ఈ దారి మనసైనది -8
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: మెడికల్ కాలేజీలో కొత్తగా చేరిన అనురాగ్ తొలి చూపులోనే దీక్షిత కళ్ళలో తనను తాను కోల్పోతాడు. ఆమెకు చేరువ కావాలని ఆరాట పడుతూ ఉంటాడు. అదే కాలేజీలో చేరుతుంది మన్విత. చూస్తుండగానే మెడిసిన్ మొదటి ఏడాది పూర్తవుతుంది. అనురాగ్ అంటే తనకున్న ఇష్టాన్ని, బయట పడనివ్వకుండా చదువు మీదే దృష్టి పెడుతుంది దీక్షిత, అందుకు కారణం ఆమె చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి చదివి మెడికల్ కాలేజి దాకా రావడమే. అతి కష్టం మీద మెడిసిన్ లో సీటు సంపాదించి. పట్టుదలగా చదువుతూ ఉంటుంది ఆమె. దీక్షిత, అనురాగ్ కాలేజిలో కలిసి లాబ్ కు వెళ్తారు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన్విత. మన్విత, అనురాగ్ లు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటారు. అనురాగ్ తల్లి ప్రియబాంధవి మన్విత పట్ల ప్రత్యేక వాత్సల్యం చూపిస్తూ ఉంటుంది. ఇక చదవండి. )
ఇంటర్ పూర్తయ్యాక కోచింగ్ టైంలో కూడా వాళ్లిద్దరి చదువు విషయంలో ప్రియబాంధవి స్పెషల్ కేర్ తీసుకుంది.
ఆయా సబ్జక్టుల ప్రిపరేషన్ కి ప్రతి రోజు క్రమం తప్పకుండాఒక్కొక్కసబ్జక్టుకు రెండు గంటలు కేటాయించి చదివించింది.
పరీక్ష సమీపిస్తున్నకొద్ది సిలబస్ ఒక క్రమ పద్ధతిలో విభజించి, రివిజన్ చేయించింది. టైం తక్కువగా వున్నప్పడు ఎట్టి పరిస్థితిలో తెలియని కొత్త అంశాలను చదవకూడదని చెప్పింది. థీయరి బిట్స్ చదివితే స్కోరింగ్ కే కాక సమయాన్ని కూడా ఆదా చేస్తాయని చెప్పింది.
" ముఖ్యంగా ఎంసెట్ కొశ్చన్ పేపర్లో చాయిస్వుండదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఏ మాత్రం సమయం వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలిసిన ప్రశ్నలన్నిటికి సమాధానాలు గుర్తించిన తర్వాతనే తెలియని వాటి విషయం ఆలోచించాలి. ముందుగా బయోలజీ, తర్వాత కెమిస్ట్రీ, ఆఖరుకు ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మంచిది. సమాధానాలను ఖచ్చితంగా గుర్తించాలి. త్వరగా గుర్తించాలి. ముందుగా థీయరీ బిట్లు, తేలిక ప్రశ్నలు పూర్తి చేసి ఆ తర్వాత కష్టమనిపించిన సుదీర్ఘమైన ప్రశ్నల విషయం చూడాలి. సమయాన్ని వృధా చేసుకోవద్దు ప్రతి ప్రశ్నకూ ఒక కీవర్డ్వుంటుంది. ఆ పదాన్ని సున్నితంగా గుర్తించాలి " అంటూఎగ్హామ్కివెళ్లేముందు వాళ్లను బాగా ప్రిపేర్ చేసి అన్ని మెలుకువలు చెప్పి పంపింది ప్రియబాంధవి.
అనురాగ్, మన్విత ఎంసెట్ ఎగ్హామ్ బాగా రాశారు.
ఇద్దరి శరంఫలించింది.....
మెడిసిన్లో సీటొచ్చింది....హ్యాపి.... హ్యపి....
******
మెడిసిన్ ఫస్టియర్లో ... వుండగా ....
మంచు తెరలు మెల్ల మెల్లగా విచ్చుకుంటున్న వేళ.
బాల భానుడు మబ్బుల మాటునుండి నులి వెచ్చని తొలి కిరణాలు ప్రసరిస్తున్న వేళ....
లోకమంతా నిద్రలేచింది....
మేడారంలో ఉత్సాహం పెల్లుబికింది.
లక్షల మంది ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.
దట్టమైన కీకారణ్యం .... కొండకోనల్లో కొలువు తీరిన సమ్మక్క - సారలమ్మ తల్లలను ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధపౌర్ణమి రోజుల్లో... పండుగలా జరుపుకునే సమ క్క జాతర అది.
ఆ జాతరకి సోమన్న తన భార్య పిల్లలతో ఎడ్లబండిలో మేడారం చేరుకున్నాడు. ఆయన ప్రతిసారి తన కుటుంబ సభ్యులతో మేడారం వస్తుంటాడు. ఈసారి కూడా అలాగే వచ్చాడు. తన కూతురికి మెడిసిన్లో సీటు రావటానికి ఆ తల్లే కారణమని అయన నమ్మకం.
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన గిరిజన ఇలవేల్పులు సమ్మక్క-సారలమ్మలు కొలువు దీరిన మేడారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం అనే చిన్న కుగ్రామానికి శివారు పల్లె జాతర జరిగే ఈ సమయంలో మాత్రం అది ఒక మహానగరం. ముచ్చటగా ఈ మూడు రోజులు మహోత్సవమే.
