ఆద్య
వై.ఎస్.ఆర్.లక్ష్మి
ఉదయమే చాలాసేపుట్నించీ ఫోన్ మోగుతుండటం తో అరుణ "ఈ మనిషి అక్కడే ఉన్నాఫోన్ తియ్యరు.పేపర్ లో అంత చేటు రాజకీయాలు ఏముంటాయో పేపర్ చదువుతుంటే పక్కన పిడుగు పడినా పట్టించుకోరు"అంకుంటూ వంటింట్లోనుంచీ చేతులు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది.అవతల వాళ్ళ అమ్మాయి లలిత.
"అమ్మా!నీ మనమరాలు అసలు చెప్పిన మాట వినడం లేదు.తెగ విసిగించేస్తోంది.నీవన్నా చెప్పు దానికి."అంది.
"అంతా విడ్డూరం కాకపోతే నా మనమరాలు ఏమిటి .నీకూతురు కాదా.నాలుగేళ్ళు నా దగ్గర పెరిగినంత మాత్రాన నా మనమరాలు అయిపోతుందా!అసలు ఏమి జరిగిందో చెప్పకుండా మాట వినడం లేదంటే ఎలా?అది అంత అల్లరి చెయ్యదు నిదానం గా చెబితే మాట వినకపోవడమూ లేదు."
"ఏమో? నీ దగ్గర ఎలా ఉండేదో.అది వరకు బాగానే ఉండేది.అది నా కంటే గంట ముందు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది.నేను వచ్చే వరకు ఎదురింటి ఆంటీ వాళ్ళింట్లో ఉంటుంది నీకు తెలుసు కదా!ఇప్పుడు ఏమైందో నేను ఉండను నీతో వస్తాను అంటుంది.ఎందుకే అంటే చెప్పదు.అమ్మమ్మ,తాతగారు ఏమన్న అన్నారా అంటే మాట్లాడదు.లేదంటే ఒక్కటే ఇంట్లో ఉంటాను అంటుంది.అదింకా చిన్నది .తాళం దానికి ఇచ్చి వెళ్ళలేము కదా!నువ్వు వచ్చి దానికి నచ్చ చెప్పు"అని ఫోన్ పెట్టేసింది లలిత.
ఫోన్ పెట్టగానే రామారావు పేపర్ పక్కకు తీసి "ఏమిటి విషయం "అని అడిగారు.అరుణ అంతాచెప్పగానే "ఓహో అలాగా"అంటూ మళ్ళీ పేపర్ లో తల దూర్చారు.
"ఈయనకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒక్కటే!ఏమీ పట్టించుకోరు.నా తిప్పలు నేను పడాల్సిందే"అనుకున్నది అరుణ.
అరుణ రామారావు దంపతులకు ఒక కొడుకు,ఒక కూతురు.కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు.కూతురు బి యిడి చదివి గవర్నమెంటు స్కూలులో టీచరుగా చేస్తుంది.అల్లుడు ఒకప్రైవేటు కంపినీలో చేస్తూ విజయవాడలో ఉంటాఆరు.ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం తో మనమరాలు ఆద్య మొన్నటిదాకా అమ్మమ్మ గారింట్లో పెరిగింది.కార్పోరేట్ స్కూల్ లో సీట్ వచ్చిందని అల్లుడు ఫీజ్ ఎక్కువని గొణుగుతున్నా కూతురు ప్రెస్టేజ్ కోసం అందరూ చదువుతున్నారని జాయిన్ చేసింది.లలిత విజయవాడ దగ్గరలోని పల్లెటూళ్ళో చేస్తుంది.ఉదయం 8.30 కి వెళ్ళి సాయంకాలం వచేటప్పటికి 6.00 అవుతుంది.వీళ్ళ ఎదురు ప్లాట్ లో నాగభూషణం దంపతులు ఉంటారు.వారి పిల్లలు ఉద్యోగరీత్యా వేరేవేరే ప్రదేశాలలో ఉంటారు.వీళ్ళతో చనువుగా ఉంటారు.ఆద్య లలిత వచ్చే వరకు వాళ్ళింట్లో ఉండేది.ఉన్నట్లుండి ఇప్పుడు ఈ ఫోన్.ఆ రోజంతా అన్యమనస్కంగానే గడిపి మరునాడు శని ఆదివారాలు కలసి వచాయి లలిత ఆద్య రెండు రోజులు ఇంట్లోనే ఉంటారు నిదానం గా అన్నీ తెలుసుకోవచ్చని భర్తకి ఇబ్బంది రాకుండా అన్నీ అమర్చి తెల్లవారుఝాము బస్ కే విజయవాడ బయలుదేరింది అరుణ.
