రంగవల్లి - అచ్చంగా తెలుగు
రంగవల్లి
టేకుమళ్ళ వెంకటప్పయ్య 

"రేపటి నుండి నెలరోజులు ప్రిపరేషన్ హాలిడేస్ కదా….. ఊటీ...గోవా…. ఏదైనా ప్లాన్ చేద్దామా? నాల్రోజులు జాలీగా..." 
"లేదు శశీ!....నేను రేపు ఉదయం మావూరెళ్ళిపోతున్నా.. మళ్ళీ ఎగ్జాంస్ కు వారం రోజులు ముందు..." అన్న శేఖర్ మాటలకు అడ్డొస్తూ..
"అదేంటి? ఇక్కడే హాస్టల్లో ఉండొచ్చుగదా! పైగా నేను కూడా మా వూరు వెళ్ళడంలేదు…నీకు తెలుసు  కదా… నాకిక్కడ ఒక్కదానికే బోర్....ప్లీజ్...ప్లీజ్.. ఉండిపో..." అంది శశిరేఖ.
"లేదు నాన్నగారు రెండు నెలలల్నుంచీ రమ్మని ఫోను చేస్తున్నారు. నాకే ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్సూ అవీ... ఇవీ...కుదరలేదు...వెళ్ళాలి."
"సర్లే..వెళ్ళు……మీ నాన్నగారి కోసమో..లేక నీ మరదలుపిల్ల… రంగసాని... అదే పల్లెటూరి గబ్బిలాయి… రంగి కోసమో... నాకెందుకూ.. మధ్యన…" అంది నిష్టూరంగా.
"ష్.. అబ్బా.. ఎందుకు ప్రతిదానికీ పెద్ద సీను చేస్తావు? మధ్యలో అమాయకురాలు రంగి గొడవెందుకు తెస్తావు. నేను అక్కడ పొలంలో మంచె మీద హ్యాపీగా చదువుకోవచ్చు. ఏ డిస్టర్బెన్సు లేకుండా... ఇంటర్ వరకూ అలా చదివే అన్ని మెడల్స్ తెచ్చుకున్నాను తెలుసా!"
హ్మ్..నేనిక్కడ నీకు డిస్టర్బెన్సనేగా…... మీ మరదలు పెద్ద అమాయకురాలు. అను… అను. నిన్ను ముగ్గులోకి దింపుతుందేమోనని…నాది.  మన పెళ్ళయ్యాక చెప్తా దాని పని. నేను నీకు తలనొప్పిగా తయారయ్యననేగా.. నువ్వనేది. నువ్వేమో గోల్డ్ మెడల్ స్టూడెంటువి. నేనొక మొద్దు స్టూడెంటును. "
"ష్.. హబ్బా. అది కాదు శశీ.  నాకు మంచి సీ.జీ.ఉంది. ఇంకొంచెం కష్టపడితే గోల్డ్ మెడల్ వస్తుంది కదా! అలా వస్తే రేపు మన పెళ్ళయ్యాక మంచి జాబ్ వస్తే నీకే కదా సంతోషం"
"నీకు ఆల్రెడీ క్యాంపస్ లో మంచి జాబే వచ్చింది కదరా!  8 లక్షల ప్యాకేజీతో. ఇంకెందుకు కష్టపడటం. ఎంజాయ్ చెయ్యక.
"నిజమే! మనం జాబ్ మారాలన్న.. ప్రొమోషన్ రావాలన్నా మనకంటూ ఏదో ఒక స్పెషాలిటీ లేకపోతే కష్టం"
"సర్లే ఏదో ఒకటి ఏడువ్.  చెప్తే వినవు కదా...జాబ్ వచ్చినా ఇంకా ఎందుకు కష్టపడుతున్నావో నాకర్ధం కాదు. హూ..ఒరేయ్... ఇవాళ శుక్రవారం కదా.. మనం.. సరదాగా"
"బిర్లా టెంపుల్ కేగా... వెళ్దామా? ఓకే. ఆ ఏడుకొండలవాడికి మ్రొక్కుకోవాలి గట్టిగా... గోల్డ్ మెడల్ నాకే రావాలని…"
"ఓరి నీ గోల్డ్ మెడల్ గోడకు దిగ్గొట్టా... ఏం చేసుకుంటావురా...నన్ను చెప్పనివ్వరా! బడుద్ధాయ్! ఎప్పుడూ చదువు గొడవేనా.. చదువుతావే గానీ లోకజ్ఞానం సున్నారా నీకు…. మనం పబ్బుకు వెళ్ళి ఆరు నెలలైంది. వెళ్దాం రా.. ప్లీజ్. మళ్ళీ ఎగ్జాంస్. ఈ గొడవలతో సరిపోతుంది"
"వద్దు...పోయిన సారి నువ్వు తాగి చేసిన అల్లరి…. డ్యాన్స్ పేరుతో నీ గెంతులు….  అంతా ఇంతా కాదు..అది తల్చుకుంటే... ఇప్పటికీ నాకు కంగారుగానే ఉంది
"ప్లీజ్ రా.. మనకు ఎంజాయ్ చేసే వయసు….. కాలం… మళ్ళీ మళ్ళీ… రాదురా.."
