జర్నీ ఆఫ్ ఏ టీచర్ -8 - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ -8
                                                                               చెన్నూరి సుదర్శన్ 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)

            ఆ మరునాడు ఉదయం అదే ట్రైన్లో తిరిగి కాలేజీకి బయలు దేరాను.
గొల్లగూడలో సుధాకర్ రైలెక్కడం చూసి పిలిచాను. హుషారుగా వచ్చి నా కెదుర్గా కూర్చున్నాడు.
“ సార్.. మీరు సిటీ నుండి అప్ అండ్ డౌన్ చేస్తున్నారా”
“లేదు సుధాకర్.. నేను మునిపల్లిలోనే ఉంటున్నాను. మా చిన్న బాబుకు జ్వరమొస్తుందంటే నిన్న వెళ్లాను”
“ఎందరు  సార్ పిల్లలు”
“ఇద్దరబ్బాయిలు.. మధ్యలో ఒక అమ్మాయి”
“నాకు ఒక అమ్మాయి సార్”
“ఏంటీ.. నువ్వు ఒక బిడ్డ తండ్రివా?” అంటూ ఆశ్చర్యంగా అడిగాను.
“ఔను సార్.. నాకు పదవ తరగతిలోనే పెళ్లి చేసారు. ఆర్థిక పరిస్థితి.. ఒక్కరు చాలనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నా..”
నేను తెల్ల బోయాను. పల్లెల్లో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు..
            పేరంటాలు. పిల్లలు.. పీకులాటలు సహజమే..           
ఇంకా ప్రజల్లో మార్పు రాలేదు.
జీవనోపాధికి మరో సులభ మార్గం స్కాలర్‍షిప్స్. దాని కోసం కాలేజీల్లో అడ్మిషన్లు. మనసు పడినప్పుడు ఆడుతూ.. పాడుతూ రావడం..పోవడం.. అని మనసులోకి రాగానే రాత్రి సుధాకర్ పాట గుర్తుకొచ్చింది.
“సుధాకర్ నిన్న నీ పాట చాలా బాగుంది” అంటూ మెచ్చు కున్నాను.
“సార్.. రాత్రి నాపాట విన్నారా..”
“ఔను.. విన్నాను. నీ నాట్యం కూడా చూసాను”
“ఏదో.. టైం పాస్.. సార్”
“అలా అనిపించలేదు నాకు. నీ మనసులో ఆవేదన కనబడింది. నిజంగా నీకు అలాంటి భావాలు లేవా..”
నా ప్రశ్నతో సుధాకర్ కాసేపు ఆలోచనలో పడ్డాడు.
“లేకేం సార్..ఉన్నాయి.”
“అలాంటి ఉన్నత భావాలు ఉన్న వాడివి కాలేజీకి సరిగ్గా రాకుండా.. లెక్చరర్లను, ప్రిన్సిపాల్‍ను భయపెడ్తూ.. స్కాలర్‍షిప్ తీసుకోవడం.. నీ మిత్రులను సైతం ప్రోత్సహించడం తప్పు కదా” సుధాకర్ నిశ్శబ్దంగా వింటూండం నాకు మరింత ఉత్సాహం కలిగింది.
            “చూడు సుధాకర్.. సంఘాన్ని మార్చాలంటే అడవుల్లో అజ్ఞాతంగా బతుకాల్సిన అవసరం లేదు. మనం సంఘంలోనే ఉంటూ అన్యాయాన్ని ఎదుర్కోవాలి. సమాజంలో  మార్పు తీసుకు రావాలి. తుపాకితో బెదిరిస్తే వచ్చే మార్పు శాశ్వతం కాదు. మనుషుల మనసుల్లో మార్పు తీసుకు వస్తేనే..  అది శాశ్వతం” 
            “నిజమే సార్” అంటూ కింద పడిపోయిన తన పెన్నును  తీసుకొని  చొక్కా జేబుకు సర్దుకున్నాడు.
