వడ్డాణం
శ్రీమతి సంధ్యా నాగేశ్వర
"ఈ సంబంధమైనా కుదరాలని మా పిట్ట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను, ఒకవేళ కుదిరితే గనక శ్రావణ మాసంలోనే పెళ్ళి ముహుర్తం చూడండి, అప్పుడైతే చిన్ను గాడికి కూడా సెలవలుంటాయ్......' స్వప్న చెప్పుకుంటూ పోతుంది '
"ఆగవే ఆగు, నువ్వు నీ కంగారు, ఇంకా వాడసలు పిల్లని చూడందే" స్వప్న మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు సుమతి గారు.
"సర్లే కానీ అమ్మా బంగారం ధర తగ్గిందంటగా మరి నా పని చూసెయ్యరాదు?"
"ఒసినీ అసాధ్యం కూలా, ఎంతసేపూ నీ వడ్డాణం గోల నీదే కానీ ఇవతల ఏ పరిస్థితులున్నాయో అర్థంచెసుకోవే, ఐనా నీ సీమంతానికి మీ ఆయన చేత వంకీలు, జడబిళ్ళా కొనిపించుకున్నావు కదా అప్పుడే ఒక వడ్డాణం కూడా కొనిపించుకొవల్సింది కదా"
"అబ్బా, ఆశ దొశ అలా ఎలా కొనిపిస్తాను ఆయన చేత, చిన్నప్పటి నుంచి నా వడ్డాణం కోరిక నీకు తెలియంది కాదుగా, నాన్నే నాకు కొనాలి"
"సరేలే కానమ్మాయ్ ఇంతకీ నీ చదువెలా సాగుతుంది?"
"ఎం చదువే అమ్మా, మనవి వానాకాలం చదువులైతే ఇక్కడివి చలికాలం చదువులు, ఆ నరాలు బిగుసుకుపొయే చలిలో యూనివర్సిటీకి వెళ్ళొచ్చేసరికి తల ప్రాణం జడలోకొస్తుంది"
"జడలొకి రావడమేమిటే నీ తలకాయ"
"అదేనమ్మా ఇక్కడికొచ్చాక నా జడ సన్నగా తోకలా అయిందని, తల ప్రాణం తోకలోకొచ్చింది అనడానికి బదులు జడలోకొచ్చింది అన్నాను సరదాగా, ఐనా నీకు వయసు పెరిగిపోతుందే జోక్స్ కూడా ఇలా విడమర్చి చెప్పాల్సొస్తుంది
"చాల్లేవే, మీ నాన్నకి తోడు నువ్వొకదానివి నా ప్రాణానికి, ఈ మధ్యన మీ నాన్నొక సెలెబ్రిటి అయిపొయారు తెలుసా"
"నాన్న సెలెబ్రిటీయా, అదెలా"
"ఈయనకి తెలిసిన నాటువైద్యం గురించి ఫేస్బుక్ లో పెట్టారు ఒకసారి, అది మొదలు ప్రతిరోజూ ఎవడో ఒకడు ఫోన్ చెయ్యడం, ఫలానా జబ్బుకి ఏ మందువాడాలో చెప్పండని అడగడం, ఈయన గారు ఆ మూలికల కోసం అర్థరాత్రి దాక తుప్పల్లో వెతకడం, ఇదీ వరస"
"పొనీలే అమ్మా రిటైర్ అయిన తర్వత ఎదో కాలక్షేపం అవుతుందిగా"
"ఆ కాలక్షేపం నా చావుకొచ్చిందే తల్లి, మూలికలని చెప్పి రోజూ ఒక బస్తాడు ఎండుటాకులు, వేర్లు , పిచ్చిమొక్కలు తెస్తారు, ఒక్కోసారి వాటిల్లో గొంగళిపురుగులు, మిడతల్లాంటివి కూడా ఉంటాయ్, అవన్నీ శుభ్రం చేసి పెట్టాలిట నేను, సరేలే ఏదో ఒక్కరే చేసుకుంటున్నారులే అని ఆ పని నేనే చెస్తాను ఇంతవరకు బాగానే వుంది, ఈ మధ్యన ఏవో మూలికలు కావాలని కోయదొరకి చెప్పారట, ఇంక చూసుకో ఎక్కడపడితే అక్కడ నేను కనపడినప్పుడల్లా పెద్దమ్మ గారు కుర్రో కుర్రు అని అరవడం మొదలుపెట్టాడు, అది విన్న ఇరుగుపొరుగు వాళ్ళు, వాడేమైనా నీ బంధువా అని అడుగుతున్నారు, ఇక నా పరిస్థితి కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ సినిమాలో నరేష్ లాగ తయారయ్యింది, వాడు కుర్రో అనగానే నేను అమ్మో అని పారిపోతున్నాను.
