వేదసంహిత - అచ్చంగా తెలుగు
వేదసంహిత
పోలంరాజు శారద 


"మేడం, మా అమ్మగారి పెన్షన్ కాయితాలు.........."

"కూర్చోండి." కాయితాలు చేతిలోకి తీసుకొని వివరాలు చదివిన ఆఫీసర్ తలఎత్తి ఎదురుగా నిలుచున్న వ్యక్తి వైపు ఒకసారి చూసి మళ్ళీ దృష్ఠి ఫైల్ మీదకు మళ్ళించింది. 

"మీ పేరు?"

హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు "వేదసంహిత" అని సమాధానం ఇచ్చాడు.

ఆఫీసర్ పెదవులు చిన్నగా నవ్వుతున్నట్టు విచ్చుకున్నాయి.

"మీ అమ్మగారి పేరు ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో కనిపిస్తూనే వుంది. నేనడిగింది మీ పేరు." 

ఆ మాటలకు అతనికి కూడా కొద్దిగా నవ్వు వచ్చింది. "సారీ, కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాను. నాపేరు చిరంజీవి."

"పిల్లలా?"

ఏమిటీ పిచ్చి గోల? ఒక పక్క ఆఫీసుకు టైం అయిపోతోంది. అమ్మ తిరగలేకపోతుందని పర్మిషన్ తీసుకొస్తే ఈవిడ ఏదో ఇంటర్వ్యూ లో లా ప్రశ్నలేస్తోందని మనసులో విసుక్కొంటూనే, "ఇద్దరు పిల్లలండీ. పాప బాబు. పాప రెండవక్లాసు బాబు నాలుగవ క్లాసు చదువుతున్నారు." మళ్ళీ మళ్ళీ అడక్కుండా వివరాలన్ని చెప్పాడు. 

"ఓకె మీరు వెళ్ళవచ్చు."

"మరి మాఅమ్మగారి పేపర్స్........... మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు?"

"మళ్ళీ మీరు రానవసరం లేదు. అయిపోగానే మేమే పంపిస్తాము." ఇంక మీరు వెళ్ళవచ్చు అన్నట్టు ఆ ఫైల్ పక్కన పెట్టి మరీ ఫైల్ చేతిలోకి తీసుకొని ప్యూన్ కోసం బెల్ కొట్టింది.

ఇంక చేసేదేమీలేక బయల్దేరిన చిరంజీవి వంక తలఎత్తి చిరునవ్వుతో చూసింది ముప్పై ఐదేళ్ళ  కాంచన. 

******

"ఏరా అబ్బాయి? పెన్షన్ ఆఫీసుకు వెళ్ళావా?" 

"ఆ వెళ్ళానమ్మా. ఈ సారి డైరెక్ట్ గా ఆఫీసర్‌నే కలిసి పేపర్లు ఇచ్చి వచ్చాను. అయిపోగానే వాళ్ళే పంపిస్తారు అన్నది ఆవిడ." అప్పుడే ఆఫీసునుంచి వచ్చిన చిరంజీవి తల్లికి సమాధానం చెప్పి లోపలికి వెళ్ళాడు.

"ఏం పెన్షనో? ఏమిటో? నాతో పాటు రిటైర్ అయిన వాళ్ళందరికీ ఎప్పుడో వచ్చేసింది. హై స్కూల్ నుండి జూనియర్ కాలేజీకి, అక్కడి నుండి డిగ్రీ కాలేజీకి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అవటంతో ఈ గోలంతా. ఈ పాటికైనా పని పూర్తవుతే ఒక భారం తీరుతుంది." తనలో తాను అనుకుంటున్నట్టు అన్నది.

"ఒరే బయట కారేదో ఆగినట్టుంది చూడు.  ఎవరో లోపలికి వస్తున్నట్టున్నారు." 

కొడుకూకోడలూ ఒక్కసారే హాల్లోకి వచ్చారు.

తలుపు వద్ద నిలబడ్డ అపరిచితురాలిని చూసి, "ఎవరు కావాలమ్మా? లోపలికి రండి." వేదసంహిత ఆప్యాయంగా ఆహ్వానించింది.

"ఎవరమ్మా?" కారు శబ్దం తరువాత మాటలువినబడ్డ చిరంజీవి బయటకు వచ్చి ఆశ్చర్య పోయాడు. "మేడం మీరు........ అమ్మా పెన్షన్ ఆఫీసర్ గారు." అని తల్లికి వివరించి, 

"రండి మేడం కూర్చోండి." 

"నమస్కారమమ్మా. ఇదిగో మీ పెన్షన్ కాయితాలు." అంటూ అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి వున్న వేదసంహిత చేతిలో పేపర్లు పెట్టింది కాంచన చిరునవ్వుతో. 

ఎవరికీ ఏమీ అర్ధం కావటం లేదు. ముఖ్యంగా చిరంజీవికి. ఆఫీసులో హుందాగా దర్పంతో కనిపించిన కాంచన సరాసరి ఇంటికి పేపర్లు తెచ్చి ఇవ్వటం ఏమిటి? ఆశ్చర్యం కలిగించింది. 

