వేదము వేంకటరాయశాస్త్రి (1853-1929)
"ఈ వర్థంతి సంస్మరణీయం "నవతి"కి పునాది (18 జూన్)
కొంపెల్ల శర్మ
వేదము వేంకట రాయశాస్త్రి సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త. "కవి పండితుడు – పండిత కవి".
“కవి పండితుడు కాడు. పండితుడు కవి కాడు” అని కొందఱి వాదము. కాళిదాసుడు కవికుల తిలకము. అతని పాండిత్వము భువనవిదితము. భవభూతి మహాకవి. అతడు పదవాక్య ప్రమాణజ్ఞానమున పేరుమోసిన వాడు. కవి పండుతుడు కాడనుటలో సొగసులేదు.”
అని "ఆంధ్ర రచయితలు" గ్రంథంలో, వేదం వెంకటరాయ శాస్త్రి పై పరమ ప్రమాణమైన పరిచయం ఈ కింది వాక్యాలతో శ్రీకారం చుట్టిన విధానం సర్వసమంజసం. ఈ విశ్లేషణని బట్టి - వేదం వారిని "కవి పండితుడు – పండిత కవి" అని రెండు విధాలా ప్రశంసించక తప్పదు.
వేదము వేంకటరాయ శాస్త్రిగారు మహోపాధ్యాయులు సర్వతంత్ర స్వతంత్రులు. కళా ప్రపూర్ణులు. వ్యాఖ్యానమల్లినాథులు. వీరు వ్రాసిన పద్య కావ్యములు లేకపోయినా, కాళిదాస భవభూతుల వలె వీరు రాసిన మూడు నాటకములు మూడు రత్నములు. వానిలో ప్రతాప రుద్రీయ మనర్ఘరత్నము. ఉష, బొబ్బిలి నాటకములు రమ్యములై రంగస్థలముల కెక్కికీర్తిగనినవి. ఈ నాటకములు మూడిటికిని పాత్రౌచిత్యపోషణము పెద్దవన్నె దెచ్చినది.
వేంకట రాయ శాస్త్రి తండ్రి గారు వేంకటరమణ శాస్త్రి గారు సంస్కృతాంధ్రములలో గొప్ప పండితులు. వీరు పరవస్తు చిన్నయసూరికి సహపాఠులు. తండ్రి గారు పెక్కు చోట్ల ఉద్యోగములు చేసి యుండుటచే వేంకట రాయ శాస్త్రిగారు కూడ వారితో పాటనేక మండలములలో దిరుగుట, వ్యవహార భాషాసంప్రదాయము లెఱుగుట తటస్థించినది. బాల్యముననే ప్రతాపరుద్రీయ కథ వేంకట రాయ శాస్త్రిగారి నాకర్షించినది. అది 1896 లో నాటక రూపమునకు వచ్చింది. “శాస్త్రిగారు నిరుపమానవర్ణనా సన్నివేశ సంధానధౌరేయులు. ఒక యెడ గాళిదాసుని దలపింతురు. ఒకయెడ భవభూతిని మఱపింతురు” బొబ్బిలి నాటకములు మఱికొంద ఱిటీవలి కవులు కూడ వ్రాసిరి. వానియన్నింట వేంకట రాయ శాస్త్రి గారిది రసవత్తరము” అన్న మధునాపంతుల వారి మాటలు ముత్యాల మూటలు.
"ఆముక్త మాల్యద" - వేదం వారి వ్యాఖ్యానానికి శతవసంతాల సౌరభాలు
వేంకట రాయ శాస్త్రి గారి ఖండపాండితికి దార్కాణముగా వారి అముక్తమాల్యద, శృంగార నైషధ వ్యాఖ్యలు చూప వచ్చును. ఆముక్త వ్యాఖ్య వీరు కొన్నేండ్లు చదివి నాలుగు నెలలలో - 24-6-1920 నాడు ప్రారంభించి 20-10-1920 నాటికి పూర్తి చెసినట్లు వారు తన జీవిత చరిత్రలో సుస్పష్టంగా చెప్పుకున్నారు. "ఆముక్త మాల్యద" - వేదం వారి వ్యాఖ్యానానికి శతవసంతాల సౌరభాలు గుబాళింపజేస్తున్న సార్థక సంవత్సరం సందర్భంగా - తెలుగునేలలు పున:పులకితమయ్యేలా, వేదం వారి వ్యాఖ్యానం పై పలు విమర్శనా సాహితీ ప్రవచనాలు జరగాల్సిన అవసరం చాలా అవశ్యం.