"హ హ హ , చాలమ్మా చాలు ఇంక నవ్వలేను, అసలే ఈరోజు ఎక్కువ క్లాసులున్నాయ్, మళ్ళీ రేపు మాట్లాడతాను"
"అంతేలే నీకు మీ నాన్నకి నా పరిస్థితి నవ్వులాటగానే ఉంటుంది, సరేలే కానీ జాగ్రత్తగా వెళ్ళు"
ఈ సంభాషణ అంతా వెనక నుంచి వింటున్న రావు గారు "ఏమిటోయ్ అమ్మాయితో నా గురించి ఉన్నవీ లేనివి చెప్తున్నావ్"
"ఆ మరే మీరుంటే నన్ను మాట్లాడనివ్వరుగా, మీ ఇద్దరి ముచ్చట్లకే సరిపోతుంది, ఆ సామర్లకోట సంబంధం వాళ్ళకి ఎల్లుండి ఆదివారం వస్తామని చెప్పండి, అబ్బాయి రేప్పొద్దున్నే వస్తానన్నాడు"
"అన్నట్టు పటికబెల్లం తీసుకురండి, కార్ డ్రైవర్ కి చెప్పారుగా ఆదివారం ఎనిమిది గంటలకల్లా ఇక్కడనుంచి బయల్దేరాలని"
"ఆ ఆ.... పటికబెల్లం ఎందుకులేవే, ఏదైనా స్వీట్ కొని పట్టుకెళ్దాం.
"చాల్లెద్దురూ, మన పద్దతి ప్రకారం మనం నడుచుకోవాలి అంతేకాని ఎవరేమనుకుంటారో అని పద్ధతులు మార్చుకుంటామా"
"నీతో వాదించలేనుకాని, కాస్త కాఫీ ఇస్తే బజారు పనులన్నీ చూసుకొని వస్తా"
"వుండండి రెండు నిమిషాల్లో తెస్తా"
"ఏ మాటకామాటే చెప్పుకోవాలి నీ చేతి కాఫీ అమృతమనుకో, పడుకునే ముందు కూడా ఒక గ్లాసుడు ఇచ్చావనుకో అమృతపు కలలొస్తాయి అదేనోయ్ స్వీట్ డ్రీమ్స్ అనమాట"
"అమృత కలలేం ఖర్మ, అతిధి సినిమాలో హీరోయిన్ అమృతారావే వస్తుంది, ఏంటో పిల్లచేష్టలు మీరూను"
****
శనివారం ఉదయాన్నే కొడుకు ప్రదీప్ రావడంతో అబ్బాయికి ఇష్టమైనవి వండే పనిలో పడ్డారు సుమతి గారు, ప్రదీప్ వంటగదిలోకి అడుగుపెడుతూనే "అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి" అని అనడంతో ఏదైనా ప్రేమవ్యవహారం ఉందేమో అని కంగారు పడ్డారు సుమతి గారు.
"నాకు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదు, ఈ విషయం నాన్నకి నువ్వే చెప్పు"
“ఇదా విషయం, ఇంకేదో అనుకుని కంగారుపడ్డాను, నేను చెప్తానులేరా నువ్వెళ్లు"
పైకి అలా అన్నారే కానీ మనసులో అలజడి రేగింది, అబ్బాయికి వచ్చిన కట్నంతో అమ్మాయికి వడ్డాణం కొనాలని ఎప్పటినుంచో భార్యాభర్తలు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు కొడుకు ఇలా అనడం తో ఏమి పాలుపోవట్లేదు.
