ధ్వన్యనుకరణసామ్రాట్ – శ్రీ వేణుమాధవ్
పోడూరి శ్రీనివాసరావు
(చిత్రంలో రచయతతో పాటు డా.నేరెళ్ళ వేణుమాధవ్ గారిని చూడవచ్చు.)
ధ్వనిని అనుకరించడం
ఒక కళ. ఇతరుల గొంతును అనుకరించి మాట్లాడడం.... ఒక తమాషా ... ఒక వినోదం. దాన్నే
సింపుల్ గా ‘మిమిక్రీ’
అంటాము. దీనిలో చాలా తేడాలున్నాయి. ఒకరి గొంతును మాత్రమే అనుకరించడం గాక, చుట్టుప్రక్కల ఉండే ధ్వనులను అనుకరించడం.... ఉదాహరణకు రైలుబండి
వెడుతున్న శబ్ధం;
గుర్రము పరుగెడుతున్నపుడు డెక్కల శబ్ధం;
తుపాకులు,ఫిరంగులు మ్రోగుతున్నపుడు వెలువడే శబ్ధం;
మనుషులనే గాక జంతువులు,పక్షులు
చేసే శబ్ధాలు,వాటికూతలు,
అరుపులు... ఇలా వివిధ శభాలను,
గొంతుకలను – తన గొంతులో పలికించడమే,వినిపించడమే
‘మిమిక్రీ’ కళ.
అదేకాకుండా ఒక
బొమ్మను, ఉదాహరణకు కోతి బొమ్మనో,బాతు
బొమ్మనో, ఏదైనా ఒక బొమ్మను తీసుకుని... ఆ బొమ్మ మాట్లాడుతున్నట్లుగా, మనం మాట్లాడుతున్నట్లు ఇతరులు గుర్తించలేని విధంగా... మాట్లాడే
ప్రక్రియ ‘వెంట్రిలాక్విజమ్’ ఆ
బొమ్మే మాట్లాడుతున్నట్లు భ్రమ కల్పించే,
పెదవులు కూడా కదలకుండా బయటకు వినిపించే మాటలాడే విధానాన్నే ‘వెంట్రిలాక్విజమ్’
అంటారు.
ఇలా మిమిక్రీ
వెంట్రిలాక్విజమ్ ఆదిగాగల ధ్వన్యనుకరణ విధానానికి,ప్రక్రియకు
భారతదేశంలో శ్రీకారం చుట్టిన ఆద్యుడుగా “శ్రీ నేరేళ్ల వేణుమాధవ్” గారినే
చెప్పుకోవాలి.
*****
వరంగల్ నగరంలోని
మట్టేవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నేరేళ్ల శ్రీహరి,శ్రీలక్ష్మి
దంపతులకు 1932, డిసెంబరు 28 నా శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ జన్మించారు. వారికి చిన్నతనం
నుంచీ విధ్యాబ్యాసం మీద అంతా శ్రద్ధ లేకపోవడంతో,
ఎనిమిది సంవత్సరాల వయసులో చదువు మొదలు పెట్టినప్పటికీ,
పెద్దగా ప్రతిభ చూపించిన దాఖలాలు లేవని వారే స్వయంగా చెప్పుకున్నారు. ఆయనకు బాల్యం
నుంచీ కూడా ‘ధ్వన్యనుకరణ’
అంటే ఎంతో అభిరుచి ఉండేది. ఆకళ వారికి సహజంగా అబ్బింది. ఆ కళలో మిమిక్రీలో తన
తండ్రి తనకు తొలి గురువని శ్రీ వేణుమాధవ్ చెబుతుండేవారు. తండ్రి చేసే ఇప్పపువ్వు, బియ్యం వ్యాపారంలో భాగంగా, తమ
ప్రాంతానికి వేట కోసం వచ్చే బ్రిటీష్ అధికారులతో, తన
తండ్రి వారి యాసలోనే ఇంగ్లీషు మాట్లాడడం శ్రీ వేణుమాధవ్ గారిపై బాల్యంలోనే ప్రభావం
చూపింది. చదువుకునే రోజుల్లో,
మిమిక్రీయే తన లోకంగా ప్రవర్తించే శ్రీ వేణుమాధవ్ గారిని వారి తండ్రి “గాడిద కొడకా
ఇందులోనే బతుకుపో” అని తిట్టిన తిట్టే భవిష్యత్ లో నిజమయిందని శ్రీ వేణుమాధవ్ గారు
ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
శ్రీ వేణుమాధవ్
గారికి ధ్వన్యనుకరణ కళ సహజంగా అబ్బడంతో, తన
చుట్టుప్రక్కల ఉండేవారిని,
అదేవిధంగా తనకెంతో ఇష్టమైన సినిమాల్లోని నటులనూ అనుకరిస్తూండేవారు. అడపా తడపా, తండ్రి చేతిలో దెబ్బలు తినడం మామూలే! ప్రసిద్ధ సినీనటులు ఎన్టీఆర్, ఏఎన్నార్,
లాల్ బహదూర్ శాస్త్రీ,గాంధీ, నెహ్రూ,కెనడీ
లాంటి రాజకీయ నాయకులు,
సర్వేపల్లి రాధాకృష్ణన్,అరబిందో, వివికానంద మొదలైన అధ్యాత్మిక ప్రతిభామూర్తులు... ఇలా ఎందరినో
వేణుమాధవ్ అనుకరించేవారు. మిమిక్రీ;నాటకాలు,చిత్తూరు నాగయ్య సినిమాలకు ప్రాధాన్యమివ్వడంతో వేణుమాధవ్
మెట్రిక్యులేషన్ పరీక్ష తప్పారు.
