ఆ రోజు పొద్దున తను విన్నవిషయాన్ని తలచుకుంటూ లలిత దిగ్భ్రమ చెందింది. దాని గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది. కోపం, ఆవేశం కలగలిపి ఆమెను చుట్టుముట్టాయి.
*****
లలిత మహేశ్, శాంతిల అమ్మాయి. ఒక అన్నయ్య ఉన్నాడు, లోకేశ్. మహేశ్ మధ్యతరగతి జీవి. ఇప్పటికి యాభై సంవత్సరాల క్రితం తరానికి చెందినవాడు. ఒక తాలుకా పట్టణంలో నూట యాభై గజాల స్థలంలో స్వంత ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడు. చిన్న వ్యాపారస్థుడు. ముచ్చటైన నలుగురి సంసారాన్ని తన పరిమిత ఆదాయంతో నెట్టుకొస్తూ, మర్యాదగా జీవిస్తున్నవాడు. తమ కొడుకును, కూతుర్ని బాగానే చదివించి ఒడ్డున పడేశాడు. పిల్లలిద్దరూ ర్యాంకులు తెచ్చుకోకపోయినా, తమ తమ డిగ్రీలు ముగించారు.మహేశ్ తన యాభైయవ పడిలో పడినప్పుడు లలిత ఇరవైలలోకి వచ్చింది. మామూలుగా ఆడపిల్లలున్న ఇంట్లో వచ్చేట్టుగానే ఆమె వివాహ విషయం ప్రస్తావనకు వచ్చింది. కానీ, తన కాళ్ళ పైన తాను నిలబడాలనుకున్న లలిత తలిదండ్రులతో వాదించి, తన వివాహాన్ని వాయిదా వేయించింది. తనకున్న విద్యార్హతలతో అదే ఊళ్ళో ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకుని తన ఆశయాన్ని నెరవేర్చుకుంది. అన్నయ్య లోకేశ్ మాత్రం ఇంజనీరింగ్ ముగించి, హైదరాబాద్ లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ అభిజిత్ లోకేశ్ కు స్నేహితుడయ్యాడు. ఇద్దరి అభిరుచులు కలిసాయని అనిపించాక ఇద్దరూ సన్నిహితంగా మెలగసాగారు. ఒకసారి అభిజిత్ ను వీకెండ్ కి తమ ఊరికి తీసుకొచ్చాడు లోకేశ్. రెండు రోజులు ఊరంతా కలియదిప్పి, తాను చదివిన స్కూలు, కాలేజ్, పరిసరాలు, దగ్గరలో కొండపైనున్న అమ్మవారి గుడి అన్నీ చూపెట్టాడు . అవన్నిటితో పాటు తన్న చెల్లాయిని కూడ పరిచయం చేశాడు. అభిజిత్ కి లలిత చురుకుతనం, అందం నచ్చాయి. దొంగచూపులు చూస్తూ, కలిసి మాట్లాడేటప్పుడు చెణుకులు విసురుతూ, నవ్విస్తూ అమ్మాయి పైన తనకున్న ఇష్టాన్ని చాటాడు. చదువు బరువంతా ముగించుకుని, అప్పుడప్పుడే మధురోహల పర్వానికి ఆడుగిడిన లలితకు అభిజిత్ కోరచూపులు చక్కిలిగిలి పెట్టాయి. తన అన్నయ్య తరువాత తనను అంత నవ్వించిన అభిజిత్ పైన తనకు తెలియకుండానే ఇష్టం పెంచుకుందా అమ్మాయి. కళ్ళల్లోనే ప్రేమ కబుర్లు, వీడ్కోళ్ళు చెప్పుకున్నారు. లోకేశ్ కూడ అదే తరం వాడు కాబట్టి ఇద్దరి మనసుల్నీ పసిగట్టి, హైదరాబాద్ వెళ్ళగానే అభిజిత్ ని కదిపాడు. అభిజిత్ తన ప్రేమను వ్యక్తం చేయగానే “ మరి మీ అమ్మానాన్నలతో మాట్లాడితే మా అమ్మానాన్నలకు చెప్తాను “ అన్నాడు. తెగలు వేరయినా తమ కులం వాడే అని తెలుసు కాబట్టి ఆ విషయం చర్చకు రాలేదు.