భర్తకి విషయం చెప్తే, ముందు పెళ్ళిచూపులవ్వనీ ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని నవ్వేసి వెళ్లిపోయారు.
అనుకున్నదాని ప్రకారం ఉదయాన్నే బయల్దేరివెళ్లి అమ్మాయిని చూసారు, వాళ్ళ పద్ధతులు అవి నచ్చాయి, ఇరువైపుల అంగీకారం తో అదేరోజు తాంబూలాలు మార్చుకున్నారు, కానీ సుమతి గారికి మాత్రం వడ్డాణం గురించే ఆలోచన. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు వివాహం నిశ్చయించారు, స్వప్న కి ముందుగానే చెప్పడంతో పెళ్ళికి పదిహేనురోజులముందు వచ్చేట్టుగా ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకుంది, భర్తకి సెలవలు లేకపోవడంతో పెళ్ళికి ముందు రోజువచ్చి, పెళ్ళైన మూడోరోజే వెళ్లిపోయేలా ఆయన టిక్కెట్లు తీసుకున్నారు.
"ఏమోయ్, బ్యాంకుకి వెళ్లే పనుంది, నీ సంతకం కావాలి, తయారవ్వు"
అంత అర్జెంటు గా బ్యాంకుకి వెళ్లాలని ఎందుకన్నారో ఆవిడకి అర్థంకాలేదు, ఎదో ముఖ్యమైన పనే అయ్యుంటుందిలే అనుకుని తయారయ్యి ఇద్దరూ బ్యాంకు కి వెళ్లారు.
బ్యాంకు పని పూర్తిచేసుకొని వచ్చాక రావుగారు చెప్పడం మొదలుపెట్టారు.
"రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు నీ పేరు మీద కొంత ,నా పేరు మీద కొంత డిపాజిట్ చేసాము కదా, అమ్మాయికి వడ్డాణం కొనివ్వడానికాని ఆ డబ్బులు ముందే తీసుకొనేలా పదిరోజుల ముందు అప్లికేషన్ పెట్టొచ్చాను, ఈరోజు ఫార్మాలిటీస్ పూర్తి చేసి తీసుకెళ్లండని పొద్దున్న ఫోన్ చేసారు, అందుకే నీ సంతకాలు అడిగాను, అమ్మాయి అకౌంట్లో డబ్బులు వేసాను, అక్కడ కూడా బంగారం షాపులు బాగానే ఉంటాయి కదా, వచ్చేటప్పుడు కొని తెచ్చుకోమను, అక్కడైతే వాళ్ళిద్దరికీ నచ్చిన మోడల్ కొనుక్కుంటుంది"
"ఏంటి ఏమి మాట్లాడవు?"
పక్కకెళ్లి కళ్ళొత్తుకోవడం చుసిన రావు గారు, "నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది, మనకి అవసాన దశలో ఉపయోగపడతాయని దాచుకున్న డబ్బు ఇప్పుడు ఇలా చేశాననే కదా?"
"ఇలా ఆలోచించడం తప్పో కాదో నాకు తెలియదండి, ఇప్పుడున్న పరిస్థితులని బట్టి వృధాప్యంలో ఎవరిమీదా ఆధారపడకుండా ఉండాలనే కదా ఆ డబ్బు ఆలా ఉంచింది, కానీ ఒక పక్క అమ్మాయి కోరిక, రెండోపక్క మన భవిష్యత్తు, ఏది మంచో చెప్పలేకున్నాను"
"ఒకటి ఆలోచించు సుమతి, మన పెంపకం మీద నాకెంత నమ్మకం ఉంటే ఈ పని చేస్తాను"
నిజమే కదా అనిపించిందావిడకి, ఇక ఆ విషయం గురించి ఆలోచించకూడదని ఇద్దరూ ఒట్టేసుకున్నారు.
