మట్టి పొరల్లోంచి - పుస్తక సమీక్ష
భావరాజు పద్మిని
మట్టి పొరల్లోంచి అన్ని జీవులకు ప్రాణాధారమైన అంకురం మొలకెత్తినట్లే, మనసు పొరల్లోంచి వచ్చిన ఆలోచనల నుంచి అజరామరమైన భావకవిత్వం జనిస్తుంది.
సాహిత్యమంటే సమాజానికి హితవు చేకూర్చేలా, సమకాలీన స్థితిగతులకు అద్దం పట్టేలా ఉండాలి. 'రవికాంచనిది కవి గాంచును' అన్నట్లు సున్నితమైన భావకవి మనసు, తాను పరిశీలించే అంశాల లోతులను దర్శిస్తుంది. సత్వరమే స్పందిస్తుంది. ఒక్కోసారి ఆనందంతో ఉప్పొంగిపోతే, మరోసారి దుఃఖంతో విలవిలలాడుతుంది. ఏ విధంగా అంతర్మధనం జరిగినా, కవి మనసులోంచి అమృతమయమైన అక్షరాలే జనిస్తాయి. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి కలం నుంచి అలా జాలువారిన అద్భుతమైన కవిత్వ అక్షర సుధలే ... ఈ 'మట్టి పొరల్లోంచి' పుస్తకం.
నెత్తురులో రంగరించుకున్న కార్పొరేట్ కల్చర్ ను ఓ కవితలో ప్రశ్నిస్తే, మరో కవితలో దళారీల చేతులో మోసపోతున్న రైతన్న జీవితాన్ని మనకు చూపుతారు. 'మాటల బెహారీ - అనుసంధాత కాడు, అన్నదాత అడుగుల్ని శాసించే విధాత' అంటూ రైతన్న దయనీయ స్థితిని తెలుపుతారు. ప్రాణాలకు తెగించి చేపల వేటకు వెళ్ళే జాలర్ల బ్రతుకుల్ని 'సుడిగుండం చుట్టూ...' అనే కవితలో హృద్యంగా వర్ణించారు కవి. కాలేజి రోజుల మధురానుభూతులను 'మళ్ళీ అమ్మ ఒళ్లోకి' కవితలో వర్ణిస్తే, 'డాలర్ యవనిక' కవితలో ఈజీ మనీ కోసం నేడు తొక్కుతున్న కొత్త పుంతల్ని వర్ణిస్తారు, భాషపై తనకున్న మక్కువను 'భాషే నా శ్వాస' కవితలో వర్ణించారు... ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్కో కవితా, ఒక్కో ఆణిముత్యం.
కవిత్వానికి ప్రాణం వంటిది భావ వ్యక్తీకరణ, ఈ అంశంలో సోమేపల్లి వారు ఆరితేరిపోయారని వారి పుస్తకం చదివిన ఎవరైనా అవలీలగా చెప్పవచ్చు. వారి కవితా కుసుమాల్లోంచి కొన్ని మీకోసం...
"చిటికెడు ఋణం
చేటంత బ్రతుకుని
చక్రవడ్డీ బంధంలో చిరిగేస్తుంది
మళ్ళీ మళ్ళీ ఋణగ్రస్తులను చేస్తుంది"
"బ్రెయిన్ డెత్ ఒక దీపం
మరో జ్యోతిని వెలిగిస్తుంది"
"బతుకు బాటకి, బడి సిలబస్ కి
పొంతన ఉండదు
చదువుల ధ్యాసంతా కాసుల పైనే"
"శిఖరానికి ఎగబాకాలనుకోవటంలో
తప్పు లేదు
స్వార్ధపు రాళ్ళు నెత్తికెత్తుకొని
ఆదర్శపు ఆనవాళ్ళు
చెరిపేసుకుంటూ కాదుగా..."
ముఖ్యంగా కవిత్వాన్ని కొత్తగా అభ్యసించే కవులు, నైపుణ్యం కోసం ఈ కవితా సంకలనాన్ని తప్పక చదవాలి. ఈ పుస్తకం వెల 60 రూ.
ప్రతులకు సంప్రదించండి :
email: svsomepalli@gmail.com
ఫోన్ : 9000004565
పరిచయం చేయవలసిన పుస్తకం, చక్కటి సమీక్ష!
ReplyDelete