రమణ కొడుకు తిరిగొచ్చాడు - అచ్చంగా తెలుగు

రమణ కొడుకు తిరిగొచ్చాడు

Share This

రమణ కొడుకు తిరిగొచ్చాడు
మా బాపట్ల కధలు – 27
భావరాజు పద్మిని

గుడి పక్కన రోడ్డు మీద పట్టపగలే ఒళ్ళు తెలీకుండా పడుంది రమణ. చిరిగిన ఆమె చీర మోకాళ్ళ దాకా పైకి లేచి చెదిరిపోయింది. పైట తొలగి ఉంది. ఒంటి మీద ఈగలు వాలుతున్నాయి. తెరచి ఉన్న నోటి నుంచి చొంగ కారుతోంది. తైల సంస్కారం లేని ఆమె జుట్టు వెలిసిపోయిన పాత బట్టలా ఉంది. ఊళ్ళో వాళ్ళ కర్మలన్నీ అన్నం రూపంలో పోత పోసుకున్న ఆమె పొట్ట కలికాలపు పాపాల్లా ఉబ్బిపోయి ఉంది.
రమణ పక్కనున్న సంచీలో ఏవో పాత గుడ్డలు, ఎవరెవరో ఇచ్చిన మిగిలిపోయిన అన్నాలు ఉన్నాయి. ఊర కుక్కలు మధ్య మధ్య వచ్చి ఆమెను వాసన చూసి, పక్కనున్న సంచీలో ఉన్న అన్నం కావలసినంత తిని వెళ్తున్నాయి. రమణ బొడ్లో దోపుకున్న చిన్న సంచీలోంచి జారిపడ్డ చిల్లరను కొందరు ఆకతాయి పిల్లలు ఏరుకుపోతున్నారు. ఇవేమీ ఆమెకు తెలీదు. ఎందుకంటే .... ఆమె తాగి పడుంది.
ఇలా ఆమెను బాపట్ల నాగేంద్రపురంలోని ఈ గుడి చుట్టూ ఎన్ని సార్లు, ఎన్ని చోట్ల చూసానో! రోజుకో విలాసానికై అర్రులు చాచే ఈ రోజుల్లో, రోడ్డే ఇల్లుగా, ఆ వేంకటేశ్వరుడి గుడి చుట్టుపక్కల ప్రాంగణమే బంగాళాగా, దయగల తల్లులు పెట్టిన ముద్దే ఆహారంగా, పిగిలిన పాత చీరలే ఆహార్యంగా బ్రతుకుతోంది రమణ. ఎవరినీ పల్లెత్తు మాట అనదు. తనతో అడుక్కునే వాళ్ళ దగ్గర్నుంచీ చుట్టుపక్కల కొట్ల వాళ్ళు, కూరల వాళ్ళు, చెత్త తీసే మున్సిపాలిటీ వాళ్ళు, అందరూ నేస్తాలే రమణకి.
అలాంటి ఈ రమణ ఆ రోజు ఎందుకో కోపంగా ఎవరినో తిడుతోంది. పూలు కొనడానికి కొట్టుకు వెళ్ళిన నేను ఆమె వింత ప్రవర్తన చూసి, ఉండబట్టలేక, ‘ఎందుకలా తిడుతోంది? ఎవరిని?’ అనడిగాను.
ఒక్క క్షణం గాఢముగా నిట్టూర్చింది పూలమ్మి. ‘ఇప్పుడు మేము పెట్టుకున్న ఈ కొట్టు కట్టిన పదిహేను గజాల స్థలమంతా ఆమెదే. మహారాణిలా బ్రతికేది.  చక్కటి సంసారం, ముగ్గురు మగ పిల్లలు, ఒక కూతురు. భర్త వీరయ్య వ్యవసాయపు పనులు చేసుకునేవాడు. పెద్ద కొడుకులు ఇద్దరూ పదో క్లాసు చదివి, ఏవో చిన్న ఉద్యోగాలు చెయ్యసాగారు. ఉన్నంతలో కూతురు పెళ్లి చేసి మరో ఊరు పంపి, ఆ కుటుంబం ఆనందంగా కాలం గడపసాగారు.