ఇంకా అందులోనుండి తేరుకోను కూడా లేదు. ఈ లోగా  కారు డ్రైవరు లోపలికి వచ్చాడు. చేతిలో పళ్ళ బుట్ట లోపల పెట్టి బయటికి వెళ్ళి పెద్ద బట్టల సంచులు, కవర్లు బొమ్మలు ఒక్కొకటే లోపలికి తీసుకొచ్చాడు.

చిరునవ్వుతో చూస్తున్న కాంచనను, అక్కడ పెట్టబడిన వస్తువులను మార్చిమార్చి చూస్తూ ఉండి పోయారు కుటుంబ సభ్యులు. 

డ్రైవర్ వెళ్ళిపోయిన తరువాత కాంచన లేచి, ఒక కవర్ తీసి అందులో నుండి ఒక ఖరీదైన పట్టుచీరమీద పళ్ళు  పెట్టి నోటమాట లేకుండానిలబడ్డ వేదసంహిత చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కరించింది.

వెంటనే తేరుకొన్న ఆవిడ కాంచన తల మీదచేయి పెట్టి శ్రీరామ రక్ష అని ఆశీర్వదించి, "అమ్మా, మిమ్మల్ని నేను గుర్తు పట్టలేదు....."సందేహంగా అడిగింది.

కాంచన అదే చిరునవ్వుతో, తను తెచ్చిన మిగతా వస్తువులు  చిరంజీవి చేతుల్లొ పెట్టింది. 

"అమ్మా,  నేనెవరో మీరు గుర్తుపట్టలేరని నాకు తెలుసు."

బహుశా తన దగ్గర చదువుకున్న ఏ విద్యార్ధినో అయి వుంటుందని అనుమానం వచ్చి అదేమాట ఆమెతో అన్నది.

"అమ్మా, మీరు కొంతకాలం ఒంగోలులో వుండేవారు. అక్కడ మీ ఇంటి పక్కన గుర్నాధంగారు వుండేవారు. ఙ్ఞాపకం వున్నారా?"

"అయ్యో వారిని ఎట్లా మర్చిపోతాను? మీకు వారెట్లా తెలుసు?"

"మీరు ఆ వూళ్ళోవుండగా వారి మరదలి కూతురును గుర్నాధంగారు ఇంటికి తెచ్చుకున్నారు. గుర్తుందా?"

వేదసంహిత ఒక్క నిమిషం ఆలోచనలో పడింది. కొంత తడవుకు గుర్తుకు వచ్చినట్టు, 

"అవునవును. పాపం ఆ అమ్మాయికి తల్లితండ్రి చనిపోయారు. మేము అక్కడుండగానే నిండా పదహారేళ్ళు కూడా లేని ఆ అమ్మాయికి మేనత్త వాళ్ళు పెళ్ళి చేయటానికి ఏర్పాట్లు చేయటం మొదలెట్టారు. పాపం ఎక్కడుందోఆ అమ్మాయి." ఏదో ట్రాన్స్‌లోకి వెళ్ళినట్టు అంది. 

ఎప్పటి గుర్నాధంగారు? ఏం కథ? ఆ నాడు జరిగిన సంఘటనలతో పాటే తన జీవితంలో ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. 

***************

"ఏం సావిత్రీ, వారం రోజులబట్టి ఇల్లు తాళం పెట్టి ఉంది. ఊళ్ళో లేరా?"

"అవును వేదా, మా మరిది సాంవత్సరీకాలు. వెళ్ళి వచ్చాం."

"అవును కదా. అప్పుడే ఏడాదయిపోయిందా?" ఆశ్చర్యంగా అని, "మీ చెల్లెలికి ఒక కూతురు ఉన్నదనుకుంటా? ఏంచేస్తున్నదో. చదువుకుంటున్నదా?"

"ఏం చెప్పమంటాను వేదా. కాంచన  గురించే మా బెంగంతా."

కాంచన పుట్టుకలతోనే సావిత్రి చెల్లెలికి అనారోగ్యం మొదలయింది. ఆ రోగం రోగం కూతురికి ఏడాది వెళ్ళకుండానే ప్రాణాలు తీసింది. ఆమె భర్త మంచి ఆస్తిపరుడు. పెద్ద ఉద్యోగమే చేస్తుండేవాడు. పిల్ల పెంపకం కోసమైనా మళ్ళీ పెళ్ళి చేసుకోమని అందరూ ఎన్ని విధాలగానో నచ్చచెప్పచూసారు. కాని అతను భార్య మీద కూతురు మీద ఉండే ప్రేమతో మళ్ళీ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోక కూతురుకు తానే తల్లి తండ్రై కంటికి మిన్నగా కాపాడుకుంటూ పెంచుకున్నాడు. వారిద్దరినీ వంటరిగా వదిలేయలేక, అతని తల్లి అక్కడే వుంటూ మనుమరాలి పోషణ చూస్తూ తండ్రి కూతురుకు వండి పెడుతూ ఉండేది. 