“మహోపాధ్యాయ” బిరుదుకూ వందేళ్ళు
శాస్త్రి గారు నాటక రంగమునకు బ్రశస్తి దెచ్చిన కళాహృదయులు. ఇంచుమించు ముప్పది యేండ్లు సంస్కృతాంధ్ర నాటకములు తమ శిష్యులచే బ్రదర్శింప జేసిరి. వీరి సర్వాధ్యక్షతతో నెల్లూరు 'ఆంధ్ర భాషాభిమాని సమాజము ' నడచి రజతోత్సవము జరిపించుకొన్నది. జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను బునరుద్ధరించి యెన్నో ప్రాక్తన గ్రంధములు సవ్యాక్యముగా వెలువరించి భాషా సేవ గావించిరి. వేంకట రాయ శాస్త్రిగా రాంధ్రభాషా మధుమధనులు. ఆయనను మించిన పండితులుందురుగాక, ఆయనను కాదనిపించు కవులుండిరిగాక, ఆయన వలె భారతీ పూజ గావించిన మహాభక్తుడు మాత్రము లేడు. కొన్ని శతాబ్దులు నిలుచు వాజ్మయసేవ చేసెను. అహోరాత్రము లదేపనిగా వ్రాసినవాడు వ్రాసినట్లే యుండెను. చదివినవాడు చదివినట్లే యుండెను. ఆ పరిశ్రమ, దానికిదగిన యారోగ్యము, ఆ పాండిత్యము, దానికి దగిన భావనాశక్తి మఱొకనియందు జూడము. ఆయన మాటలాడిన మధు వొలికెడిది. ప్రతిపక్షిని చల్లగా గొంతుకోయువాడు. సభలో నిలబడినచో సింహము. ఆయన రసవత్సంభాషణములు వ్రాయుచో నొక మహాకావ్యము. స్వాతంత్ర్యము నెన్నడు చంపుకొనలేదు. పని లేక యెవరిని దూలనాడలేదు. ఆ మేధ, ఆ ప్రతిభ, ఆ హాస్యవిలాసము, ఆ సమయస్ఫూర్తి యితరున కందవు. అవసరమునుబట్టి పెంకితనము జూపెను. ప్రాచీనాచారముల కతీతుడుడు. అట్లని నవీనాచారముల నాశ్రయింపను లేదు. సందర్భానుసారముగా బోయెను. భాషా విషయమునను నిదియేత్రోవ. పాత్రోచితమని వ్యావహారికము వాడెను. గ్రాంధికమును సమర్థించెను. గిడుగువారి వలెగాక వీరు నియమసాపేక్షముగా గ్రామ్యము ప్రయోగింపవలెనని యందురు. భాషా విషయికముగా గొంచె మభిప్రాయభేదమున్నను గురుజాడ అప్పారావు గారి వీరిని కడు గౌరవించిరి. వజ్ఝుల చినసీతారామ స్వామి శాస్త్రిగారును వీరి అభిప్రాయాలను సమ్మతించారు.. బహుజనపల్లి సీతారామాచార్యులవారు వీరి కాచార్యులు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారికి వీరాచార్యులు. కట్టమంచి రామలింగారెడ్డి ప్రభృతులు వీరికి శిష్యులు. అల్లాడి కృష్ణస్వామి ప్రముఖులు వీరి కాప్తులు. ఈపుంభావసరస్వతికి లక్ష్మీ ప్రసన్నత తక్కువ. శ్రీనాధుని వలె వరికాలమున జిక్కులుపడినారు. ఎంతచిక్కుపడియైనను సరస్వతిపూజ నేమఱలేదు. ఇట్టి మహానీయచరిత్రునకు 1927 లో నాంధ్రవిశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుమునిచ్చి సత్కరించుటలో విశేషములేదు. ఆనాటి నెల్లూరుమండలమున కెల్ల దిక్కనవలె గీర్తిదెచ్చిన కవిపండితుడీయన. శాస్త్రులుగారికృతులను బోషించిన రెడ్డివంశీయుల యశము శాశ్వతము. వేంకటరాయశాస్త్రిగారు 1919 లో ఆంధ్రసారస్వత సభ వారిచే
సన్మానితులై “మహోపాధ్యాయ” బిరుదుకూ వందేళ్ళ సందర్భోచిత సాహితీ మహోత్సవాలు జరుపుకోవాలి.
వేంకట రమణశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండిత పదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం మరియు సంస్కృతంలలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1916 లో సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు. వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రోత్సహించినవారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపరుద్రీయ నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.
వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగానందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నారు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898 డిసెంబరులో మద్రాసులో సమావేశమయ్యారు. ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగానే, శాస్త్రి పంథాను అనేకమంది సృజనాత్మక సాహితీకారులు అనుకరించారు. 1899 లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు.
తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తరరామచరితం (1920), విక్రమోర్వశీయం, రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) (1897), ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) వ్రాసిన నాటకాలు కాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.
