గుప్పిట్లో ఛందస్సు - అచ్చంగా తెలుగు

గుప్పిట్లో ఛందస్సు

Share This

గుప్పిట్లో ఛందస్సు


పెయ్యేటి రంగారావు.


         
         లఘువుః  పొట్టి అక్షరాలు.  ఉదాః క, ల, ప, క్త, ప్ప, క్ర మొదలైనవి.  ఋ త్వంతో కూడినవి. ఉదాః కృతి లో కృ. కాని కృష్ణుడు లో కృ గురువు అవుతుంది.  ఎందుకంటే కృ తరువాత ద్విత్వాక్షరమైన ష్ణు వచ్చింది కనుక. తేల్చి పలికే రేఫకు ముందున్న అక్షరాలు.  ఉదాః కద్రువ, అద్రి మొదలైనవి. లఘువుకు గుర్తుః I


    గురువుః  దీర్ఘమైన (పొడుగు) అక్షరాలు.  ఉదాః కా, లా, పా. మరిన్నీ, ఒత్తున్న అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు.  ఉదాః రక్తి లో ర గురువు అవుతుంది. అభ్యాసము లో అ మరియు భ్యా గురువులు. పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాలు.  ఉదాః రం, యం, తం మొదలైనవి. పొల్లులతో కూడిన అక్షరాలు. ఉదాః నిన్, గల్, రన్ మొదలైనవి. విసర్గలతో కూడినవి.  ఉదాః అంతఃపురము లో అం, తః గురువులు. ఐత్వంతోను, ఔత్వం తోను వున్న అక్షరాలు. ఉదాః కౌపీనము, కైలాసము లలో కౌ మరియు కై గురువులు.  గురువుకు గుర్తుః U


గణములుః  కొన్ని అక్షరములు కలిసి గణములు అవుతాయి.  గణాలకు పేర్లు ఉన్నాయి. అవిః యగణం, మగణం, తగణం, రగణం, జగణం, భగణం, నగణం, సగణం.  ఇవి మూడేసి అక్షరాలు గలవి. రెండేసి అక్షరాల గణాలుః గగ, గల, లల, లగ. ఒక లఘువు, ఒక గురువు ఉన్న లగ ను వగణం అని కూడా అంటారు.  ఒక గురువు, ఒక లఘువు ఉన్న గల ను హగణం అని కూడా అంటారు. ఏకాక్షర గణాలుః లఘువు, గురువు. ఐతే ఈ గణాలను ఎలా గుర్తించాలి అన్నదానికి ఒక సులభమైన మార్గం సూచింపబడింది.  “యమాతారాజభానసలగం” . ఇది ఛందస్సు నేర్చుకునే వారికి చాలా విలువైన వాక్యం. ఎలాగో చూడండి. యగణం లో ఎన్ని లఘువులు, ఎన్ని గురువులు వుంటాయో ఈ వాక్యం చూడగానే తెలిసిపోతుంది.  


యమాతా అంటే IUU.  (య - లఘువు, మా - గురువు, తా - గురువు).  అంటే యగణం ఒక లఘువు, రెండు గురువులతో కూడి వుంటుంది.


అలాగే మిగిలిన అన్ని గణాలను మీరు గుర్తించగలరు.  


మగణంః  మాతారా - UUU - మూడు గురువులతో కూడి వున్నది.
తారాజ - UUI - రెండు గురువులు, ఒక లఘువు తో కూడి వున్నది.
రాజభా - UIU - గురువు, లఘువు, గురువు తో కూడి వున్నది.
జభాన - IUI - లఘువు, గురువు, లఘువు తో కూడి వున్నది.
భానస - UII - గురువు, లఘువు, లఘువు తో కూడి వున్నది.
నసల -  III - మూడు లఘువులతో కూడి వున్నది.
సలగం - IIU - రెండు లఘువులు, ఒక గురువు తో కూడి వున్నది.