కూతురి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి ఆమె పేరు మీద బాంక్ లో డబ్బు కూడ బెట్టసాగాడు. ఆ అమ్మాయిని మంచి చదువులు చదివించి తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా చూసి పెద్ద ఆఫీసరుకి ఇచ్చి పెళ్ళి చేయాలని కోరిక. దానికి తగ్గట్టుగానే అతను ఆశించినట్టుగానే కాంచన చక్కగా చదువుకుంటూ మంచి పేరు తెచ్చుకోసాగింది.

కాని ఒకనాడు హఠాత్తుగా అతను రోడ్డు ఏక్సిడెంట్‌లో మరణించటంతో అంతా తల్లకిందులయిపోయింది.

అప్పటిదాకా పెద్ద దిక్కుగా ఉన్న తల్లి, కొడుకు హఠాన్మరణంతో తిప్పుకోలేక మంచాన పడ్డది. దాంతో పెద్ద కొడుకు తల్లిని తీసుకెళ్ళటానికి వచ్చాడు. కాంచన భవిష్యత్తు ఒక సమస్య అయి కూర్చుంది. అతనికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. మరో ఆడపిల్లను తీసుకెళ్ళి చదువు పెళ్ళి అంటే మాటలు కాదు. ఎంత ఆస్తి ఉన్నా ఆడపిల్ల బాధ్యత మాటలు కాదు. అయినా కష్టమో నిష్టూరమో తమ్ముడి కూతుర్ని  తప్పని సరి పరిస్థితులలో తనతోటే తీసుకెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు.

ఆ సమయంలో కాంచన మేనత్త సుగుణ అండగా నిలబడి ఆదుకున్నది. 

"అన్నయ్యా, ఎట్లా మాకు ఆడపిల్లలు లేరు కదా, కాంచనను నాతోనే తీసుకెళ్దామనుకుంటున్నాను." పెద్ద అన్నగారి దగ్గర ప్రస్తావించింది.

"ఎందుకమ్మా అసలే అత్తింటి కోడలివి. మేనకోడలిని ఇంట్లో పెట్టుకుంటే మీ అత్తగారు మామగారూ ఏమంటారో ఆలోచించు. అయినా కాంచన చదువుకుంటానంటోంది. మీ ఊళ్ళో సరైన బళ్ళు కూడాలేవాయె."

"అదంతా ఆలోచించుకొనే అడుగుతున్నానన్నయ్యా. మా అత్తగారు మామగారికి కూడా ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మరేమీ మాట్లాడ వద్దు. ఈ నాటి నుంచి కాంచన బాధ్యత నాది." అంటూ పెద్ద అన్నగారిని తల్లిని ఒప్పించి సుగుణ కాంచనను తనతో కూడా తీసుకెళ్ళింది.

"ఇన్ని రోజులూ కాంచన మేనత్త ఇంట్లో చక్కగా చదువుకుంటున్నదని మేమందరమూ నిశ్చింతగా ఉన్నాము వేదా. కాని మొన్న సంవత్సరీకాలకు వెళ్ళినప్పుడు అసలు సంగతి తెలిసింది." సావిత్రి వివరించసాగింది.

************ 
"ఏరా తల్లీ! బాగా చదువుకుంటున్నావా?" తండ్రి సంవత్సరీకాలకు వచ్చిన కాంచనను దగ్గరకు తీసుకున్న సావిత్రికి ముతక పరికిణీ ఓణీలో ఉన్న కాంచన శరీరంలో ఎముకలు చేతికి తగిలాయి. దూరంగా నిలబెట్టి పరిశీలనగా చూసిన సావిత్రికి కొబ్బరిపీచులాంటి జుట్టు, గుంటలు పడ్డ కళ్ళతో కనిపించిన కాంచన అసలు రూపం కనిపించి విస్తుపోయింది.

ఆప్యాయంగా పలుకరించిన పెదతల్లి మాటలకు ఆ అమ్మాయికి ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. సావిత్రిని కౌగలించుకొని భోరుమని ఏడవసాగింది. ఆ దృశ్యం సుగుణ అత్తగారు చూసింది.

"అమ్మాయి సావిత్రీ బాగున్నావా. పాపం పిల్ల చాలా కాలానికి మిమ్మల్ని చూసేటప్పటికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చినట్టున్నది. పాపం. అమ్మలూ కాంచనా పోమ్మా లోపలికి పో అత్తయ్య పిలుస్తున్నది. పో పోయి టిఫిన్ తినిరా పో." గొంతులో తెచ్చిపెట్టుకున్న ఆప్యాయత కనిపించినా ఉరిమి చూస్తున్న ఆమె కళ్ళు సావిత్రి దృష్టి దాటిపోలేదు. సంవత్సర కాలంలో ఏదో పెద్ద సంఘటనలే జరిగాయని గ్రహించింది.  సమయం చూసి సుగుణను కదిలించి వివరాలు తెలుసుకొని నివ్వెరపోయింది.

