పుష్యమిత్ర - 30
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర. ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు. అక్కడ దొరికిన ఒక నాణెం ఆధారంగా నిధి ఎక్కడ ఉన్నదీ తెలుసుకుంటారు.పుష్యమిత్రునితో కలిసి ఖెవ్రా సాల్ట్ మైన్స్ సందర్సిస్తారు. అలాడిన్ అనే ఒక గైడు సాయంతో లోనకు వెళ్తారు. అక్కడ దొరికిన ఒక నాణెం ఆధారంగా నిధి ఎక్కడ ఉన్నదీ తెలుసుకుంటారు. పుష్యమిత్రుని సలహామేరకు ఎయిడ్స్ కు మందు కనిపెట్టే విషయంలో కొరియెన్ గిన్సెంగ్ అనే వేరు బాగా పని చేస్తుందన్న విషయం బయటపడుతుంది. (ఇక చదవండి)
హిమాలయాల ట్రెక్కింగ్ బాచ్ లా నటిస్తూ పాకిస్తాన్ చేరుకొన్నఆరుమంది బృందం ఖెవ్రా చేరుకోగానే తిరుకడయూర్ అల్లబక్ష్ హోటల్ హుస్సేన్ ద్వారా పరిచయం చేసుకున్న మహమ్మద్ హనీఫ్ ఇంట్లో మకాం పెట్టారు. నాలుగైదు రోజులయ్యాక అక్కాడ ఏవో గనులున్నాయి చూడాలని చెప్పగా హనీఫ్ సహాయంతో గనుల వద్దకు చేరుకొంటారు. అక్కడ నుండి లోపలకు వెళ్ళాక ఏం చెయ్యాలో పంచాపకేశన్ సలహాలు తీసుకుంటారు. బృందం లీడర్ తూర్పు వేపు చూపి ఆ వైపుకు వెళ్ళాలి అనడంతో గార్డు "తూర్పు వేపు ఉప్పు డిపాజిట్లు లేవు. అందువల్ల విజిటర్లకు కూడా అనుమతిలేదు" అన్నాడు. "గేటు తీయించండి. మా వాళ్ళు ఒక్కసారి చూడాలంటున్నారు అన్న హనీఫ్ మైన్స్ మేనేజర్ కు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని తూర్పు వైపుకు ఒక ఫర్లాంగ్ వెళ్ళాక సార్ ఇక మనం ఇక్కడ చూసేదేమీ ఉండదు. వెళ్దాం పదండి అని కారు రివర్సు చేస్తుండగా బృందం లీడర్ "ఒకసారి మేము ఇక్కడ పది నిముషాలు ఉండాలి" అనగా గార్డు "ఇక్కడ గాలి రావడంలేదు. నేను మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోగా విషయం వెంటనే పంచాపకేశన్ కు తెలియజేస్తాడు. "ఎవ్వరూ లేకుండా చూసి అక్కడి సీ.సీ.కెమేరాలు ధ్వంసం చెయ్యండి" అని సలహా ఇవ్వగా లీడర్ నేను వస్తాను మీరు నడుస్తూ ఉండండి అని మిగతా వారిని పంపించి కెమేరాల వైర్లు కట్ చేస్తాడు. మిగతా వాళ్ళకు వెళ్ళిపొమ్మని మెసేజెస్ పంపించి లీడర్ వెంకటేశన్ మాత్రం అక్కడే గనిలో ఉండిపోతాడు. తనను గురించి అడిగితే తెలీదని చెప్పమంటాడు.
