పుడమితల్లి చుట్టరికం - అచ్చంగా తెలుగు

పుడమితల్లి చుట్టరికం

Share This
పుడమితల్లి చుట్టరికం
 –పెమ్మరాజు అశ్విని 
      
“లావణ్య ఆలస్యం  అవుతోంది త్వరగా తయారవ్వు ఇవాళ ఆ అపార్ట్ మెంట్  చూడడానికి వెళ్ళాలి నీకు గుర్తుందా “ అంటూ తొందరపెట్టాడు సుదీర్ “హా ఇదిగో వస్తున్నా వెళ్దామా అంటూ లోపలి నుంచి పసుపు ఆకుపచ్చ రంగు చుడిదార్ తో వచ్చింది లావణ్య . అలా ఇద్దరు కార్ లో అపార్ట్ మెంట్ చూడడానికి బయలుదేరారు జయనగర్ నుండి బనీర్ఘట్ట రోడ్ లోకి  లావణ్య,సుదీర్ ఇద్దరు బెంగలూరు లో ఒక బహుళ జాతీయ కంపెనీలలో పనిచేస్తున్నారు. అంతకు ముందు మూడు సంవత్సారాలు వేరే వేరే దేశాల్లో ఉండి  కాస్తంత కూడబెట్టారు లోపే ఇంతలోపు ఇద్దరు బెంగుళూరు కి పోస్టింగ్ దొరికింది ,పెద్దగా ఆర్ధిక ఇబ్బందులు గాని ,తోబుట్టువులు,పిల్లలు భాద్యతలు గాని లేవు ఇద్దరికీ వయసు ముప్పై.  సరే ఎలాగు ఆన్ సైట్ పేరు చెప్పి కొద్దిగా కూడబెట్టుకున్నారు ,దానికి తోడు బెంగుళూరు లో అద్దె ఇల్లు డిపాజిట్లు ఆకాశం లో వుంటాయి అన్న విషయం ఏడాది లో బాగా అర్ధమైంది .
           సరే ప్రతి సారి ఈ తిప్పలు పడలేము సొంత ఇల్లు కోనేస్కుంటే ఒక పని అయిపోతుంది పద్దాక ఇల్లు వెత్తుకోవక్కరలేదు,అంతగా వేరే  ఊరు వెళ్ళాల్సి  వస్తే ఇది అద్దె కి ఇచేస్తే సరి అని ఒక నిర్ణయానికి వచ్చి సొంత ఇల్లు కొన్నుకుందాము అనే ఒక ప్రయత్నం మొదలు పెట్టారు. మొదట మామూలుగా ఆఫీస్ లో తెలిసిన స్నేహితులకి చెప్పారు,సరే వెబ్సైటుల మీద కూడా దాడి చేసారు ,నెమ్మదిగా ఈ పని మీద బ్రోకర్ లు ఉంటారని తెలుసుకుని ఒక ఫ్రెండ్ చెప్పిన నమ్మకమైన బ్రోకర్ ని సంప్రదించారు వీరికి ఇంతలో కావాలి ఆఫీస్ కి అవకాశము ఉన్నంత దగ్గరలో లేదా కనీసం కాబ్ వచ్చే అవకాశము వున్న ప్రదేశాలు చెప్పారు. 
       అప్పటి వరకు వారం అంతా  ఉద్యోగం వారంతం వస్తే కేవలం విశ్రాంతి గా వుండే దంపతులు సొంత ఇంటి ఆలోచన వచ్చిన దగ్గర నుంచి వారంతం వస్తే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం తిరిగానారభించారు . దీనికి తోడు ఇంటి గురించి బోలెడు కొత్త విషయాలు తెలియ వచ్చాయి,బ్రోకర్లు పెట్టె అవస్థలు వాళ్ళ వసూలు చేసే ఫీజు ,ఇంట్లో వాళ్ళు సలహా తో  వాస్తు చూడటం ,తూర్పు వైపు వుండాలని ఒకరు అంటే నీ నక్షత్రానికి ఉత్తరం వైపు గడప వుండాలి అంటూ ఇంకో బంధువు సెలవిచ్చారు  , ఇంటి నెంబరు సరి సంఖ్య వుండాలని కొందరు బేసి సంఖ్య వుండాలి అన్నారు ఇంకొకరు  ,ఇవి చాలవన్నట్టు కొందరు అపార్ట్ మెంట్ మంచిది అంటే కొందరు విడి గా స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి అని చెప్పారు. సరే అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎంత బ్యాంకు బాలన్స్ వున్నా ఇల్లు కొన్నా , కట్టుకున్నా  బ్యాంకు లోన్ తీస్కుంటే ఆదాయపు పన్ను మినహాయింపు వస్తుందని చెప్పారు లావణ్య వాళ్ళ నాన్నగారు మరింకేమి అయితే బ్యాంకు లోన్ తీస్కుందాం అని రకరకాల బ్యాంకు లో ఇంటి లోన్ వివరాలు రాబట్టే పని లో పడ్డారు.