"నేను రాను"
"అయితే నేను డేవిడ్ గాడితో వెళ్తా.. ఛంపుతున్నాడు. . రోజూ... పబ్బుకురా. పబ్బుకురా. అని"
"శశీ.. తప్పు... అలా చేయకు... ప్లీజ్ "
"అయితే..రా..."
"సరే"
* * *
రైలెక్కి ఒక్కసారి హాయిగా గాలి పీల్చుకున్నాడు. ఉదయం 9 గంటలకు స్టేషనుకు వస్తానన్న శశి ఇంకా రాలేదు. ఎక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కుందో ఏమో.. అనుకుంటూ ఫోను చేశాడు. నాలుగైదు సార్లు చేశాక  ఫోను ఎత్తి.."సారీరా.. ఏమనుకోకు..ఇంకా నిద్ర లేవలేదు..బై..హాపీ జర్నీ.." అని ఫోను పెట్టేసింది. ఒక్కసారి నీరసం ముంచుకొచ్చేసింది. నాన్నకు ఫోను చేశాడు తను వస్తున్నట్టు.
* * *
సమయం సాయంత్రం నాలుగు గంటలవుతోంది.ఆటో దిగుతూండగానే.. వాకిట్లో ఉన్న అంత పెద్ద రంగు రంగుల ముగ్గు చూసి ఆశ్చర్యపోయాడు. మధ్యలో "వెల్కం టు శేఖర్ బావ" అని పెద్ద అక్షరాలతో ఉంది.  వాకిట్లో నుంచే అమ్మా! అని పెద్ద కేకేసి ఏమిటిదంతా..ఎవరు? అని కళ్ళెగరేసి అడిగాడు. 
"ఇంకెవరు నీ ముద్దుల మరదలు. శ్రీరంగనాయకీ…  శ్రీవేదవల్లిగారు. పొద్దున మొదలెట్టిది ముగ్గు ఇప్పటికయ్యింది. ఆరు గంటలు పట్టింది వెయ్యడానికి. ఎవ్వర్నీ కదలనివ్వదు. అటూ ఇటూనడవనివ్వదు...ఏమిటో దాని పిచ్చి.."
కిటికీ లోంచి చూస్తూ నవ్వుతూ నిలబడి ఉంది లోపల రంగి.
"ఏయ్.. బల్లీ.. …ఇలా రావే!..నీకు వేరే పనీ పాటా... ఏమీ లేవా? ఎందుకివన్నీ.."
"చూడత్తా... బావ..ఇంత కష్టపడి వేస్తే..." మూతీ తిప్పుకుంటూ తుర్రుమంది.
"ఏరా.. పరీక్షలెప్పుడు? బాగా చదువుతున్నావా? ఈ సంవత్సరం కూడా గోల్డ్ మెడల్ రావాలి." అంటున్న నాన్నతో.
"గ్యారంటీగా వస్తుంది నాన్నా!"
"అవునట.. మీ లెక్చరర్లంతా అదే చెప్పారు పోయినసారి నేను కాలేజీ ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు"
"ఉద్యోగం కూడా వచ్చేసింది నాన్నా.. శెలవులవగానే చేరాలి"
"ఆ మూడుముళ్ళూ కూడా వేయించి పంపిస్తే..మాకు ఏ దిగులూ ఉండదు రా.." అన్న అమ్మ మాటలకు
"అమ్మా.. నేను ఇంకో రెండు సంవత్సరాలు ఆగి చేసుకుంటాను"
"నువ్వు అలాగే అంటావు. రంగి, వాళ్ళమ్మా నన్ను తినేస్తున్నారు రోజూ… ముహుర్తాలు ముహుర్తాలంటూ" నవ్వుతూ వంటింట్లోలొ వెళ్ళిపోయింది కాఫీలు అవీ తేవడానికి.