* * *
గిన్సెంగ్ పరిశోధనలో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఇంఫ్లూయెంజాకు, ఆర్.ఎస్.వీ వైరస్ రోటావైరస్ లాంటి అనేక వైరసులను సమర్ధవంతగా ఎదుర్కొంటుందన్న విషయం తెలుస్తుంది. పీ.ఇ.పీ గా పిలవబడే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ గా కూడా అత్యద్భుతంగా పనిచేయడం చూసి ఆశ్చర్య పోతారు సైంటిస్టులు. ఒకసారి పుష్యమిత్రుని ఈ విషయం చెప్పాలని లేబోరేటరీ కి పిలిపిస్తారు. ఆయన రాగానే గౌరవ సూచకంగా వందనం చేసి, కూర్చున్న తర్వాత జరిగిన పరిశోధనా విశేషాలు చెప్తారు. దానికి పుష్యమిత్రుడు సంతోషించి ఎకినేసియా, కెలండులా వంటి కొన్ని మొక్కలను గురించి వివరించి వీటి కలయికతో గిన్సెంగ్ ద్వారా ఏమైనా గొప్ప మందు తయారవుతుందేమో చూడమని సలహా ఇస్తాడు.
* * *
పుష్యమిత్రుడు ప్రధానిని కలిసి పంచాపకేశన్ వ్యవహారం ఏదో అనుమానాస్పదంగా ఉన్నదని తనకు తెలియకుండా అనేకసార్లు ఎవరితోనో మాట్లాడడం, అలెగ్జాండర్ కాలం నాటి నాణెం దొరికినప్పుడు చూపించిన అత్యంత ఆసక్తి ఏవో అనుమానాలను రేపుతున్నాయని ఒక కంట కనిపెట్టి ఉండడం మంచిదని చెప్తాడు.
* * *
గనిలో ఉండిపోయిన వెంకటేశన్ అందరూ వెళ్ళిపోయక లేచి బ్యాటరీ లైటు ఆధారంగా ఆ గోడలు పరికించి చూడడం ఆరంభించాడు. అవి మట్టిగోడలని చాలా డెలికేట్ గా ఉండి సులభంగా కూలగొట్టవచ్చునని తెలుసుకుంటాడు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా తను ఎక్కడ ఉన్నది సురక్షితమైన ప్రదేశం నుండి గనిలోకి ఎలా భూమిలో నుండి తొలిచిన బొరియల ద్వారా రావచ్చో అంచనా వేసుకుని ప్రక్కరోజు ఉదయం మెల్లిగా బయటకు వచ్చి జనంలో కలిసి బయటకు వచ్చి హనీఫ్ ఇంటికి చేరుకొని తను లోపల చిక్కుకు పోయినట్లు అబద్ధం చెబుతాడు.
* * *
ప్రధాన మంత్రి ఓ అత్యవసర పార్టీ మీటింగులో ఉండగా సీక్రెట్ సెక్యూరిటీ ఫోను రింగయింది. ఏదో కీడు శంకించి వెంటనే పంచాపకేశన్ ను పిలిచి "అర్జెంటు గా నా ఆఫీసుకు వెళ్ళి సెక్రెటరీ ఇచ్చే ఫైల్ తీసుకురండి. వెరీ.... వెరీ.... కాంఫిడెన్షియల్ కనుక మీకు చెప్తున్నా" అని పంపేశాక ప్రక్క గదిలోకి వెళ్ళి, మళ్ళీ రింగయిన ఫోన్ ఎత్తి "చెప్పండి" అన్నాడు.
"సార్! మనం వీసా ఇవ్వని ఆరుగురు ప్రస్తుతం ఇండియాలో లేరు. హిమాలయన్ ట్రెక్కింగ్ బృందం వేషాలలో పాకిస్థాన్ చేరుకున్నారట."
"ఓ మై గాడ్. ఇవన్నీ నీకెవరు చెప్పారు"
"సార్! మనం వీసా ఇవ్వని వాళ్ళపై నిఘా పెట్టమని లోకల్ సీ.ఐ.డీ డిపార్ట్మెంటుకు చెప్పాం కదా వారిని అనుసరించి వెళ్ళిన సీ.ఐ.డీ ఒకడు పాకిస్తాన్లో ఉన్నాడు. వాళ్ళలో వెంకటేశన్ అనే అతను చాలా డేంజరస్ వ్యక్తి. అతను ఒకరోజు మాయమయ్యి మళ్ళీ ఖెవ్రా మైన్స్ దగ్గరలో ఉన్న పిండ్ దండంఖాన్ అనే గ్రామంలో హనీఫ్ అనే వాడి ఇంట్లో చేరాడు. వాళ్ళ ప్లానేంటో అర్ధం కావడంలేదు. వాళ్ళు ఉప్పుగనులకు ఎందుకు వెళ్తున్నారో తెలీడంలేదు"
"మై గాడ్. చాలా ప్రమాదం. ఆ విషయాలు వదిలేసి వాళ్ళపై కన్నేసి ఉంచు. అతనికి సహాయంగా మరో నలుగురిని పంపించు."
