అదృష్టవంతుడు
దొండపాటి కృష్ణ
మనం అనుకున్నది కాకుండా, కోరుకున్నది కాకుండా, అనుకోనిది, కోరుకోనిది దొరకడం కాని, జరగడం కాని సహజం. ఉదయ్ కుమార్ తన ప్రమేయం లేకుండానే ఎంబీయే చదివాడు. అక్కడవరకు తన ప్రమేయం లేకపోయినా, జీవన పోరాటంలో ప్రమేయం లేకపోతే ఇబ్బంది పడడం ఖాయం అని గ్రహించడంతో ఎలాగొలా పట్టా చేతబుచ్చుకొని ఓ ప్రైవేటు కంపెనీలో 12 వేలకు కొలువులో చేరాడు. హైదరాబాదులో ఓ బ్రహ్మచారికవిసరిపోతాయేమో కాని సంసారపరుడికి మాత్రం సరిపోవు.
హైదరాబాదు లాంటి మహానగరంలో ఒంటరిగా ఉంటే, జంట తోడవుతుందేమోనని భయపడ్డ అతని కుటుంబం మరియు బంధుగణం కలిసి ఒక నిర్ణయం చేసి, తన మరదలనిచ్చి పెళ్లి చేసి హైదరాబాదుకు జంటగా పంపించారు. ఇందిరను కూడా నెలకు 8 వేలిచ్చే సంస్థలో జాయిన్ చేశాడు. ఇద్దరికీ వచ్చే జీతంతో హాయిగా బ్రతకొచ్చని ఆశ. ఆశే రేపటికి ఆయువు కదా..!
జంటగా బ్రతికేస్తున్న వారి జీవితాల్లోకి ఆనందాలను పెంచడానికన్నట్లుగా కూతురు రంజని పుట్టింది. రెండు సంవత్సరాల నుంచీ ఒకే సంస్థలో పనిచేస్తున్నా కెరీర్లో ఎదుగుదల కనిపించలేదు. ఆడవాళ్ళ అవసరాలకు ఆర్ధిక వనరులు కరిగిపోతుండడం సహజమే.! ఉదయ్ బాధ్యత మరింత పెరిగింది.
ఇందరది విచిత్రమైన మనస్సు. ఈ కాలం అమ్మాయే అయినా కట్టుదిట్టంగా ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకి లొంగదు. పేస్ బుక్, వాట్స్ ఆప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాల్లో అస్సలు కనిపించదు. కనీసం స్మార్ట్ ఫోన్ వాడడానికి కూడా అంత ఆసక్తి చూపించదు. ఆఫీస్లో ఖాళీ సమయాల్లో భార్యమీద ప్రేమతో మెసేజ్లు పంపించినా, ఉదయ్ కు తిరిగి జవాబివ్వదు. అదేంటని అడిగితే “తొమ్మిది గంటల పాటు మన సమయాన్ని కొనుక్కొని, నెలపాటు చేసిన శ్రమకు ప్రతిఫలంగా జీతం ఇస్తున్నారు. అటువంటి సంస్థ ఎదుగుదల గురించి ఆలోచించాలి కాని వ్యక్తిగత జీవితం గురించి కాదు” అని నిర్మొహమాటంగా చెప్పేసింది. అవును మరి.! ఆమెకే తెలిసిన సత్యమిది.!
ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక కూడా బంధువులేవ్వరితోనూ ఫోన్లో మాట్లాడుతూ కాలక్షేపం చేయదు. ఎంజాయ్ చేయమని ఉదయ్ చెప్తే “ఆఫీసులో అస్తమానం ఫోన్ లోనే ఆఫీస్ కాల్స్ మాట్లాడుతుంటాం. ఇంటికొచ్చాక కూడా ఎందుకు.? ఎంజాయ్ చేయడమంటే ఏంటి.? మనుషులతో ప్రేమగా మెలగాలి కాని వస్తువులతో కాదు. వీలున్నప్పుడు వాళ్ళను కలవొచ్చు. మీరు, పాప నాకున్నారు. మీ సమయాల్ని నాకు కేటాయిస్తే చాలు, అదే ఆనందం. సంతోషకరమైన జీవితం” అంటుంది.ఇదామె కనిపెట్టిన సూత్రం.!
అంత మంచి భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఆమె కోరికలను వీలైనంతవరకు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా, ఆమెకు తెలియకుండా, మాటల్లోనే ఆమె ఇష్టానిష్టలను తెలుసుకొని అవి సాకారంయ్యేలా చేయడం మొదలెట్టాడు. ఉదయ్ తనకిస్తున్న ప్రాధాన్యతకు, ప్రేమకు ఉప్పొంగిపోయేది ఇందిర. భర్తే సర్వస్వం, పాపే ప్రాణంఅయిందామెకు.!
