అమ్మమ్మా, జాగ్రత్త. అమ్మ ఏర్పోర్టుకు వస్తుంది, తెలిసిన వూరేకదాని తొందరపడి వెళ్ళద్దు. నీ బాగ్ లో చెక్కు పెట్టాను. అమ్మకు ఇచ్చి మార్పించుకో. నువ్వు తీసుకోవంది అమ్మ. కాని అమ్మమ్మా గుప్పెడు మెతుకుల కోసం వెతుక్కునే వాళ్ళ కోసం.సరేనా.
విమానమెక్కి సీట్లో కూర్చుని జారగిలబడి బాగ్ లో నుండి తీసిన చెక్కు చూస్తూ గతంలో కీ జారిపోయింది జయమ్మ.
********
అమ్మా మనం వెంటనే విశాఖపట్టణం వెళ్ళాలి. నువ్వు జయ బయలుదేరండి అంటూ హడావిడిగా వచ్చాడు కాంతారావు.
ఈ రోజో రేపో కనేట్టుగా వున్న పిల్లతో ఎందుకురా? ముందు బయలుదేరండి. ఈ బండి తప్పితే రేప్పొద్దున దాక బండి లేదు. బావకు బాగాలేదట.
ఏమయిందో ఏమో చెప్పడు. అడిగే సమయం కూడా ఇవ్వడు అంటూ బయలుదేరింది రాజమ్మ జయతో. విశాఖపట్నం లో దిగి వూరి చివర వున్న ఆనందరావు ఇంటికి చేరేటప్పటికి పొద్దున పది గంటలయింది.
ఇంటిముందు వరండాలో చింకిచాప మీద జీవంలేని ఆనందరావు దేహం.నోట మాట కంటనీరు లేక నిశ్చేష్ట అయింది జయ, ఏమయింది ఎందుకిలా జరిగిందని అడగలేదు.
ఆనంద రావు దేహంలో జీవం తోనే తన జీవితంలో ఆనందము పోయింది.
తల్లీ బిడ్డా నష్ట జాతకులు అంటున్న బంధువుల మాటలు, లేదు నేను నష్టజాతకు రాలినేమో నా బిడ్డకాదు, బిడ్డకు నేనున్నాను అనుకుంటూ నిండుకుండలా వున్న పొట్ట మీద చేయి పెట్టుకుంది జయ.
ఏ కార్యక్రమం ఎలా జరిగిందే తెలియదు తనకు తెలిసిందల్లా ఒక్కటే పెళ్ళయి ఏడాది కాకుండానే పసుపు కుంకుమలకు దూరమయ్యాయని మాత్రమే.
తొమ్మిదో రోజు జయకు పురిటి నొప్పులు, వూళ్ళోనే మంత్రసాని సహాయఁతో జయ ఒడిలో రబ్బరుబొమ్మ లాంటి ఆడపిల్ల చేరింది.
మగపిల్లాడయినా పుట్టలేదు సానుభూతిపరుల మాటలు ఈ బిడ్డ కారుచీకటిలో చిరుదీపం, నాకంటి వెలుగు, నాకొక ఆశాకిరణం అనుకుంది అమ్మ అయిన జయమ్మ.
వదినగారు మీకు తెలుసుకదా. నేను పిల్లల మీద ఆధారపడ్డదానిని, తలదాచుకోడానికి ఈ పెంకుటిల్లు తప్ప వెనకాముందు ఏమీలేదు . జయను, పసిపిల్లను మాదగ్గర వుంచుకోలేము. ఇంతకన్న నేనేమి చెప్పలేను, చెట్టంత కొడుకును పోగొట్టుకున్నదాన్ని, అంటూ రెండు అశౌచాలు తీరాక తేల్చి చెప్పారు అత్తింటివాళ్ళు.
తలచెడి పసిపిల్లతో పుట్టిల్లు చేరిన జయమ్మకు ఆదరణకు లోపంలేకపోయినా అంతంత మాత్రం ఆదాయంవున్న అన్న కుటుంబంలో జరుగుబాటు తక్కువయింది. పెళ్ళికి చేసిన అప్పే ఇంకాతీరలేదు పులి మీద పుట్ర లాగ అల్లుడి అర్ధాంతర మరణం రాజమ్మను మృత్యువు దగ్గరకు తీసుకుంది.
