నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే)-ఎరుపంటే మైమరపు! - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే)-ఎరుపంటే మైమరపు!

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే)-ఎరుపంటే మైమరపు! 
శారదా ప్రసాద్ 

అలా యవ్వనపు ప్రభావం నా మీద పనిచేయ సాగింది.నూనూగు మీసాల నూతన యవ్వనం అది.నాకు స్నేహితులు చాలా ఎక్కువమంది ఉంటారు.నా బలం, బలహీనతలు కూడా నా స్నేహితులే!.స్నేహితుల కోసం నాకు నచ్చితే ఏపనైనా చేస్తాను,నచ్చకపోతే మౌనంగా ఉండిపోతాను. బియస్సీ 2 వ సంవత్సరంలోకి వచ్చాను.2 సంవత్సరాలకు కలిపి ఒకేసారి పరీక్షలుండటం చేత ,మొదటి నుంచే జాగ్రత్తగా చదువుకునేవాడిని.ఆ రోజుల్లో యువకులు ఫాషన్ గా ఉండటానికి సిగరెట్లు త్రాగేవారు.అప్పటివారితో పోలిస్తే ,ఇప్పటి యువకుల్లో ఆ అలవాటు తక్కువనే చెప్పాలి.అయితే ఇప్పటి యువత ఇంటర్మీడియట్ నుంచే ముందుకు, మత్తు పదార్ధాలకు అలవాటు పడుతున్నారు.హైద్రాబాద్ లాంటి మహానగరాల్లో ఈ విచ్చలవిడి తనాన్ని మనం చూడొచ్చు.తల్లి తండ్రులిద్దరూ సంపాదన వ్యామోహంలో పడిపోయి ,పిల్లల బాగోగులు చూడకుండా ,వారు అడిగినంత ధనాన్ని పాకెట్ మనీగా వారికి ఇస్తున్నారు.విలాసవంతమైన కార్లు ,బైక్స్ కొనిపెడుతున్నారు.తాగి అధిక వేగంలో వాహనాలను నడిపి ప్రమాదానికి గురై మరణించే వారిలో చాలామంది ధనవంతుల పిల్లలే!మన మున్సిపాలిటీ మంత్రి అయిన నారాయణకు యెంత సంపద ఉందో అందరికీ తెలిసిందే!విద్యార్థులకు పాఠాలు బోధించే విద్యా సంస్థలకు అధిపతి కూడా ఆయన!అయితే ఆయన కుమారుడిని క్రమశిక్షణగా పెంచి ఉండకపోవచ్చు.దాని కారణంగా అతని ఏకైక కుమారుడు మితిమీరిన వేగంతో వెళుతూ  కార్ ఆక్సిడెంట్ లో ఘోరంగా చనిపోయాడు.ఉన్న ఒక్క కుమారుడు ఘోరంగా చనిపోయాడు.సంపాదించింది అనుభవించటానికి వారసులు లేరు.అయినా సంపాదన మీద వ్యామోహం మనిషికి చావలేదు.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా తరంలో చాలామంది తల్లితండ్రుల వద్ద ఉండే చదువుకున్నాం.ఇప్పటి వారు 10 వ తరగతి తర్వాతనే తల్లితండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్నారు. చదుకొని బాగుపడేవారు కూడా ఉన్నారనుకోండి!సందర్భం వచ్చినప్పుడు రచయితకు వచ్చిన భావాలను ఎక్కడో ఒక చోట చెప్పకపోతే రచయితకు తృప్తి ఉండదు.నేను మొదటి సారిగా అప్పుడే సిగరెట్టు  తాగటానికి  అలవాటు పడ్డాను.రోజుకు ఒక సిగరెట్టూ మాత్రమే తాగేవాడిని.సిగరెట్ తాగిన మొదటిసారి దగ్గు వచ్చి ఇబ్బంది పడ్డాను.