పుష్యమిత్ర - 29 - అచ్చంగా తెలుగు
పుష్యమిత్ర - 29
- టేకుమళ్ళ వెంకటప్పయ్య

జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో  హిమాలయాలపైన  బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర.  ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు.  ఎన్నో భయంకర వ్యాధులు భరతఖండాన్ని పట్టిపీడిస్తున్నాయన్న ప్రధాని మాటలకు వాటికి మందులు కనిపెట్టవలసి ఉందని అంటాడు. పంచాపకేశన్  లాహోర్ కు దగ్గరగా పుష్యమిత్రుడు దాచిన ఆ సంపదను ఎలా కొట్టెయ్యాలా అని పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. పుష్యమిత్రునితో కలిసి ఖెవ్రా సాల్ట్ మైన్స్ సందర్సిస్తారు. అలాడిన్ అనే ఒక గైడు సాయంతో లోనకు వెళ్తారు. (ఇక చదవండి)
ఆర్ధిక మంత్రి పుష్యమిత్రుని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆయన చూపులు ఎక్కడ పడతాయా అని తదేకంగా చూస్తున్నాడు. అలాడిన్ తన సహజ ధోరణితో చెప్తున్నాడు. సార్! క్రీస్తుపూర్వం 326 సం.లో అంటే అలెగ్జాండర్ మన దేశంపైకి దండెత్తి వచ్చినప్పుడు యవనుల గుర్రాలు ఇక్కడి ఉప్పును నాకడం వలన ఇక్కడ పెద్ద ఉప్పుగని ఉందని వెలుగులోకి వచ్చింది. తర్వాత అక్బర్ కాలంలో అంటే సుమారు క్రీ.శ.1500 లో లోకల్ గా ఉన్న రాజు అక్బర్కు తెలియజేయగా ఈ ఉప్పును త్రవ్వి తీసి వాడడం మొదలెట్టారు. 1849 లో దీనిని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకుని మైనింగ్ ప్రారంభించారంటూ ఉండగా పుష్యమిత్రుడు తూర్పు వేపు చూపి ఆ వైపు మూసి వుందేమిటి? అటువేపు దారిలేదా? అనడంతో అలాడిన్ "అవును సార్! తూర్పు వేపు ఉప్పు డిపాజిట్లు లేవు. అందువల్ల నాకు తెలిసినప్పటినుండి ఈ దారి మూసే వుంది. కాకపోతే గేట్ లో నుండి ఒక ఫర్లాంగ్ వరకూ వెళ్ళవచ్చు. విజిటర్లకు కూడా అనుమతిలేదు" అన్నాడు. "గేటు తీయించండి. ఒక్కసారి చూడాలి." అన్న పుష్యమిత్రుని అభ్యర్ధన మేరకు మైన్స్ మేనేజర్ కు ఫోన్ చేసి విషయం చెప్పి తాళాలు తెప్పించాడు. తూర్పు వైపుకు వెళ్తున్నకొద్దీ దారి ఇరుకయిపోతూ సాగుతోంది.  ఒక ఫర్లాంగ్ వెళ్ళాక సార్ ఇక మనం ఇక్కడ చూసేదేమీ ఉండదు. వెళ్దాం పదండి అని కారు లాంటి వాహనం రివర్సు చేస్తుండగా అక్కడ గోడకు గ్రుచ్చుకుని  ఏదో లోహం రేకు వంటి వస్తువు మెరుస్తూ కనిపించింది.  దానిపై ఉప్పు పేరుకుని ఉంది. పుష్యమిత్రుడు దానిని తీసి శుభ్రం చేసి చూశాడు. అది క్రీ.పూ అలెగ్జాండర్ కాలం నాటి నాణెం. దానిపై బొమ్మ మరియూ " 1 కర్షపణ" (బరువు సుమారు 2.83 గ్రాములు, 17 మిల్లీమీటర్ల పరిధి గలిగిన దీర్ఘ చతురస్రాకారమైన నాణెము) అని వ్రాసి ఉంది.  ఇప్పటి విలువ ప్రకారం సుమారు 120 రూపాయలు ఉంటుంది. పుష్యమిత్రుని రెండు కన్నీటిబొట్లు ఆ వెండి నాణెంపై పడ్డాయి. ఇవన్నీ పంచాపకేశన్ గమనించకపోలేదు. అయితే ఆ నిధి ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఎక్కడో ఉందని మనసులో తీర్మానించుకున్నాడు. ఆ కర్షపణ నాణాన్ని ఆర్ధిక మంత్రికిచ్చి ఉంచమన్నాడు.
*    *    *
ప్రైం మినిస్టర్ ఆంతరంగిక సమావేశం లో పుష్యమిత్రుడు, పంచాపకేశన్ ఉన్నారు.
"అయితే ఆచూకీ తెలిసిందన్నమాట" అన్నాడు పీ.ఎం. ఆర్ధిక మంత్రి ఇచ్చిన సిల్వర్ కాయిన్ చేతిలోకి తీసుకొని.
"యెస్. సార్! కానీ.. అది శతృవుల దేశంలో ఉంది. మనం తీసుకోగలమన్న నమ్మకం నాకు లేదు" అన్నాడు పంచాపకేశన్.
"అప్పుడే అంత నెగటివ్ గా మాట్లాడుతున్నావేంటి ఎఫ్.ఎం. ఏమైంది మీకు?"
"ప్రయత్నిద్దాం. ఏదో ఒక ఆలోచన చేద్దాం" అన్నాడు పుష్యమిత్ర.
"అవును. ఆలోచిస్తే ఏదో ఒక దారి కనబడుతుంది" అన్నాడు పీ.ఎం.
దానికి సంబంధించిన ఫొటోలు అవీ అన్నీ చూపించారు.