నాలుగు అక్షరాల గణాలుః


నలము - IIII - నాలుగు లఘువులతో కూడి వున్నది.
నగము - IIIU - మూడు లఘువులు, ఒక గురువుతో కూడి వున్నది.
సలము - IIUI - రెండు లఘువులు, ఒక గురువు, ఒక లఘువు తో కూడి వున్నది.


గణాలలో ఇంద్రగణములు, సూర్యగణములు అని ఉన్నాయి.  
ఇంద్రగణములు - నల, నగ, సల, భ, ర, త గణములు.
సూర్యగణములు - గల, న గణములు.


ప్రాసః  పద్యము యొక్క ప్రథమ పాదము యొక్క రెండవ అక్షరము ఏ హల్లు వుందో, మిగిలిన అన్ని పాదముల యొక్క రెండవ అక్షరములు ఆ హల్లే వుండాలి.
ప్రాసాక్షరము ద్విత్వమైతే అన్ని పాదములలోని రెండవ అక్షరము ద్విత్వమే వుండాలి.  అలాగే సంయుక్తాక్షరమైతే అన్ని పాదములలోని రెండవ అక్షరము సంయుక్తాక్షరమే అయి వుండాలి.
ప్రాస పూర్వాక్షరము (అంటే పద్యపాదము యొక్క మొదటి అక్షరము గురువైతే అన్ని పాదములలోను మొదటి అక్షరము గురువై వుండాలి.  అలాగే మొదటి అక్షరము లఘువైతే అన్నిపాదములలోను లఘువే వుండాలి.
ప్రాసాక్షరము పూర్ణబిందువైతే అన్ని పాదములలోని రెండవ అక్షరము పూర్ణబిందువే వుండాలి.


ద కు ధ కు, ద కు థ కు, ఱ కు ర కు, న కు ణ కు, ల కు ళ కు ప్రాస కుదురుతుంది.  ఉదాః మొదటి పాదములోని రెండవ అక్షరము ల అయివుంటే మిగిలిన పాదాలలోని రెండవ అక్షరము ల గాని ళ గాని వుండవచ్చును.


యతిః  పద్య పాదము లోని మొదటి అక్షరానికి, అదే పాదములోని మరొక గణము యొక్క మొదటి అక్షరానికి  యతినియమం వున్న చోట యతి కుదరాలి. అది పద్యలక్షణాలు చెప్పుకునేటప్పుడు వివరిస్తాను.


యతి మైత్రి ఈ ఈ అక్షరాలకు కుదురుతుంది.
  1. అ, ఆ, ఐ, ఔ, హ, య, అం.
  2. ఇ, ఈ, ఎ, ఏ, ఋ.
  3. ఉ, ఊ, ఒ, ఓ.
  4. క, ఖ, గ, ఘ, క్ష.
  5. చ, ఛ, జ, ఝ, శ, ష, స.
  6. ట, ఠ, డ, ఢ.
  7. త, థ, ద, ధ.
  8. ప, ఫ, బ, భ, వ.
  9. న, ణ.
  10. ర, ఱ, ల, ళ.
  11. పు, ఫు, బు, భు, ము.
  12. క ఖ గ ఘ ఙ - ఒక వర్గము.  చ ఛ జ ఝ ఞ - ఒక వర్గము. ట ఠ డ ఢ ణ - ఒక వర్గము.  త థ ద ధ న - ఒక వర్గము. ప ఫ బ భ మ - ఒక వర్గము. ప్రతి వర్గములోను చివర వున్న అనునాసికమునకు ముందు వున్న నాలుగు అక్షరాలతో, అవి పూర్ణబిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది.  ఉదాః త - న వర్గములోని అనునాసికమైన నకు కంద లోని దకు యతి చెల్లుతుంది. ఉచ్చారణ పరంగా కంద ను కన్ ద లా పలకవచ్చును. అందువలన కన్ లోని న కు కంద లోని దకు యతి చెల్లుతుంది. అలాగే మ కు పూర్ణబిందువైన య ర ల వ శ ష స హ లతో యతి కుదురుతుంది.  ఉదాః మయం ను మయమ్ అని పలకవచ్చును. కనుక మ కు య కు యతి చెల్లుతుంది.
  13. యతి స్థానంలో గాని, యతి మైత్రి స్థానంలో గాని సంయుక్తాక్షరముంటే, అందులో ఏ ఒక్క అక్షరానికి యతి చెల్లినా సరిపోతుంది.  ఉదాః క్ష్మ కు క ష మ లలో ఏ అక్షరమునకైనా యతి కుదర్చ వచ్చును.
  14. ఋ కారములో వున్న హల్లులకు యతి కుదురుతుంది.  ఉదాః ద కి గ కి యతిమైత్రి లేకపోయినా దృ కి గృ కి యతి కుదురుతుంది.
  15. హల్లులకి యతి కుదర్చేటప్పుడు హల్లుకి, దానిపై నున్న అచ్చుకి కూడా యతిమైత్రి పాటించాలి.  ఉదాః తు కి ఒ కి యతి చెల్లదు. త + ఒ లో ఉన్న త కి కూడా యతి కుదర్చాలి. అంటే తొ అని వుంటే తొ, దొ, థొ, ధొ లతో మాత్రమే యతి కుదురుతుంది.  


