తల్లిప్రేమ - అచ్చంగా తెలుగు
తల్లిప్రేమ
పెమ్మరాజు అశ్విని 
         
ఫ్లాట్ తలుపు చప్ఫడైతే వెళ్లి తీసింది రాధ “అత్తయ్య వాకింగ్ అయిపోయిందా కాఫీ తాగుతారా అని అడిగింది."  రాధ అత్తగారు సుమతికి  రోజు సాయంత్రం వేళ  పంచవటి ఫ్లాట్స్ లో వాకింగ్ ఏరియా లో వాకింగ్ చేసి కాస్త నలుగుర్ని పలకరించి వచ్చే అలవాటు.  చిన్నప్పటి నుండి  పల్లెలో అలవాటు పడ్డ ప్రాణం! అందువల్ల చుట్టూ అందర్నీ పలకరిస్తూ సాయంత్రం అలా నడిచి రావడం అలవాటు చేస్కున్నారు. ఇవాళ ఎందుకో మొహం చిన్నబుచ్చుకుని వున్నారు సుమతి గారు. కాఫీ ఇస్తూ “ఏంటి అత్తయ్య ఆరోగ్యం బాలేదా డాక్టర్ దగ్గరకి వెళ్దామా? మావయ్య ఏమైనా తలంపుకి వచ్చారా “అంటూ భుజం మీద లాలనగా చెయ్యి వేసింది రాధ.
      "అబ్బే, అదేమీ లేదే తల్లి. మీ మామగారిని మరిస్తే కదూ  గుర్తుచేసుకోడానికి! అది కాదు, నిన్న వాకింగ్ లో కింద నిర్మలమ్మ గారని, ఒక  పెద్దావిడని చూసా. ముగ్గు బుట్ట లాంటి జుట్టు మనం ఊరి జనం కట్టుకునేలాంటి చీర కట్టు, ముసలి ముడతలు. ఇంత వయసులో కూడా చాల అందంగా వున్నారు ,ఆవిడని నిన్న పరిచయం చేస్కున్నా. పిల్లల్ని చూస్తూ బోలెడు మాటలాడరు. ఇవాళ నేనెవరు అన్నట్టు చూసారు. అదే అర్ధం కాలేదు, పైగా దగ్గరికి వెళ్తే భయపడ్డారు, అదేదో నేను ఆవిడని ఏమి చేసేస్తానో అన్నట్టు! అదే అర్ధం కాక పక్కనే వున్న ఆవిడని అడిగా  “ఆవిడ పేరు గంగ అట, ఈ నిర్మలమ్మ గారిని చూసుకునేందుకు ఆవిడతో ఉంటున్నారట. 

ఈ నిర్మలమ్మ గారు ఈ అపార్ట్ మెంట్ లు కట్టకముందు, ఈ జాగాకి యజమాని.  ఇద్దరు కొడుకులూ ఈ స్థలాన్ని  డెవలప్మెంట్ కి ఇచ్చేసారట.  వారి వాటాగా వచ్చిన కింద వాటాలో ఈ మధ్య ఈవిడని  పెట్టారు, బావున్నంత కాలం ఆవిడ చేత అన్ని సేవలు చేయించుకున్నారట, ఇప్పుడు చెరుపు మరుపు వచ్చేసరికి కోడళ్ళు చేతులు ఎత్తేసారుట. వృద్దా శ్రమంలో వేస్తె నలుగురు నానా మాటలు అంటారని, ఈ గంగని తోడు గా పెట్టి ఇక్కడ పెట్టారుట. తెలివి వచ్చినప్పుడల్లా "నా కొడుకులు ఏరి? మనమలు ఎక్కడ?" అని అడుగుతారట పాపం. ఈ వయసు ఆవిడకి ఏమిటి ఈ ఖర్మ “ అంటూ కళ్ళు వత్తుకున్నారు సుమతి గారు.
     “ఊరుకోండి అత్తయ్య, ఇప్పుడు లోకం తీరు అలాగే వుంది ఎక్కడో మనలాగా కలిసి వుండే అత్త కోడళ్ళని  చూస్తే, మ్యుజియం లో వింత వస్తువు ని చూసినట్టు చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా వెళ్లి ఆవిడతో కాస్త కాలం గడపండి. పెద్ద ప్రాణం హాయిగా వుంటుంది. అన్నట్టు ఆవిడకి ఒక 9౦ ఏళ్ళు  ఉంటాయా? ఏమి లేదు ఇంటి దస్తావేజుల్లో ఎక్కడో నిర్మలమ్మ వయసు 3౦ అని రాసి వుంది. అది దాదాపు 6౦ ఏళ్ళ క్రితం పట్టా పుస్తకం లెండి ,ఇంతకీ మీరు రాత్రికి ఫలహారం ఏమి చేస్తారు దోసలు వెయ్యనా, అంటూ కాస్త విషయం మరల్చింది” రాధ. 