దేశంలోనే మహాకుంభమేళా తరువాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యేది ఈ మేడారం జాతరకే. ఈజాతరకి సుమారు ఎనబై లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా.
మహానగరాల్లా అక్కడ మేడలు, మిద్దెలు ఉండవు. అడుగు కూడా ఖాళీ లేకుండా అంతకంటే కిక్కిరిసి వేనవేల గుడారాలతో, రకరకాల విద్యుత్తు కాంతులతోసర్వాలంకారమైదేదిష్యమానంగా శోభిల్లుతుంది. ఒకప్పడుఆదివాసీలకే పరిమితమైన ఈ జాతర ఇప్పడు అన్ని వర్గాలవారిని ఆకర్షిస్తోంది.
చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే మహోజ్వల ఘట్టం ఆరంభమైన క్షణం దగ్గర పడగానే అడవి తల్లి పులకరించింది. నేల ఈనిందా. నింగి పొంగిందా అన్నట్లు ఎక్కడ చూసినా జనసందోహమే, చిలకల గుట్టలో సమ్మక్క బయలుదేరగానేభక్తుల చేతుల్లో వున్న పసుపు గాలిలో లేచి పచ్చని చెట్లు పసుపు వర్ణంలోకి మారాయి.
శివసత్తులు కేకలు ఒక్కసారిగా మిన్ను ముట్టాయి. ఎస్పీ 47 గన్తో గాలిలోకి కాల్పులు జరపగా అధికార యంత్రాంగం నడుమ భారీ బందోబస్తుతో ఆ తల్లి కుంకుమ భరిణి రూపంలో వచ్చి గద్దె చేరుకుంది.
రోడ్లన్నీ జన ప్రవాహంగా మారిపోయాయి. దాదాపు నాలుగైదుకి.మీ పొడవునా ఆధునికీకరించిన పన్నెండు రోడ్లు మొత్తం జనసమ్మర్ధంతో నిండిపోయాయి.
గిరిజనులు తమ సాంప్రదాయ నృవిత్యరీతుల్లో డప్పులు, బూరలు, రకరకాల వేష ధారణలతో గుంపులు, గుంపులుగా తల్లి దగ్గరికి వెళ్తున్నారు. జనంలో ఎక్కడ తప్పిపోతామోననిఒక్కోగుంపుపొడువాటివెదురుబొంగులతో ఆనవాలుగా గుడ్డలు, జెండాలు పట్టుకొని సమ్మక్క నామంతో ముందుకు సాగుతున్నారు. గిరిజనేతరులు మాత్రం అమ్మ వార్లను దర్శనం చేసుకొని వెళ్లి పోతున్నారు.
వరంగల్ ఏటూరునాగారం జాతీయరహదారిపైలెక్కలేనన్ని వాహనాలు పరుగులు తీస్తున్నాయి. గిరిజనులు బారులుతీరినఎడ్ల బండ్లపై అక్కడికి చేరుకుంటూనే వున్నారు.
గతంలో లాగ ఎక్కడా వాహనాల రాకపోకలకి అంతరాయం కలగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రియబాంధవి తన భర్తతో అనురాగ్తో క్వాలిస్ లో బయలుదేరి జాతరకి వచ్చింది. వాళ్లతో మన్వితను కూడా రమ్మంటే వచ్చింది. మన్విత జాతరకి రావటం ఇదే మొదటిసారి.
వాహనాలలో వచ్చిన వాళ్లు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే
తమ వాహనాలను ఆపుకొని నడుచుకుంటూ వస్తున్నారు.
జంపన్న వాగు దగ్గర స్నానాదికాలుముగ్గించుకొని వెళ్లే వారు వెళ్తుంటే వచ్చే వారు వస్తున్నారు. ఆ వాగులో నాలుగు కిలోమీటర్ల దూరం వరకు భక్తుల రద్దీ విస్తరించింది. లక్షలాది మంది భక్తులు స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులుతమకు సంతాన ప్రాప్తి కలగాలని, అనుకున్న కోరికలు తీరాలని, పంటలు బాగా పండి క్షేమంగా వుండాలని ఆ తల్లిని వేడుకుంటున్నారు. అక్కడ చెట్లు ముడుపులతో మునిగిపోయాయి.
శివ సత్తుల పూనకాలతో, మేళ తాళాలు, డప్పుల చప్పుళ్లతో భక్తుల నృత్యాలతో, మినుముట్టే నినాదాలు, మనసులను కదిలించే పగడిద్దరాజు, సమ్మక్క- సారలమ్మ జంపన్నలవీరగాధలు వినిపించే ఒగ్గు కథలు, గిరిజనేతర దేవతలను ఆరాధించే గిరిజన పూజారుల మంత్రోత్సరణతో, డోలిచప్పుళ్ళతో హోరెత్తి పోతున్న ఆ జాతర అనురాగ్ని, మన్వితను ఆనందోత్సాహాలతో ముంచెత్తి వేస్తోంది.
జంపన్న వాగు ఒడ్డున వున్న షవరు భక్తుల శరీరాలను తడుపు తున్నాయి...ఎక్కడ చూసినా జనం ... జనం ....
No comments:
Post a Comment