పై చదువులు చదివిస్తానని తనతో తీసుకెళ్ళిన సుగుణ ఆశలు అడియాసలయ్యాయి. కాంచనను ఇంటికి తెచ్చేదాకా సుముఖత చూపిన  అత్తగారు కాంచన ఇంటికి వచ్చిన తరువాత అసలు రంగులు చూపించింది. కాంచనను బడికి పంపటానికి ఒప్పుకోకపోగా ఇంట్లో పూర్తిగా పనిమనిషిగా మార్చేసింది. నిద్రలేచి గొడ్లసావిడి బాగుచేయటం నుంచి అత్తగారు పడుకోబోయేటప్పుడు కాళ్ళు పిసికే దాకా వయసుకు మించిన  గొడ్డు చాకిరీతో కాంచన మనసు శరీరం కూడా శుష్కించి పోయాయి. సుగుణ మౌనంగా చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని ఫక్తు అత్తింటి కోడలు.

చాకిరీ సంగతి పక్కన పెట్టి కాంచన చెప్పిన ఘోరమైన సంఘటనలు విన్న సావిత్రి కోపం  పట్టలేక సుగుణ అత్తగారిని నాలుగు కడిగేద్దామని లేవబోయి సుగుణ తొందరపడవద్దని వారించేటప్పటికి తమాయించుకుంది.

సుగుణ ఉండేది వ్యవసాయ కుటుంబంలో.  ఆ ఇంటి మగవారికి విద్యాగంధం శూన్యం. పొలం పనులు, ఆ తరువాత ముంతలు లాగించి కామకలాపాలు విలాసాలు. అంతే వారి కాలక్షేపం. వారికి అది తప్పుగా అనిపించదు. ఇంట్లో  సుగుణ భర్త, అతని తండ్రి, అన్నగారు, ఆ అన్నగారి కొడుకు. వయసు వరస బేధం లేకుండా అందరిదీ ఒకటే నీచ మనస్తత్వం. ఆధారం లేని ఈడొచ్చిన ఆడపిల్ల ఇంట్లో తిరుగాడుతుంటే ఎవరికి వారు ఆమెను లొంగతీసుకుందామని తెగ ప్రయత్నాలు చేయటం మొదలెట్టారు. కాస్తోకూస్తో లోకఙ్ఞానం ఉన్న ఆడపిల్ల కాబట్టి వారిని తప్పించుకొని తిరగటం నేర్చుకుంది. కాని ఎంతకాలం? మేనత్తకు కూడా జరుగుతున్న అన్యాయాలు తెలుసు. కాని నిస్సహాయురాలు. మంచి చేద్దామని మేనకోడలిని తెచ్చుకుంది. కాని ఇక్కడి పరిస్థితులు చూస్తే పిల్ల బతుకు బండలయ్యేట్టుగా ఉంది. అత్తింటివారిని ఎదిరించే శక్తి లేదు. అట్లా అని చూస్తూ వూరుకోలేదు. ఆమె స్థితి అడకత్తెరలో పోకలాగా తయారయింది.

పడుతున్న ఈ వ్యధ చాలదన్నట్టు అత్తగారికి మరో ఆలోచన వచ్చింది. కాంచన పేరు మీద తండ్రి కూడబెట్టిన ఆస్తి మీద ఆమె కన్ను పడ్డది. చదువు సంధ్యల్లేకుండా బలాదూరు తిరుగుతూ, నానా దుర్వ్యసనాలకు బానిసైన సర్వగుణ సంపన్నుడు మనుమడికి కాంచననిచ్చి పెళ్ళిచేయాలన్న దురాలోచన వచ్చింది ఆవిడకు. ఆ కారణంగానే పెళ్ళి కూడా ఖాయం చేసుకోవాలనే  ఉద్దేశ్యంతో సంవత్సరీకాలకు వచ్చింది. 

ఈ విషయాలన్ని వివరంగా చెప్పిన సుగుణ అమాంతం సావిత్రి రెండు చేతులూ పట్టుకొని, "వదినా, ఆ పసిదాని బ్రతుకు నువ్వే బాగు చేయాలి. మీకు పట్నంలో ఎందరో తెలిసిన వారు ఉంటారు. కాంచనను మీతో తీసుకెళ్ళి ఏదైనా దారి చూపించండి. మా చిన్నన్నయ్య దాని పేరు మీద బాగానే కూడబెట్టాడు. ఆ డబ్బు పెట్టి కాస్త చదువుకున్న బుద్దిమంతుడికి ఇచ్చి పెళ్ళి చేయండి. లేకపోతే ఏదైనా ఆశ్రమంలో చేర్చినా దాని బతుకు బాగు పడుతుంది. అంతే కాని మా ఇంట్లో ఉంటే దాని బ్రతుకు బుగ్గిపాలౌతుంది.  నా పుట్టింటి ఆడబడుచు అ విధంగా నాశనమైతే ఆ పాపం నాకు నాపిల్లలకు తగులుతుంది." అంటూ భోరున ఏడ్చింది.