ఆమె గుమ్మం లో అడుగు పెడుతూనే అమ్మమ్మా"అంటూ సంతోషం గా ఎదురువచ్చిన ఆద్యను దగ్గరకు తీసుకుంది అరుణ."అమ్మా,నాన్నా ఏరమ్మా?" అని అడిగింది.
"నాన్న ఆఫీస్ కు వెళ్ళారు.అమ్మ వంటింట్లో పని చేసుకుంటోంది.నాకు బోర్ కొడుతోంది అంటే టి.వి లో కార్టూన్ ఫిల్మ్ చూడమంది అమ్మ"అంది ఆద్య.మనమరాలు చెప్పింది విని అయిదేళ్ళ పిల్లకి బోర్ కొట్టడం ఏమిటో అనుకుంటూ "లలితా"అని పిలుస్తూ వంటింట్లోకి నడిచింది అరుణ.
"వచ్చావా!" అంటూ వెనక్కి తిరిగింది లలిత.
"అమ్మమ్మా నేను చెప్పేది విను" అంటూ తల్లి చెయ్యి పట్టుకుని లాగుతున్న ఆద్యని చూడగానే "అమ్మమ్మ ఇప్పుడేగా వచ్చింది.వచ్చీ రాగానే నీ గోలేనా!అమ్మమ్మ రెండు రోజులు ఉంటుందిలే.అప్పుడు చెబుదువుగాని నీ సోది.వెళ్ళు టి.వి చూసుకో"అని కసిరింది లలిత.
బిత్తరపోయిన ఆద్య అరుణ చెయ్యి నెమ్మదిగా వదిలి హాల్ లోకి వెళ్ళింది.
"అది ఇప్పుడు ఏమన్నదని అలా విసుక్కుంటావు."అంది అరుణ
"నీకు తెలియదమ్మా!నువ్వూరుకో.ఎప్పుడూ ఏదోఒకటి చెబుతూనే వుంటుంది.ఇప్పటి నుంచి కంట్రోల్ లో పెట్టకపోతే మాట వినదు"
'అది ఎంత?దాని వయసెంత?మాట వినకపోవడానికి.పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లా అంతలా అరవాలా"
"నీకలాగే అనిపిస్తుంది.అది ఎంత విసిగిస్తోందో నీకేం తెలుసు?అది వదిలేయి.నేను చెప్పిన విషయం నీ ముద్దుల మనుమరాలిని అడిగి తెలుసుకో!"
"అలాగేలేవే!అందుకేగా ఇప్పుడు వచ్చింది."అంటూ బాత్రూం కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేసి వచ్చి ఆద్య పక్కన కాసేపు నడుము వాల్చింది.
సాయంకాలం ఐదు అవ్వగానే ఆద్యను తీసుకొని దగ్గరలోని పార్కుకు వెళ్ళింది అరుణ.అక్కడ పీల్లలతో కాసేపు ఆడుకొని "ఇంక వెళదామా అమ్మమ్మా "అంటూ అరుణ పక్కన బెంచీ మీద కూర్చుంది.
"వెళదాములే!ఇక్కడ ప్రశాంతం గా ఉంది కాసేపు కూర్చుని వెళదాము.ఈలోపు మీ కొత్త స్కూలు కబుర్లు చెప్పు."అంటూ మెల్లగా ఆద్యను ఒళ్ళోకి తీసుకుంది.
"స్కూలు ఎలా ఉన్నది"అని మళ్ళీ అడిగింది.
"స్కూలు బాగానే ఉంటుంది.కాని ఇంగ్లీషు లో మాట్లాడకపోతే పనిష్ చేస్తారు.లంచ్ టైము లో కూడా మాట్లాడ కూడదు.ఆఖరికి ఏడుపు వచ్చినా మమ్మి అనే ఏడవాలి కానీ అమ్మా అనకూడదు.ఒకవేళ తెలుగు లో మాట్లాడితే ఎవరో ఒకరు క్లాసు టీచరుకు కంప్లైంట్ చేస్తారు ఆమె పనిష్ చేస్తారు.మొదట్లో వచేది కాదు కాని ఇప్పుడు బాగానే వస్తోంది."
"అలాగా! స్కూలు బాగానే అలవాటు అయ్యింది అన్నమాట.మరి ఇంటికి వచ్చినాక ఆడుకోవడానికి పిల్లలు ఉన్నారా?వాళ్ళతో ఆడుకుంటావా?"ఇల్లు మాట ఎత్తగానే ఏమి గుర్తువచ్చిందో ముఖం అదోలాగా పెట్టి కిందకు దించుకుంది.