ఒక మిత్రుడు ,ముందుగా నోటిలో పిప్పరమెంట్ పెట్టుకొని దాన్ని చప్పరిస్తూ కూల్ సిగరెట్ ను తాగమని సలహా ఇచ్చాడు.అది బాగానే పనిచేసింది .కూల్ సిగరెట్ మజాగా ఉంది.దుర్వ్యసనం నేర్చుకోవటానికి కూడా ఎక్కువ కష్టపడాలేమో!అప్పటి నుంచి నా అంతరంగ విషయాలన్నీ సిగరెట్ కు తెలుసు. సిగరెట్ నా ఇష్ట సఖి అయింది!తర్వాతి కాలంలో అది అలవాటై ఆరోగ్య రీత్యా చాలా బాధపడ్డాను.ఆ కధ మరొకసారి ఆసక్తికరంగా చెబుతాను.ఆ వయసులో ఆడపిల్లలతో మాట్లాడాలనే కుతూహలం బాగా ఉండేది.అంతకు మించి వేరే చెడు ఆలోచనలు రాని టీనేజీ అది. టీనేజీ పిల్లలలో చాలామందిలో అదే భావన ఉంటుంది.వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకుందామనే వారి శాతం చాలా తక్కువ.ఎక్కువ రేప్ కేసుల్లో దొరికిన వారిలో చాలామంది వివాహితులు,50 ఏళ్ళ వారే!లైంగిక వాంఛ ఉన్నవారే ఆసిడ్ దాటి లాంటివి చేసేది.ఒక అమ్మాయి నాతో ఎక్కువగా చనువుగా ఉండేది.(ఆ అమ్మాయి తన పేరును మీకు  చెప్పటానికి అనుమతి ఇవ్వలేదు!) ఆ అమ్మాయికి బాగా మార్కులు వచ్చేవి.ఆ అమ్మాయి మెప్పు పొందటానికి నేను కూడా కష్టపడి ఆ అమ్మాయి కన్నా ఎక్కువ మార్కులను తెచ్చుకునే వాడిని.(ప్రతి మగవాడి విజయం వెనుక ఆడవారు ఉంటారనేది నిజం!తర్వాతి రోజుల్లో కూడా నన్ను చాలామంది ప్రభావితులను చేశారు.వారిలో ముఖ్యమైన స్త్రీశిరోమణి నా భార్య!) అలా ఆడుతూ,పాడుతూ బియస్సీ 2 వ సంవత్సరం  మంచి మార్కులతో ఉత్తీర్ణుడనయ్యాను.శ్రీ భమిడిపాటి రామగోపాలం గారి స్ఫూర్తితో తెలుగు సాహిత్యం వైపు దృష్టి మళ్లింది.సెలవుల్లో శ్రీ శ్రీ సాహిత్యాన్ని చదవటానికి అలవాటు పడ్డాను.ఆటోమ్యాటిక్ గా వామపక్ష భావజాలం నాలో మొదలైంది."మ్మార్క్స్,ఎంగెల్స్ వ్రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివి ఎందరు కమ్యూనిష్టులుగా మారారో  నాకు తెలియదు కానీ ,నా మహా ప్రస్థానాన్ని చదివి ఎందరో కమ్యూనిష్టులుగా మారారని నేను గర్వంగా చెబుతామని" మహాకవి శ్రీ శ్రీ చెప్పింది అక్షరాలా నిజం!అలా ఎరుపంటే నాకు మైమరపుగా మారింది.మరికొన్ని భావాలు మరో సారి! 
***

4 comments:

  1. మీ అనుభవాలను ఆసక్తికరంగా చెబుతున్నందుకు అభినందనలు

    ReplyDelete
  2. చాలా బాగుందండీ!

    ReplyDelete
  3. అక్షర దోషాలకు క్షమించగలరు!

    ReplyDelete
  4. This is a recollection of your past describing how the youth was then and now. It also narrates as how you're influenced by communist ideology which can be known as red theory. Good.

    ReplyDelete

Pages