"సుగుణా! ఇంక కాంచన గురించి నువ్వేమీ దిగులు పడవద్దు. పోయినేడే కాంచనను నాతో తీసుకెళ్దామనుకున్నాను. కాని నా చెల్లెలి అత్తింటి వ్యవహారంలో తలదూర్చటం భావ్యం కాదని ఊరుకున్నాను. ఇంక ఇప్పుడు ఊరుకునేది లేదు. కాంచన భారం నాది. నువ్వు చెప్పినట్టే దానికి మంచి  సంబంధం చూసి పెళ్ళి చేస్తాను." 

"వదినా, మా అత్తగారు అంత సులభంగా లొంగే రకం కాదు. ఆవిడ కన్ను దాని పేరు మీద ఉన్న ఆస్తి మీద పడింది. ఎట్లా ఒప్పిస్తావో ఏమో?"

"ఆ విషయం నేను చూసుకుంటానులే" సావిత్రి మాటలకు సుగుణకు కాస్త మనశ్శాంతి కలిగింది.

"పిన్నిగారూ! కాంచనకు పెళ్ళయిన తరువాత ఎట్లా వీలుపడదు. కనుక కొంత కాలం మా ఇంట్లో అట్టేపెట్టుకొని పంపిస్తామనుకుంటున్నాను. మా చెల్లెలు ఉండి ఉంటే మీ పెద్ద మనసుకు ఎంతో ఆనందించేది. కనీసం నేనైనా దానికి తల్లిగా నాలుగు మంచిమాటలు నేర్పించి పంపిస్తాను." 

కార్యక్రమాలు ముగిసిన తరువాత సుగుణ అత్తగారు పెళ్ళి ప్రస్తావన ఎత్తినప్పుడు సావిత్రి మెరమెప్పు మాటలు నాలుగు చెప్పి ఆవిడను ఒప్పించింది. ఆమె మాటల ఉచ్చులో పడ్డ ఆ పెద్దావిడ,"అయ్యో దాన్దేముందమ్మా అట్లాగే ఓ నెలరోజులు అట్టేపెట్టుకొని పంపించు." అంటు అనుమతి జారీ చేసింది.

************

"అది సంగతి వేదా. నీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ళ నాన్న కూడబెట్టిన ధనంతో కట్నకానుకలు ఇచ్చి ఘనంగా పెళ్ళి చేద్దామనుకుంటున్నాను. ఎవరైనా బుద్దిమంతుడు చదువుకున్న పిల్లవాడైతే చాలు."

ఆ రాత్రి వేదసంహిత ఆలోచనలో పడ్డది.

బహుశా ఆ నాడు తనకు కూడా కాంచన వయసే ఉండిఉంటుంది. పదవ తరగతి పాసై ఇంటర్‌లో చేరింది. ఒక్కొక్క కూతురు పుట్టగానే తండ్రి పోస్టాఫీస్లో వారి పేరు మీద డిపాజిట్ చేయటం మొదలెట్టేవాడు. అక్కలకు చేసినట్టే తనకు కూడా కట్నాలు లాంచనాలూ ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ రోజుల్లో కట్నాలు మగపిల్లవాడి తల్లితండ్రుల చేతిలో పోయటమే తప్ప అమ్మాయి పేరుమీద విడిగా ఇవ్వాలన్న ఆలోచన ఉండేది కాదు. అమ్మాయిలు కూడా నాకేమిచ్చారు? అని ప్రశ్నించేవారే కాదు. ఇంటికి  పెద్ద కోడలు. ఆస్తులు అంతంత మాత్రమే. ఆడపడుచుల పెళ్ళిల్లు మరుదుల చదువులకు తండ్రి కట్నరూపంలో ఇచ్చిన డబ్బు ఖర్చయిపోయింది. అందరి బ్రతుకులు స్థిరపడ్డాయి. అత్తమామలు కాలధర్మం పొందారు. ఇద్దరు పిల్లలు చిన్న తరగతులలో చదువుకుంటున్నారు. నిండా పాతికేళ్ళుకూడా నిండకుండానే అనుకోకుండా వేద భర్త కూడా అకాల మరణం పాలయ్యాడు. 

అందరివీ మధ్య తరగతి కుటుంబాలే. ఎవరి సంసారాల్లో వారు బిజీ. ఆదుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. భర్త మరణంతో వచ్చిన కొద్దిపాటి డబ్బే ఆధారం. వేద చదువుకున్న పదవ తరగతి చదువుతో ఒక స్కూల్‍లో ఆయాగా ఉద్యోగం వచ్చింది. కాస్త ఊపిరి అందినట్టయింది. పిల్లల్ని చదివిస్తూ తాను కూడా సగంలో ఆపేసిన ఇంటర్ పరీక్షలకు కట్టి పాసవటమే కాక ప్రైవేటుగా బిఎ కూడా పూర్తి చేసింది. ఆయా ఉద్యోగం నుంచి మెల్లిగా టీచర్ వరకు అభివృద్ధి సాగించి పై చదువులతో చివరకు కాలేజీలో లెక్చరరుగా స్థిరపడింది. అంత వరకు ఆమె ఎన్ని కష్టాలు పడ్డదో ఎన్ని పస్తులున్నదో ఆ భగవంతుడికే తెలుసు.