జీవన పర్వ - అనుభవాలు, అనుభూతులు
·
పూండ్ల రామకృష్ణయ్య గారు శాస్త్రిగారికి వ్రాసిన జాబులో “నేనురోగినైనాడను. దూరమునడువ లేను. ఎండసోకగూడదు. ఎట్లు జీవించగలనో దిగులుగానున్నది, రాజైశ్వర్యములు వలసియున్నవి. ఆర్జననున్న...కుదురుపాటు చిక్కలేదు. చిత్త చాంచల్యము మెండుగానున్నది. ఇందుచే బక్షవాయువు వచ్చునట్లు తోచుచున్నది ఏదివచ్చినను ననుభవించక తీరదుగదా. విశేషములులేవు”
·
ఒకదినము విస్తారము వర్షముకురియుచుండెను. శాస్త్రులవారు ఒక పెట్టెలో వస్త్రాలుంచుకొని, జోరువర్షములో గొడుగున్నను, తడిసి, కళాశాలచేరి, ఆ తడసిన దుస్తునుతీసి పెట్టెనుండి వేఱు దుస్తు ధరించి తరగతికి పోయిరి. ఆదినము అనేకులు అథ్యాపకులు రాలేదు. ప్రిన్సిపాలుగారు, దొర, శాస్త్రులవారితో నిట్లనెను. "శాస్త్రిగారూ, చూచారా, ఏవిధంగావర్షంకురుస్తున్నదో ఫలానివారు రాలేదు. వారిపనికూడా తాము చూడగలరా." శాస్త్రులవారికి నాడు విస్తారము పనియుండెను. పైగా శాస్త్రులవారికే ఎక్కువపని తగులుచుండెను. అధికారులకును ఇతరాథ్యాపకుల యందు పక్షపాతముండినది. వెంటనే శాస్త్రులవారు "వర్షమే ఒకకారణంగా తాము భావించేపక్షములో నేనుకూడారాక ఇంటనే ఉందునే" అని శాస్త్రులవారు బదులుపలికిరి.”
·
వేసవికాలమున నొకదినమున తరగతిలో విద్యార్థియొకడు, శాస్త్రులవారు పాఠము చెప్పుచుండగా నిద్రబోవుచుండెను. దొర ఎచటినుండియో వచ్చి, శాస్త్రులవారి యనుమతి లేకయే వారి గది జొచ్చి, ఆవిద్యార్థిని లేపి, శాస్త్రులవారినిచూచి విద్యార్థులను తరగతిలోనే నిద్రబోనిచ్చెదవా? అని అని యడిగెను. శాస్త్రులవారికి కోపమువచ్చింది. తరగతిలో తాము పాఠము చెప్పునప్పుడు తమ యనుజ్ఞలేకయే లోన ప్రవేశించుట మర్యాదగాదు. వెంటనే వారు నేను నాధర్మమును నెఱవేర్చుచున్నాను అని బదులిచ్చిరి. ఈదెబ్బకు ఏమి బదులుచెప్పుటకును తోచక దొర వెడలి పోయెను.
·
“నేను రిక్తుడను రుగ్ణుడను, నిరాయతిని బహుకుటుంబిని, ఉక్తకారణములచేత బహువ్యయుండనుంగాన, ఆముక్తమాల్యద ముద్రణమునకు తక్కువపడిన ధనమును వ్యయించుటకు స్వశక్తి లేకయు నుంటిని. దానినెఱింగి గ్రంథము తప్పక ముద్రిత మగుగాకయని నెల్లూరుజిల్లా కావలి తాలుకా ఇందువూరు గ్రామ్యవాస్తవ్యులు, భూస్వాములు శ్రీయుతులు ఎఱబ్రోలు రామచంద్రారెడ్డిగారు ....... నాకు ఏతద్గ్రంథ ముద్రణపూర్తికై అప్పుడప్పుడు పరిమితిం జెందువఱకు విరాళమొసంగిరి.' అని పలవరిస్తూ, పరవశించారు. ఈవిధముగా ఆముక్తమాల్యద గ్రంథము 1927 జూలై నెలలో వెలువడినది. 'చేసెదనింకదత్పరత సేవలు చూడికుడుత్త దేవికిన్' అని 1913 కావించిన ప్రతిజ్ఞను ఇన్నాళ్ళకు చెల్లించుకొని 'చేసితినిప్డు తత్పరత సేవలు చూడికుడుత్తదేవికిన్' అని ముద్రించారు. ఆముక్తమాల్యద ముద్రితమై వెలువడినప్పుడు వారిహర్షమునకు మేరలేదు.
సత్కార, గౌరవ, సన్మాన, బహుమతీ పర్వాలు పలు విధాలు.