* * *
సాయంత్రం 6 దాటింది. ఫ్రెండ్సును కలవడానికి తయారవుతుండగా ఏవో స్వీట్స్ గట్రా గట్రా లగేజీతో దిగింది. అవి లోపల పెట్టి వచ్చి "బావా… ఇవాళ శనివారం కదా.. మనం సరదాగా.." 
"హా..సరదాగా.."
"గుడికి వెళ్దాం బావా.."
"నాకు పనుంది నువ్వెళ్ళు"
"అయితే నేనూ వెళ్ళను"
"ఇంకెవరితోనైనా వెళ్ళు"
"వెళ్ళను గాక వెళ్ళను. వెళ్తే నీతోనే.. పరాయి వాళ్ళతో వెళ్తారా!"
ఎందుకో...ఆక్షణాన... “అయితే నేను డేవిడ్ గాడితో వెళ్తా.. ఛంపుతున్నాడు. . రోజూ... పబ్బుకురా. పబ్బుకురా” అన్న శశిరేఖ మాటలు గుర్తొచ్చాయి. తేరుకుని "మొండి ఘటం.. పద.." అన్నాడు.
దారంతా ఏవో కబుర్లు చెప్తూనే ఉంది నాన్ స్టాప్ గా. గుడిలో అర్చన అయ్యాక బయట కూర్చుని ఉండగా.. ఒకతను వచ్చి 'పూజారిగారు పిలుస్తున్నారు'  అనేసి వెళ్ళిపోయాడు. వల్లి కొళాయి దగ్గర నీళ్ళు తాగుతోంది. ఏమిటా అని వెళ్ళాను.  ఆయన ఎంతో ఆప్యాయంగా "బాబూ శేఖరం.. నీకు గోల్డ్ మెడల్ రావాలని నీ మరదలు గత ఆరు నెలలుగా ఉపవాసాలు ఉంటోంది.  వారం వారం నీపేర అర్చనలు కూడా చేయిస్తోంది. రాకపోతే బాధ పడుతుంది. నువ్వు మంచి మెరిట్ స్టూడెంట్ అని నాకు తెలుసు. కానీ ఆ మెడలేదో జారవిడుచుకోకు…కొన్ని జీవితంలో పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ సంపాయించుకోలేం.. నాయనా..వల్లి చాలా బాధ పడుతుంది. అదుగో వల్లి వస్తోంది. నేను చెప్పినట్టు ఏమీ చెప్పొద్దు బాబూ... అకాల మృత్యుహరణం. సర్వవ్యాధి నివారణం." అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.
"ఎందుకు దీనికి నేనంటే ఇంత పిచ్చి" అనుకుంటూ బయటకు వచ్చాడు.
"ఏమిటట?  పూజారి గారు పిలిచారు?" అంది
"పెద్దాయన కదా...చదువు ఎప్పుడు అయిపోతుందని, ఉద్యోగం వెంటనే వస్తుందా… అంటూ ఏవో ప్రశ్నలు"
"మంచి ఉద్యోగం రావాలని దేవుడికి రోజూ పూజ చెయ్యమని చెప్పకపోయ్యావా బావా.... సర్లే వెళ్దాం పదా.."
దార్లో మళ్ళీ కబుర్లు  మొదలెట్టింది. ఇళ్ళు చేరాక బావా….. రేపు ఉదయంనీకు మన తోటలో ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. .. ఉదయాన్నే 8 గంటలకు వెళ్దాం…. రెడీ గా ఉండు గుర్రబ్బండితో వస్తా.
"అమ్మా! మావయ్యా వాళ్ళు గుర్రబ్బండి కొన్నారా?" అని అమ్మను అడుగుతుంటే...
"ఆᴄ…ఇదే…శ్రీవల్లి…పోరుపెట్టి కొనిపించింది. నడపడం కూడా నేర్చేసుకుంది. స్పీడ్ గా తోలుతుంది. మగరాయుడిలా..." అంది నవ్వుతూ.
 * * *
"బావా..పద వెళ్దాం. డ్రైవర్ నేనే తెలుసా..."
"వద్దు...వద్దు.. పడేశావంటే నా నడుం విరుగుతుంది. పరీక్షలు కూడా రాయలేను. "
"లేదు 2 నెలలనుంచీ నేనే డ్రైవర్...భయంలేదు ఎక్కు చెప్తా..."
"వల్లీ! నీకు రెండు పేర్లేంటి?"