ప్రాసయతి నియమముః  పాదమందలి మొదటి అక్షరమునకు, యతిమైత్రి స్థానములో నున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతిమైత్రి తరువాతి అక్షరమునకును ప్రాస కుదుర్చుటను ప్రాసయతి అందురు. కొన్ని పద్యాలలో యతికి బదులు ప్రాసయతి వాడవచ్చును అని వుంటుంది.  అప్పుడు ఈ నియమాన్ని పాటించవచ్చును. ఉదాః తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో ప్రాసయతి వాడ వచ్చును. ఉదాః వేడిగిన్నె చురక వాడిగా తగలగా - అన్న పాదంలో వే కి వా కి యతి కుదరదు. కాని వేడి కి వాడి కి ప్రాసయతి కుదురుతుంది.


ఇక పద్యాల విషయానికొద్దాము.  సాధారణంగా ప్రతి పద్యానికి నాలుగు పాదాలు వుంటాయి.  (పాదాలు అంటే వరసలు) ప్రతి పాదంలోను గణాలు వుంటాయి.  పద్యలక్షణాలను జాగ్రత్తగా నేర్చుకుంటే మనం పద్యాలను సులభంగా వ్రాయడానికి వీలవుతుంది.
పద్యాలలో వృత్తములు, జాతులు, ఉపజాతులు వుంటాయి.  చంపకమాల, శార్దూలము మొదలైనవి వృత్తములు.


కందము, ద్విపద - జాతులు.


ఆటవెలది, సీసము, తేటగీతి - ఉపజాతులు.


ఇప్పుడు పద్యలక్షణాలను నేర్చుకుందాము.


కందపద్యముః  ఈ పద్యానికి నాలుగు పాదాలు.  
ప్రతిపాదంలోను అక్షరాల సంఖ్యకు నియమం లేదు.  
మొదటి, మూడవ పాదాలలో మూడేసి గణాలు వుండాలి.
రెండవ, నాలుగవ పాదాలలో ఐదేసి గణాలు వుండాలి.
భ, జ, స, నల, గగ  - ఈ ఐదు గణాలను మాత్రమే వాడాలి.
బేసి గణం జగణం కాకూడదు.  అంటే 1,3 పాదాలలో 1, 3 గణాలు,  2, 4 పాదాలలో 2, 4 గణాలు జగణం కాకూడదు.  
2,4 పాదాలలో అంతంలో గురువు వుండాలి.  అంటే ఈ పాదాలలో చివరి గణం గగ కాని సగణం కాని వుండాలి.
ప్రాసనియం పాటించాలి.  ప్రాసయతి పనికిరాదు.
యతిమైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికి, నాలుగో గణం మొదటి అక్షరానికి కుదరాలి.
అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్నీ హ్రస్వాలు గాని, అన్నీ దీర్ఘాలు గాని అయివుండాలి.  అంటే మొదటి పాదం మొదటి అక్షరం లఘువు అయితే అన్ని పాదాలలోని మొదటి అక్షరం లఘువే అయి వుండాలి.  అలాగే గురువు అయితే, అన్నీ గురువే వుండాలి.
2,4 పాదాలలో మూడవ గణం తప్పనిసరిగా జగణం కాని నలము కాని కావాలి.