సుమతి గారికి దాదాపు 65 ఏళ్ళు వుంటాయి ,రాధ కి 4౦ ఏళ్ళు.  రాధ భర్త వేణు గారు వుడాలో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. కొడుకు శ్రీకర్ ఇంజనీరింగ్ అయ్యి ఈ మధ్యే ఉద్యోగం లో చేరాడు. రాధ ఇంట్లో అకౌంట్స్ కోచింగ్ ఇస్తూ వుంటుంది. అదీ కాలక్షేపం కోసం, తనకి వచ్చిన సబ్జెక్టు మర్చిపోకుండా ఉండేందుకు.
     నెమ్మదిగా రాధ, సుమతి గారు కుడా నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో సభ్యురాలు లాగా చూడసాగారు. ఇంట్లో వండినవి ఇవ్వడం, ఆవిడతో కాస్త కాలం గడపడం లాంటివి చేయసాగారు. ఒకరోజు తన స్నేహితురాలు కాత్యాయిని పేస్ బుక్ పుణ్యమా అని మళ్ళి కలిసింది. ఒకరి నెంబర్ ఇంకొకరు తీస్కోని,    కాత్యాయిని  ఫోన్ చేసింది రాధకి  “ ఏంటి రాధ ఎలా వున్నావు? ఎక్కడ వుంటున్నావు హైదరాబాద్ లో నేనా?" అని అడిగింది.  “అరె కాత్యాయిని ఎలా వున్నావు? నేను హైదరాబాద్ ఏంటి నీ మొహం! నేను వైజాగ్ లో స్థిరపడి 2౦ ఏళ్ళు అయ్యింది. ఇంతకి నువ్వెక్కడ వుండేది? విజయవాడ లేక హైదరాబాదా?" అని అడిగింది. “హా ఇది వరకు విజయవాడే, ఈ మధ్యే వైజాగ్ వచ్చేసాము. నా కూతురు భార్గవిని వైజాగ్ ఇచ్చాము. దాని కనీసం రోజుకి ఒకసారైన చూడందే ప్రాణం ఒప్పదు. అందుకే ఇక్కడికి వచ్చేసాము. ఎలాగు ఈయన వ్యాపారం ఎక్కడినుండైన చేస్కోవచ్చు. షేర్ లు,  లావాదేవీలు అంటూ ఇల్లు పట్టదు. నాకేమో ఒంటరి గా బెంగ వచ్చేస్తుంది. అందుకే అమ్మాయికి దగ్గరలో ఇల్లు తీస్కుని, ఇక్కడే గాజువాక లో ఉంటున్నాము. ఒకసారి ఇంటికి రావే రాధ “ అంది.  ఇద్దరు అనుకుని, ఒకరోజు కాత్యాయని ఇంటికి  వెళ్ళింది రాధ. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఇంట్లో వున్న ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తోంది కాత్యాయని. ఇల్లు చాల ఆడంబరంగా వుంది. కూతురు అల్లుడు గురించి చెప్తూ మైమరిచి పోతోంది కాత్యాయిని. ఇంతలో రాధ కళ్ళు ఒక ఫోటో పైన పడ్డాయి. ఆ ఫోటో చూసి రాధ “ఎవరే మీ బామ్మ గారా లేక అన్నయ్య గారి చుట్టాలా?" అని అడిగింది. కాత్యాయిని ఎదో తప్పించుకో బోయి ఇక తప్పక చెప్పింది, "ఆవిడ ఎవరో కాదు మా అత్తగారు అని .” ఆ ఫోటో రాధ తో అపార్ట్ మెంట్ లో ఉంటున్న  నిర్మలమ్మ గారిది. 
        “మరి కాత్యాయిని, మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడ వుంటున్నారు?” అని అడిగింది ఏమి తెలియనట్టుగా. "హా, మా మరిది ఇంట్లో ఉంటోంది. నేను ఊరు మారడం కదా, అసలే పెద్దావిడ మళ్ళి వాతావరణం ఇబ్బంది పడకుండా అక్కడే విజయవాడలో వుండిపోయారు. అస్సలు రానని ఒకటే పేచి. సర్లే పెద్దవిడ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అక్కడే వుంచేసాము. వచ్చిన దగ్గరనుండి ఈయన ఒకటే గోల ఏదో చిన్న పిల్లాడి  లాగ! అమ్మ, అమ్మ అని ,ఆవిడో పెద్ద నస తెలుసా? దానికి  తోడు ఈ మధ్య మతి స్తిమితం లేదు బట్టలు పాడుచేస్కుంటారు అసహ్యంగా“ అంటూ చీత్కారంగా మొహం పెట్టింది . రాధకి కాత్యాయిని అహంకారం అర్ధమైంది. అనువుగాని చోట అధికులమనరాదు అని గుర్తొచ్చి ఆగిపోయింది.