అన్యోన్యమైన వారి జీవితం ఇంకా అన్యోన్యంగా ఉండాలని రెండేళ్లుగా పనిచేస్తున్న సంస్థకు స్వస్తి పలికి, నెలకు 15 వేల జీతం వస్తుందని మా కంపెనీలో చేరాడు. ఎంబీయే చదవడం మా ఆఫీసులో పనిచేయడానికి బాగా పనికొచ్చింది. వచ్చిన మూడు నెలల వరకూ అతనితో పరిచయం పెరగలేదు. మా ఆఫీస్ కొచ్చాక, తనకో చిన్న బైక్ మరియు శ్రీమతికో స్కూటర్ కొన్నాడు. తన కూతురు నడకలు మొదలెట్టి ఉరకలు ప్రారంభించడంతో, పాప సంతోషమే ముఖ్యమని, తక్కువ బడ్జెట్ ఇంటినుంచి మంచి సౌకర్యాలున్న ఇంటికి మకాం మార్చాడు. బ్యాచిలర్స్ కు ఎక్కువ అద్దె చెప్తారు కాని ఫ్యామిలీకి మాత్రం హైదరాబాదులో కొంచం తక్కువే ఉంటుంది. ఖైరతాబాద్ లాంటి అభివృద్ధి చెందిన ఏరియా కావడం, జూబ్లి హిల్స్ దగ్గర ఆఫీస్ కావడం, రెండూ అతనికి కలిసొచ్చాయి.
ఉదయ్ తో పరిచయం పెరిగిన దగ్గర్నుంచి రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. ఆఫీస్ పరంగా అది నాకు మంచే చేసింది. ఒకరోజు వ్యక్తిగత విషయాలు మా మద్య చొరబడ్డాయి. అతన్ని నా మనసులో మాట అడిగేశాను. “మీ ఇద్దరి జీతం కలిపితే నా ఒక్కడి జీతంతో సమానం. అయినా నాకు పెళ్ళంటే చాలా భయం వేస్తుంది. కాని మీరెలా సర్దుకోగల్గుతున్నారు.? పాపనెలా పెంచగల్గుతున్నారు.?” అని అడిగాను. అతనెలాస్వీకరిస్తాడోనని సంకోచం మొదలైంది.
“ఆడదైనా, మగాడైనా పరిమితంగా హద్దుల్లో ఉంటే ఏం ఇబ్బంది ఉండదు గోపాల్. సర్దుకుపోగలిగే మనస్తత్వం ఉంటే చాలు. అర్ధం చేసుకునే భాగస్వామి దొరికితే జీవితమంతా బిందాస్. పది వేలయినా సరిపోతాయి. అర్ధం చేసుకోనిది దొరికితే మాత్రం చంక నాకి పోవాల్సిందే.! కోట్లకు కోట్లు సంపాదించిన వాళ్ళల్లో మనశ్శాంతిగా సంసారం చేసే వారెందరున్నారు చెప్పండి.? సంపాదన లేని వాళ్ళు కూడా ఎంత మనశ్శాంతిగా ఉన్నారో చూడండి. అప్పుడు భేదం మీకే తెలుస్తుంది” అని చెప్పాడు ఉదయ్. ఊహించని సమాధానం.!
నాలో భావోద్వేగాల్ని గ్రహించిన అతనే మళ్ళీ “భయ్యా.! ఒకమాట చెప్తున్నా వినండి.. ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేశాయి. ముప్పై వేల జీతం తీసుకుంటున్నారు. ఇంకేం ఆలోచించకుండా పెళ్లి చేసుకోండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఆఫీసులో ఒత్తిడుల మధ్య పనిచేసుకుని ఇంటికెళ్ళగానే “నాన్నా” అంటూ పాప రావడం, శ్రీమతేమో బాగోగులు చూసుకోవడం చూస్తుంటే ఒత్తుడులన్నీ మటుమాయం. మీలాగే ఇంకా జీతం పెరిగాక పెళ్లి అనుకోని ఉండొచ్చుగా..? పైగా తను నా మరదలే. ఎదురు చూడగలదు. కాని ఎందుకు చేసుకున్నాను.? జీవితంలో అన్నీ అనుభవించాలి. నా మనసెరిగిన భార్య రావడంతో చాలా ఆనందంగా ఉన్నాను. నిజంగా తను లేకపోతే ఏమైపోయేవాడినో..! నన్నెంత బాగా చూసుకుంటుందో. గొంతెమ్మ కోర్కెలు అస్సలు కోరదు. అంత మంచి భార్య అందరికీ దొరకదు. నేను అదృష్టవంతుణ్ణి” అంటూ చేతి కొనవేళ్ళతో కన్నీటిని తుడుచుకున్నాడు. తనలో ఆ భావోద్వేగం వాళ్ళ ప్రేమకు గుర్తు. అది నా మనస్సును తాకింది. నిజంగా అతను అదృష్టవంతుడే.!