ఇలా ఉండగా పరపతి ఉన్న ఒక రాజకీయ నాయకుడి కన్ను ఈమె స్థలంపై పడింది. నయాన్నో, భయాన్నో చెప్పి, స్థలం అమ్మమని కోరినా, వాళ్ళు అమ్మలేదు. వీరయ్య పూర్వీకులు అతనికి ఇచ్చిన ఇల్లది. అతని జ్ఞాపకాలన్నీ ఆ స్థలంతో, ఇంటితో ముడిపడి ఉన్నాయి. వీరయ్య, అతని ముగ్గురు కొడుకులు ధైర్యవంతులు. వీళ్ళని ఎదుర్కోవడం నాయకుడికి పెద్ద సవాలుగా మారింది.
ఇక వీళ్ళు మాటలతో లొంగరని, స్థలం మీద ఆశతో వీళ్ళ మీద చేతబడులకు దిగాడు నాయకుడు. ఆ ప్రభావంతో పులిలా ఉండే వీరయ్య, పిల్లిలా మారి, మారు మాటాడకుండా పదిహేను గజాల స్థలాన్ని, ఇంటిని మూడున్నర లక్షలకే అమ్మినట్టు సంతకం పెట్టి వచ్చాడు. కొడుకులు ఇద్దరికీ తండ్రి వైఖరి అర్ధం కాలేదు. నాయకుడి మీద తిరగబడ్డారు. కాని, కాగితాలు మారాకా ఏం చేస్తారు. తెలిసిన వారిని సంప్రదిస్తూ, ఇల్లు ఖాళీ చెయ్యమని  పోరాటం మొదలుపెట్టారు.
ఇలా ఉండగా చేతబడి ప్రభావానికి వీరయ్య అకాల మరణం చెందాడు. ఇంటికి పెద్ద దిక్కు తమ నాన్న పోయేసరికి పగతో రగిలిపోతూ, నాయకుడిపైకి విరుచుకు పడ్డారు రమణ కొడుకులు. తనపై వాళ్ళు తిరగబడడం సహించలేని నాయకుడు మళ్ళీ రమణ కొడుకులపై చేతబడి మొదలుపెట్టాడు.
చూస్తుండగానే ఓ నెల లోపే రమణ పెద్ద కొడుకు రక్తం కక్కుకుని చనిపోయాడు. కల్తీ కల్లు తాగడం వల్లనే అతడు పోయాడని అంతా అనుకున్నారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది రమణ. ఇల్లు పొతే పోయింది, తన కొడుకులు బాగుంటే చాలనుకుంది. అందరినీ ఒప్పించి ఒక పూరింట్లోకి మారింది.
కాని, అప్పటికే మొదలైన చేతబడి ప్రభావం రెండో కొడుకునీ వదలలేదు. ఉన్నట్టుండి కాలు జారిపడి, తల పగిలి చనిపోయాడు. రమణ సగం పిచ్చిదై పోయింది. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకైనా క్షేమంగా ఉండాలని, తెలిసిన దేవుళ్ళు అందరికీ మొక్కుకుంటూ, కంటికి రెప్పలా అతడిని కాపాడుకోసాగింది.