            “నీలో నిజంగా అభ్యుదయ భావాలుంటే.. నువ్వు సహకరిస్తే మన కాలేజీని చక్కదిద్దుదామని ఉంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.. లేకుంటే నిన్న నువ్వు పాడిన పాటను ఎగతాళి చేసినట్లే.. నీ భావాలను సమాధి చేసినట్లే అవుతుంది”
            “లేదు సార్.. మీరు వచ్చినప్పడి నుండి గమనిస్తున్నాను. మీలాంటి నిబద్ధత కలిగిన లెక్చరర్‍ను చూడలేదు. మీరు లెక్కలు బాగా చెబ్తున్నారు. మీరు చెప్తున్న కొన్ని చాప్టర్లు వినాలనే కుతూహలంతో కొందరు విద్యార్థులు వికారాబాదు నుండీ వస్తున్నారు”
            నిజమే ప్రిన్సిపాల్ అనుమతి తీసుకొని రావడం.. క్లాసులో విద్యార్థుల సంఖ్య పెరగడం నాకూ ఆనందంగానే ఉంది..
            నా టీచింగ్ ప్రభావం విద్యార్ధులపై పడింది.     
            సుధాకర్ మంచి మూడ్‍లో ఉన్నాడు. కాలేజీలో విద్యాసాగర్, పాపారావుల వాటాల సంగతి సుధాకర్‍కు
తెలిసే ఉంటుంది. అనే అనుమానంతో మెల్లిగా కదిలించాను.
            “సుధాకర్ నేను కాలేజీలో జాయినైన రోజు రిజిస్టర్‍తో ప్రిన్సిపాల్ తల మీద బాదడం చూసాను.. అయన నీ మీద ఏచర్యా తీసుకోలేదు.. అంటే మీ ఇద్దరి మధ్య ఏదో అవగాహన ఉందని నా అనుమానం”
            “నిజమే సార్.. ఉంది. ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అన్నట్లు మన కాలేజీ సర్వస్వం స్కాలర్‍షిప్పులకు బానిస. ఇటు విద్యార్థులు, లెక్చరర్లు.. అటు సాంక్షనింగ్ అథారిటీ కలిసి ప్రభుత్వ ధనం కొల్లగొడ్తున్నారు. కాలేజీల్లో లక్షల్లో కుంభకోణం జరుగుతోంది”
            “నాకర్థం కాలేదు సుధాకర్.. అదెలా సాధ్యం”
            “సార్ మేము విద్యార్థులం.. ప్రజానాయకుల కాళ్ళా, వేళ్ళా పడి కాలేజీల్లో అడ్మిషన్లు సంపాదిస్తున్నాం. లెక్చరర్ల కాళ్ళా, వేళ్ళా పడి స్కాలర్‍షిప్ పొందుతున్నాం. అందులో కమీషన్లు  పోను మాకు చేతికి దక్కేది సెవెంటి ఫైవ్ పెర్సెంట్ మాత్రమే. ఇంకా హాజరు తక్కువ ఉన్నదనే వంకతో మరింత లాక్కొని సగం చేతికద్దుతరు”
            “కమీషన్లెవరికీ” అంటూ ఏమీ తెలియనట్లే అడిగాను. ఇంకెవరు ‘ప్రిన్సిపాల్’ అంటాడనుకున్నాను. కాని ప్రిన్సిపాల్ ఒక్కడే కాదు.
సుధాకర్ చెప్పిన విషయాలతో నిర్ఘాంత పోయాను.
“ఈ పర్సెంటేజీల భాగోతం కంటే పెద్ద భాగోతం మరొక టుంది సార్..
నలభై మంది డమ్మీ విద్యార్థుల లిస్టు పకడ్బందీగా తయారు చేసి స్కాలర్‍షిప్ కోసం అప్ప్లై చేయడం.. అందులో పది మంది డబ్బులు డిపార్ట్ మెంటుకు.. ఐదుగురివి స్కాలర్‍షిప్ ఇంచార్జ్ కు.. ఐదుగురివి మావిద్యార్థి లీడర్లకు .. మిగిలిన ఇరవై మంది డబ్బులు ప్రిన్సిపాల్‍కు ఇలా వాటాలు పంచుకోవడం ఆనవాయితీ”
నాకు మూర్చ వచ్చినంత పనైంది.
