మంచి పుస్తకం - అచ్చంగా తెలుగు

మంచి పుస్తకం 


పిల్లలూ! మీరెప్పుడైన మంచి పుస్తకాలు చదివారా!
చాలా చదివే ఉంటారు కదా!
అయితే అందులో ఏదో ఒక పుస్తకం చేతుల్లోకి మళ్లీ తీసుకుని చదవడం ప్రారంభించండి. అదీ శ్రద్ధగా..ఎంత శ్రద్ధగా అంటే కామాల దగ్గర ఫుల్ స్టాఫ్ ల దగ్గర ఆగి అర్థం చేసుకుంటూ చదవండి. ఈసారి మీకెన్నో కొత్త విషయాలు, సంగతులు తెలిసి మీరెంతో ఆశ్చర్యపోతారు.
అందుకే పెద్దవాళ్ళు భగవద్గీతలాంటి పుస్తకాలు మళ్లీ మళ్లీ చదివితే కొత్త కొత్త విషయాలు స్ఫురిస్తాయని అంటారు.
మన జీవితం(ఆయుషు)లో కొంత సమయం కేటాయించి ఒక పుస్తకం చదువుతున్నామంటే అది ఎంత ఉత్తమంగా, ఉన్నతంగా ఉండాలి? అది మన జీవితంపై ఎంతటి ప్రభావం చూపాలి. కదూ..
ఉన్నతంగా ఎదిగిన చాలామంది ప్రముఖులకు పుస్తకాలే స్ఫూర్తినిచ్చాయన్నది నిర్వివాదాంశం.
మనం చదవబోయే పుస్తకాలను ఎంచుకోవడం ఒక కళ(ఆర్ట్). అసలు పుస్తకాన్ని ఎంచుకోవడంలోనే మన అభిరుచి వ్యక్తం అవుతుంది. ఆ తర్వాత కవర పేజీకి చివరిపేజీకి మధ్యనున్న పేజీలపై చూపులను దొర్లించడం కాకుండా విషయాన్ని ఆకళింపు చేసుకోవాలి. అంటే మెదడులో నిక్షిప్తం చేసుకోవాలి. అది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు (రిఫరెన్స్) ఉపయోగపడుతుంది.
ఒకప్పుడు మనక్కావలసిన పుస్తకాలు ఇన్నాయో లేవో తెలిసేది కాదు. ఇప్పుడలా కాదు. నెట్లో పుస్తకాల లభ్యత తెలుస్తోంది. ఈ-బుక్కులూ లభ్యమవుతున్నాయి. ప్రభుత్వాలు సంవత్సరానుకోసారి బుక్ ఫెయిర్స్ ఏర్పాటుచేస్తున్నాయి. హైద్రాబాదులో, కోటీలాంటి కొన్ని ప్రదేశాల్లో సెకండ్ హేండ్ పుస్తకాలు తక్కువ ధరకు లభ్యమవడమూ మనకు సౌలభ్యమే!
మనక్కావలసిన రంగంలో కావలసిన (టైటిల్) శీర్షికలతో ఉన్న పుస్తకాలను ఎంచుకుని మన ప్రతిభని మెరుగుపరచుకోవచ్చు. మనం ఎంచుకున్న మార్గంలో మనం సునాయాసంగా సాగిపోనూవచ్చు.
అందుచేత మంచి పుస్తకాలు చదవండి. అభివృద్ధిపథంలో పయనించండి.
సరేనా మరి. ఉంటానర్రా!
మీ
సుబ్బుమామయ్య


No comments:

Post a Comment

Pages