*****
'అన్నయ్యా నేను చదువుపూర్తి చేస్తే ఏదయినా ఉద్యోగం చూసుకోవచ్చు,' అంటున్న జయతో 'నువ్వు చదువు ఉద్యోగం అంటూ పోతే పిల్లదాన్ని ఎవరు చూడాలనంటూ' తన బాధను వెళ్ళబోసింది వదిన. అంతంత మాత్రపు ఆరోగ్యం, పెరుగుతున్న అవసరాలు పెరగని ఆదాయం ఆవిడని అలా మాట్లాడనిచ్చింది అటువైపు నుండి కూడా ఆలోచించాలి అనుకుంది జయమ్మ. గుప్పెడు మెతుకుల కోసం ఆరాటం. అదేమిటోగాని దుఖంలో ఆకలెక్కువయిందేమో ఎప్పుడూ ఆకలి ఆకలి ఆకలి. దరిద్రానికి ఆకలెక్కువేమో.
*****
జయా మాప్లీడరుగారి వంటావిడ కాంతమ్మ రావడంలేదట. పాపం శాంతమ్మ గారు ఇబ్బంది పడుతున్నారు.పొద్దున్నే వెళ్ళి సాయం చేయగలవామ్మా తొమ్మిదింటికల్లా వచ్చేయచ్చు.చంటిదాన్ని నువ్వు నేను చూస్తాను. ఏమంటావు అన్న కాంతరావు మాటకాదనలేక మరోమార్గంలేక శాంతమ్మ గారింట కాలుపెట్టింది జయమ్మ.
అలా అలా పదిరోజులు జరిగిపోయాయి. కాలుజారి పడిన కాంతమ్మ ఇప్పట్లో వచ్చేట్టు లేదు.రోజూ ఒకళ్ళో ఇద్దరో వారాలబ్బాయిలు వైద్యానికంటూ వచ్చే చుట్టాలు దానికి తోడు గ్రామాంతరంనుండి వచ్చే క్లయింట్లను భోజనం చేసి వెళ్ళమనే భర్త , పూర్తిగా జయమ్మ మీద ఆధారపడిన శాంతమ్మగారు.
జయమ్మా నువ్వు చేసిన చింతచిగురు పప్పు మీబాబాయిగారు రెండుసార్లు కలుపుకొని తిన్నారు,వాళ్ళమ్మగారు చేసినట్లు వుందన్నారు, అదిసరేగాని మినుములు చింతపండు పచ్చట్లో గచ్చకాయంత బెల్లం తగిలించావులావుంది. కమ్మగావుండి అన్నమంతా పచ్చడితో కానియ్యచ్చు అనిపించింది. నీది అమృతహస్తంం అంది శాంతమ్మ.
అన్నింటికి మౌనమే సమాధానం.
జయమ్మా ఏమనుకోవుగా. మాఇంట్లో పడమరవైపు గది ఖాళీగావుంది. నువ్వు పిల్లదానితో వుండచ్చు,
పిన్నిగారు అన్నయ్య నడగండి వాడు సరే అంటే వుంటాను.
మీ బాబాయిగారితో చెప్పిస్తా.కాదనడులే.కాంతయ్యకు కూడ కొంత భారం తగ్గుతుంది. అలా శాంతమ్మగారింట్లో పిల్లదానితో చేరింది జయమ్మ.