    
     సరే కొంత కాలం సైట్ లు లేఔట్ లు అంటూ చూసాక ఇది మన వల్ల అయ్యే పని కాదు అనే నిర్ణయానికి వచ్చారు లావణ్య సుదీర్ లు ,మొతానికి ఒక ఆరు నెలల వేట ఫలితంగా  బనీర్ఘట్ట లో ఒక ఫ్లాట్ ,సర్జాపుర లో ఒక విల్లా వీరికి నచ్చాయి అయితే ఇంటి గురించి నిర్ణయం కాబట్టి వీరి దూరపు బంధువు ఒకాయన లాయర్ గారు వుంటే ఆయన సలహా తీస్కోడం మంచిది అనుకున్నారు,అతను కూడా సాయం చేయడానికి ముందుకొచ్చాడు ,ఈ రెండు ఇళ్ళ యజమానులు విదేశాల్లో వున్నారు అక్కడ వచ్చింది అసలు తంటా ఇద్దరి తో ను ఫోన్ లో మాటలు సాగుతున్నాయి వారి తరపున  మధ్యవర్తులు వ్యవహారం నడుపుతున్నారు .వాళ్ళ కమిషన్ కోసం ఏమి చేయడానికైనా వాళ్ళు వెనకాడరు అని అర్ధం అయింది .
       వీళ్ళ బంధువు లాయర్ అయిన సీతాపతి గారు సర్జాపుర విల్లా అన్ని విధాలుగా బావుంది అక్కడ నుండి ఆఫీసు కుడా దగ్గర పైగా అమ్మే అతను మధ్యవర్తులను పక్కన పెట్టి వచ్చి మాట్లాడతాను అని చెప్పడం తో వీళ్ళు ఊపిరి పీల్చుకున్నారు మొత్తానికి కోటి రూపాయిలు దగ్గరలో బేరం తెగ్గొట్టారు ,అందులో ఓనర్ సగం బ్లాకు సగం వైట్ అని చెప్పాడు ,ఈ బ్లాకు వైట్ ఎలా ఏర్పాటు చెయ్యలా  అని మళ్ళి  ఇద్దరు జుట్లు పట్టుకున్నారు ఇవతల బ్యాంకు వాడు సేల్ అగ్రిమెంట్ మరియు సేల్ డీడ్ రెండు ఒకేలా వుండాలి అంటాడు, పోనీ వీరు దాచుకున్న డబ్బులు ఇద్దామంటే వీరు న్యాయంగా పన్ను కట్టిన డబ్బు చూస్తూ చూస్తూ స్థలం యజమాని చేతికి నల్ల ధనం గా వెళ్ళటం  వీళ్ళకి నచ్చలేదు. 
         ఒక రోజు లావణ్య సుదీర్  తో ”సుదీర్  సొంత ఇల్లు వద్దు ఏమి వద్దు హాయిగా ఇలా అద్దె ఇంట్లో గడిపేద్దాం,ఈ తలనోప్పులన్ని ఉంటాయని తెలిసి వుంటే అసలు మనకు సొంత ఇల్లు ఆలోచన వచ్చేదే కాదు గా ,దీని వల్ల తిండి నిద్ర మానేసి తిరుగుతున్నాము,మానసిక ప్రశాంతత కరువై అందర్నీ బతిమాలుకోవాల్సి వస్తోంది మనకి అవసరమా ఈ బాధలు ,ఆర్నెల్ల నుంచి నానా తంటాలు పడుతున్నాం అయినా ఒక్క పని కూడా  పూర్తి  కాలేదు”అంది  నిరాశగా. “ లావణ్య మా బంగారం కదా ఆర్నెల్ల నుంచి తాపత్రయం పడుతున్నాము అని నువ్వే చెప్పావ్ మజ్జిగ చిలికి చిలికి సరిగ్గా వెన్న పడే సమయానికి కుండ బద్దలు కొట్టేదామా ,కొంచెం సహనం అవసరం తల్లి ,అయిన నీ కంగారు నాకు అర్ధం అయింది నా ఫ్రెండ్ సతీష్ బ్యాంకు లో మేనేజర్ గా చేస్తున్నాడు లోన్ సంగతి వాడు చుస్కుంటాను అన్నాడు ,కాకపొతే ఓనర్ తో బ్లాకు ,వైట్ వ్యవహారం కొంచెం బేరం ఆడాలి డెబ్బై అయిదు శాతం వైట్ మిగతాది తప్పదు నల్లదనం ఇవ్వాలి కొన్ని అంతే సర్దుకుపోవాలి” .
