ద్వారక వేంకటేశ్వర శతకము - మంత్రులు నరసింహ కవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం
ద్వారక వేంకటేశ్వర శతక రచయిత నియోగి బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రుడు. తండ్రి కామయ, ఈ కవి తనను గురించి ఈ శతకారంభంలో ఇలా చెప్పుకొనినాడు.
ఉ. మంత్రికులావతంస నృపమాన్యుఁడ కాస్యపగోత్రపౌత్ర స్వా
తంత్రుడ కామయాత్మజుడఁ ధన్యమతిన్ నరసింహయాఖ్యుడన్
మంత్రములేమియున్నెరుగ మత్తుడతావక నామకీర్తనల్
మంత్రముగా బఠించెదను మాటికి ద్వారక వేంకటేశ్వరా
ఉ. పెట్టెద నూర్ధ్వపుండ్రములు బ్రీతిగ మీపదపద్మయుగ్మమున్
బట్టెద వక్త్రదోషములు బాయుటకై యొనరింతు నీ స్మృతిన్
మట్టెద నాదుపాపములు మాన్పుటకై యమకింకరాదులన్
గొట్టెద ముక్తికాంతగనుగొంటకు ద్వారక వేంకటేశ్వరా
ఈ కవి ఏకాలానికి చెందినవాడో, ఇతర వివరాలు, రచనలు గురించి తెలియటం లేదు.
శతక పరిచయం
"ద్వారక వేంకటేశ్వరా" అనే మకుటంతో నూట ఎనిమిది చంపకోత్పలమాల వృత్తాలలో రచింపబడిన ఈశతకము నీతి శతకాల కోవలోనికి వస్తుంది. అంత్యప్రాసలతో నిండిన ఈశతకంలో భాష సరళం. కవిత్వం ప్రవాహంలా సాగిపోతుంది. తాను చెప్పదలచుకున్నది సరళమైన భాషలో కవి వ్యక్తపరిచాడు.
కొన్ని పద్యాలను చూద్దాం.
ఉ. వాసనలేని పువ్వు బుధవర్గములేని పురంబు భక్తి వి
శ్వాసములేని భార్య గుణవంతుడుగాని కుమారుడున్ సదా
భ్యాసములేనివిద్య పరిహాసములేని ప్రసంగవాక్యముల్
గ్రాసములేనికొల్వు కొరగాదుర ద్వారక వేంకటేశ్వరా
చ. వినయము లేని విద్యయు వివేకముచాలని దేశికత్వమున్
సనయుడుకాని పండితుడు సౌఖ్యమునీయగలేని గానమున్
కనుగవకింపుగాని సతి గాంచగ నేవముబుట్టుగైతయున్
గనికరమూనలేని మది గాదుర ద్వారక వేంకటేశ్వరా
ఉ. ఏలినవానితో తనువరించనియింతితో బ్రజ్వలాగ్నితో
బాలులతో దురంత మధుపానులతో దన యాయుధంబుతో
గూళులతో విరోధులను గూడినవారితో యాచకాళితో
జాలయతీంద్రులతోటి సరసంబులు గూడవు వేంకటేశ్వరా
చ. పరిమళహీనమౌ సుమము ప్రాజ్ఞులు మెచ్చని విద్య కామినీ
విరహితమైన గేహ మరవిందవిహీన సరోవరంబు కా
పురుషుని శేవనంబు శివపూజలొనర్చని చేతులున్ సుధీ
వరపరిశూన్యమౌ సభలు వ్యర్థము ద్వారక వేంకటేశ్వరా
ఉ. సత్యము దప్పుచోట జనసమ్మతిదప్పినచోట సాధుసాం
గత్యములేనిచోట తనకాంక్షలెరుంగనిచోట బంధుసా
హిత్యములేనిచోట రుణమివ్వగజాలనిచోట నెప్పుడున్
నిత్యము నిల్వరాదు యిది నిక్కము ద్వారక వేంకటేశ్వరా
ఉ. హీనునితో నుదారగుణహీనునితో గులహీనుతో దయా
హీనునితో బుధానుమతిహీనునితో గుణహీనుతో సదా
దానవిహీనుతో సకలధర్మవిహీనుతో మానహీనుతో
హానిసుమీ జరింపగ జనావన ద్వారక వేంకటేశ్వరా
ఈ శతకాన్ని మనం చదువుతున్నప్పుడూ మనకు చాలావరకు వేమన శతకం, సుమతీశతకంలోని అనేక పద్యాలు గుర్తుకు వస్తాయి. బహుశా ఈ కవు వారి పద్యాలను అనుకరించి ఉండవచ్చును. ఈ కవి చౌడప్ప శతకాలలోని పద్యాలవలే ఇంపు, రూపు, పస, పద్యాలను రచించాడు. కొన్నిటిని చూద్దాం.
ఉ. స్త్రీలకు కొప్పు రూపు కురుచీలకు దంతపు కప్పురూపు దం
తాలకు కప్పురూపు పరదాలకు గోడలచొప్పు రూపు శా
స్త్రాలకుమెప్పు రూపు గుణసాగర సాధుజనైకబృంద గో
పాలముకుంద భక్తజనపాలక ద్వారక వేంకటేశ్వరా
ఉ. కప్పకుగంతులెస్స తనకాన్పుకు మిక్కిలి సంతులెస్స పా
తప్పుకురంతులెస్స వెలయాండ్రకుజొప్పగుతంతు లెస్స వా
తప్పుకు వంతు లెస్స తనతప్పుకు మిక్కిలి గొంతు లెస్సయా
చప్పనిమాతలేల సువిచారక ద్వారక వేంకటేశ్వరా
ఉ. మచ్చికలేణి చోట ననుమానము వచ్చిన చోట మెండుగా
గుచ్చితులున్నచోట గుణక్విదులుండనిచోట విధ్యలన్
మెచ్చనిచోట రాజు గరుణించని చోట వెవేకులుందురో
అచ్చట మోసమండ్రు సుగుణాకర ద్వారక వేంకటేశ్వరా
ఉ. పుంటికి నూనెమేలు నతిపుణ్య శరీరికి జ్ఞానిమేలు బ
ల్పంటికి కాచుమేలు చలపాదికి మిక్కిలి మాట మేలు స్త్రీ
చంటికి కూనమేలు దగు సస్యముకెపుడు వాన మేలు నీ
బంతును కావవయ్య జనపాలక ద్వారక వేంకటేశ్వరా
ఉ. లంజకు పిల్ల చేటు పసరానకు మిక్కిలి గుల్ల చేటు కా
ల్లుంజకు లొల్ల చేటు కుంజరుమాటకు గల్ల చేటు బ
ల్పింజకు డొల్ల చేటు తనపేరున కొట్టిన కోట్లు చేటయా
కంజవిలోచన భువనకారక ద్వారక వేంకటేశ్వరా
ముప్పుననప్పుచేటు ముదిముండకు మెండగు కొప్పుచేటు చా
చప్పని యప్పుచేటు తన సమ్మతితప్పినచోటు చేటు తా
జెప్పిన మెప్పుచేటు నరచేతను బాణముద్రిప్పచేటు యా
చప్పని మాటలేల సువిచారక ద్వారక వేంకటేశ్వరా
ఇటువంటి అనేకమైన నీతిపద్యాలతో నిండిన ఈశతకం అందరూ చదవలసిన శతకము మీరూ చదవండి. మీ సన్నిహితులచే చదివించండి.
***
No comments:
Post a Comment