ఆలోచనల నుండి తేరుకున్న వేద ఒక నిర్ణయానికి వచ్చింది.

సాయంత్రం కాలేజీ నుండి సరాసరి సావిత్రి ఇంటికి వెళ్ళిన వేద,"సావిత్రీ, కాంచన ఏది?" అని ప్రశ్నించింది.

"ఇంట్లో లేదు వేదా పిల్లలతో కలిసి నాగార్జునసాగర్‌కు వెళ్ళింది.  ఏం ఏదైనా సంబంధం కనిపించిందా?" ఆరాటం ఆనందం కలిసిన గొంతుతో ప్రశ్నించింది సావిత్రి. ఆ సమయానికి సావిత్రి భర్త కూడా ఇంటి వద్దనే ఉన్నాడు. 

"అవునా అమ్మా ఏదైనా సంబంధం చూసావా? ఏదో ఆ అమ్మాయికి పెళ్ళయి సుఖపడితే చాలు."

"అన్నయ్యగారూ, మీ ఇద్దరితో నేను కొంచం మాట్లాడుదామని వచ్చాను. పిల్లలు ఇంట్లో లేకపోవటం మన మంచికే. సావిత్రీ, నువ్వు నన్ను గత పది సంవత్సరాలుగా చూస్తున్నావు కదా! నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది?" 

అసందర్భపు ప్రశ్న అర్ధం కాక అయోమయంగా చూస్తున్న సావిత్రి బదులు ఆమె భర్త సమాధానం చెప్పాడు.

"అమ్మా నువ్వొక ఆదర్శ మహిళవు. నీ భర్త మరణించినా కూడా క్రుంగి పోక ధైర్యంగా నీ కాళ్ళ మీద నిలబడటమే కాక పిల్లలను కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నావు. నిన్ను చూసి నలుగురు నేర్చుకొనేటంత ఆదర్శమూర్తివి. అంతకన్నా పెద్ద మాటలు చెప్పటం నాకు తెలియదు." అన్నాడు ఆర్ద్రమైన కంఠంతో.

"అన్నయ్యగారూ, మీకందరికీ నేనొక ఆదర్శ మహిళలాగా కనిపించవచ్చు. దాని వెనక నేనెన్ని కష్టనష్టాలకు ఓర్చుకున్నానో కూడా నా సన్నిహితులైన మీకు తెలుసు. కాని ఈ పరిస్థితులు నాకు ఎందుకు రావలసి వచ్చింది? చిన్నతనానే లోకమంటే ఏమిటో తెలియక తగినంత చదువులేక నేను పడ్డ అగచాట్లు మరో ఆడపిల్ల పడటం నాకు ఇష్టం లేక నేను నా మనసులో మాటలు నాలుగూ చెప్పదలచుకున్నాను. 

ఆ రోజుల్లో ఏమీ తెలియని అయోమయావస్థ. చదివింది చాలు పెళ్ళి అని అమ్మ నాన్న అనగానే మరో ఆలోచన లేకుండా పెళ్ళి జరిగిపోయింది. అంతంత కట్నాలు ఇచ్చి పెళ్ళి చేసారు. ఇచ్చిన కట్నం డబ్బులు ఎట్లా ఖర్చయ్యాయో కూడా తెలియకుండానే ఖాళీ. 

హడావుడిగా పెళ్ళి చేయకుండా ఆడబ్బు పెట్టి నాకు చదువు చెప్పించటమో, లేదా ఆ డబ్బు బాంక్‌లో వేయటమో చేస్తే నేనింత అగచాట్లు పడవలసిన అగత్యం ఉండకపోయేది కదా అని తరువాత ఎన్నిసార్లు బాధపడ్డానో ఎవరికీ తెలియదు. పెళ్ళి చేయటం ఎంత అవసరమో, ఆడపిల్లకు కొంత ఆర్ధికంగా నిలబడే శక్తి వచ్చేలా చూడటం కూడా అంతే అవసరం. అందరికీ నాకు వచ్చిన పరిస్థితే వస్తుందని కాదు. కాని రోజులన్ని మనవి కావు. 

ఇంత ఎందుకు చెప్తున్నానంటే, కాంచన తల్లితండ్రులు లేని పిల్ల. డబ్బుకు కొదవలేదు అంటున్నారు. 

