పల్లెతల్లి
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
మస్తు పైసలొస్తయని..బతుకులు బాగుపడ్తయని
పదేళ్లక్రితం పల్లెతల్లి నొదిలి,,పట్నం దారి పట్టినం
దుమ్ముల..ధూలిల..ఇరుకిరుకు కొంపల్ల
సిన్నపెట్టెలో ఇరికినతీరుగ, ఎట్లున్నమో?
పొద్దుగాల ఉరుక్కుంటా కొలువుకు పోవాల
పొద్దుమీకి తన్లాడుకుంట ఇండ్లకి రావాల
యాడికిబొయినా ఎవరో ఎంటబడినట్టు ఉరుకుడే
జరంత నిమ్మలంగ కూసున్నదిలేదు..మనసు సుదరాయించింది లేదు
సుకానికి అలవాటుపడి..పనికో మనిషిని పిల్వబడితిమి
నాలుగడుగులేయ షాతకాక..షేర్ ఆటోల్ల తిరగబడితిమి
సిన్న రోగమొచ్చి దవాఖానకు పోతే..సంపాయించి దాచిందంతా పెట్టుడే
బాధలకు ఎన్నోసార్లు..తల తాకట్టు పెట్టినం
పట్నంల పరేషాన్ జేసేటొల్లేకాని..పట్టించుకునేటోల్లుండరు
అదో రంగులద్దిన ఊబి..దాన్లకి బోయినోడు..ఇంగ అటే.
అదురుట్టం బాగుండి..అన్నీ తెలుసుసుని
సేతులుకాలినాకన్నా..అమ్మకాడికి అచ్చినం
ఇంగ పట్నం ఊసు ఎత్తుడులేదు..అటు సూసుడులేదు
గింత గంజినీళ్లు తాగి..గీ సెట్టునీడల సల్లగ తొంగుంటాం.
నా పిల్లల్నిగూడ..అటువైపు జూడనియ్య
సావైనా, బతుకైనా..అమ్మకాడనే, మీతోనే!
*****
No comments:
Post a Comment