లలాట ఫలకే......
రచన: ’ శారదా తనయ’
“సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అని మన పెద్దవారు అన్నా నా మట్టుకు నాకు మన మొహాల్లో కొట్టొచ్చేటట్టు కనిపించేది నుదురే అనిపిస్తుంది. తత్సమంగా లలాటమనీ, మన దేశీ తెలుగులో నుదురు, నొసలు అని పిలుచుకునే ఈ ముఖ్యమైన అలాగే ప్రస్ఫుటమైన అంగానికి అంతెందుకు నేను ప్రాధాన్యతనిస్తున్నాను అని తమ వద్ద విన్నవించుకుంటాను.
ముఖ్యంగా ఈ నుదురు నన్ను ఆకట్టుకున్నదెందుకంటే దానిమీద మన భవిష్యత్తు వ్రాయబడి ఉంటుందట కాబట్టి. ఎంత ప్రాముఖ్యత లేకుంటే బ్రహ్మ దీన్ని ఎంచుకునుంటాడండీ ! బల్ల పరుపుగా, వ్రాయడానికి చాలా సౌకర్యంగా ఉంటూ, అలాగే చదవగలిగిన వారికి వ్రాత బల్ల మాదిరిగా కనిపించే ముఖంలోని ఒకే ఒక భాగం లలాటమే కదా. నుదుటి వ్రాత ఎవరు చదవగలరని ఇలా అంటున్నారు అని మీరు అనవచ్చు. శ్రీ మంజునాథ చిత్రంలో అంబికేశ్వర మహారాజుగారు తపస్సు చేసి నుదుటి వ్రాతను చదవగలిగే సత్తాను పొందగలుగుతారు అని చూపించారు. కాబట్టి అలాంటి వారి కోసం ! అదేదో పాత సినిమాలో “ నుదుట వ్రాసిన వ్రాతను చెరుపుట నీ తరమౌనటరా “ అనే పాట ఉంది. అంటే అదొక్క సారి ఒక మనిషికి ( మృగాలకు కూడానేమో మరి ) వ్రాయబడిందంటే ఇక ఎన్నికల సమయంలో వ్రేలికి వేసే సిరా మరక మాదిరి( పోలిక అతకలేదు అని అనవచ్చు. అంతటి నుదుటివ్రాతను ఎన్నికల సిరా మరకకు పోలుస్తారా ఆయ్ అంటారేమో. అంత తొందరగా చెరుపుకోలేని ఉదాహరణ నాకు దొరికింది ఇదొక్కటే మరి. చదువరులు మన్నించాలి. దైవ భక్తులు క్షమించాలి ) అన్న మాట. చెరుపుకోలేము. అక్కడ వ్రాసినట్టే జరుగుతుందని మనం నమ్ముతాము కాబట్టి అలాంటి దైవప్రదమైన వ్రాతను తన పైన పొందగలిగే నుదురు ఎంత భాగ్యశాలియో కదా ! అంటే మనం నుదుటికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి మీరే చెప్పండి.
ఇక మనం అందం విషయానికి వద్దాం. మగవాళ్ళకేమో యువకులుగా ఉన్నప్పుడు నుదుటి పై భాగానికి భూషణంగా అందమైన జుట్టు ఉంటుంది. దానిని తమకు నచ్చిన, తాము మెచ్చిన విన్యాసాలతో అలంకరించుకుంటూ మురిసిపోతుంటారు . అప్పుడప్పుడు ముందుకు వేసుకునే కొన్ని వెంట్రుకలకు నుదురు సపోర్ట్ సిస్టమ్ గా పని చేస్తుంది అని చెప్పాల్సి వస్తుంది. ఈ విషయంలో ఆడవారి సదరు వెంట్రుకలకు ఒక మంచి నామకరణం గావించారు మనవారు, ముంగురులు అని. వాటిని తుమ్మెద రెక్కలకు పోల్చడం కూడా జరిగింది. రైలు పట్టాలు తప్పుతోంది అంటారేమో ! ఫర్వాలేదు. అప్పుడప్పుడు పిట్టకథలు కావాల్లెండి, ముఖ్య కథ రక్తి కట్టడానికి.