ఆ అమ్మాయి పేరు మీద ఉన్న డబ్బు మీద ఆశకొద్దీ ఎవరో ఒకరు ముందుకు వచ్చి పెళ్ళిచేసుకుంటారే అనుకోండి. ఆ కాస్త ఊడబెరుక్కొని ఆమెను వీధిలో నిలబెట్టరని గ్యారంటీ ఏమిటి? నన్ను సంప్రదించారు కనుక నా సలహా చెప్పటానికి సాహసిస్తున్నాను. కాంచన పేరున ఉన్న డబ్బు ఎక్కడైనా ఆదాయం వచ్చే చోట పెట్టుబడి పెట్టి వచ్చే ఆదాయంతో చదివించి ఆమెను తన స్వశక్తి మీద ఆధారపడే విధంగా తోడ్పడండి. ఏదైనా ఇంకా ఆర్ధిక సహాయం కావాలంటే నాకు తెలిసిన స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. నాకు చేతనైన సహాయం చేయగలను. నేను ఉద్యోగం చేస్తున్న కాలేజీలో సీటు వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను. చేర్పించండి. అంతే కాని ముక్కుపచ్చలారని ఆ పిల్లను ఇప్పటి నుండే పెళ్ళి అనే రొచ్చులోకి దింపకండి."

తనకు తోచిన నాలుగు మాటలు చెప్పి మనసులోభారం దించుకున్న వేదసంహిత ప్రశాంతంగా నిద్రపోయింది.

అప్పటికే ట్రాన్స్ఫరై ఉండటాన మరుసటి వారమే వూరు వదిలి వెళ్ళిన వేదకు తరువాత ఏమి జరిగిందో తెలియదు.

"అవునమ్మా! ఆ అమ్మాయికి అప్పుడే పెళ్ళిచేద్దామనుకుంటుండేవారు. ఇప్పుడెక్కడుందో ఏమో?"

"అమ్మా! ఆ అమ్మాయి మీ కళ్ళముందే ఉంది." చిరునవ్వుతో చెప్పిన ఆ సమాధానం విని అందరూ నిశ్చేష్టులయ్యారు.

*********

ఆ నాడు వేదసంహిత చెప్పిన మాటలు సావిత్రి దంపతులను ఎంతగానో  ప్రభావితులను చేసాయి. 

"నిజమే సావిత్రీ, వేద చెప్పే వరకు కాంచనను చదివించాలన్న ఆలోచనే మనకు రాలేదు కదా! మనం కూడా తెలివి లేకుండా పెళ్ళని సంబంధాలని వేళ్ళాడుతున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తనను చదివించాలి." భర్త మాటలకు సమ్మతంగా తల ఊపింది సావిత్రి. 

పిల్లలతో పిక్నిక్‌కు వెళ్ళి తిరిగి వచ్చిన కాంచనను కూర్చో పెట్టుకొని వేద సంహిత చెప్పిన మాటలు చెప్పి, "అమ్మా కాంచనా! ఇప్పుడు నీ అభిప్రాయం చెప్పు. నీకు చదువుకోవాలనుంటే చెప్పు. ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదువుకోవచ్చు. కాదు నీకు చదివింది చాలు పెళ్ళి చేసుకోవాలంటే అట్లాగే నీకు నచ్చిన పిల్లవాడిని చూసి పెళ్ళి జరిపిస్తాము." అంటూ ఏ దాపరికం లేకుండా వివరంగా చెప్పారు.     

ఆ అమ్మాయికి పట్టరాని సంతోషం కలిగింది.

"పెద్దమ్మా, నేను చదువుకుంటాను. మా నాన్న ఉన్నంతకాలం ఎప్పుడూ చెప్పుతూ ఉండేవారు. అమ్మలూ నిన్ను కలెక్టర్ చేయాలని ఉందమ్మా అంటూ ఉండేవారు. నేను ఇప్పుడే పెళ్ళి చేసుకోను." మనసులో మాట చెప్పటానికి ఇంతకాలానికి అవకాశం దొరికింది.

"కాని కాంచన మీ అత్తయ్య సుగుణ అత్తగారు ఏమి గొడవ చేస్తుందో?"భయంభయమ్గా అన్నది సావిత్రి.

"పెద్దమ్మా ఆ విషయం నాకు వదిలేయి. ఆ ముసలి గుంటనక్కకు ఎట్లా వాతలు పెట్టాలో నాకు బాగా తెలుసు. కాని ముందర మీకు ఇంతమంచి సలహా ఇచ్చిన ఆ దేవతను కలవాలి." అంటూ లేవబోయింది.

"నీకు ఆ అవకాశం లేదు కాంచనా. ట్రాన్స్ఫరయింది వేద సంహిత నిన్నరాత్రే వేరే వూరికి బయలుదేరి వెళ్ళిపోయింది. కాకపోతే మేమిద్దరమూ కలిసి తీయించుకున్న ఫోటో ఒకటి ఉంది చూపిస్తాను." అంటూ సావిత్రి ఇచ్చిన ఫోటోను భద్రంగా దాచుకుంది కాంచన.

అనుకున్నట్టుగానే సుగుణ అత్తగారు ఒకరోజు పిడుగులాగా ఊడిపడింది.