ఉదయ్ మాటలు నన్ను ఆలోచించేలా చేశాయి. మా ఇద్దరికున్న చనువుతో నన్ను తనింటికి ఆహ్వానిస్తే వెళ్లాను. మాటల రూపంలో ఆయన చెప్పినదంతా కళ్ళకు కన్పించింది. పాప రంజని చాలా ముద్దుగా ఉంది. వాళ్ళ దాంపత్యం నేడీ సమాజానికి కనువిప్పనిపించింది. ఒకపూట వాళ్ళ సాంగత్యం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. అమ్మానాన్నా నన్నెప్పుడు అడిగినా ముందుకు జరుపుకుంటూ వచ్చిన నేనే, పెళ్లి చేసుకుంటానని చెప్పే సరికే ఆశ్చర్యపోయారు. కాస్త నవ్వుకున్న మాట కూడా వాస్తమే (అచ్చం మీరిప్పుడు నవ్వుకున్నట్లుగానే.. నవ్వకపోతే ఇప్పుడైనా నవ్వుకోండి..).
అమ్మాయినేప్పుడో రెడీ చేసుకుని పెట్టుకున్నట్లు, అడిగిన రెండు నెలల్లోనే ‘ఆ తంతు’ కానిచ్చేశారు. అంతా కలలా జరిగిపోయింది. ఉదయ్-ఇందిరల దాంపత్యంలా మాదీ ఉండాలని తాపత్రయ పడ్డాను. అందుకే నేనే చొరవ తీసుకుని శ్రీమతి కోరికలు తెలుసుకోవడం ప్రారంభించాను. హైదరాబాదులో మంచి సౌకర్యాలున్న ఇంటికి వెంటనే మారాను. తర్వాత తనని తీసుకొచ్చాను. ఉదయ్ గారు చేసినట్లుగానే శ్రీమతి అడక్కముందే చాలా సౌకర్యాలను ముందే అందించి పెట్టాను. తన మొదటి పెద్ద కోరికను చాలా గ్రాండ్ గా తీర్చాలని ప్లాన్ చేశాను.
ఎప్పట్లానే బస్సులో ప్రయాణం అనుకుందామె. కాని తనకి విమానంలో ప్రయాణం చేయాలనుందని తెలిసి తిరుపతి వెంకన్న దర్శనానికి విమానం టికెట్స్ బుక్ చేశాను. ప్రయాణం రోజు ఎయిర్ పోర్ట్ కు తీసుకెళ్తున్నప్పుడు విషయం చెప్తే ఎగిరి గంతేసినంత పన్జేసింది. చిన్నపిల్లలా సంబరపడిపోయింది. తన సంబరాన్ని చూస్తుంటే భలే ముచ్చటేసింది. వెంకన్న అనుగ్రహం త్వరగానే దొరికింది. తిరుగు ప్రయాణం కూడా విమానంలోనే.
శ్రీమతిని బాగా చూసుకోవాలనుకోవడం తప్పా చెప్పండి..? ఎప్పుడైతే తన కోరికలను అడక్కుండానే తీర్చుతున్నానో కోరికల చిట్టా పెరగడం, నా ప్రమేయం లేకుండా నాకు తెలియడం జరిగిపోతున్నాయి. తెలియకుండానే తనకి నేనే అలవాటు చేసేసి తప్పు చేశాను. ఇప్పుడు ఏ చిన్న కోరిక తీర్చకపోయినా అలగడం మొదలెట్టింది. నేను కోరుకున్నట్లు కాక అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. ఏం చేయాలో తెలియక రోజూ ఉదయ్ దగ్గర కూర్చొని నా బాధనంతా చెప్పుకోవాల్సి వస్తుంది. అనవసరంగా ఉదయ్ నన్ను ఇరికించాడని అన్పిస్తుంటుంది -అప్పుడప్పుడు. ఎందుకు గాడి తప్పానో మరి..? నిజంగా ఉదయ్ అదృష్టవంతుడు...! నేనిప్పుడు దురదృష్టవంతుణ్ణి..! ఎంతలా అంటే, ఆమెతో మాట్లాడితే ఏం కోరిక కోరుతుందో అన్నంతగా...!!!
-: చిరునవ్వు :-
No comments:
Post a Comment