"యెస్సార్"
"ఇండియా బార్డర్లో అడుగుపెట్టాక అరెస్టు చేసి దిల్లీ తీసుకురండి"
"యెస్సార్"
* * *
ఆ రాత్రి పుష్యమిత్రునితో సమావేశం అయ్యాడు పీ.ఎం.
"మీరు చెప్పిన విషయం నిజమే! పంచాపకేశన్ మనుష్యులు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నారు"
చిన్నగా నవ్విన పుష్యమిత్రుడు "అక్కడ దాచిన ధనం కొట్టెయ్యాలని పధకం వేస్తున్నాడు. అదంత తేలిక కాదు"
"హిందూ దేశంలో మొదటినుండి మన ఆంతరంగికుల వలననే ముప్పు. ఆనాడు అంభి మహారాజు సాయం చెయ్యకపోతే అలెగ్జాండర్ వచ్చే వాడు కాదు. జాగ్రత్తగా ఉండండి."
"వాళ్ళు తిరిగి వచ్చే ముందు కచ్చితంగా ఫ్లైట్ లోనే వస్తారు. వాళ్ళ పాస్పోర్టులను స్వాధీనం చేసుకుని అరెస్టు చెయ్యమని చెప్పాను"
"మంచిది. పంచాపకేశన్ ను మనం ఆధారం దొరికితే గానీ ఏమీ చెయ్యలేము. ఆయన వాడే అన్ని రకాల ఫోన్లను రికార్డు చెయ్యమని చెప్పండి"
"అలాగే"
"మా రోజుల్లో గూఢచారు లుండేవారు విషయాలు చెప్పడానికి.. ఈ రోజుల్లో మీ టెక్నాలజీ చాలా బాగుంది"
ప్రధాని నవ్వుతూ "దీన్లో ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి" అన్నాడు.
* * *
"సార్! మమ్మల్నెవరో ఫాలో అవుతున్నట్టుగా ఉంది. మేం వీధిలోకి రాగానే ఐదారుగురు వ్యక్తులు రకరకాల వేషాలతో రకరకాల వాహనాలతో వెంబడిస్తున్నట్టు ఉంది"
"చంపగలిగితే చంపెయ్యండి. నేను చెప్పే వరకూ మైన్స్ వేపు వెళ్ళకండి. ప్రస్తుతానికి మీరు ఏదో ఫ్లైట్ పట్టుకుని వచ్చేయండి. దిల్లీ ఎయిర్పోర్టులో ఫ్లైట్ మారి చెన్నై వెళ్ళిపోండి. దిల్లీ లో అడుగుపెట్టవద్దు. చెన్నై వెళ్ళిపోండి. మళ్ళీ మంచి సమయం చూసి ఏమి చెయ్యాలో చెప్తాను"
"ఓకే సార్. రేపు ఇండియా బార్డర్ చేరుకుంటాము"
"గుడ్. గో అహెడ్. బై"
అప్పటివరకూ వాట్సప్ లో రికార్డెడ్ వాయిస్ విన్న ప్రధాన మంత్రి భృకుటి ముడిపడింది.
"ఈ ఆధారం చాలదు. వాళ్ళను దిల్లీ లో దింపి ఇంటరాగేట్ చేసి మీ వెనుక వున్నది ఎవ్వరో చెప్పమని అవసరమైతే ధర్డ్ డిగ్రీ ఉపయోగించి అడగండి” అని సమాచారం తెచ్చిన సిబ్బందికి చెప్పి పంపించాడు. ( సశేషం)
No comments:
Post a Comment