ఇలాంటి అవకతవకల అనుభవాలతో  ప్రభుత్వం నేడు విద్యార్థుల పొదుపుఖాతాల్లో నేరుగా జమచేస్తోంది.
చిట్టిగడ్డ స్టేషన్  వచ్చినట్లుంది.. ట్రైన్ ఆగింది. కాని మళ్ళీ కదలడం లేదు. సుధాకర్, నేను కలిసి ట్రైన్ దిగాం. అటుగా వెళ్తున్న గార్డునడిగాడు సుధాకర్. రెండు ఎక్స్ ప్రెస్ ట్రైన్ల క్రాసింగ్ ఉంది. మరో అరగంట పడ్తుందని అన్నాడు.
“సార్ మీరెళ్ళి ట్రైన్లో కూర్చోండి.. నేనిప్పుడే వస్తాను” అంటూ సుధాకర్ వడి, వడిగా స్టేషన్ మాస్టర్ క్యాబిన్ వైపు వెళ్ళాడు.
ఐదు నిముషాల్లో తిరిగి వచ్చాడు. మాట్రైన్‍కు సిగ్నల్ ఇచ్చారు. విజిల్ వేసి బండి కదిలింది.
            “అరగంట అలస్యమన్నాడు గదా గార్డు” అంటూ నేను ఆశ్చర్యపోతుంటే..
            “సార్.. నేను వెళ్లి స్టేషన్ మాస్టారుతో మాట్లాడాను. మన కాలేజీకి ఆలస్యమౌతుందని.. ఒకవేళ మా బండి కదలకుంటే ఆ ఎక్స్ ప్రెస్ బండ్లు కూడా పోవు అని బెదిరిస్తే మన బండిని పంపిస్తున్నాడు”
            “అదేంటి అతనిష్టమేనా.. కంట్రోలర్ ఉంటాడు గదా.. అతడు పర్మిషనివ్వొద్దూ..”
            “కంట్రోలర్‍తోనూ మాట్లాడాను సార్.. ఎక్స్ ప్రెస్ బండ్లు ఎక్కడున్నవని ఆరా తీశాను. ఒక బండి తాండూర్ నుండి ఇప్పుడే కదిలిందట. అది నెక్స్ట్  స్టేషన్ చేరుకుంటే గాని  మరొకదాన్ని వదలరు. అవి రావడానికి కనీసం నలుబది నిముషాలు పడ్తుంది. మనడి రాబోయే స్టేషన్ వికారాబాదు జంక్షన్.. ఐదు నిముషాల్లో వెళ్తాం. అక్కడి నుండి మన  రూట్ వేరు. మనదీ ఫాస్ట్ పాసింజరే.. ఆపవద్దని కాలేజీకి ఆలస్యమౌతుందని రిక్వెస్ట్ చేసాను. మన బండికి సిగ్నలిచ్చాడు.. ఇదంతా మాకిక్కడ మామూలే సార్”
            నాకు ప్రథమ అనుభవమిది. ఇలా రైళ్ళ రాక పోకలను సైతం జనం శాసిస్తారని అనుకోలేదు. సుధాకర్ వాదించింది వాస్తవమే.. ఈ తెలివి తేటలు కంట్రోలర్ ఉండవని కాదు.. నిర్లక్ష్యపు ధోరణి. పల్లెటూరి ప్రజల ట్రైన్ సౌకర్యంపై చిన్న చూపు.
మా ట్రైన్  వేగం పుంజుకుంది.
            “సుధాకర్.. ఇంతకూ ప్రిన్సిపాల్‍ను కొట్టిన విషయం చెప్ప లేదు” అంటూ మళ్ళీ విషయం కదిపాను.