ఒకక్షణం ఆగి "మరి అమ్మ కంటే ముందు వస్తావుగా ఎక్కడ ఉంటావు?"
'తాతగారింట్లో .కాని నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు.'
"ఎందుకని?వాళ్ళు విసుక్కుంటారా/"కాదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది.
"మరి ఎందుకని?నాతో చెప్పు.ఎవరికీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?తాతగారు ఏమన్నా అంటారా?"ఆయనపేరు ఎత్తగానే ఆ పిల్ల కళ్ళు భయం తో పెద్దవయ్యాయి."నీకేమీ భయం లేదు నాతో చెప్పు"అని బుజ్జగించి అడిగింది.
"మరేమో తాతగారు ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు.కానీ నీ ఒళ్ళో కూర్చున్నట్లుగా ఉండదు.వద్దన్నా ఇక్కడా ఇక్కడా గట్టిగా ముద్దులు పెడతారు"అని బుగ్గలు,పెదాలు చూపించింది.అప్పుడే ఆ సంఘటన జరిగినంత అసహ్యంగా గట్టిగా తుడుచుకుంది.అరవైఐదు యేళ్ళ ముసలాడికి ఇదేం పోయే కాలం అనుకుంటూ "ఇంకేమి చేస్తాడు?" అని మరల అడిగింది.
అమ్మమ్మ అలా గుచ్చిగుచ్చి అడుగుతుంటే తన మాట వినే వారు ఒకరు ఉన్నారన్న ధైర్యం తో "ఇంకానా...ఇక్కడ చేతులు పెట్టి గట్టిగా నొక్కుతారు.నాకేమో నొప్పి వస్తుంది" అంటూ రెండు కాళ్ళ మధ్య చూపించింది."నేను నెట్టేసినా బలవంతంగా లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు.
"అమ్మమ్మ అక్కడ ఉండరా?ఏమీ అనరా?"
"అమ్మమ్మ టీ.వి చూస్తూ ఉంటారు.ఇంకా తాతగారు ముద్దుపెట్టుకున్నంత మాత్రానా నీ బంగారం ఏమీ కరిగిపోదులే అంటారు."అన్నది.
"అమ్మకు చెప్పలేదా?ఈ సంగతి."
'అమ్మ నేను ఏమి చెప్పినా వినిపించుకోదు.ఇంకా విసుక్కుంటుంది.తాతగారింట్లో ఉండనంటే మొన్న కొట్టింది కూడా.నేను ఎవరికి చెప్పను అమ్మమ్మా అంటూ అరుణ ఒడిలో తలపెట్టుకొని ఏడిచింది ఆద్య.ఆమెను ఎలా ఓదార్చాలో కారణం తెలుసుకోకుండా మూర్ఖం గా ప్రవర్తించిన కూతురికి ఏమి చెప్పాలో ఆలోచిస్తూ ఆద్య తల నిమురుతూ నిశ్శబ్దంగా ఉండిపోయింది అరుణ.ఆద్య ఏడుపు తగ్గినాక నిదానంగా ఇంటికి బయలుదేరారు.
ఇంట్లో అడుగు పెడుతూనే 'ఏమి రాజకీయాలు వెలగబెట్టారు.ఇప్పుడుదాకా ఉన్నారు?"
"ఏదో ఒకటి వాగటమే గాని వెనకాముందు ఆలోచన ఉండదు.ముందు దానికీఅకలి అవుతోంది అన్నం పెట్టు పెందలకాడ పడుకుంటుంది."
'మనమరాలి మీద ఈగ వాలనివ్వవు కదా"అంటూ వెళ్లి ఆద్యకు అన్నం పెట్టింది.అలసిపోయిందేమో వెంటనే నిద్రపోయింది ఆద్య.పెద్దవాళ్ళు కూడా భోంచేసి హాలులో కూర్చున్నారు.రవి కూడా నిద్ర వస్తోందని బెడ్రూము లోకి వెళ్ళాడు.సావకాశం దొరకడం తో "ఇప్పుడు చెప్పు.ఏమంటోంది నీ మనుమరాలు?ఎందుకు ఉండదంట?స్కూలుకన్నా వెళుతుందా? నీతో వస్తానందా?"అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
"నోరుముయ్యవే.నీకు నోటి తొందరేగాని.ఎమి జరిగిందో తెలుసుకోవాలనే ఆలోచన లేదు."