ఆ తరువాత ఉత్తీర్ణుడై
పెద్దలకోసమే పై చదువులకు వెళ్లారు. వారి జీవితంలో టర్నింగ్ పాయింటు- అదే అయింది.
వేణుమాధవ్ చదువుతున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా శ్రీ బారు వెంకట
రామనర్సుగారు ఉండేవారు. వారు శ్రీ వేణుమాధవ్ యొక్క ప్రతిభను గుర్తించి
ప్రోత్సహించేవారు. ఒకరోజు విచారంగా ఉన్న వేణుమాధవ్ ని చూచి, వివరమడుగగా,
ఎన్నో ఇంగ్లీషు సినిమాలు వస్తున్నాయని,
తండ్రి డబ్బులివ్వక పోవడం వల్ల,
అవన్నీ చూడలేక మిస్ అవుతున్నాననీ దిగులుగా చెప్పారు శ్రీ వేణుమాధవ్. వెంటనే
ప్రిన్సిపాల్ గారు తన జేబులోంచి అరవై రూపాయలు తీసి ఇచ్చారట. ఆ అరవై రూపాయలతో
వేణుమాధవ్ ఏకంగా 30 ఇంగ్లీషు సినిమాలు చూశారట. అంతేగాక ఆ సినిమాల్లోని దృశ్యాల
నేపథ్య సంగీతాన్ని,నటుల
గొంతుకలను అధ్బుతంగా అనుకరించి చూశారట. దాంతో ఉద్విగ్న భరితుడైన ప్రిన్సిపాల్ శ్రీ
రామనర్సుగారు శ్రీ వేణుమాధవ్ ని గాఢంగా హత్తుకుని,‘ప్రపంచంలోనే
అత్యుత్తమ కళాకారుడవు అవుతావని’
ఆశీర్వదించారట, అంతేగాక తనకున్న ఏకైక కుమారుడు విఠల్ అయితే రెండవకుమారుడు వేణుమాధవ్
అని తెలియచెప్పారట.
మిమిక్రీ కళాకారులు
సాధారణంగా తమ ప్రదర్శనల్లో నటుల గొంతుకలను,
వాహనాల శబ్ధాలను,పక్షుల
కఊతలను,జంతువుల అరుపులను అనుకరిస్తారు. కానీ శ్రీ వేణుమాధవ్ సినిమా
సన్నివేశాలను నేపధ్య సంగీతంతో సహా అనుకరించి అబ్బురపరుస్తారు. ముఖ్యంగా హాలీవుడ్
చిత్రాలయిన టెన్ కమాండ్ మెంట్స్ లో సీన్లను,
మెకన్నాస్ గోల్డ్ చిత్రంలోని గుర్రపుడెక్కల శభ్దాన్ని ఆయన అత్యధ్బుతంగా
అనుకరిస్తారు. వినేవాళ్లు తాదాత్మ్యం చెంది,వారు
ఆ సినిమాలను చూస్తున్న భావనలోని వెళ్లిపోతారు. అచ్చమైన ఆంగ్లేయులు ఉచ్చారణలో ఆయన
చేసే మిమిక్రీ విదేశీయులను సైతం ఆశ్చర్యచకితులను చేసేది. రాజకీయనాయకుల్లో ఆయన అనుకరించని
గొంతే లేదు. సినిమాలంటే ఇష్టపడి,
సినీనటుల గళాలను అనుకరించిన శ్రీ వేణుమాధవ్ దాదాపు 12 సినిమాల్లో నటించారు.