            “సార్.. దానికి రెండు కారణాలు.. ఒకటి.. నేనిచ్చిన లిస్టులో ఒకరికి అడ్మిషన్ రాలేదు. రెండవది.. ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకొని పరీక్షల్లో మాకన్యాయం చేసాడు”
            “మొదటిది సరే.. మరి పరీక్షలు.. డబ్బులు.. నాకర్థం కాలేదు” అన్నాను కుతూహలంగా..
            “పబ్లిక్ పరీక్షల్లో స్క్వాడ్ వస్తే ప్రొటెక్ట్ చేస్తానంటూ.. ఎవరినీ మాల్ ప్రాక్తీసు కింద బుక్ గాకుండా చూస్తానంటూ.. నకలు చిట్టీలు అందిస్తామంటూ..హామీలు గుప్పించి హాల్ టిక్కట్లు జారీచేసేప్పుడే ప్రతీ కాండిడేట్ వద్ద ముప్పై రూపాయలు ఝాడించుకుంటరు. అయినా ఈ సారి ఇద్దరు బుక్కయ్యారు. అందుకే కొడుక్కు బుద్ధి రావాలని తలకాయ మీద ఒక్కటిచ్చా.. అసలు వానికి తగాలాల్సింది”
            “ఎవరు” అంటూ ఆసక్తిగా అడిగా.
            “ఇంకెవరు సార్.. కాలేజీ పాపాల మూటలో సూత్రదారుడు.. వాటాదారుడు.. పాపారావు సారు. రింగు మాస్టరాయన. కాలేజీలో ప్రిన్సిపా ల్‍ను వాడుకుంటూ చక్రం తిప్పుతడు”
            నాకంతా అవగతమైంది. విద్యాసాగర్,పాపారావు తోడు  దొంగలు తయారై కాలేజీని దోచుకు తింటున్నారు. ‘గుడినీ.. గుడిలోని లింగాన్ని మింగే’ రకాలు.
            లెక్చరర్లకు  పూర్తి స్వేచ్చనిచ్చారు. కాలేజీకి వచ్చినా రాకున్నా హాజరు పట్టికలో  సంతకాలు పెట్టి జీతాలు బొక్కుతున్నారు. వారికదే సంతోషం.
            “సార్.. ఇంకా వీరి లీలలు కోకొల్లలు. నాకు తెలిసినవి మాత్రమే చెబుతున్నాను..  నేను  కాలేజీ క్లర్కుకు అప్పడప్పుడు పార్టీలిచ్చి సేకరించిన వివరాలు చూడండి..” అంటూ తన నోట్ పుస్తకం తెరచి చూపించాడు. ‘లెక్కలు చూస్తేనే గాని బొక్కలు దొరికేవి’ అన్నట్లు అందులో గత సంవత్సరం తాలూకు స్పెషల్ ఫీ ఫండ్‍ని ఎలా దుర్వినియోగం చేసారో లెక్కల చిట్టా ఉంది.
            కాలేజీ వార్షికదినోత్సవం జరుపకున్నా జరిపినట్లు.. ఆటల పొటీలలో పిల్లలకు బహుమానాలు పంచకున్నా  పంచినట్లు.. సైన్స్ మేటీరియల్ కొన్నట్లు,ఫర్నీచర్ కొన్నట్లు కొటేషన్లు.. బోగస్ బిల్లులు రశీదుల నంబర్లతో సహా సుధాకర్ నోట్ చేసి పెట్టాడు. ఇవన్నీ ఫలదీకరించుకోడానికి సబ్ ట్రెజరీ ఆఫీసులో చెల్లించుకున్న  ముడుపులు అణా పైసలతో సహా రాసి పెట్టాడు.   
నేను చూసి నివ్వెరపోయాను.
“అందుకే సార్.. కాలేజీలో నేనంటే హడల్..”
            “అవునూ.. వీళ్ళ భరతం పట్టేది పోయి పాపం పోయిన మ్యాథ్స్ నాగమణి మేడంను ఏడ్పించారట.. ఎందుకు?” అంటూ అడిగాను.