·
ఆంధ్ర మహా సభ చేత 'మహోపాధ్యాయ' (1920); ద్వారక పీఠ శంకరభగవత్పాదులచేత 'సర్వతంత్ర స్వతంత్ర', 'మహామహోపాధ్యాయ' మరియు 'విద్యాదానవ్రత మహోదధి' సత్కారాలు (1922);
·
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత తొట్టతొలి
'కళా ప్రపూర్ణ' సన్మాన గౌరవం (1927)
·
కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచోడుని కవిత్వంపై - 'నన్నెచోడుని కవిత్వము' విమర్శనా గ్రంథానికి 'ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి' బహుమతి (1958).
రచనలు
నాగానందము (1891); శాకుంతలము (1896); ప్రతాపరుద్రీయం (1897); ఆంధ్ర ప్రసన్నరాఘవవిమర్శనము (1898); స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాపణము (1899); గ్రామ్య భాషా ప్రయోగ నిబంధనము (1899); విక్రమోర్వశీయము (1901); మేఘసందేశ వ్యాఖ్య (1901); ఉషా పరిణయము (1901); ప్రియదర్శిక (1910); విసంధి వివేకము (1912); శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య (1913); బొబ్బిలి యుద్ధము (1916); మాళవికాగ్నివిత్రము (1919); తిక్కన సోమయాజి విజయము (1919); ఉత్తర రామచరిత్ర (1920); విమర్శ వినోదము (1920); ఆంధ్ర హితోపదేశ చంపువు; ఆంధ్ర సాహిత్య దర్పణము; ఆముక్తమాల్యదా సంజీవినీ వ్యాఖ్య (1921); రత్నావళి (1921); అమరుకావ్యము; (ఆంధ్రవ్యాఖ్య) (1950); ఆంధ్ర దశకుమార చరిత్రము (దండి రాసిన సంస్కృత మూలానికి ఆంధ్రగద్యానువాదం)
నోట వచ్చిన చరమ పదం - పరమ పదం
చరమకాలదశ ని ఆయనే స్వయంగా విశ్లేషించుకుంటూ, “ప్రతిదినమును ప్రొద్దున నొకటి రెండుగంటలు శరీరముపై స్పృహయుండెడిది. తర్వాత జ్వరము వచ్చెడిది. ఒడలు తెలియనిస్థితి. గంజి ఆహారము. ఉపనయనానంతరము నేను చెంతకుపోయితిని” అనుకున్న వీరిని
ఒకనాడు 'మీకు, ఒంట్లో ఎట్లున్నదండీ?' అని అడిగితే 'పరమ పదం, పరమపదం' అని మాత్రము చాలకష్టముతో చెప్ప గలిగినా, అప్పటికే భౌతిక చైతన్యం చాలా సన్నగిల్లింది.
1929 జూన్ 18 మంగళవారము ప్రత్యూషకాలంలో 5-45 గంటలకు పరమపదించిరి.
'మహోపాధ్యాయ' బిరును స్వీకరించిన సందర్భంలో - తమ వాగ్దేవతాపూజా విధానాన్ని ఆయనే స్వయంగా యిలా ప్రస్తావించుకున్నారు. ఉషా నాటకమున వీరు జీవిత విషయ మిట్లు చెప్పించి కొనినారు.
చాత్ర సహస్త్ర ప్రచారంబుగా నాట
కములు దన్నిగమంబు గఱపినారు
సర్వజ్ఞసింగమ సార్వ భౌముని గద్దె
యెక్కినదొర మది కెక్కినారు
హూణరూపకరసంబుదరంబు నిండార
ద్రావి గుఱ్ఱున ద్రేచి తనిసినారు
టాటోటు గవులు పటాపంచలై మాయ
గాంచిక వాణి కర్పించి నారు
బల్లారిభ కవి పండిత సంఘంబు
మదరాసులో రూపు మాపినారు
కాళిదాసు శకుంతల నేలినారు
మించిన ప్రతాపకృతిని నిర్మించినారు
తగదోకో శాస్త్రిగారి గ్రంధమును గోర
మహిత వస్తు పరాయణ మానసులకు.”
వేదం వేంకటరాయ శాస్త్రిగారి ప్రతిభాపాండిత్యపాటవాలని - నాటినుంచీ నేటివరకూ - ఉభయభాషా జగతి నిత్యం ప్రశంసిస్తూనే ఉంది; పలవరింతల పరవశాలు పొందుతూనే ఉంది.
వేదము వేంకటరాయశాస్త్రి (1853-1929) గారి " వర్తమాన వర్థంతి (18 జూన్) సంస్మరణీయం - "నవతి" వసంతానికి పునాది.
No comments:
Post a Comment