్రభుత్వ దృష్టిలో పడ్డాయి ఆగస్టు 8, 1942 లో బిటిష్ ప్రభుత్వ తీర్మానం వల్ల అనేకమంది నాయకులు అరెస్ట్ అయినారు వారిలో రాజేందట ప్రసాద్ కూడా ఒకడు బంకిపుర సెంట్రల్ జైలు పాట్నా)లో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాడు.ఉద్యమాలలో పాల్గొబుతున్నప్పటికీ కుటుంబము పట్ల అశ్రద్ధ వహించలేదు తానూ కష్టపడుతున్న ఈనాడు కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయలేదు. జైలు నుండి విడుదల అయినాక నెహ్రు నాయకత్వములో ఏర్పడిన మంత్రివర్గములో ఆహార వ్యవసాయ శాఖ మంత్రిగా చేరాడు. 1946లో రాజ్యాంగ అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఆ విధముగా భారత రాజ్యాంగ నిర్మాణములో కీలక పాత్ర వహించాడు.
జనవారి 26, 1950లో భారత రాజ్యాంగము అమలులోకి వచ్చి భారత దేశము గణతంత్ర దేశముగా ఆవిర్భవించి నప్పుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా భాద్యతలు స్వీకరించాడు నెహ్రూకు ఆయనకు ఉన్న విభేదాలవల్ల నెహ్రు వేరొకరిని రాష్ట్రపతి ఎన్నికల బరిలో దింపినప్పటికీ రాజేంద్రప్రసాద్ భారీ మెజారిటి తో ఎన్నిక అయినాడు. ఎన్నిక అయినాక కూడా నెహ్రూకు బాబు రాజేంద్ర ప్రసాద్ కు మధ్య విభేదాలు కొనసాగినాయి. ముఖ్యముగా హిందూ కోడ్ బిల్ విషయములో. బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ బిల్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడటానికి అవసరము అని గట్టిగా నమ్మి ఆ బిల్ పాస్ అవటానికి కృషి చేసాడు.
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తాను నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణముగా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి బాబు రాజేంద్రప్రసాద్ అయన ఒక్కడే ఇప్పటివరకు 12 సంవత్సరాలు ఆ పదవి లో కొనసాగిన వ్యక్తి తానూ పదవిలో ఉన్నంతకాలము సగము జీతము మాత్రమే తీసుకునేవాడు. ఒకే ఒక్క వ్యక్తిని వ్యక్తిగత సిబ్బందిగా ఉంచుకొనేవాడు బహుమతులు తీసుకోవటానికి ఇష్టపడేవాడుకాదు ప్రజల అభిమానము ఆశీస్సులే ముఖ్యము అని అనేవాడు.అయన ప్రజల రాష్ట్రపతిగా చాలా సాదాసీదాగా వ్యవహరించేవాడు. అయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు 1962లో భారత రత్న అవార్డు ఇచ్చారు. 1962లో అయన రాష్ట్రపతి పదవికి రాజనీమా చేసినప్పుడు రామ్ లీల మైదానములో ఆయనకు ఘనముగా వీడ్కోలు ఇవ్వాలని అయన అభిమానులు ప్రజలు అనుకున్నారు కానీ 1962లోనే అయన భార్య పరమపదించటం వల్ల అయన తన చివరిరోజులను పాట్నాలోని సదాకత్ ఆశ్రమములో గడిపి 28 ఫిబ్రవరి ,1963లో స్వర్గస్తులైనారు అయన భారత మొదటి రాష్ట్రపతిగా ప్రజల మన్నలను పొందిన వ్యక్తి తానూ అధిష్టించిన పదవికి గౌరవము తెచ్చినవ్యక్తి నవభారత నిర్మాణానికి తనవంతు కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్
***
No comments:
Post a Comment