            “సార్.. నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాను. ఒక్క చేత్తో చప్పట్లు మోగవన్నట్లు ఇందులో మేడం తప్పూ ఉంది. ఒక  లెక్చరర్ అంటే మా తల్లి తరువాత తల్లితో సమానం. చూస్తే దైవత్వం ఉట్టి పడాలి. రెండు చేతులా దండం పెట్టాలనే భక్తి భావం కలగాలి. కాని మేడం అలా మా కళ్ళకు కనిపించేది కాదు. మీకు చెప్పాలంటే సిగ్గుగా ఉంది సార్..” అంటూ నోట్ బుక్ నోటికడ్డంగా పెట్టుకున్నాడు. ఆరుద్రపురుగులా ముడ్చుకుపోయాడు.
“ఫరవా లేదు చెప్పు సుధాకర్.. దీంతో నా అనుమానాలన్నీ తీరుతాయి” అంటూ రిక్వెస్ట్ ధోరణిలో అడిగాను.
“సార్.. ఆమె జబ్బల దాక పల్చని జాకెట్లు.. లోన వేసుకున్న  బాడీ.. బటన్స్  కనిపించేవి. పెదాలకు లిప్ట్సిక్.. తల్వార్ కటింగ్ ఐ బ్రోస్..  బొడ్డు కింద చీర కట్టి జుగుప్సగా కనబడేది.. ‘మృగశిర చిందిస్తే ముసలి ఎద్దు రంకె వేస్తుంది’ అన్నట్లు  ఆమెను చూడగానే పండు ముసలాడైనా పడుచువాడై పోతాడు. ఆమె క్లాసుకు పిల్లలు ఫుల్.. బుర్రకెక్కేది నిల్.. ఆఖరి రోజు ఆమె వెళ్తుంటే వెంటపడ్డాం.. ఇలాంటి డ్రెస్సులతో కొత్త కాలేజీకి వెళ్ళకని హెచ్చరించాం” అంటూ నవ్వసాగాడు.
నిజమే ఒక లెక్చరర్‍కు గురుభావం కలిగే వేష,భాషలవసరం. భావ వ్యక్తీకరణలో భక్తిభావం తొణికిసలాడాలి. ఒక రకంగా తనకు జరిగిన అవమానానికి నాగమణి సైతం కొంత వరకు కారణం. అందుకేనేమో..! నాకు అనాసబండలో అలా కనిపించ లేదు చాలా సింపుల్‍గా వచ్చింది..
నేను హన్మకొండ పి.జి. కాలేజీలో చదివేప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ఉద్యోగుల కోసం ఈవినింగ్ డిగ్రీ కాలేజీ నడిచేది. ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ లెక్చరర్ పాఠం చెబ్తుంటే గది తలుపులు మూసి ఆమెను నానా హంగామా చేసారు విద్యార్థులు. పెద్ద రభస జరిగింది. అసెంబ్లీలో సైతం చర్చకు వచ్చింది. 
ఒక లెక్చరర్ ఏప్రాంతానికి చెందిన వారని కాదు.. వారు కనబడే తీరు విద్యార్థులకు పూజ్యభావం కలగాలి.
మాకు డిగ్రీలో సుభద్ర మేడం ఫిజిక్స్ చెప్పేది. ఆమె మాకు పెద్దక్కయ్యలా కనబడేది.
ఇదంతా నాగమణి స్వయంకృపారాధం.
మా మునిపల్లి స్టేషన్ వస్తోంది..ట్రైన్ వేగం కాస్తా తగ్గింది.
“సుధాకర్.. నేను మళ్ళీ మాట్లాడుతాను. విద్యార్థుల సహకారంతో కాలేజీని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను. దానికి ప్రణాళికలు  తయారు చేస్తాను. నీ ఆదర్శం తూర్పు వైపు చూస్తూ అడవి పాలు చేయకు. దాని కంటే జనంలో మమేకమై ఒక ఊరును బాగుచెయ్యాలి. అది లక్ష్యంగా పెట్టుకో.. నేనూ తోడుంటాను” అంటుంటే సుధాకర్ కళ్ళు మెరుస్తూ.. నాకు  భరోసానిచ్చాయి.

No comments:

Post a Comment

Pages