శ్రీ వేణుమాధవ్
ఒకసారి మిమిక్రీ ప్రదర్శన నిమిత్తమై దుబాయ్ వెళ్లారు. విమానాశ్రయం వెలుపల టెక్సీ
కోసం ఎదురుచూస్స్తున్న వారిని, ఒక
టెక్సీ వాలా గుర్తుపట్టారు. శ్రీ వేణుమాధవ్ కు గొప్ప అభిమానినని చెప్పుకున్న ఆ
టెక్సీవాలా , వారిని తాన్ టెక్సీ ఎక్కించుకున్నాడు. తనకోసం ‘మొఘల్-ఏ-అజాం’
హిందీ చిత్రంలోని పృధ్వీకపూర్,
దిలీప్ కుమార్ ల గొంతులను అనుకరిస్తూ డైలాగ్ లు చెప్పమని కోరుకోగా, అతని తృప్తికోసం,
టెక్సీ లోనే ఆ నటుల గొంతులను అనుకరిస్తూ డైలాగ్ లు చెప్పారట శ్రీ వేణుమాధవ్.
ప్రదర్శన వద్ద శ్రీ వేణుమాధవ్ దింపిన
టెక్సీవాలా, వారివద్ద నుండి టెక్సీ చార్జి తీసుకోలేదట. మిమ్ములను కలవడమే నా
మహాబాగ్యం అంటూ నమస్కరించి వెళ్లిపోయాడట. విదేశాలలో సైతం వారి ప్రతిభకున్న
గుర్తింపు, క్రేజ్ కు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
1971లో
ఐక్యరాజ్యసమితి వేదికగా మిమిక్రీ ప్రదర్శన చేసిన తొలి కళాకారుడు శ్రీ వేణుమాధవ్.
అప్పట్లో అక్కడ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్,
శ్రీ జాన్.ఎఫ్.కెనెడీలను అనుకరిస్తే స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. అలాగే ఒక
సందర్భంలో నాటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుటే వారి గొంతుకను, మరో సందర్భం లో నెహ్రూగారిని, మరో
సంధర్భంలో శ్రీ కెనెదీని వారి ఎదుటే అనుకరించి వారి ప్రశంసలు అందుకున్నారు.
అంతేకాదు షెక్సిపియర్ నాటకాల్లోని దృశ్యాలను సైతం ప్రదర్శించి, ఐక్యరాజ్యసమితి సభ్యులను ఆశ్చర్యచకితులను చేశారు.
మాజీ ప్రధానీ శ్రీ
పి.వి.నరసింహారావుగారితో శ్రీ వేణుమాధవ్ గారికి సాన్నిహిత్యం ఉండేది. ఎంతో గొప్ప
భాషాభిమాని అయిన శ్రీ పి.వి.నరసింహరావుగారు చేసే ప్రయోగాలను బాగా ఇష్టపడేవారు.
పి.వి.నరసింహరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీ వేణుమాధవ్ గారిని ఎమ్మెల్సీ గా
నామినేట్ చేయడంతో,
1972 నుంచి 1978 వరకు శ్రీ వేణుమాధవ్ ఎమ్మెల్సీ గా కొనసాగాడు.
తండ్రి చేసే వ్యాపారం
దెబ్బదినడంతో వేణుమాధవ్ కుటుంబ పోషణకై,
ఉపాధ్యాయ వృత్తినిచేపట్టారు. విద్యార్థులకు పాఠాలు సైతం మిమిక్రీ కళతో మిళితం చేసి,ఆసక్తికరంగా బోధించేవారు. వృత్తితోపాటు,
ప్రవృత్తిగా మిమిక్రీకళతో అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే గాక,
ఎన్నో ప్రదర్శనలు ప్రపంచదేశాల్లో ఇచ్చారు. అంతర్జాతీయ మీడియా కూడా శ్రీ వేణుమాధవ్ప్రతిభకు
కితాబులిచ్చి, గొప్ప కళాకారుడిగా పేర్కొంది.
ఒకే గొంతులోంచి
వెంటవెంటనే ఆర్ద్రత,
మార్దవంతో బాతు, గంభీరం కూడా పలికించగల దిట్ట శ్రీ వేణుమాధవ్. ఖంగున మ్రోగే అదే
స్వరాన్ని అంతలోనే పీలగా,
నంగిగా మార్చేసి ఔరా! అనిపించగలరు.చైనాతో యుద్ధం సమయంలో శ్రీ ఎన్టీఆర్ తో కలిసి
పలు ప్రాంతాల్లో పర్యటించి నిధులు సేకరించారు.