మళ్ళీ విధి రమణను కాటేసింది. ఉన్నట్టుండి రమణ మూడో కొడుకు కనిపించకుండా పోయాడు. ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఏం కట్టుకుంటోందో, ఏం తింటోందో, ఎక్కడ ఉంటోందో అన్న స్పృహ లేదు ఆమెకు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నాయకుడి పరపతి వలన అసలు ఎఫ్.ఐ.ఆర్ నే రిజిస్టర్ చెయ్యలేదు. ఇక తానే బయలుదేరి కొడుకును వెతకసాగింది. కూతురు మాత్రం ఎన్నాళ్ళని చూస్తుంది? పిచ్చి తల్లిని దగ్గర పెట్టుకునే శక్తి లేదు ఆమెకు. గుడి ముందు అడుక్కోవడం, అడుక్కునే వాళ్ళ ప్రభావంతో అలవాటైన తాగుడు తాగడం, దొరికింది తినడం, కాలు సాగినంత మేర నడుస్తూ వెళ్లి, కొడుకుని వెతుక్కోవడం... ఇదే రమణ దినచర్య. ఏడాదయ్యింది, ఇంతవరకు కొడుకు జాడ లేదు. అప్పుడప్పుడు అవన్నీ గుర్తొచ్చి ఇలా అరుస్తుందమ్మా...”
పూలమ్మి చెప్పే కధ విని కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి నాకు. మనిషి స్వార్ధం ఎంత చెడ్డది? పచ్చటి కుటుంబాన్ని నాశనం చేసింది. ఇంతా చేసినా, ఆ నాయకుడు చచ్చాకా స్థలాన్ని మూటగట్టుకు పోలేడుగా. మరెందుకో అంతటి క్రౌర్యం? నాలో ఎన్నో ప్రశ్నలు లేని జవాబులు, అంతర్మధనం.
“ఓరి దేవుడా ! నీ గుడి ఎదురుగానే పెట్టుకున్నావని మురిసిపోయాను. ఉన్నదంతా పోయినా ఊరుకున్నాను. భర్త, ఇద్దరు బిడ్డలు పోయినా తట్టుకున్నాను. ఇదంతా నా ఖర్మని సరిపెట్టుకున్నాను.  కాని, నా చిన్న కొడుకును కూడా మాయం చేసావే. ఇంత కష్టం ఏ మనిషికీ రాకూడదు. నా గుండె పగిలిపోతోంది. ఏం పాపం చేసానయ్యా?
ఇదిగో చెబుతున్నా, నీ కళ్ళ ముందు జరిగిన ఈ అన్యాయానికి నువ్వే సమాధానం చెప్పు. నా కొడుకు తిరిగి వచ్చేదాకా, నీ గుడి బయటే పడుంటాను. ఏం చేస్తావో తెలీదు. నా కొడుకుని ఎలాగైనా రప్పించు. వాడిని చూసుకుంటూ కన్ను మూస్తాను. నామీద కాస్త దయ చూపించు ఏం చేస్తావో ఏమో నీదే పూచీ. “ ఇంకా స్వరం పెంచి అరవసాగింది రమణ.
“ఇవాళ తాగడానికి డబ్బులు కూడా లేవమ్మా. అందుకే మరీ అరుస్తోంది,” అంది పూలమ్మి.
ఎంతటి చిత్రమైనది జీవితం ! గుడి ఎదురుగా ఉన్న కోట లాంటి ఇంట్లో మారాణి, ఇప్పుడు గుడి బయట ముష్టెత్తుకుంటోంది. నా హృదయం ద్రవించిపోయింది. ‘హే భగవాన్ ! ఆమె మనసుకు ఊరట కలిగించు,’ అని ప్రార్ధించుకుంటూ ఆమె తాగడానికి సరిపడా డబ్బిచ్చాను. అది తప్పో ఒప్పో నాకు తెలీదు, కాని ఆమె బాధను తీర్చలేని నేను, ఇలా ఇవ్వడం ద్వారా ఆమె బాధను తాత్కాలికంగా మర్చిపోయేందుకు, ఈ చిన్న సాయమైనా ఉపయోగపడుతుందేమో అనిపించింది.