     సరే కాత్యాయిని,  నేను బయల్దేరతాను. వచ్చే ఆదివారం ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాము. నువ్వు మా అన్నయ్యగారు తప్పకుండా రండి, ఇది అడ్రస్ అంటూ పిలిచి వెళ్ళిపోయింది .రాధ పిలుపుకి ఆనందంగా తన మొగుడు సుబ్బారావుని తీస్కోని రాధ  ఇంటికి బయల్దేరింది  కాత్యాయిని. అపార్ట్ మెంట్ సందు మొదట్లోనే "ఇదేమిటి మనం డెవలప్మెంట్ కి ఇచ్చిన ఫ్లాట్స్ కదా! ఇవి గుర్తుపట్టరా, చాల మారిపోయింది", అంటూ మొగుడు కేసి చూసింది అప్పటికే సుబ్బారావు తేలు కుట్టిన దొంగ లాగ చూస్తున్నాడు.  ఇద్దరూ ఫ్లాట్స్ లోపలి వెళ్లారు. రాధా  వాళ్ళ  ఫ్లాట్ లో అప్పుడే పూజ అయ్యి హారతి ఇస్తున్నారు. “సారి రాధ ఆదివారం కదా పని కాస్త ఆలస్యం అయ్యింది ,క్షమించు అన్నట్టు ఈయన మా వారు సుబ్బారావు గారు," అంటూ పరిచయం చేసింది. రాధ ,"ఈయన మా వారు పేరు వేణుగోపాల్ గారు. ఈవిడ మా అత్తగారు సుమతి, మా అబ్బాయి శ్రీకర్, వీడు హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాడు. “ అంది.  రాధ "రా ఇలా కూర్చో, అని వాళ్ళకి ప్రసాదం పెట్టి, భోజనాలకి ఇంకా వ్యవధి ఉందా లేక వడ్డన చేసేయనా" అంది.  వేణు శ్రీకర్ కేసి చూసి “అయ్యో ఇంకా మామ్మగారు రాలేదు కదా. ఆవిడా వస్తూనే వడ్డన  చెయ్యొచ్చు. శ్రీకర్ కిందకి వెళ్లి మామ్మ గారిని జగ్రత్తగా లిఫ్ట్ లో తీస్కురా “ అని పురమాయించాడు. కాత్యాయిని సుమతి గారితో తన మొగుడు, కూతురు అల్లుడు గొప్పలు చెప్తోంది. ఇంతలో లోపలకి నెమ్మదిగా వచ్చారు నిర్మలమ్మ గారు. ఆవిడ లోనికి వస్తూనే “సుబ్బు ఎలా వున్నావు రా? అమ్మ మీద బెంగపెట్టుకున్నావా? ఏంటి ఇలా చిక్కిపోయావు? కాత్యాయిని ,నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మ ,చిట్టి తల్లి ఎలా వుంది? బామ్మ మీద అలిగిందా? ఏది ఆ గదిలో దాక్కుందా అంటూ గబా గబా మనవరాలిని వెత్తుకుంటూ గది లోకి వెళ్లారు “ ఒక్క క్షణం కాత్యాయని సుబ్బారావుల మొహం అవమాన భారంతో ఎర్రబడిపోయింది .
      “ఏంటిది కాత్యాయిని ,సుబ్బారావు గారు మీరు ఎంత మంచి పలుకుబడి వున్నవారు? ఎంత పెద్ద వ్యాపారవేత్త? ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా కన్నతల్లి మనసు నొప్పించ వచ్చా?  మీ కోసం ఎదురు చూసి చూసి ఆ పిచ్చి తల్లికి మతి భ్రమించింది. చెరుపు మరుపుగా ఉంటోంది. అంత  మరుపు లోను మిమల్ని మీ యోగాక్షేమాలని గురించి మరవలేదు చూడండి, అది తల్లి ప్రేమంటే. మీకు ఒక్కగానొక్క కూతురు. తనని దూరం ఇవ్వలేక మీరు ఊరు మారి తనకి దగ్గర వుండాలి అనుకున్నారు. మీకో న్యాయం ,మీ అమ్మగారికి ఒక న్యాయం తగునా? మీ ఇల్లు చాలా పెద్దదేగా! మొన్న వచ్చినప్పుడు చూసాను. అంత పెద్దింట్లో ఈ పిచ్చి తల్లికి చోటు లేదని చెప్పి, మీ మనుసులు ఎంత ఇరుకో చూపించారు “ అంటూ రాధ కోపంగా ప్రశ్నించింది .
      రాధ అడిగిన ప్రశ్నలకి బదులు ఇచ్చే పరిస్తితుల్లో లేరు సుబ్బారావు గారు. నాలుగు అంగల్లో తన తల్లిని చేరి అమ్మని పట్టుకుని “అమ్మ, నన్ను క్షమించమ్మ. ఎంత స్వార్ధంతో వ్యాపార ధోరణిలో ఆలోచించాను తప్ప, మనిషి గా పతనమైపోయాను. నన్ను మన్నించమ్మ," అంటూ కళ్ళ నీళ్ళు కారుతూ ఉండగా బతిమాలాడు సుబ్బారావు. ఇవేవి అర్ధం కాని నిర్మలమ్మ గారు తల నిమురుతూ పక్కన వున్న రాధతో “మా సుబ్బి ఆకలికి ఆగలేడు, కాస్త పులిహోర ప్రసాదం పెడతారా, అందాక? వాడికి ఆకలి వేసి ఏడుస్తున్నాడు," అంటూ మొహమాటంగా పైట కప్పుకుని అడిగారు. రాధ తన్మయంగా ఆవిడని చూసి ఒక ప్లేట్ లో పులిహోర తెచ్చి ఇచ్చారు. ఆవిడ గబగబా సుబ్బారావు దగ్గరికి వచ్చి “సుబ్బు, ఇది తిను నాన్న నీకు ఇష్టం కదా పులిహోర." అంటూ నోట్లో పెట్టారు .