శ్రీ వేణుమాధవ్ కు
నాటకరంగంలోనూ ప్రవేశముంది. చదువుకునే రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ తో కలిసి నటించిన
అనుభవం ఉంది. ఆ తర్వాత హైదారాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల
రామకృష్ణారావుగారు వేణుమాధవ్ లో గల మిమిక్రీ కళను గుర్తించి ప్రోత్సహించారు.
ధ్వన్యనుకరణ కళను
విశ్వవ్యాప్తం చేయడమే కాదు కానికొక సిలబస్ రూపొందించి,
కోర్సుగా మలచి, పదో తరగతి చదివినవారు సైతం ఆ కళను అంది పుచ్చుకునేలా తెచ్చిన ఘనత
శ్రీ వేణుమాధవ్ దే. హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాకయంలో మిమిక్రీ ప్రత్యేక
డిప్లమో కోర్సుగా రూపుదిద్దుకోవడంలో ఆయన పాత్ర ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇతరుల
గళాలను ఎలా అనుకరించాలి?
ధ్వనులను ఎలా సృష్టించాలి?
సహజధ్వనులకు, మెకానికాల్ ధ్వనులకు తేడా
ఏమిటి? ఇలా విస్తృత స్థాయిలో కోర్సు రూపొందించారు.నాలుగేళ్లపాటు
అధ్యాపకుడిగా కొనసాగారు.
ఆయన
వద్ద ధ్వన్యనుకరణ కళ నేర్చుకున్నవారు వందల సంఖ్యలో ఉంటే,
ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, మిమిక్రీ
ఆర్టిస్టులుగా ఎదిగిన ఏకలవ్య శిష్యులు వేల సంఖ్యాల్లో ఉన్నారు. శిష్యులంటే వాయికి
పుత్రవాత్సల్యం. పురస్కారాలు,గౌరవాల విషయానికి వస్తే,
శ్రీ వేణుమాధవ్ పొందిన సత్కారాలు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని
విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవించాయి. జేఎన్‌టీయూ, కాకతీయ వర్సిటలు ఆయనకు
గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేశాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపుర్ణ బిరుదును
ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారంతో ఆయనను గౌరవించింది. 2017లో ఆయన పేరుతో తపాలా కవర్
కూడా ఆవిష్కరించింది.తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను గజారోహణం చేయించి
సత్కరించింది. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని ఆడిటోరియానికి 2011లో డాక్టర్ నేరెళ్ల
వేణుమాధవ్ కళా ప్రాంగణం అని నామకరణం చేశారు.
వేణుమాధవ్
గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28వ తేదీని ‘ప్రపంచ మిమిక్రీ దినోత్సవం’గా జరుపుకొంటారు.
అఖండ ప్రజ్ణాశాలి,మిమిక్రీ ప్రక్రియను ప్రపంచానికిపరిచయం చేసిన భారతీయ భారత మాత
ముద్దు బిడ్డగా ప్రఖ్యాతి గాంచిన, ఐక్యరాజ్యసమితిలో
తన మిమిక్రీని ప్రదర్శించి, సభ్యులను సమ్మోహితులుగా చేసిన ప్రముఖ గళం 19.06.2018వ తేదీన శాశ్వత విశ్రాంతి తీసుకుంది.వెయిగొంతుల
వేణుమాధవ్ గా ప్రసిద్ధిగాంచిన,శ్రీ వేణుమాధవ్ సుమారు 70 సంవత్సరాలకు
పైగా ప్రపంచాన్ని తన మిమిక్రీ కళతో అలరించిన వేణుమాధవ్, మిమిక్రీ
కళను ఒక సబ్జెక్టుగా గుర్తించి, తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సులకు
శ్రీకారం చుట్టిన శ్రీ వేణుమాధవ్, జాతీయంగా,అంతర్జాతీయంగా
తన మిమిక్రీ కళ ద్వారా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన శ్రీ వేణుమాధవ్. వేలమంది
ప్రత్యక్ష పరోక్ష ఏకలవ్య శిష్యులను దుఃఖసాగరంలో ముంచి దివికేగారు ఇక నుంచి వారి
గొంతు మనకు వినపడదు.కేవలం వారి జ్ఞాపకాలే మనకు మిగిలాయి.వారి ఆత్మకు శాంతి కలగాలి.
No comments:
Post a Comment