*****
నాలుగువేళ్ళ వెడల్పు జరీతో ఏడుగజాలచీర కాశీపోసి కట్టి,కాళ్ళకు కడియాలు గొళ్ళెపు గొలుసులు మువ్వలపట్టీలు, చేతులకు ఆరేసి బంగారు గాజులమధ్య ఎర్రటి గాజులు, మెడలో ముప్పేట చంద్ర హారం,నల్లపూసలగొలుసు, కదలినప్పుడల్లా తళుక్కుమనే వజ్రపు ముక్కుపుడక, చెవులకు ఏడురాళ్ళ దుద్దులు, పచ్చిపసుపుకొమ్ములాంటి మేనిఛాయ. పావలాకాసంత కుంకుమ బొట్టు జడల్లి పెట్టిన కొప్పులో ఠీవిగా కూర్చున్న రాళ్ళ చామంతిబిళ్ళతో శాంతమ్మ ను చూస్తుంటే బెజవాడ దుర్గమ్మ కదలివచ్చినట్టుండేది.
అమ్మమ్మగారు అంటూ ఆవిడ దగ్గర చనువుగా తిరుగుతూ వుండే పసిదంటే ఆవిడకు వల్లమాలిన ప్రేమ, మడిపనులన్నీ అయినతరువాత ఒడిలో కూర్చోపెట్టుకుని భాగవతశ్లోకాలు శతక పద్యాలు చెప్పేది శాంతమ్మ, చిన్నపిల్లనేగాని అన్నీ వెంటనే పట్టేస్తుందంటూ మురిసిపోయేది.
అయిదోయేట విజయదశమి నాడు గుళ్ళో అక్షరాభ్యాసంచేయించి శారద అని పేరు రాయించి వీధి చివరవున్న బడిలో చేర్పించింది.
చదువులు ఉద్యోగాలంటూ ఇతర రాష్ట్రాలలో వుంటున్న శాంతమ్మగారి పిల్లలిద్దరికీ శారదంటే ఎంత ముద్దో.గుప్పెడు మెతుకులకు ఎదురు చూసిన తనకు నీడ నిచ్చిన శాంతమ్మగారంటే దైవమే జయమ్మకు, చెల్లెలికి అన్నవస్త్రాదులకు, ఆదరణకు కరువులేకుండా చూస్తున్న ఆకుటుంబమంటే కాంతారావుకు అతని భార్యకు అంతులేని భక్తిగౌరవాలును.
జయమ్మా, కావమ్మగారా మనవరాలికి పెళ్ళి ముహుర్తాలు పెట్టారుట, రేపు మంచిరోజు వడియాలు పెట్టి అప్పడాలు వత్తాలి.నేను వెళ్ళి వినాయకుడికి బియ్యం కట్టించి రెండు కొమ్ములు పసుపు దంచి వస్తాను, నువ్వు ఎండెక్కకుండా గుమ్మడి వడియాలు పెట్టడానికి, అప్పడాలు వత్తడానికి చేసాయం చేయాలి. మనింట్లో ఏ సందర్భ మయినా అత్తాకోడళ్ళు వచ్చి చేస్తుంటారు.వంట పూర్తి అవగానే వెళ్ళు,శారద నా దగ్గర వుంటుంది. అదేమీ పేచీకోరు పిల్లకాదు.
వడియాలు అప్పడాలు పని పూర్తి చేసి వస్తుంటే నాలుగు రూపాయి బిళ్ళలు చేతిలో పెట్టింది కావమ్మ గారు వద్దు వద్దంటున్నా .ఇంటికి రాంగానే శాంతమ్మ చేతిలో పెట్టేసింది జయమ్మ భయం భయంగా నేనేం చేసుకుంటాను శారదకు నాకు అన్నీ మీరే చూస్తున్నారు అంటూ.
పిచ్చిదాన ముందు ముందు అవసరముంటుంది శారదకు అని దేముడి గది లో డబ్బీలో దాచేది.అలా వీళ్ళింట్లో బారసాల వాళ్ళింట్లో సీమాంతము అంటూ చేసాయానికి పంపించి నాలుగురూపాయలు ఎక్కువగా ఇప్పించి డబ్బీ నిండగానే గుమాస్తాను పంపించి పోస్టాఫీసులో జయమ్మ ఖాతాలో వేయించేది.