"నువ్వు చెప్పు వింటాను."అరుణ చెప్పిన విషయం విన్న లలిత నిర్ఘాంత పోయింది."నమ్మలేకపోతున్నాను.ఆయన నాన్న కంటే పెద్దవారు.అమ్మాయ్ అమ్మాయ్ అంటుంటే ఆత్మీఈయులు దొరికారని ఎంతో మురిసిపోయాను.నాకుతురు కంటే పెద్ద మనమరాళ్ళు ఉన్నారు.ఈ వయసులో ఇదేమి పాడు బిద్ది.ఆంటీ అన్నా చెప్పవచ్చు కదా!ఊహించడానికే అసహ్యం వేస్తోంది పొద్దునే వాళ్ళను కడిగి పారేస్తాను."
"ఆపు ఇక.నువ్వు అడిగితే వాళ్ళు ఒప్పేసుకుంటారా?చిన్న పిల్ల అని ముద్దు చేసాను అంటారు.నీ కూతుర్ని పిలిచి సాక్ష్యం అడుగుతారు.ఇప్పుడు మనిద్దరికే తెలుసు.అప్పుడు పదిమందికీ తెలుస్తుంది.దాని మనసు గాయపడుతుంది. పెడబుద్దులకు,పశువాంచలకు వయసుతో పనిఏముంది.ఇలాంటి గోముఖవ్యాఘ్రాలు మన చుట్టూ చాలానే ఉంటాయి.అడవి లోని క్రూర మృగాలను గుర్తుపట్టవచ్చు.కాని మనచుట్టూ తిరిగే వీరిని వాళ్ళ స్వభావం బయటపడేదాకా గుర్తుపట్టలేము.మన జాగ్రత్తలో మనం ఉండాలి.అందుకే ఆడపిల్లలు వాళ్ళరక్షణ వాళ్ళు చూసుకునే వరకు తల్లిదండ్రులే రక్షణ కవచంలా ఉండాలి.లేదంటే పొంచి ఉన్న తోడేళ్ళు ఏక్షణమైనా కబళించడానికి సిధంగా ఉంటాయి.ఇక ఆవిడకు ఇదంతా గ్రహించే తెలివి లేదు.సీరియళ్ళలో జరిగేదుర్ఘటనలను చూసి అయ్యో పాపం అనుకుంటారు కాని తమచుట్టూ కూడా అలాంటివి జరుగుతాయనుకోరు.అసలు భర్త గురించి తప్పు అనుకోలేని సగటు గృహిణి".
"నాతో చెప్పవచుగా అది"
"నీ తోనా.నేను వచ్చిన దగ్గర్నించీ చూస్తున్నాను నువ్వు దానితో ప్రేమగా మాట్లాడీంది ఎప్పుడు?పిల్లలతో పాటు మీరు కూడా ఉన్న కాస్త సమయం టి.విలు ఐ పాడ్ లతో గడుపుతారు కుతుంబమంతా ఒక దగ్గర కూర్చుని సరదాగా గదిపే సందర్భాలేవి?పిల్లలు కోరిందల్లా కొనివ్వడమే వారి మీద ప్రేమకు తార్కాణమనుకుంటారు.వారితో కలిసి కబుర్లు చెప్పడం కలసి ఆడటం చేస్తే అనుబంధలు ప్రేమలు చనువు పెరుగుతుంది.వాళ్ళు స్వేచ్చగా మనసులో మాట చెప్పుకుంటారు.మీరే కాదు.ఇప్పటి తరమే అలా ఉంటోంది.వివేకం,విచక్షణ మీకే గ్రహింపు లేదు.పిల్లలఖేమి చేబుతారు."
"ఇప్పుడేమి చెయ్యాలి?"అని బేలగా అడీగింది.
"నువ్వు ఉద్యోగం మానేసి చూసుకోవడమో!లేదా కార్పోరేట్ మోజు మానేసి దాన్ని మీ స్కూలులో జాయిన్ చేసి నువ్వు పనిచేసే చోట ఉండి రవి రోజూ వచ్చి వెళ్ళే టట్లు చూసుకోవడమో చేయండి.ఇద్దారూ దాని భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని చేయండి.అక్కడ నాన్నకు ఇబ్బనది నేనురేపు ఉదయమే వెళతాను."అని అరుణ చెప్పింది.
"సరేలే.చాలా ఆలస్యమైంది పడుకో"అంటూ తాను పడుకో వడానికి వెళ్ళింది లలిత.గుండెల బరువు దిగిన అరుణ కూడ ఆద్య పక్కన నిశ్చింతగా నిద్రపోయింది.
లలిత తాను పనిచేసే ఊరిలోనే కాపురం పెట్టింది.ఆద్య తల్లి సాన్నిహిత్యం తో సరత్కాల చంద్రునిలా ప్రకాశంగా ఉన్నది.
***
No comments:
Post a Comment