అభిజిత్ తరువాతి సెలవులకు తమ ఊరికి వెళ్ళాడు. అభిజిత్ వాళ్ళు కొంతవరకు ఉన్నవాళ్ళనే చెప్పుకోవచ్చు. దగ్గరిలోని ఒక జిల్లా కేంద్రంలో మంచి వ్యాపారవేత్త అభిజిత్ తండ్రి. అభిజిత్ కు ఒక అక్క, అవని. తాముంటున్న మేడ, కొట్టు కాకుండా మరో మేడ ఉంది వారికి ఆ ఊళ్ళో. అవనికి పెళ్ళై రెండేళ్ళైంది. ఇంకా పిల్లలు కలగలేదు. అల్లుడు వాళ్లు కూడా వీరికి సరితూగే అంతస్తు వాళ్ళే. అదే ఊళ్ళోఉంటారు.
అభిజిత్ లలిత గురించి కదపగానే తలిదండ్రులిద్దరూ ఆలోచనలో పడ్డారు. తమ కులపు వాళ్ళే అవడంతో ఆ మిష చెప్పడానికి వీలు లేక పోయింది. అంతస్తు తక్కువ అనే విషయం వారిద్దరికీ అనిపించినా కొడుకు ఇష్టపడ్డ అమ్మాయి కాబట్టి సరే వెళ్ళి చూసి వద్దాం అనుకున్నారు. అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి ఇంట్లోని వాతావరణం, మర్యాదలు చూసి కాస్త మెత్తబడ్డారు. లలిత కుందనపు బొమ్మ. అవని కూడా తమ్ముడి ఇష్టానికి వోటేసింది. తిరిగి ఇంటికి వచ్చాక వారి అంతస్తు గురించిన విషయమే చర్చల్లోకి రాసాగింది. కానీ పిల్లలిద్దరూ అటువైపే మొగ్గడంతో తలిదండ్రులకు ఒప్పుకోక తప్పలేదు.
పెళ్ళి తాంబూలలప్పుడు మాత్రం అభిజిత్ తండ్రి నిష్కర్షగా చెప్పాడు మహేశ్ తో, పెళ్ళి తమ అంతస్తుకు తగినట్టు చేసివ్వాలని. తమ వైపు వచ్చే బంధువులంతా తమ అంతస్తు వాళ్ళేననీ, వారికి జరిపే మర్యాదలలో ఏ లోటూ రాకుండా చూసుకోవాలనీ మరీ మరీ చెప్పాడు. మహేశ్ ఇంటివాళ్ళు కూడా ఆయన మాటలని మన్నించి పెళ్ళికి వచ్చిన వియ్యాలవారికి ఏ రకమైన లోటు లేకుండా మర్యాదలు చేసి , మాట రాకుండా చూసుకున్నారు.
లలిత అభిజిత్ భార్యగా అడుగిడింది.