ఆడపిల్లలు అరటి చెట్టులా ఇట్టే ఎదుగుతారంటూ పెద్దదయిన శారదకు మామిడిపండురంగుతో జేగురురంగు అంచున్న పట్టులంగా జాకెట్టు కుట్టించి తండ్రి లేకపొతేనేం మనం లేమా అని నలుగురు ముతైదువులను ని పిలిచి పేరంటం చేయించింది శాంతమ్మ. నేను నష్టజాతకురాలినేమోగాని నాబిడ్డ కాదు అనుకుంది మరోసారి జయమ్మ.
***
ఇదిగో జయమ్మా, గుమాస్తాగారు శారద స్కూలుకు ఫీజు కట్టడానికి వెళ్ళారుట. అక్కడి పంతుళ్ళు నీకూతుర్ని తెగ మెచ్చేసుకున్నారుట. ఇంగిలీసు లెక్కల్లో మిగతాపిల్లలకంటే ముందుంటుందిట, పేరుకు తగ్గ పిల్ల అన్నారుట. ఈమాట చెబుతూ మీ బాబాయి గారు ఎంత మురిసి పొయారో.
మీదయవలన ఆచదువేదో పూర్తి అయితే చాలు.
****
పది మంచి మార్కులతో పాసయిన శారదను బాబాయిగారు ఫీజు కడతారంటూ జూనియర్ కాలేజీలో చేర్పించారు.శాంతమ్మగారి పిల్లలు పుస్తకాలకని డబ్బులిచ్చారు,చెంపకు చేరడేసి కళ్ళుకాకపోయిన చక్కని కనుముక్కు తీరుతో మంచి తలకట్టు చామనఛాయ రంగుతో ముచ్చటగా వున్న శారద 'పిల్ల బుధ్ధిమంతురాలు' అనిపించుకుంది.
శారదా కావమ్మగారి మనవలు నువ్వు చదివిన స్కూలులోనే చదువు తున్నారుట. ఇద్దరూ చదువులో వెనకబడుతున్నారుట. కాలేజినుండి వచ్చాక ఒక గంట ఇంగ్లీషు లెక్కలు చెప్పిరా, గంట మాత్రమే సుమా. లేకపోతే నీ చదువుకు ఆటంకమవుతుంది.
తప్పకుండా చెబుతాను అమ్మమ్మగారు. నాకు పాఠాలు చెప్పడం ఇష్టమే.
అయినా నువ్వెళ్ళద్దులే. వాళ్ళను ఇక్కడికి పంపించమంటాలే. సరేనా.
ఆకలి వేసిన వాడికి తినడానికి చేపనివ్వకూడదు.గాలం ఇస్తే చేపలు పట్టి బతకడం నేర్చుకుని బాగుపడతాడు అనే సూత్రం తెలిసిన ఆ శాంత,మ్మ ఆ ఇద్దరితోపాటు మరో ఇద్దరిని చేర్చి తలాపదిరూపాయలు ఇచ్చేలా ఏర్పాటు చేసింది, మాగాయకు మామిడికాయల చెక్కు తీస్తూ జయమ్మా శనాదివారాలు భోజనానికి వచ్చే రాజు డిగ్రీ పూర్తి చేసాడు. మీబాబాయిగారు కోర్టులో పెద్దవాళ్ళకు చెప్పి వుద్యోగం వేయించారుట. తల్లిదండ్రులు చిన్నతనంలో నే పోతే మేనమామల అండనున్నాడు, రాజు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది శాంత. ఆ పిల్లాడికేమమ్మా బుద్ధి మంతుడు. అయితే ఇక రాడన్నమాట., ఎంతమందికి అండగా నిలిచారు పిన్నిగారు. మీ పుణ్యంవూరికేపోదు.