"అమ్మొఅమ్మొ మా ఇంటికి కాబోయే కోడలు చక్కగా నేవళం తేరి ఎంత ముద్దొస్తున్నదో! సావిత్రీ నువ్వు చెప్పినట్టే పిల్లను చక్కగా పెళ్ళికి సిద్దంచేసావు. రేపు శ్రావణ మాసంలో మంచి ముహుర్తం ఉందట. అది పోతే మళ్ళీ ఆరునెలలదాకా ముహుర్తాలు లేవట." గబగబా చెప్పుకుపోతున్న ఆవిడ మాటలకు అడ్డుకట్ట వేస్తూ, "ఎవరికి అమ్ముమ్మా పెళ్ళి అంటున్నావు? తాతయ్యకు గాని మామయ్యలకు కాని మళ్ళీ పెళ్ళి చేస్తున్నావేంటీ?"

"అబ్బ చాల్లేవే సరసం. నీకు శీను బావకు పెళ్ళికి ముహుర్తం పెట్టుకొచ్చాను. త్వరగా నీ సంచీ తీసుకొని బయల్దేరు రాత్రి బస్సుకు ప్రయాణం."

"అమ్ముమ్మా! నీ బేవార్స్ మనవణ్ణి చేసుకోవటానికి ఇక్కడ ఎవరూ సిద్దంగా లేరు. నేను కాలేజీలో చేరాను. వాడికి వేరే సంబంధం వెతుక్కో." నిర్లక్షంగా కాంచన చెప్పిన సమాధానం విన్న ముసలామె రెచ్చిపోయి సావిత్రిని, కాంచనను కన్నతల్లిని అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలూ  కలిపి దుమ్మెత్తిపోసింది. కాంచన పేరు మీద ఉన్న ఆస్తి కాజేయటానికి సావిత్రి దంపతులు ఎత్తు పన్నారన్నది.

అన్ని మాటలు మౌనంగా విన్నారు. కాంచన నెమ్మదిగా లేచి, ఆవిడ చేయి పట్టుకొని తలుపు దాకా తీసుకొచ్చి అక్కడి నుండి బయటకు ఒక్క తోపు తోసి,"నడు బయటకు. ఇంకా ఒక్క మాట మాట్లాడావంటే పోలీసులను పిలవాల్సి వస్తుంది." అని దడేలుమని తలుపు మూసింది.

అంతే ఆ తరువాత జరిగిందంతా కాంచన విజయగాథ. 

***********************************

ఇదిగో మళ్ళీ ఇన్నేళ్ళకు.........

తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. "నువ్వు కాంచనవా? నమ్మలేకపోతున్నాను. ఎంతగా ఎదిగిపోయావమ్మా?"

"అమ్మా, నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడలేదు. కాని పెద్దమ్మ దగ్గర నుండి తీసుకున్న  ఫోటోలోని మీ రూపు, అంతకన్నా అపురూపమైన మీ పేరు నా మనసులో ముద్రించుకు పోయి ఉన్నాయి. మీ మాటలు వేదవాక్కులలాగా నా అణువణువులో జీర్ణించుకొని పోయాయి. నా దగ్గరకు వచ్చిన మీ పెన్షన్ పేపర్స్ చూడగానే నా మనసు ఆనందంతో ఉరకలు వేసింది. ఇన్నేళ్ళకు నా కలల దేవతను చూడాలన్న తాపత్రయంతోనే ఉదయం మీ అబ్బాయికి ఇవ్వకుండా నేనే వచ్చాను."

"అమ్మా మీరు చెప్పినట్టే కష్టపడి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు చదివాను. కాంపిటీటివ్ పరీక్షలు పాసై ఇట్లా మంచి ఉద్యోగంలో స్థిరపడి పెద్దమ్మ వాళ్ళ అనుమతితో ఒక బాంక్ ఆఫీసర్‌ను పెళ్ళి చేసుకున్నాను. ఇప్పుడ నాకు అయిదేళ్ళ పాప. పాప పేరు "వేద సంహిత"  
 ****

7 comments:

  1. ఇది కథా. భలే. నిజంగానే జరిగిన కథే అనుకుంటున్నాను.మంచి అందించినందుకు ధన్యవాదాభివందనలు అక్కా..

    ReplyDelete
  2. అక్కా ! చాలా బాగుంది !!

    ReplyDelete
  3. ఆడపిల్లలకి చదువు ఆవశ్యకత ఎంత ఉందో చాలా బాగా వ్హెప్పిన కథ.. అభినందనల శారద వదినా..

    ReplyDelete
  4. vedha samhita name is very unique. story is excellent

    ReplyDelete
  5. కథ నడిపిన తీరు చాలా బావుంది శారదక్కా
    మొహంకూడ చూడని మనిషిపై మమకారం పెంచుకొన్న తీరు ఆకొట్టుకొంది.

    ReplyDelete
  6. Chala baagundi Amma ...inspiring ga undi 🙏

    ReplyDelete
  7. Chaala manchi sandesamtho chakkani kadha.Chala baagunnadhi

    ReplyDelete

Pages