******
లలిత కూడా హైదరాబాద్ కు వచ్చేసింది. ఆమె అక్కడే ఇంటికి దగ్గర్లోని ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాయించింది. క్రొత్త జంట తమ దాంపత్య జీవితంలోని మధురిమను గ్రోలసాగారు. మొదటి సంవత్సరమే పిల్లలు వద్దనుకోవడం వలన దాని గురించిన జాగ్రత్తలు తీసుకున్నారు. రెండో సంవత్సరానికి దాంపత్యం అడుగిడగానే లలితకు పిల్లలను ఎత్తుకోవాలనిపించింది. “ ఏవండీ ! ఈ సంవత్సరం చివరికి మనకొక బాబో, పాపో పుట్టితే బావుంటుందండీ. ఇద్దరికే బోర్ కొడుతోంది. మా అమ్మావాళ్ళు కూడా ఎప్పుడు మనవణ్ణిస్తావని అడుగుతున్నారు “ అని ముద్దుగా చెవిలో పోరు పెట్టసాగింది. అభిజిత్ “ అలాగే ! దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడే కదా రెండో సంవత్సరంలోకొచ్చింది. చూద్దాం. “ అంటూ దాటవేశాడు. కానీ లలిత తన పోరు కొనసాగింది. ఒక వీకెండ్ లోని శనివారం రోజు రాత్రి, లలిత అతణ్ణి నిలదీసింది. అప్పుడు అభిజిత్ “ లలితా ! అర్థం చేసుకో. అక్కయ్యకు పెళ్ళై మూడు సంవత్సరాలవుతోంది. ఇంకా పిల్లలు పుట్టలేదు. అలాంటప్పుడు మనకు పిల్లలు కలిగే సూచనలు కనిపిస్తే తనకు ఎలా ఉంటుంది ? క్రుంగిపోదా ? అర్థం చేసుకో. మనం వెయిట్ చేద్దాం. అక్కయ్యదేమైనా తీపి వార్త రాగానే మనం ప్లాన్ చేద్దాం. నువ్వు చదువుకున్న దానివి. పరిస్థితులను ఆకళింపు చేసుకోగలవు. నా బంగారం కదూ “ అంటూ ముందరి కాళ్ళ బంధం వేశాడు. లలితకు ఇదేదో విచిత్రమైన లాజిక్ అనిపించినా, కొంత వరకు సబబేననిపించింది. ఇలా వాళ్ళ సంసారానికి మరో మెంబర్ ని ఆహ్వానించే కార్యక్రమం వాయిదా పడింది. లలిత అవనినుండి వచ్చే తీపి వార్త కోసం ఎదురు చూడసాగింది.
*****
దానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. ఒక మధ్యాహ్నం లలిత స్కూలుకు ఫోన్ చేసిన అభిజిత్ తను మేనమామ కాబోతున్న వార్తను లలితకు తెలిపాడు. తమకున్న అడ్డంకి తొలగిపోయినందుకు దంపతులు ఆనందించారు. ముందు నెలలోనే లలిత కూడా తనవంతు తీపి వార్తను అందించింది. రెండు వైపుల తలిదండ్రులకూ వార్తను అందించారు. ఇద్దరూ వాళ్ళ ఊళ్ళకు వెళ్ళి వచ్చారు. రెండు ఇళ్ళలోనూ ఆనందోత్సాహాలు. సంతోషం వెల్లివిరిసాయి. అభిజిత్ తలిదండ్రులకు రెండింతలు ఆనందం. అంతా అనుకున్నట్టుగా జరిగితే జీవితానికి విలువేముంది ?
******
తామొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందనే సామెత గుర్తుకొచ్చింది లలితకు, అవనికి అబార్షన్ అయిందని వినగానే.గర్బకోశం బలహీనమని చెబుతూ, కొంత కాలం విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పారని అభిజిత్ అన్నాడు. అత్తగారితో మాట్లాడితే ఆమె దేవుడిని తిడుతూ అసలు సరిగ్గా మాట్లాడలేదు. ఒకటే ఏడుపు ఫోన్లో. అభిజిత్ కయితే మూడవుట్ అయిపోయింది. అక్కా తమ్ముళ్ళు ఒకళ్ళకొకళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకేనేమో అభిజిత్ కూడా ఇంత బాధపడుతున్నాడు పాపం అనుకుంది లలిత. మేమిద్దరం కూడా అంతే కదా. తనకేదైనా ఒంట్లో బాగోలేకపోతే లోకేశ్ చేసే హడావుడి గుర్తుకొచ్చి సర్దుకుంది లలిత.