              “హా అవును ఈ వ్యవహారం తేలితే ఇంకా ఇంట్లో కి ఇంటీరియర్ చేయించుకోవాలి,అలమరాలు,వంటింట్లో హంగులు ఇవ్వన్ని వున్నాయి,గృహప్రవేశానికి ముహూర్తం చూడాలి మీ అమ్మవాళ్ళ ని మా అమ్మ వాళ్ళని అందర్నీ పిలవాలి “అంటూ చిన్న పిల్లలాగా చప్పట్లు కొట్టింది లావణ్య .
     “ఆగాగు ఇప్పటికే తడిసి మోపెడు అవుతోంది మళ్ళి  ఇదో ఖర్చా వామ్మో మనకా ఇల్లు వద్దు ఈ బాధలు వద్దు నిన్నే మా ఫ్రెండ్ చెప్పాడు రిజిస్ట్రేషన్ ఖర్చు అది కాకుండా జి ఎస్  టి అది కూడా పద్దెనిమిది పెర్సెంట్ అక్కడికే అన్ని కలిసి తడిసి మోపెడు అవుతోంది మనం ఈ ఇంటి గొడవ వదిలేద్దాం” అని బతిమాలాడు సుదీర్ 
    “మరి నువ్వుఇప్పుడే అన్నావు కదా వెన్న కుండా అంటూ ఎదో ఎదో చెప్పావు మరి దాని సంగతేంటి “ అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది లావణ్య సుదీర్ ని ఆటపట్టిస్తూ “అవును కదా మరేం చేద్దాం సర్లే ఒక పని చేద్దాం ప్రస్తుతానికి ఈ వ్యవహారాన్ని కాస్త వాయిదా వేద్దాం , ఈ లోపు మన ఆకాష్ మావయ్య వాళ్ళ  ఊరిలో పొలం ఒక అర ఎకరం అమ్మకానికి వుందట మనకి ఎలాగో దానికి లోన్ ఇవ్వరు ఈ బ్యాంకు వాళ్ళు ప్రస్తుతానికి మన దగ్గర వున్న డబ్బులో కొంత పెట్టి అది కొందాము ఎవరైనా మంచి వారికీ కౌలుకు ఇద్దాము మట్టిని నమ్ముకున్న రైతు మోసం చేయడు ,ఏమంటావు లావణ్య “ అంటూ లావణ్య కేసి చూసాడు “నీ ఆలోచన బావుంది కాని కొనే ముందు మరి గుడ్డి నమ్మకం వద్దు ఒక్కసారి వెళ్లి పొలం చూసి దస్తావేజులు చూస్కుని మరి కొందాము ఎవరిని అతిగా 
నమ్మద్దు మన జాగ్రత్త లో మనం కుడా వుండాలి.” 