స్వప్న, పిల్లాడితో ఇండియా రావడం పెళ్లిపనులన్ని తానే ఉత్సాహం గా చేయడంతో భార్యాభర్తలిద్దరికీ ఎంతో సంతోషమేసింది, అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది, పెళ్ళిలో వడ్డాణం పెట్టుకొని మెరిసిపోతున్న కూతుర్ని చూసి రావు గారు సంబరపడిపోయారు.
ఇంతలో స్వప్న వెళ్లే రోజు రానే వచ్చింది, ఆరుబయట కూర్చున్న నాన్న దగ్గరికి వెళ్లి చేతిలో ఏవో పేపర్లు పెట్టింది, అది ఏంటో ఆయనకీ అర్థంకాలేదు, ప్రస్నార్ధకంగా స్వప్నవైపు చూసారు
"చిన్నప్పట్నుంచీ వడ్డాణం వడ్డాణం అని బాగా విసిగించాను కదా నాన్న, నా అకౌంటుకి డబ్బులు పంపినప్పుడు మొదట ఆనందపడ్డా తర్వాత ఆలోచించాను, అన్నయ్యకి ఫోన్ చేసి అడిగాను తనకి తెలియదన్నాడు, అంత డబ్బు నాకివ్వడానికి నువ్వు అప్పైనా చేసుండాలి లేకపోతే దాచుకున్న డబ్బైనా అయ్యుండాలి, ఎదో తెలియని బాధ నాన్నా, అదే మీ అల్లుడికి చెప్పాను, అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావ్ అని అడిగారు, ee డబ్బు అమ్మానాన్నల పేరు మీద డిపాజిట్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పాను తనుకూడా సంతోషించారు, ఆ డిపాజిట్ తాలూకా బాండ్ అది"
అంతా అయోమయంగా వుంది రావుగారికి "మరి ఈ రెండో ఫైల్ ఏంటి? నువ్వు పెళ్ళిలో పెట్టుకున్న వడ్డాణం?"
"నేను ఇలా చేసే ముందు అన్నయ్యతో చెప్పాను, వాడుకూడా చాలా బాధపడ్డాడు మీరు సరిగా అర్థంచేసుకోలేదని, ఎక్కడో ఎవరో ఎదో చేసారని మనం కూడా అలాగే చేస్తామా, పెళ్ళైతే తల్లితండ్రుల్ని పట్టించుకోరని ఒకలాంటి అభిప్రాయం ఎందుకు ఏర్పరుచుకుంటారోనని చాలా మథన పడ్డాడు, ఒకరోజు నాకు ఫోన్ చేసి అమ్మానాన్న పేరుమీద చిన్న అపార్ట్మెంట్ కొన్నానని చెప్పాడు, దాని డాక్యూమెంట్స్ ఆ ఫైల్ లో వున్నాయ్.... ఇక నా వడ్డాణమంటావా, ఇక్కడికొచ్చేముందురోజు నా పుట్టినరోజుకి నాకు మీ అల్లుడు బహుమతిగా ఇచ్చారు"
"ఏం చెప్పాలో కూడా అర్థంకావట్లేదు, ఎన్నో కష్టనష్టాలని చూసినప్పుడు కూడా ఏనాడు కంట్లో నీరు రానివ్వలేదు నేను, కానీ జీవితంలో మొదటిసారి మీ అందరి ఉన్నత వ్యక్తిత్వాలని చూసి కన్నీళ్ళొచ్చాయి”
ఇంతలో గుమ్మం లో కుర్రో కుర్రు అన్నమాటకి అందరు సుమతి గారి వంక చూడ్డంతో , ఒక్కసారిగా అందరూ నవ్వేసారు సుమతి గారితో సహా..
*****సమాప్తం******
చక్కగా ..ప్రశాంతంగా చదివించే కధ వడ్డాణం...బాగుందండి సంధ్య గారు..
ReplyDeleteచాలా బాగుంది...
ReplyDelete