దాదాపుగా రోజూ కనబడుతూనే ఉంటుంది రమణ. ఓ రోజు చెట్టు కింద ప్లాట్ ఫారం మీద, ఓ రోజు రోడ్డు పక్క పిచ్చి గడ్డి మొలిచిన నేల మీద, ఓ రోజు నడి రోడ్డు మీద, ఓ రోజు గుడి మెట్ల మీద, ఎండనకా, వాననకా ఆ వేంకటేశ్వరుడి నీడే ఆమెకు గూడు. ఒక్కోరోజు అందరూ ఇచ్చినవి పెట్టిన సంచీ తీసి, అవీఇవీ సర్దుకుంటూ కనిపించేది. ఆమె కధ తెలిసిన ఎవ్వరూ ఆమెను తరిమేవారు కాదు. ఎవరైనా ఏదైనా ఇస్తే ,‘నీ కడుపు చల్లగుండాలి తల్లీ. పదికాలాల పాటు సుఖంగా బ్రతకు దొరా,’ అంటూ అందరినీ నోరారా దీవించేది. తనకు దక్కని సుఖం పరులకు దక్కాలని దీవించే ఆమె మనసెంత గొప్పది? అందరికీ అద్భుతాలు చూపే దేవుడు తననే నమ్ముకున్న ఈమెను ఏ నాటికైనా కరుణిస్తాడా? నా మనసులో ప్రతిరోజూ ఇవే ప్రశ్నలు.
సత్యం గల తండ్రి తన మహిమ చూపిన ఆ రోజు రానే వచ్చింది. చెప్పులు విప్పి గుళ్ళోకి వెళ్ళబోతున్న నాకు ‘వచ్చావా కొడకా!’ అని పెద్ద పట్టున రమణ వేసిన కేక వినబడింది. బోడి గుండు గీకి, బక్కచిక్కిపోయి ఉన్న రమణ మూడో కొడుకు ఆ వేళ నేరుగా రమణను వెతుక్కుంటూ ఆమె వద్దకే వచ్చాడు. ఆ క్షణంలో రమణ ఆనందం అంతా ఇంతా కాదు. జీవచ్చవంలా బ్రతికే ఆమె, దిగ్గున లేచి, కొడుకును గట్టిగా వాటేసుకుంది. ‘ఓ దయగల తండ్రీ, ఇన్నాళ్ళకు నా మొర విన్నావా తండ్రీ’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
‘చూసావా అమ్మా, ఆ దేవుడు కరుణించాడు, నా కొడుకు తిరిగి వచ్చాడు,’ అని నాతో అంటూ ఆనందంతో పెద్ద పట్టున ఏడవసాగింది. రమణ ఆత్మీయులైన కొట్ల వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, గుళ్ళో పూజారులు, అందరూ ఒక్క ఉదుటన ఉరికి, అక్కడికి వచ్చారు. ఆశ్చర్యంతో, ఆనందంతో ఎవరికీ మాటలు రావట్లేదు.
ఓ పావుగంట గడిచి, కాస్త కుదురుకున్నాకా, ‘ఏమైనావురా బిడ్డా. ఇన్నాళ్ళకు ఈ పిచ్చి తల్లి గుర్తుకు వచ్చిందా?’ అనడిగింది. అతడు గట్టిగా పట్టుకున్న అమ్మనింకా వదలకుండానే, అన్నాళ్ళ తర్వాత దక్కిన తల్లి స్పర్శను ఆస్వాదిస్తూ, ఇలా చెప్పసాగాడు.
‘నేను రోడ్డు మీద వెళ్తున్నాను, ఏదో కార్ వచ్చి పక్కన ఆగింది. అందులో ఎర్ర చీర, పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె నావంక తీక్షణంగా చూసింది. కార్ లో ఎక్కమంది. నాకేమైందో తెలీదు, నా ప్రమేయం లేకుండానే కార్ ఎక్కాను. తెల్లారి లేచేసరికి, కారడవిలో ఉన్నాను. ఎక్కడ ఉన్నానో, ఎటు వెళ్ళాలో ఏం తెలీదు. ఏవేవో భ్రమలు, వాళ్ళేవో పూజలు చేస్తున్నారు. పారిపోవాలని అనుకున్నా, నావల్ల కావట్లేదు. నా మాట పడిపోయింది. ఈలోగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అటుగా రావడంతో వాళ్ళంతా పారిపోయారట. పిచ్చి చూపులు చూస్తున్న నన్ను ఆయన తనతో తీసుకుని వెళ్ళారు.