పుణ్యపాపాలు నాకు తెలియదు, నాదా వానాకాలంచదువు. ఇవ్వడం కాదు దాన్ని చక్కగా వినియోగించుకుని వృధ్ధిలోకి వస్తే అది చాలు, మన చాకలి సుబ్బి కొడుకు చూడు మీబాబాయి ఫీజులు కడితే చదువుని రైల్వేలో వుద్యోగం తెచ్చుకున్నాడు.చదువనేది ఒక వరంలాంటిది, దాన్ని కైకమ్మలా వాడకూడదు. అప్పుడే ఇచ్చిన వాడికి తృప్తి ,అపాత్ర దానంకాకూడదు. మన శారద నిచ్చి పెళ్ళి చేస్తే ఎలా వుంటుందంటావు, మీబాబాయి మాట వాళ్ళు కాదనరు, న్నిగారు శారద ఇంకా చిన్నపిల్లే కదండీ, పెళ్ళంటే బాధ్యత కూడిన వ్యవహారం చూడు జయమ్మా రోజులెప్పుడూ ఒక్కలావుండవు.నువ్వా ఒంటరిదానివి.కాలేజి చదువంటే మరో మూడేళ్ళు ఆగాలి, శారద నువ్వుఆలోచించుకొని చెప్పండి, దానికి చదువుకోవాలని వుందమ్మా.
ఏం పెళ్ళయితే పెద్ద చదువులు చదవకూడదా. సంకల్పబలం గట్టిగా వుండాలేకాని,ఏదీ అడ్డురాదు.
శారదకూడా రాజు అతని మేనమామలు కూడా వివాహానంతరం చదువుకోవడానికి అంగీకరించడంతో సరేనన్నది, అంతే కాళ్ళుకడిగి కన్యాదానం శాంతమ్మ దంపతులు జయమ్మ ఖాతాలోవున్న డబ్బుతో మంగళసూత్రాలు గొలుసు గాజులు చేయించి తమ ఖర్చుతో ఘనంగానే పెళ్ళి చేసారు, జయమ్మ అత్తింటివారు ఆపాత పెంకుల్లు అమ్మగా ఆనఁదుడి వాటాఅంటూ పదివేలు ఇచ్చారు, దాన్ని రాజు శారదలపేర బాంకు ఖాలా వేయించింది.
పిల్లకు పెళ్ళయింది కదా వాళ్ళతో వెళతావేమో. నేనున్నన్ని రోజులూ మాఇంట్లోనే వుండు, నువ్వు చుట్టపుచూపుగా వెళ్ళిరా.
అంత మాటెందుకు పిన్నిగారు, నేనున్ననాళ్ళు మిమ్మల్ని వదలివెళ్ళనంటే వెళ్ళను.
అన్నమాటప్రకారం రాజు శారదను కాలేజీలో చేర్పించాడు.
***
శ్రావణంమాసం అమ్మవారి పూజకు అన్నీ సిధ్ధంచేసింది జయమ్మ, మహానైవేద్యం పెట్టి హారతి యిస్తూ గంటవాయించిన శాంతమ్మ గోడకు జారగిలపడింది, పిన్నిగారూ అంటూ జయమ్మ పెట్టినకేకకు పూజగదిలోకి వచ్చారు బలరామయ్యగారు, పంచపాత్రలోని నీళ్ళు వుధ్ధరిణుడు కూడా లోపలికి పోలేదు, ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది,
ఇల్లంతా తానై తిరిగిన శాంతమ్మ కళతప్పిన ఆ ఇంటి గోడ మీద ఫ్రేములో కదలకుండా వుండి పొయింది.
బలరామయ్య బలహీనుడయ్యాడు, ఆయనను ఇక ఒంటరిగా వదలమని కొడుకులు తమతో తీసికెళ్ళారు.
*****
అమ్మా నేను కాలేజీకి వెళితే పసివాళ్ళను చూసుకోగలవా అని శారద అడిగితే పిల్లనెలతప్పీందని తెలుసుకుని ఆనందపడింది జయమ్మ, చూస్తుండగానే శారద ఇద్దరు పిల్లలతో డిగ్రీ వున్నతశ్రేణిలో పాసయింది, శాంతమ్మగారిదీవెనలు అనుకున్నారు తల్లీకూతుళ్ళు. బియ్యీడి పూర్తిచేసి ప్రభుత్వ పాఠశాలలో వుపాధ్యాయినిగా చేరింది,వృత్తి మీద నిబధ్ధత గౌరవము కలిగిన టీచరు అని అభినందనలు అందుకున్నది, పిల్లలకు చదువుచెబుతూ తాను కూడా పిజీ చేసి, ప్రధానోపధ్యాయురాలయింది, పిల్లలిద్దరూ క్రమశిక్షణ తో చదివి వున్నత విద్యవంతులయ్యారు, పెద్దవాడు మంచి కంపెనీలో వుద్యోగం రావడంతో కెనడా భార్యను తీసుకుని వెళ్ళాడు, చిన్నవాడికి లో బెంగుళూరులో ప్రొఫెసర్ గా చేస్తున్నాడు.
