శ్రీమద్భగవద్గీత - 22
8 వ అధ్యాయము
అక్షరపరబ్రహ్మ యోగము
రెడ్లం రాజగోపాలరావు
మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్
నాప్తువన్తి మహాత్మాన స్సంసిద్ధిం పరమాం గతాః
15 వ శ్లోకం
మానవజన్మకు పరమార్ధమైన మోక్షమును పొందిన మహనీయులు భగవంతునిపొందిన వారై మరలా అనిత్యమైనట్టి జన్మ పరంపరను ఎన్నటికిని పొందనేరరు.వేయించిన విత్తనము భూమిలో విత్తినా మొలకెత్తదు.అటులనే ఆత్మ సాక్షాత్కార స్థితిని అనుభవించిన మహనీయులు జనన మరణ చక్ర భ్రమణమును సులభముగాదాటిపోవుచున్నారు. పరమాత్మనుపొందిన పిదప అతనికి పునరావృత్తియుండదు. కాబట్టీ దుఃఖరాహిత్యమునకై దైవాన్ని తప్పక ఆశ్రయించవలసియున్నది.
చాలామంది ఈ జన్మలో అనేక విషయభోగములతో ఆనందకరముగా నున్నదని చెప్పవచ్చును.ఇందులో గీతాచార్యుడు జన్మయనునది దుఃఖాలయము, అశాశ్వతమని తెలియజెప్పినాడు. కోటీశ్వరుడైననూ తనకు బాధ, దుఃఖము కలుగలేదని చెప్పలేడు. ప్రకృతిలో పగలు రాత్రి ఎంత సహజమో, జన్మించిన మానవునికి సుఖము, దుఃఖము అంతే. ఒకవేళ భౌతిక సుఖము కనుపించిననూ అది అశాశ్వతమే అవిధ్యా ప్రభావముచే దుఃఖమును సుఖముగా భ్రమించుచున్నాడు. భగవంతునితో సాయుజ్యము పొందిన మహనీయులకు సుఖము,దుఃఖము రెండునూ సమానములే దుఃఖమునకు కృంగరు సుఖమునకు పొంగరు.
వేదేషు యజ్ఞేషు తపఃస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్ఠమ్
అత్యేతి తత్పర్వ మిదం విదిత్వా యోగీపరం స్థానముపైతి చాద్యమ్
28 వ శ్లోకం
యోగియైన వాడువేదాధ్యయనము వలన,యజ్ఞ,దాన తపస్సుల వలన ఏ పుణ్యఫలము లభించునని తెలియబడుచున్నదో వీటన్నింటినీ మించిన పుణ్యఫలమును పొందుచున్నాడు. మరియు సర్వోత్తమమైన బ్రహ్మ స్థానమును పొందుచున్నాడు. లోకములో కొందరు చదువురానందువలన వేదములను అధ్యయనము చేయలేకపోవచ్చును. అర్థబలము లేనందున యజ్ఞాదులాచరించలేకపోవచ్చును. పేదరికము వలన దానములు చేయలేకపోవచ్చును.
అట్టివారికి పుణ్యప్రాప్తికి మార్గమేది...? అదియే పరమాత్మ ధ్యానము. బ్రహ్మ జ్ఞానమునకు చదువుతో గాని తపస్సు, యజ్ఞము, దానాదులతో పనిలేదు. మనస్సుద్ధి, హృదయపవిత్రత, నిర్మలభక్తియే అందుకు కావలసినవి. అట్టివారు ఆత్మజ్ఞాన ప్రాప్తి ద్వారా తక్కిన పుణ్యఫలములన్నింటినీ దాటివేయుదురు. పైన దెల్పిన వేద పఠనము, యజ్ఞము, దానాదులు ఉపేక్షించమనికాదు.వాటిని నిష్కామముగా నాచరించుచు క్రమక్రమముగా చిత్తశుద్ధి బడసి, ఆత్మానుభూతిచే మహా పుణ్యమునొందవలెను. అడవిలో జంతువుల పాదములన్నియు ఏనుగు పాదములో ఇమిడిపోవును. అలాగే ధ్యానయోగి యొక్క పుణ్యము కూడా
యోగమనగా జీవుని దేవునితో జేర్చుమార్గము. అది నిష్కామ కర్మయైననూ,భక్తియైననూ,ధ్యానమైననూ,జ్ఞానమైననూ అనుసరించిననతడు యోగియగును. ఇచ్చట బ్రహ్మ జ్ఞానము శ్రేష్ఠమని, సర్వోత్తమమని స్పష్టపడుచున్నది. కావున ప్రారంభంలో తపోదానాదులు ఆశ్రయించిననూ సంతృప్తినొందక క్రమముగా చిత్తశుద్ధి ద్వారా ఆత్మానుభవము, బ్రహ్మజ్ఞానమును బడయవలెను.