ఇకపోతే హిందూ స్త్రీలకు అతి ముఖ్యమైన ఐదోతనపు చిహ్నమైన బొట్టుకు నిలయం ఈ నుదురే. ద్వాపరయుగం వరకు మగవారందరూ బొట్టు పెట్టుకునే వారు అని పురాణాలద్వారా మనకు అర్థమవుతుంది. “తిలకం లేని లలాటం స్మశాన సదృశం” అని కూడా చెప్పబడింది. విదేశీయుల దాడులు జరిగి మన సంస్కృతిపై పడిన దుష్ప్రభావం వల్ల ఈ అలవాటు అంతరించిపోయింది. బహుశ బొట్టు పెట్టుకున్నవాడిని సులువుగా గుర్తించి ఇడుముల పాలు చేయడం జరిగేదేమో ! అందుకే బయట తిరిగే మగవారు మానివేసి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ హిందూ సువాసినీ స్త్రీలకు మాత్రం నుదుట బొట్టు తప్పనిసరి. ఈ తిలకం ఆడవారి అందానికి మెరుగులు దిద్దుతుంది. ఈ తిలకపు నానా విధాలు మనందరికీ తెలుసు. కుంకుమతో పెట్టుకున్న బొట్టు, లక్కతో తయారుచేసిన పదార్థంతో దిద్దుకున్న బొట్టు, ఇప్పుడందరూ ఉపయోగిస్తున్న బిందీ. ఈ బిందీలలో అనేక క్రొత్త డిజైన్లు, పోకడలు కూడానూ. బిందీల తయారి ఒక పరిశ్రమగా మారింది ఇప్పుడు. ఏదైనా ఫంక్షన్ లకు ఆడవాళ్ళూ బిందీలకోసమే అంగళ్ళు తిరగడం మనం చూస్తుంటాము. మగవారు మాత్రం పూజలప్పుడు, పండగలప్పుడు మాత్రమే కుంకుమను ధరించి కనిపిస్తున్నారు. ఉత్తరాదివారు ఈ కుంకుమను కానీ, సింధూరాన్ని కానీ భ్రూ మధ్యనుండి పై దాకా పెట్టుకుని తాము పరమ హిందువులని చాటుతారు. ఇక సినిమాలలో విలన్ తరుఫున గూండాలు కూడా భయంకరంగా కనబడడానికి ఇలాంటి పొడుగాటి బొట్టునే ధరిస్తారు. ఇది పరమ శివుడి మూడో కన్నుకు ప్రత్యామ్నాయం అని భావిస్తారేమో మరి తెలియదు. అన్నట్టు నిప్పులుమిసే మహదేవుడి మూడో కన్ను కూడా ఫాలభాగమునందే పొందుపరచి ఉందండోయ్ ! మహావిష్ణువు యొక్క కస్తూరీ తిలకం కూడా నుదుటి మీదే రారాజిస్తూ ఉంటుంది.
కుండలినీ యోగం, తంత్రవిద్యలలో కూడా నుదుటి పైన కనుబొమలు కలిసే చోటు ఆజ్ఞా చక్రంయొక్క స్థానం అని చెప్పారు. ఆజ్ఞాచక్రం అంటే నిక్షిప్త జ్ఞానానికి నెలవు. తిలకం పెట్టుకోవడం వలన ఈ జ్ఞానం కేంద్రీకృతమవుతుంది అని చెప్పబడింది. ఇలా ఒక మతానికి నిదర్శనంగానూ, అందానికి సాధనంగానూ వెలిగే బొట్టు/తిలకానికి స్థానం ఫాలభాగమే. పైగా ఈ బొట్లతో సింగరించుకున్న ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించేది నుదురే కదా !