" చూసారా సుబ్బారావు గారు?  అదీ తల్లి ప్రేమంటే. అంత  మరుపులో కుడా ఆమెకి మీ ఆకలి ఇంకా గుర్తుంది“ అన్నారు సుమతి గారు. 
”అవునండి, నేను చాలా తప్పు చేసాను. ఈ స్తలం ఎప్పుడో మా నాన్న కొన్నది. ఇది అమ్మేస్తుంటే వద్దని అమ్మ ఆపింది. కావాలంటే అక్కడే వుండు పదో పరకో పడేస్తాము అంటూ నేను తమ్ముడు చాల బుద్ది హీనంగా మసులుకున్నాము. అయినా అమ్మ ఏ రోజూ నన్ను గాని, తమ్ముడ్ని గాని కోప్పడలేదు. అలాగే ఒంటరితనాన్ని అనుభవించింది. ఇక మీదట అమ్మ మనతోనే వుంటుంది కాత్యాయిని, నీ స్నేహితురాలు రాధ తన అత్తగార్ని ఎంత చక్కగా చుస్తోందో చూడు.  అది మనకి ఆదర్శం “అన్నాడు. అలా నిర్మలమ్మ గారిని మళ్ళి తన గూటికి చేర్చారు  రాధ సుమతి కలిసి .
***

2 comments:

  1. తల్లి ప్రేమ కథ చాలాబాగున్నదండి.అశ్వని గారికి అభినందనలు..

    ReplyDelete
  2. తల్లి ప్రేమ కథ చాలాబాగున్నదండి.అశ్వని గారికి అభినందనలు..

    ReplyDelete

Pages