*    *    *
"సార్! మాకు పాక్ కు వెళ్ళడానికి వీసాలు మంజూరు చేయడంలేదు. పైపెచ్చు దిల్లీ కి రమ్మంటున్నారు ఈ విదేశీ వ్యవహారాలశాఖ వారు. ఈ విషయం బయటకు పొక్కిందో ఏమో.. అనుమానంగా ఉంది" ఫోన్ లో స్వంతవూరు తిరుకడయూర్ నుండి ఫోను.
"మీరు దిల్లీ వెళ్ళకండి. రేపు అసలు కారణం తెలుసుకుని నేనే చెప్తాను."
వెంటనే చీఫ్ పాస్పోర్ట్ కమీషనర్కి ఫోన్ చేశాడు పంచాపకేశన్ సెక్రెటరీ. ఏవో రీజన్స్ చెప్పడానికి వీల్లేని పరిస్థితి అనీ, పీ.ఎం. చెబితే తప్ప ఎవరికీ వీసాలు ఇవ్వొద్దనీ..పాక్ ఇమిగ్రేష ఆఫీసు వారి సమాధానం.
*    *    *
"మీరు హిమాలయాల ద్వారా ట్రెక్కింగ్ బాచ్ లా నటిస్తూ పాకిస్తాన్ చేరుకోండి ఏదో విధంగా. అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రెలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళను చూడడానికి అని చెప్పండి. మన తిరుకడయూర్ లో అల్లబక్ష్ హోటల్ హుస్సేన్ను అడగండి. డబ్బు ఇచ్చి లొంగ దీసుకోండి. వాడి రెలేటివ్స్ ఉన్నారు అక్కడ. వాడి ద్వారా అక్కడకు చేరుకోండి. నలుగురూ నలువైపుల నుండి వెళ్ళండి కలిసి వెళ్ళొద్దు. అక్కడకు అందరూ చేరుకున్నాక నాకు ఫోను చేయండి. అప్పుడు అక్కడ ఏం చెయ్యాలో చెబ్తా. మళ్ళీ మళ్ళీ ఫోన్లు చెయ్యొద్దు. బై" సీరియెస్ గా చెప్పాడు పంచాపకేశన్.
*    *    *
పుష్యమిత్రాజీ.. భారతదేశంలో రెండు భయంకరమైన జబ్బులు. ఒకటి ఎయిడ్స్, రెండు క్యాన్సర్. వీటిని ఎదుర్కోవడం కష్టంగా ఉంది. అని వాటి వివరాలను వచ్చే కారణాలను వివరించారు ఎయింస్ (ఏ.ఇ.ఎం.ఎస్)  వైద్యశాఖ ప్రత్యేక బృందం.
"ఇవన్నీ అంతకు ముందు వున్నవే! కాకపోతే ఇది వరకు ఇంత ముమ్మరంగా లేవు. అంతే." అన్నాడు పుష్యమిత్ర.
"అవును సార్!"
"మీకు గుగ్గుల్ అనే మందు తెలుసా! ఇక్కడ,  పాకిస్తాన్ లోను పండిస్తారు. జిగురుగా ఉంటుంది. అది రాచపుండుకు అద్భుతంగా పని చేస్తుంది. ఒకసారి మీరు ప్రయత్నించండి. ఇహ మీరు చెప్పే ఎయిడ్స్ అంటే రోగ నిరోధక శక్తిని తగ్గించే వ్యాధి గురించి నేను ఆలోచించి చెప్తాను. మంచూరియా (కొరియా) దేశంలోను, మనదేశం హిమాలయాలలోను దొరికే ఒకానొక వేరులో నిరోధక శక్తి పెంపొందించే గుణం ఉంది. అది మనిషి ఆకారంలో ఉంటుంది. దాని పేరు మంచూరియా గిన్సెంగ్ అని పిలిచే వాళ్ళం. మీరు ఆ వేరు పై పరిశోధన సాగించండి."
"సార్! మేము దానిని ఉపయోగించి గ్లెన్సెంగ్ అనే గొట్టాల మాత్రలనూ, రివైటల్ అనే ద్రావకాన్ని తయారు చేస్తున్నాం."
"మీరు ఆ వేరుపై తక్షణం పరిశోధనలు మొదలెట్టండి"
"అలాగే సార్!"
*    *    *

