వృద్ధుల వేదన - అచ్చంగా తెలుగు
వృద్ధుల వేదన
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.

ఇది వయోభారంతో వేదింపబడుతున్నమావృద్ధుల వేదన, 
రక్తసంబంధీకులతో విసుగుచెందిన మా ఆత్మనివేదన. 
కొడిగట్టిన ఈ దీపమెప్పుడు ఆరిపోతుందో తెలియదు,
తడబడుతున్నఈ తనువెప్పుడు మట్టిలో చేరిపోతుందో అర్ధంకాదు.
దినదినానికీ చూపు మసకబారుతోంది,
కణకణంలోని శక్తి సన్నగిల్లుతోంది.
ఎదుటివారి ఆదరణ కరువౌతోంది,
గడుస్తున్నక్షణమొక యుగమౌతోంది.
నిర్లక్ష్యం,అలక్ష్యం అలుముకుంటున్నాయి.
పలకరింపులు,పులకరింపులూ మౌనాన్ని పులుముకుంటున్నాయి.
మాకు తినాలనే కోరికఉన్నా పెట్టేవారు లేరు,
మాకూ వినాలనే ఆతృతఉన్నా మాట్లాడేవారు లేరు,
ఏదైనా చెప్పాలనే తాపత్రయం ఎదలోఉన్నా వినేవారు లేరు.
గతం బాధిస్తోంది,వర్తమానం వేధిస్తోంది.
జీవితం సాధిస్తోంది,ప్రతిక్షణం శోధిస్తోంది
ఆత్మీయులనుకున్నవారిలో కొందరు 
అర్ధాంతరంగా అంతర్ధానమయ్యారు.
చెలిమితో చేరువైన వారెందరో చెప్పకుండానే పోయారు.
మావనుకున్నవెన్నో మమ్మల్నివీడి వెళ్ళిపోయాయి,
ఒంటరితనం మాత్రం మాజంటగా చేరిపోయింది,
గుండెల్లో మాయనిమంటలా మారిపోయింది.
మాచుట్టూ ఉన్నవాళ్ళు,మమ్మల్నిచూస్తున్నవాళ్లకు
మేము కనిపించము,మా మాటలు వినిపించవు,
వాళ్ల లోకం వాళ్ళది,మా లోకం వాళ్లకి నచ్చదు.
మమ్మల్ని చూస్తే వాళ్లకు రోత,
కానీ అదే మాకు చెప్పలేని గుండె కోత.
ఒకప్పుడు బాగానే బ్రతికిన మేము 
ఇప్పుడిలా బాధ పడుతున్నాము.
అప్పుడు లోకాన్నిఏలిన మేము 
ఇప్పుడిలా శోకానికి లోనౌతున్నాము.
వాళ్ళ నిర్లక్ష్యం మా మనసును బాధిస్తోంది,
ఐనా వాళ్లని దీవించాలనే అనిపిస్తోంది,
వాళ్ళ అలక్ష్యం మాకు తత్వాన్ని బోధిస్తోంది.
ఐనా వాళ్ళ మధ్యన జీవించాలనే అనిపిస్తోంది.
***
    

No comments:

Post a Comment

Pages