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫాలభాగాన్ని తాము ఏ సంప్రదాయానికి చెందినవారు అని చాటుకోవడానికి ప్రజలు ఉపయోగించేది. వైష్ణవ, శైవ సాంప్రదాయాల వారు తాము ఫలానా అని చెప్పకనే చెప్పేందుకు నుదుటి పైన తమ సాంప్రదాయలకు తగిన విధంగా విభూతి రేకలో, చందనమో వ్రాసుకుంటారు. అంటే వాటి గురించి తెలిసినవారు వీరిని చూడగానే గుర్తుపట్టగలరు. కొన్ని శతాబ్దాల క్రితం వీటి ప్రాధాన్యత చాలానే ఉండింది. కానీ నవ నాగరికత వెల్లువలో ఇవి కనిపించడం తగ్గిపోయింది. దేవాలయాల దగ్గర, మఠాల దగ్గర మాత్రం కనిపిస్తాయి. కొన్ని కొన్నిసంప్రదాయాలలో నుదుట కనిపించే గుర్తులను చూసి వారి భోజనం అయిందో లేదో చెప్పెయ్యవచ్చు. అంటే ఆ గుర్తు భోజనానికి కూర్చున్నప్పుడే పెట్టుకోవాలి. కాబట్టి నుదుట అది కనిపిస్తే ఇక మీరు వారిని భోజనానికి లేపనక్కర్లేదు. అలాంటి వారు కనిపిస్తే అదో రకమైన నెమ్మది.
ఈ నుదుటి నామాల గొడవలు కోర్టులకు ఎక్కినవి కూడా ఉన్నాయండీ ! దేవాలయంలో ఉన్న ఏనుగు నుదుటికి ఏ రకమైన నామం దిద్దాలని అభిప్రాయ భేదం వచ్చి ఇరు తెగలవారూ కోర్టులోనే తేల్చుకున్నారు మరి ! అంటే మన మనుషుల నుదురే కాదు, జంతువుల నుదురు కూడా అంతే ముఖ్యమైనది అని మనకు తెలుస్తుంది. ఏమంటారు ? పొట్టేలు మనపైన దాడి చేసేది తన లలాటముతోనే కదా ! కొండనైనా ఢీ కొట్టగలిగే తెగువ దానికి దాని నుదురే ఇస్తుంది మరి.
చిన్న పిల్లలు ఢీ లు ఇచ్చుకోవడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు కూడా. పిల్లలలోనే కాదు పెద్దల్లో కూడా పాత కాలంలో ఢీలు అలవాటు ఉండేవేమో ! అది చూసే ’ మంగమ్మ శపథం ’ సినిమాలో రాజుగారి పాత్రకు ఢీ కొట్టే అలవాటు పెట్టి ’ ఢీ డిక్కు ’ పాట కూడా చిత్రీకరించి చిత్రానికి వన్నె తేవడం జరిగింది. ఎవరి తలకైనా ఒకసారి తగిలితే ఇంకో సారి తగిలించి తీరాలి, లేదా కొమ్ములు మొలుస్తాయని ప్రతీతి ఉంది. ఈ కాన్సెప్ట్ ని ’బొమ్మరిల్లు’ చిత్రంలో ఉపయోగించుకుని ప్రచలితం గావించడం జరిగింది.
ఏదైనా మనకు నచ్చనివి జరిగితే గోడకు కొట్టుకోవడానికి నుదురే ముందు ! అకస్మాత్ జరగరానివి జరిగితే ’ అంతా నా ఖర్మ’ అని కొట్టుకునేది కూడా నుదుటికే !
ఇదండీ ’ నుదురోపఖ్యానం’. ఇది చదివిన తర్వాత మీ అందరికీ నుదురే ముఖ్యమని అనిపించిందంటే నాకు సంతోషం, తృప్తిన్నీ!
శహభాష్ బాగుంది.
ReplyDelete