    “సరే లావణ్య రేపు మావయ్య తో మాట్లాడి మనం వచ్చే వారం అక్కడికి వెళ్దాము ,ఈ లోపు మనం ఆఫీస్ లో లీవ్ పెట్టాలి కదా” “ హా సరే సుదీర్ అలాగే “ అంది లావణ్య  అనుకున్నట్టు గానే సుదీర్ వాళ్ళ మావయ్య నేను అన్ని చూసి పెడతాను మీరు ఒకసారి శెలవు పెట్టి రండిరా అని భరోసా ఇచ్చారు.ఇద్దరు తాడేపల్లిగూడెం దగ్గర మాధవరం అనే ఊరు వెళ్లారు ఊరు చక్కగా పొలాలతో కళకళలాడుతోంది రోజు కాంక్రీట్ జంగల్ చుసిన వారి కళ్ళకి ఈ ఊరు హాయిగా అనిపించింది . వారిని సాదరంగా ఆహ్వానించారు ఆకాష్ దంపతులు “రామ్మా పెళ్ళైన ౬ ఏళ్ళకి వచ్చారు ఎదో మా ఊరిలో పొలం పేరు చెప్పి మాకు మిమల్ని చూసే అవకాశము దొరికింది “అంటూ హాస్యమాడారు ఆకాష్ గారు ఇంతలో ఆకాష్ గారి భార్య వాసంతి గారు “ఎంటండి మా అమ్మాయిని అంటే ఊరుకుంటామా అయినా మీ అల్లుడు మన అమ్మాయిని తీసుకురాకపోతే పాపం మన అమ్మాయి ఏమి చేస్తుంది ఎరా అల్లుడు అత్త మామ ఇన్నాళ్టికి ఈ విధంగా గుర్తోచ్చారు “అన్నట్టు ఎప్పుడు తిన్నారో ఏంటో స్నానం చేసి రండి భోజనం వడ్డన చేసేస్తా  ఆనక తీరుబాటుగా మాట్లాడుకోవచ్చు “
        అందరు భోజనాలకి కూర్చున్నారు వేడి వేడి అన్నం లో చక్కటి పప్పు,గుత్తొంకాయ కుర,గోంగూర పచ్చడి,ముక్కల పులుసు ,గడ్డ పెరుగు తో లావణ్య సుదీర్ ఇద్దరికి వాసంతి గారు కొసరి కొసరి వడ్డిస్తుంటే భుక్తాయాసం వచ్చేలాగా తినేశారు .లావణ్య “అమ్మో పిన్నిగారు ఎక్కువ తినేసాము ఆయాసం  వస్తోంది “ అంది  నవ్వుతు “ ఏంటి దీనికేన ఇంకా మినప సున్ని ఎదురుచూస్తుంటే అన్నారు ఆకాష్ గారు “అమ్మో మావయ్య ఇంకో పలుకు తిన్నానంటే  వినయకుడి లాగా పొట్ట పగిలిపోడం ఖాయం” అన్నాడు సుదీర్ ,ఆ మాటలకి అంతా నవ్వుకున్నారు.
  సాయంత్రం కాస్త టీ నీళ్ళు గొంతు లో పోస్కుని పొలం చూసేందుకు బయల్దేరారు నలుగురు “అవును పిన్ని మీ పిల్లలేరి ఎన్నింటికి వస్తారు “ అని అడిగింది లావణ్య “ వాళ్ళు ఇద్దరు కోచింగ్ లు కదా సి ఏ ఎంట్రన్స్ కి ఇంకా నాలుగు నెలలే వుంది కదా అందుకే కోచింగ్ టైం పెరిగింది అభినయ ,అశ్వత్ ఇద్దరు కామర్స్ వైపే వెళ్లారు,బహుసా ఈ వారం హాస్టల్ లోనే వుంటారు పద్దాక తిరిగితే అందులోనే సగం టైం వృధా కదా లావణ్య”. 
    “అన్నట్టు మా ఊరి కొబ్బరి నీళ్ళు తాగండి రా ,రామయ్య ఒక నాలుగు బొండాలు దింపు అన్నట్టు ఇదే మన పొలం రా ,సంవత్సరానికి రెండు పంటలు ఇస్తుంది అది కాకుండా చుట్టూ కొబ్బరి వేసాను ,గోదారి తల్లి దయవల్ల నీటికి కొరత లేదు ,గవర్నమెంట్ వారి పుణ్యామాని కరెంటు కోత  లేదు అందువల్ల దిగుబడి రాబడి రెండు మర్యాదగానే వున్నాయి”అంటూ చెప్పుకొచ్చారు ఆకాష్ మావయ్య .అలా నడుస్తూ నలువైపులా చూస్తున్నారు సుదీర్ దంపతులు కాంక్రీట్ జంగిల్ చుసిన వాళ్ళ కళ్ళకి పచ్చటి పొలాలు, చల్లని పిల్లగాలులు చూస్తుంటే నేలమ్మ పచ్చ చీర కట్టుకున్నదా అన్నంత ముచ్చటగా వుంది.
   “అన్నట్టు ఇదే రాఘవయ్య గారి పొలం ఇదివరకు ఆయనే సొంతంగా సాగు చేసేవారు ఇప్పుడు ఆరోగ్యం పాడయింది పొలం అమ్మేసి పట్నం లో వున్న కొడుకు దగ్గరికి పోదాము అనుకుంటున్నారు ,ఈ మాధ్య ఈ చుట్టూ పొలాల మీద కార్పొరేట్ సంస్థల కన్ను పడుతోంది పచ్చటి పంట పొలాలని నాశనం చేసి లేఔట్ లు కట్టేస్తున్నారు ,కాని రాఘవయ్య గారు లాభాపేక్ష  తో అలా ఇవ్వదల్చుకోలేదు,అందుకే నీ గురించి మీరు కౌలు కి ఇస్తారు అని చెప్పగానే చప్పున ఒప్పేసుకున్నారు ,ఇది ఆయన కష్టార్జితం తో కొన్న పొలం కాబట్టి దాయాదులు పంపకాలు అంటూ దస్తావేజుల్లో సమస్యలు వుండవు, రేపు మనం గూడెం లో వున్న లాయర్ రవిగారిని ఒకసారి కలిసి దస్తావేజులు చుపించుకుని వద్దాము ,ముందు ముందు ఎటువంటి సమస్యలు రాకుండా వుంటాయి “ అని చెప్పారు ఆకాష్ గారు .