9 వ అధ్యాయము
రాజవిధ్యా రాజగుహ్య యోగము
శ్రీ భగవానువాచః
ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యన సూయవే
జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్
1 వ శ్లోకం
దేనిని తెలిసికొనినచో అశుభరూపమగు ఈ సంసార బంధము నుండీ విడివడబడునో అట్టి అతి రహస్యమైన అనుభవజ్ఞానసహిమైన బ్రహ్మజ్ఞానమును అసూయలేనివాడవగు నీకు లెస్సగా చెప్పచున్నాను. విధ్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతి రహస్యమైనదియునగు బ్రహ్మవిద్యను అనుభవ పూర్వకముగా భగవానుడు బోధించుచున్నాడు. "గుహ్యతమమ్" అని చెప్పుటవలన ఈ బోధ రహస్యము యొక్క పరాకాష్ఠను సూచించుచున్నది. బ్రహ్మోపదేశము సామాన్యముగా అధికారియగు మనుజునకే తెలియజేయుబడుచున్నది. దానిని ఆచరించుటకు యోగ్యత అవసరము. అసూయాది దుర్గుణంబులు లేకుండుట చిత్తశుద్ధి కలిగియుండుట, సాధనా చతుష్టయ సంపత్తిచే ఆ యోగ్యతకలుగును. వస్త్రము నిర్మలముగానున్నప్పుడే రంగు అంటునట్లు, శుద్ధచిత్తునియందే బ్రహ్మజ్ఞానము ప్రవేశించును. ఇట్టి అర్హతను పొందినవారికి సద్గురువులు అతిరహస్యములైన సాధనాంశములనన్నింటిని చక్కగా తెలియజేయుదురు. ఆవు దూడను చూచినంతనే పాలనెట్లు శ్రవింపజేయునో ప్రియశిష్యుని జూచినంతనే గురువు ఆనందభాష్పములు రాల్చును.ఈ సంఘటన శిష్యుని హృదయ నైర్మల్యమును సూచించును. కృష్ణ పరమాత్మ అర్జనునితో విజ్ఞాన సహితముగా నీకు జ్ఞానమును బోధించుచున్నాను అనెను. పరమాత్మ ఇట్లు వచించుటలో ఒక విశేషము కలదు. జ్ఞానమనగా శాస్త్రజన్య జ్ఞానము అనగా పరోక్ష జ్ఞానము. విజ్ఞానమనగా అనుభవ జ్ఞానము, పరోక్ష జ్ఞానము, అనుభూతి జ్ఞానము.
బోధ అనుష్ఠానపూర్వకముగా, అనుభూతిపూర్వకముగా పరిణమించినపుడే పూర్ణఫలితమును పొందనగును. పుట్టుక, చావు,దుఃఖము, రోగము, ముసలితనము మొదలగు అనుభవములతో కూడుకొనిన భయంకర మోహము నుండి అది జనులను విముక్తులజేయును. కాబట్టీ విజ్ఞులు భగవానుడు బోధించబోవు ఈ అనుభవపూర్వక బ్రహ్మతత్వమునెరిగి కృతార్థులు కావలెను.
రాజవిధ్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్
ప్రత్యక్షావగమంధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్
2 వ శ్లోకం
ఈ బ్రహ్మ జ్ఞానము విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, రహస్యములలోకెల్లా అతి రహస్యమైనదియు,పవిత్రమైనదియు, సర్వోత్కృష్టమైనదియు, ప్రత్యక్షముగా తెలియదగినదియు, ధర్మయుక్తమైనట్టిదియు, నాశరహితమైనదియునైయున్నది. ఈ బ్రహ్మ జ్ఞానమెట్టిదియో,దానిమహిమ ఏమియో ఈ శ్లోకమున వివరించబడుచున్నది. ప్రపంచమున అనేక విధ్యలుగలవు. కాని అవి ఏవియు జీవుని జనన మరణముల నుండీ తప్పించజాలవు. ఒక్క బ్రహ్మవిధ్యయే అట్టిపని చేయుచున్నది. దృశ్యవస్తువులన్నియు నశ్వరములు. వాటిని గూర్చిన విద్య ఏదియును మనుజునకు పూర్ణశాంతిని కలుగజేయజాలదు. శాశ్వతమగు బ్రహ్మవిధ్యయే ప్రశాంతిని చేకూర్చగలదు.కనుక బ్రహ్మవిద్య విదయలలో కెల్లా శ్రేష్టమని, రాజ విద్యయని ఇచట పెర్కొనబడినది.
ఈ బ్రహ్మ విద్యను ప్రత్యక్షముగా తెలిసికొనవచ్చును. అనుభూతమొనర్చకొనవచ్చును. ఎప్పుడు జీవుడు ఈ బ్రహ్మ జ్ఞానమును అనుభూతమొనర్చకొనుచున్నాడో ఆ క్షణముననే సాక్షాత్తు బ్రహ్మమేయగుచున్నాడు. కావున ఫలితమున కెట్టి సందేహమునకాస్కారములేదు. ఈ ప్రకారము భగవానుడు గీతయందు సాధకులకు ప్రోత్సాహము కలుగజేయుచున్నాడు. ఈ విద్య ధర్మమునకు మూలమున్ను, సనాతనము, అవ్యయమునైయున్నది.
ఈ ప్రకారముగా శ్రీ కృష్ణపరమాత్మ తాను బోధింపదలచిన బ్రహ్మజ్ఞానము యొక్క మహిమను ప్రారంభమునందే వెల్లడించెను.
ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు
09482013801
No comments:
Post a Comment