"సార్! నానా తిప్పలు పడి పాకిస్తాను ఖెవ్రా సాల్ట్ మైన్స్ కు దగ్గరగా ఉన్న పిండ్ దండన్ ఖాన్ దగ్గర ఉన్న విలేజ్ లో ఉన్నాం సార్!"
"వెంటనే ఏమీ చేయకండి. నేను చెప్పే వరకూ అక్కడే ఉండండి. వారం రోజులు ప్రజల్లో కలిసిపోయి ఉండండి. ఆ తర్వాత విలేజ్ వాళ్ళతో కలిసి గనులు చూడడానికి వెళ్ళండి ఒకరోజు. ఆ తర్వాత రోజు గనుల్లో పని సంపాదించడానికి ప్రయత్నించండి. అక్కడ ఉద్యోగం వచ్చాక కాంటాక్ట్ చెయ్యండి. ఇదే ప్రైవేట్ ఫోను కు. బై"
*    *    *

ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చీఫ్ సుబ్రతో ముఖర్జీ తో పీ.ఎం. పుష్యమిత్రుని సమావేశం.
"పీ.ఎం సాబ్! పుష్యమిత్రాజీ చెప్పిన ప్రకారం గిన్సెంగ్ రూట్ మీద పరిశోధన సాగిస్తున్నాం. ఎయిడ్స్ వ్యాధి కారకమైన వైరస్ ను దేహంలోని సీ.డీ-4 కణాల్లోకి టెస్ట్యూబ్ ద్వారా ప్రవేశపెట్టి, గిన్సెంగ్ రూట్ ద్వారా తయారు చేసిన లిక్విడ్డ్ ను ప్రవేశ పెట్టాము. అద్భుతమైన రిజల్స్ కనబడ్డాయి. గిన్సెంగ్ ఉన్నంత మేర అవి సీ.డీ. సెల్స్ దగ్గరకు రాకపోవడం కాకుండా వెంటనే అవన్నీ నశించిపోయాయి. ఏమీ చెయ్యలేకపోయాయి.
"ప్లీజ్ గో అహెడ్. ఎయిడ్స్ వ్యాధికి మనదేశమే ముందు మందు కనిపెట్టాలి."
పుష్యమిత్ర నవ్వుతూ "మనం మూలికలను, చెట్లనూ సక్రమంగా వాడుకుంటే ఏ వ్యాధీ ఏమీ చెయ్యలేదు. అసలు చాలా సాధారణ వ్యాధులకు మందులేమీ అవసరం లేదు. ఆహారం ద్వారా నయం చేసుకోవచ్చు. ఆరోజుల్లో కోట బురుజు మీద నుండి ఒక విలుకాడు వేసిన విషపూరితమైన బాణం వల్ల అలెగ్జాండర్ శరీర భాగాలు లోలోపల క్రుళ్ళిపోయి చనిపోయాడు. అతను కొంత కాలం  మనదేశంలోనే ఉండివుంటే రక్షింపబడేవాడు. మా ఆస్థానంలో జీవక్ అనే వైద్యాచార్యుడు ఉండేవాడు.  అతను తక్షశిల లో చదువుకుని వచ్చాడు. ఆయన అలా చూచి నాడిపట్టి నిముషాల్లో వ్యాధి చెప్పి మందు ఇచ్చేవాడు. ఎంత పెద్ద వ్యాధైనా గంటల్లో లేచి కూర్చునే వాడు రోగి. ( సశేషం)

No comments:

Post a Comment

Pages