"ఒకటి శ్రీవల్లి మా అమ్మమ్మ పెట్టింది. ఇంకోటి శ్రీరంగనాయకి మా నానమ్మ పెట్టింది. నీకు ఎలా ఇష్టమైతే అలా పిలువ్"
"బల్లీ! అని పిలుస్తాను. సరేనా!" అన్న మాటకు కిల కిలా నవ్వుతూ... వాయువేగ మనోవేగాలతో పది నిముషాల్లో తోటకు చేర్చింది. ఎప్పుడూ నేను చదువుకునే మంచె నందనవనంలా తయారయ్యింది. చుట్టూ మల్లె తీగలు అల్లుకుని సువాసనను వెదజల్లుతున్నాయి. పైకి ఎక్కడానికి కొయ్యమెట్లు. మంచె మీద మెత్తటి బూరుగ దూది పరుపు. పైన ఎండ పడకుండా కొబ్బరి ఆకుల కప్పులు. పంప్ షెడ్ నుంచి లాగిన కరెంటు బల్బు. మొబైల్ కు ల్యాప్టాప్ కు చార్జింగ్ పిన్ పాయింట్లు. ఒక్కసారి ఆశ్చర్య పోయాను.
"వల్లీ ఎవరు ఈ ఏర్పాట్లన్నీ చేశారు? 
"శ్రీరంగనాయకి.. శ్రీవేదవల్లీదేవిగారు. శేఖర్ గారి అనుంగు మరదలుంగారు" అని మీసంపై చెయ్యివేసి.. హా..హా..హా. అంటూ నవ్వుతూ సినిమా ఫక్కీలో… డైలాగ్ చెప్పింది. అవును…ఇంతకీ.. బావుందా? నీకు నచ్చిందా?"
కళ్ళలో ఏదో తెలీని సన్నటి నీటి పొర.. చాలా బావుంది వల్లీ..." అని స్వచ్ఛమైన నీ మనసులా.. అని మనసులో అనుకున్నాడు.
"బావా నువ్వు పైన చదువుకుంటూ ఉండు. కరెంటు పోతే సమస్య లేకుండా నాన్న సోలార్ పవర్ ఏర్పాటు చేశాడులే... నేను క్రింద మావిడి కాయలు కోసుకుంటూ... వుయ్యాల వూగుతూ ఉంటాను. నువు చదువుకో" అని క్రిందకు దిగి వెళ్ళిపోయింది.
బడలిక వల్ల ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మెలుకువ వచ్చింది. ఎక్కడున్నానో ఒక్క క్షణం అర్ధం కాలేదు. టైం ఎంతయిందో తెలీదు. పక్కన శ్రీవల్లి తాటాకు విసనకర్రతో విసరడం మాత్రమే తెలుస్తోంది. ఎప్పటినుండి అలా విసురుతోందో తెలీదు. వల్లి నుదుటిపై స్వేదం.. చెక్కిళ్ళ మీదనుండి క్రిందకు కారుతోంది. ఉలిక్కిపడి లేచాను.
"ఏమైంది బావా.. కలగానీ వచ్చిందా?"
"లేదు తెలీకుండా నిద్ర పట్టేసింది. నువ్వు ఇక్కడ ఎంతసేపైంది వచ్చి."
"ఒక అరగంటైంది బావా.. నేను వుయ్యాల వూగుతూ.. వూగుతూ.... ఏమీ అలికిడి లేదేంటబ్బా.. అని పైకెక్కి చూస్తే మంచి నిద్రలో ఉన్నావు.  నీకు చెమట కారిపోతోంది. అందుకే మోటార్ షెడ్డులో విసనకర్ర తెచ్చి విసురుతూ కూర్చున్నా.. బావా టైం రెండవుతోంది. వెళ్దాం పదా.. సాయంత్రం వద్దాం." అంటూ మంచె దిగింది.