****
గుప్పెడు మెతుకులకోసం ఎదురు చూసిన స్థితినుండి ఈ రోజువున్న స్థాయికి తెచ్చిన బలరామయ్య శాంతమ్మలకు గుండెల్లోగూడుకట్టి పూజించుకుంటున్నారు.
*****
అమ్మా ఆనందుడి భార్య నెలతప్పిందిట, మార్చినెలలో పురుడన్నారుట. నువ్వో నేనో వెళ్ళాల్సి వస్తుంది. నాకయితే స్కూలు పరీక్షలు వెళ్ళలేను, ఆయన కూడా రాలేనంటున్నారు. నీకు ఇక తప్పదు.
ఈనాలుగు వీధులు తప్ప నేనెక్కడికీ ,వెళ్ళలేదు దేశంకాని దేశం నేనేంచేయగలను.
నీకేంభయంవద్దమ్మా. ఆనందుడే అన్ని చూసుకుంటాడు,నువ్వుంటే వాడికి ధైర్యం.
అంతే కెనడా చేరిన జయమ్మ ఇక్కడ అంతా బాగుంది,చక్కగా అన్నీ దొరుకుతున్నాయి కాని భయపడ్డానురా అంటూ మురిసిపోయింది.
జయమ్మ తెలుగువంటలకు ఆనంద్ మిత్రులందరూ అభిమానులయ్యారు,
ఆనందుభార్య సుధకు బంగారంలాంటి పిల్ల పుట్టింది..
అమ్మమ్మా పాపాయి పేరు 'శాంత 'అంటూ పసిదాన్ని చేతుల్లో పెట్టారు,
శాంతమ్మగారు ఇలా దగ్గరయ్యామా మళ్ళీ అంటూ ఆనంద భాష్పాలు రాల్చాయి జయమ్మ కళ్ళు , అమ్మమ్మా అమ్మను మమ్మల్ని పెంచినట్టే శాంతను కూడా పెంచాలి, నీవి అమృత హస్తాలు అన్నాడు ఆనంద్.
***
ఆర్నెల్లు ఇట్టే గడిచిపోయాయి,
ఆప్యాయంగా చూసుకునే మనవడు భార్యసుధ చిన్ని శాంతమ్మ వదలలేక వదలలేక తిరుగు ప్రయాణమయింది జయమ్మ, ఏ అదృష్టానికి నోచుకోని ఆనందరావు గుర్తుకొచ్చాడు,
ఆటుపోట్లకు నిలిస్తేనే జీవితం. నేను నాబిడ్డ నష్టజాతకులంకాదు గాక కాదుమళ్ళీ మళ్ళీ అనుకుంది జయమ్మ.
******
యాభైవేలు నేనేంచేసుకుంటాను, గుప్పెడు మెతుకులకోసం నిర్భాగ్యులేందరో మనచుట్టూనే వున్నారు,కాలే కడుపుతో ఏం చదువుతారు. ముందు ఆకలితీరాలి,అప్పుడే ఆలోచనలు సరయిన దారిలో పడతాయి . వెళ్ళగానే ఎందరికో ఆకలితీర్చి విద్యాబుధ్ధులు యిస్తున్న తుమ్మలపల్లి వారి వసతిగృహాని కిచ్చేస్తాను, పెద్దపెద్ద పనులు చేయలేక పోయినా చేసేవారికి నేచేయగలిగినంతచేస్తాను అనుకుంటూ చెమర్చినకళ్ళు తుడుచుకుంది జయమ్మ.
***
No comments:
Post a Comment