నా మీద ఆ చేతబడి ప్రభావం తగ్గలేదేమో, అసలు నేను ఎవరినో కూడా మర్చిపోయాను. మాటా మంతీ లేకుండా ఏ పని చెప్పినా చేసే వాడినట, ఏమీ అడిగేవాడిని కాదట. వాళ్ళింట్లోనే పెట్టుకున్నారట. కాస్త తెలివి వచ్చాకా ఆయనే చెప్పారు. అయినా, నాకు నేనెవరో గుర్తు రావట్లేదు. ఆ కుటుంబం బదిలీ అయ్యి వెళ్లిపోయాకా, ఏవేవో ఊళ్లు పట్టుకు తిరిగాను. ఎక్కడ ఉన్నానో కూడా నాకు తెలీదు. ఇలా ఉండగా, ఒక రోజున నేను పనిచేసే యజమాని ఒకతను నా చెయ్యి పట్టుకుని, నన్నేదో గుడికి తీసుకుని వెళ్ళాడు. అది వెంకటేశ్వర స్వామి గుడి. అచ్చంగా మన గుడిలాగే ఉంది. ఆ గుళ్ళో పూజారి గారు తీర్ధం ప్రసాదం ఇచ్చారు. నా యజమాని కాస్త కుంకుమ తీసి, నా ముఖాన పెట్టాడు, అచ్చంగా చిన్నప్పుడు నువ్వు పెట్టినట్టే పెట్టాడు.
దెబ్బకి నాకు మన ఊరు, గుడి, నువ్వు గుర్తుకు వచ్చాయమ్మా. ఉన్నట్టుండి “అమ్మా” అన్నాను బాధగా. ‘అరె నువ్వు మాట్లడగలవా?’ అని ఆశ్చర్యపోయాడు నా యజమాని. జరిగిందంతా చెప్పాను. అన్నాళ్ళూ పని చేసిన, నాలుగు డబ్బులు ఇచ్చి పంపాడు. వెంటనే, నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చానమ్మా. ఇప్పటికైనా నిన్ను చేరగలిగాను. ఇంతకంటే ఏం కావాలి?’ అన్నాడతను అమ్మ ఒళ్లో ఒదిగిపోతూ.
వినేవాళ్ళంతా ఆనంద బాష్పాలతో బొమ్మల్లా నిల్చుండిపోయారు. స్వామి మహిమకు అవాక్కయ్యారు.
‘పోనీలేరా మన ఉసురు పోసుకున్న ఆ పాపిష్టోడు, మన స్థలాలన్నీ అమ్మేసి, గుండాగి చచ్చాడు. ఇక మనకు ఏ భయమూ లేదు. నాకు నువ్వు, నీకు నేను. పద, ఒక ఇల్లు తీసుకుని ఉందాము,’ అంటూ కొడుకుతో బయలుదేరిన రమణకి అంతా ఆనందంగా వీడ్కోలు పలికారు. ఆమెనే ఆనందంగా చూస్తూ, ఆ స్వామి మహిమకు పరవశించిపోతూ నమస్కరించాను నేను. ఇక అప్పటినుంచీ మా బాపట్లలో ఎవరు ఎవర్ని కలిసినా ప్రతి నోటా ఒకటే మాట ... ‘రమణ కొడుకు తిరిగొచ్చాడు తెలుసా?’
(ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. నా కళ్ళారా హైదరాబాద్ లో చూసిన వాస్తవ సంఘటన ఇది. ఇప్పటికీ రమణ నా కళ్ళ ముందే ఉంది. కధా నేపధ్యం కోసం బాపట్లకు అన్వయించి రాయడం జరిగింది. ఓం నమో వేంకటేశాయ! )

No comments:

Post a Comment

Pages