 * * *
తెలీకుండానే మూడు వారాలు గడిచి పోయాయి. ఈ మధ్యలో అసలు శశిరేఖ గుర్తే రాలేదు. తనూ ఫోను చెయ్యలేదు. ప్రయాణానికి పుస్తకాలు సర్దుకుంటూ ఉండగా శ్రీవల్లి గదిలోకి వచ్చింది. పెద్ద సంచితో.. అన్నీ తినుబండారాలే..."బావా! రోజూ ఇవన్నీ తినాలి. మీ ఫ్రెండ్సుకు కూడా ఇవ్వు. ఎక్కువే పెట్టానులే!  బాగా చదివి గోల్డ్ మెడల్ ఎప్పుడు తెస్తావా అని ఎదురు చూస్తుంటా! రాగానే ఆమెడల్ నాకే ఇవ్వాలి." అని వంగి కాళ్ళకు నమస్కరించింది. “ఓరి నీ గోల్డ్ మెడల్ గోడకు దిగ్గొట్టా... ఏం చేసుకుంటావురా...బడుద్ధాయ్!” అన్న శశిరేఖ తిట్లు మళ్ళీ గుర్తొచ్చాయి. ఒక్కసారి కళ్ళల్లో నీటిపొర. ఎందుకో తెలీదు. వంగి శ్రీవల్లిని లేవదీసి,  ఏంటిది? అంటూ నుదిటిమీద ముద్దుపెట్టుకున్నాను. అదే నేను శ్రీవల్లిని మొదటిసారి ప్రేమగా తాకడం. వెంటనే సిగ్గుతో బయటకు పారిపోయింది.

* * *
పరీక్ష హాల్ నుండి బయటకు వచ్చేసరికి ఫ్రెండ్స్ కనిపించారు. ఏమయిపోయావు అంటూ పరామర్శ చేశారు.
"ఒరేయ్. శేఖర్… నీకో బాడ్ న్యూస్ చెప్పాలిరా" అన్న సుందర్ మాటలకు రాము అడ్డొస్తూ.."ఒరేయ్..సుందరూ.. నోర్ముయ్ రా.. అన్నీ నీకే కావాలి" అన్నాడు. 
"ఏంటి పర్వాలేదు చెప్పండి" అంటూ ఎంతో బ్రతిమాలితే..
"ఏమీలేదురా! శశిరేఖ… ఆడేవిడ్ గాడితో పబ్బులో మందుకొట్టి పడిపోయింది. పబ్బు టైమింగ్స్ పాటించడంలేదని అదే సమయంలో యజమాన్యం మీదికి దాడికి వచ్చిన పోలీసులు అక్కడున్న శశిని, డేవిడ్లను కూడా పోలీస్ స్టేషనుకు పట్టుకెళ్ళారు. శశి వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడి విడిపించాడు. ఆరోజే వాళ్ళ వూరెళ్ళిపోయింది.  ఇవన్నీ పేపర్లో వచ్చాయి చదవలేదా! ఈరోజు పరీక్ష టైం లో వాళ్ళ నాన్న శశిని కార్లో ఇక్కడ దింపాడు. పరీక్ష కాగానే వస్తానని చెప్పడం విన్నాం. నువ్వు అప్పటికే పరీక్ష హాల్లోకి వెళ్ళిపోయావు. 
* * *
చివరి పరీక్ష రాసి వచ్చిన శేఖర్ కు వరండాలో శశిరేఖ కనిపించింది.
"శేఖర్! కొన్ని పొరబాట్లు జరిగాయి. నిజమే. నీవు మీ అమ్మా నాన్నలతో త్వరగా మావూరు వస్తే బావుంటుంది. వెంటనే మన పెళ్ళి జరిగిపోవాలి".
"శశిరేఖా! కొన్ని విషయాలు నేను నీకు చెప్పడంకంటే ఉత్తరం ద్వారా తెలియజేయడం మంచిదని ఉత్తరం రాసి తీసుకొచ్చాను" అంటూ ఉత్తరం అందించాడు. ఇంతలో "రేయ్. శేఖర్" అంటూ ఫ్రెండ్స్ చుట్టు ముట్టారు.
శశిరేఖ కారెక్కి నిద్రవస్తుందని చెప్పి వెనుక సీట్లో కూచుని అదిరే గుండెలతోమెల్లిగా ఉత్తరం విప్పింది.
శశిరేఖా!   నీకు నేను రాసే తొలి చివరి ఉత్తరం కూడా ఇదే!  మనిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే! పెళ్ళి చేసుకోవాలనుకున్న మాటా నిజమే.. నీవు కోటీశ్వరురాలి అమ్మాయివి. మాది మధ్యతరగతి రైతు కుటుంబం. ఏవిధంగా చూసినా నేను నీకు సరిపోను. అలాగే నా మనస్తత్వానికి నువ్వూ సరిపోవని అనిపించింది ఈ నెల రోజుల్లో. దానికి అనేక కారణాలు. అవన్నీ నీకు చెప్తున్నాను. నువ్వు ఆరోజు స్టేషనుకు రాలేదని చాలా బాధపడ్డాను. 