    తమ ఆలోచనలని చదివిన్నట్టు ఆయన అవి చెప్తూ వుంటే సుదీర్ దంపతులు చాల ఆనందపడ్డారు ,మర్నాడు లాయర్ గారు దస్తావేజులు చూడడం అన్ని బావున్నాయి అనుకోవడం,తర్వాత మూడో రోజు పొలం వీరి పేరిట రిజిస్టర్ చెయడం అన్ని చకచక జరిగిపోయాయి. “మావయ్య ఈ పని ఇంత సులువు గా అవ్వడానికి కారణం మీరే అలాగే ఈ పోలాన్ని జాగ్రతగా చుస్కునే కౌలుదారులను చూసి పుణ్యం కట్టుకో “ అన్నాడు సుదీర్ ,”ఒహ్హ అదెంత పని రా చిటిక లో చేసోయ్యొచ్చు ,మీరు నేల తల్లి ని ప్రేమిస్తున్నారు ,ఇంతకన్నా ఏమి కావలి రా “ అంటూ భుజం మీద చెయ్యి వేసి     “వాసంతి రంగన్న కి కబురుపెట్టు ,రంగన్న వాళ్ళ కుటుంబం తరాలు గా మన ఊరిలో వుంటూ పొలం కౌలు మీద పనిచేస్తున్నారు ,కష్టపడే మనస్తత్వం ,పొలాన్ని జాగ్రత్తగా చుస్కుంటాడు ఇకపోతే కౌలు వాటా మాట్లాడుకుంటే సరి.” 
     
    ఆ మాటలు విన్న లావణ్య సుదీర్ లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు” మావయ్య మేము  బెంగుళూరు లో ఒక ఇల్లు కొనడానికి మేము  ఆరు నెలలు ఎన్ని పాట్లు పడ్డాము  అలాంటిది పొలం కొనడం  కౌలు కి ఇవ్వడం అన్ని వారం లో జరిగిపోయాయి ,లాభం సంగతి పక్కనపెడితే పచ్చని ప్రకృతి ఒడి  లో సేదతీరారు .అందుకే అంటారు భూమిని నమ్ముకున్నవాడు చెడింది లేదు అని ,పైగా పట్నాల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు సరికదా సాయం చెయ్యమంటే తమ ఆస్తి అడిగినట్టే భావిస్తారు,అదే పల్లెలో మనషుల మనసులు ఇంకా కలుషితం కాలేదు వారి నేల గాలి లాగే అవి స్వచ్చంగా వున్నాయి,అవకాసం వచ్చినప్పుడు అల్లా మా బుర్రలకి పట్టిన కాలుష్యం ఇక్కడి పచ్చి గాలి తో కడిగేస్కుంటాం ”. 
         “ అవును బాబాయ్ గారు మా పట్టణాల్లో వుండే ఇరుకు ఇళ్ళతో పాటు మా మనసులు కూడా ఇరుక అవు తున్నాయి ,అసలు ఇలా పల్లెలో స్వచ్చమైన మనసులు,ప్రేమలు , నవ్వులు చూస్తుంటే మనసుకి ఉల్లాసం వస్తోంది ,కనుక ఈ సారి నుండి అవకాసం దొరికినప్పుడు అల్లా ఈ పల్లెలో వాలిపోతాము,దానికి సాయం ఇప్పుడు మీతోనే కాకుండా మీ  ఊరు తో మాకు చుట్టరికం ఏర్పడింది ,చుట్టాలను జగ్రత్హగా చుస్కోవాలి కదా మరి  ” అంది లావణ్య తన విశాలమైన కన్నులును టపటపలాడిస్తూ  ఆ మాటలకి హాయిగా నవ్వేసారు ఆకాష్ దంపతులు కోనసీమ వెన్నెలంత స్వచ్చంగా ఉందా నవ్వు. 

1 comment:

Pages