తేటగీతిః
ప్రతిపాదం లోను 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వుండాలి. యతిమైత్రి ప్రతిపాదం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి వుండాలి.  ప్రాసయతి లేదు.


ఆటవెలదిః
1,3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వుండాలి.
2,4 పాదాలలో 5 సూర్యగణాలు వుండాలి.
యతిమైత్రి ప్రతి పాదం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి వుండాలి.
ప్రాసయతి లేదు.


సీసంః
నాలుగు పాదాలు వుంటాయి.
6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వుండాలి.  
యతి ప్రతి పాదం మొదటి అక్షరానికి, 3,5,7 గణాల మొదటి అక్షరానికి వుండాలి.  
ప్రాస- యతి వుంటే ప్రాస అక్కర్లేదు.  లేనిచో 1,3,5,7 గణాల రెండవ అక్షరాలకు ప్రాస వుండాలి.
సీసం క్రింద ఆటవెలది గాని, తేటగీతి గాని, కంద పద్యం గాని వుండాలి.


చంపకమాలః
ప్రతిపాదానికి 21 అక్షరాలు వుంటాయి.  నాలుగు పాదాలు వుండాలి.
ప్రతిపాదం లోను న జ భ జ జ జ ర గణాలు వుండాలి.
యతి ప్రతిపాదం మొదటి అక్షరానికి, 11వ అక్షరానికి వుండాలి.
ప్రాస నియమం వున్నది.


ఉత్పలమాలః
ప్రతిపాదానికి 20 అక్షరాలు వుంటాయి.  నాలుగు పాదాలు వుండాలి.
ప్రతిపాదం లోను భ ర న భ భ ర వ గణాలు వుండాలి.
యతి ప్రతిపాదం మొదటి అక్షరానికి, 10వ అక్షరానికి వుండాలి.
ప్రాస నియమం వున్నది.


శార్దూలముః
ప్రతిపాదానికి 19 అక్షరాలు వుంటాయి.
ప్రతిపాదంలోను మ స జ స త త గ గణాలు వుండాలి.
యతి ప్రతిపాదం మొదటి అక్షరానికి, 13వ అక్షరానికి వుండాలి.
ప్రాస నియమం వున్నది.


మత్తేభముః
ప్రతిపాదానికి 20 అక్షరాలు వుంటాయి.
ప్రతిపాదం లోను స భ ర న మ య వ గణాలు వుండాలి.
యతి ప్రతిపాదం మొదటి అక్షరానికి, 14వ అక్షరానికి వుండాలి.
ప్రాస నియమం వున్నది.


మత్తకోకిలః
ప్రతిపాదానికి 18 అక్షరాలు వుంటాయి.
ప్రతిపాదం లోను ర స జ జ భ ర గణాలు వుండాలి.
యతి ప్రతిపాదం మొదటి అక్షరానికి 11వ అక్షరానికి వుండాలి.
ప్రాస నియమం వున్నది.


తరళముః
ప్రతిపాదానికి 19 అక్షరాలు వుంటాయి.
ప్రతిపాదం లోను న భ ర స జ జ గ గణాలు వుండాలి.
యతి ప్రతిపాదం మొదటి అక్షరానికి, 12వ అక్షరానికి వుండాలి.
ప్రాస నియమం వున్నది.


మరెందుకాలస్యం?  పద్యరచన మొదలు పెట్టండి.

No comments:

Post a Comment

Pages