ఆవిషయం ప్రక్కన పెడితే.. ఆరోజు సాయంత్రం నేను వెళ్ళేసరికి నా మరదలు శ్రీవల్లి వాకిట్లో ఒక ఏభై గజాల స్తలంలో ఒక పెద్ద ముగ్గు పెట్టింది. ఎన్ని కలర్స్ వాడిందో తెలీదు. 6 గంటల సమయం పట్టిందట. నేను ఆ ముగ్గును జీవితాంతం మరువలేను. దాన్ని ఫేస్బుక్ లో షేర్ చేశాను.  చూసే వుంటావు. మొదట కోపం నటించినా సాయంత్రం తీరిగ్గా ముగ్గును చూశాను. ఆ ముగ్గు కేవలం రంగవల్లి కాదు శ్రీవల్లి నా జీవనపధాన్ని, నా గమ్యాన్ని ఆ ముగ్గులో చూపించింది. నేను శ్రీవల్లి చిన్నప్పుడుమా తోటలో ఉయ్యాల ఆటలు ఆడిన బొమ్మ వుంది. నేను పదవ తరగతిలో జిల్లా ప్రధముడిగా వచ్చినప్పుడు కలెక్టర్ గారు నన్ను అభినందిస్తూ గోల్డ్ మెడల్ ఇస్తున్న బొమ్మ వేసింది. ప్రస్తుతం నాకు రాబోయే గోల్డ్ మెడల్ మన గవర్నర్ గారు ఇస్తునట్టు ఊహించి వేసిన బొమ్మ కూడా మహాద్భుతం.
నా కోసం గత కొద్ది నెలలుగా వారం వారం ఉపవాసం ఉంటోంది. గోల్డ్ మెడల్ కోసం. అదే సమయంలో చదువుపై నీకున్న అభిప్రాయం గుర్తొచ్చి చాలా బాధ పడ్డాను. నాకోసం స్పెషల్ గా మంచె తయారు చేయించింది.  నాకు విసురుతూ సపర్యలు చేసింది. అప్పుడే నేను తనపట్ల మహాపరాధం చేస్తున్నానని అనిపించింది. పూజారి గారు ఎందుకు ఏ ఉద్దేశ్యంతో చెప్పారో తెలీదు కానీ "కొన్ని జీవితంలో పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ సంపాయించుకోలేం.. నాయనా.." అని హెచ్చరించారు. అది గోల్డ్ మెడల్ అయినా నాకు అన్యాపదేశంగా శ్రీవల్లి గురించి చెప్పినట్టే అనిపించింది.
సారీ! శశిరేఖా! నీకు నేను కరెక్టు కాదు. అలాగే నాకు నువ్వు కరెక్టు కాదు. నన్ను మరచిపో. మీ వాళ్ళు చూసిన మంచి సంబంధం చేసుకో. నీవు కోరుకునే జీవితాన్ని నేను కచ్చితంగా నీకు  అందించలేను. బహుశ: మళ్ళీ మనం జీవితంలో కలుసుకోకపోవచ్చు. ఎప్పుడైనా గుర్తొస్తే ఇదంతా పీడకల అనుకున్నా.. మధురానుభూతి అనుకున్నా...అది నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నీ అభిరుచులకు తగ్గ భర్త రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..... శేఖర్.
రెండు కన్నీటిబొట్లు లెటర్ పై పడ్డాయి.
"అమ్మాయ్. శశీ..పడుకున్నావా... నీకో విషయం చెప్పాలి. మన సుబ్బరామయ్య కొడుకు అమెరికాలో పెద్ద సైంటిస్ట్. వాళ్ళు వచ్చే నెలలో నిన్ను చూసుకోడానికి వస్తున్నారు. పెళ్ళి అయ్యాక వెంటనే అమెరికా తీసుకెళ్ళిపోతారట."
"అలాగే నాన్నా! మీ ఇష్టం" కన్నీళ్ళు కర్చీఫ్ తో తుడుచుకుంటూ.
అదే సమయంలో శేఖర్ తన మరదలికి  నచ్చే పట్టుచీరె కొనాలని చందనాబ్రదర్స్ లో హడావుడిగా అన్ని చీరెలూ వెదికేస్తున్నాడు. అక్కడ శ్రీవల్లి మాత్రం తన బావకు గోల్డ్ మెడల్,  మంచి ఉద్యోగం రావాలని గుడిలో చేయించిన గణపతి హోమం తాలూకు తీర్ధ ప్రసాదాలను భక్తిగా స్వీకరిస్తుంది.
***

No comments:

Post a Comment

Pages