******
మరుసటి ఆదివారం ఊరికి బయలుదేరదీశాడు అభిజిత్ “ ఊరెళ్ళి అక్కను చూసి ఆమెను ఓదార్చాలి. పద “ అని. ఊరికెళ్ళిన లలితకు అత్తవారింట్లో ముందు మాదిరిగా ఆదరాభిమానాలు లభించలేదు. అత్తగారు మూతి బిగించుకునే మాట్లాడారు. మామగారి మొహంలో కోపం తాండవిస్తూ కనిపించింది. అవని వాళ్ళింటికి వెళ్ళారు. అక్కడ లలితతో ఎవరూ మాట్లాడలేదు. అవని అయితే తమ్ముడి భుజం పైన తల పెట్టి ఏడుస్తూనే గడిపింది వారున్నంత సేపు. ఆమె భర్త ఊళ్ళో ఉండలేదు. ఉన్నవాళ్ళు కాబట్టి అవనికి సపర్యలు బాగానే సాగిపోతూ ఉండడం గమనించింది లలిత. నౌకరు తెచ్చిచ్చిన కాఫీ త్రాగి బయటపడడం జరిగింది. ఇంటిలోని ఇబ్బందికరమైన వాతావరణంతో లలిత వ్యాకులపడింది. తను గర్భవతిగా కొనసాగడమే పెద్ద తప్పేమో అనిపించసాగింది ఆమెకి.
పుట్టింటికి వెళ్తానని అడిగి వారి అనుమతి తీసుకుని రెండు రోజులు అక్కడ ఉండి తన మనస్సును శాంత పరచుకుంది. మళ్ళీ హైదరాబాద్ కు వచ్చిన తరువాత కూడా అభిజిత్ తన మూడ్ నుండి బయటకు రాలేదు. ఇంట్లో ఒక గర్భవతి అయిన పెళ్ళాం ఉందన్నమాటే మరచిపోయినట్లు మెలగసాగాడు.
******
“ నాకు మూడ్ లేదు. “ అని. అన్నయ్యకు విషయం చెప్పి మీ స్నేహితుడికి కొంచెం చెప్పమని చెప్పింది. అతడికి కూడా అభిజిత్ కట్టుకున్న మౌనాన్ని భేదించడానికి చేతకాలేదు. లలిత పట్ల జాలి చూపాడే తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు. కానీ అమ్మనాన్నలకు ఫోన్ చేసి సంగతి చెప్పాడు. వారిద్దరూ హైదరాబాద్ వచ్చి వీళ్ళతో పాటు రెండు రోజులుండి వెళ్ళారు. లలిత మనసు కొంచెం శాంతించింది. కానీ అభిజిత్ ముభావంగా ఉండడం వలన అల్లుడితో దీని గురించి మాట ప్రస్తావించలేక పోయారు. లలితకైతే దిక్కు తోచకుండా పోయింది. కానీ, అభిజిత్ ప్రస్తుత ముభావం ఇంకా భయంకరమైన పరిస్థితులకు నాంది అని ఊహించలేకపోయింది.
******
ఆ రోజు ఇంటికి ఆదరాబాదరాగా వచ్చిన అబిజిత్ లలితని బయలుదేరదీశాడు. “ లల్లీ ! మనం మా ఊరు వెళ్ళాలి. అమ్మా, నాన్న రమ్మన్నారు. ఏదో మాట్లాడాలట. మనం రేపు ఉదయాన్నే బయలుదేరుదాం. బట్టలు సర్దుకుందాం.” అన్నాడు. లలితా గాబరాగా “ ఏమయిందండీ ? అందరూ బాగున్నారు కదా ? ఏమంత అర్జెంటు ? “ అని అడిగిన దానికి దురుసుగా “ ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ బాగున్నారు. చెప్పాను కదా ఏదో మాట్లాడాలట “ అంటూ సంభాషణను తుంచేశాడు. లలిత కూడా మాటలను కొనసాగించకుండా బట్టలు సర్దసాగింది.
మరుసటి రోజు సాయంత్రానికి అత్తవారింటికి చేరింది లలిత. వెనకసారి వచ్చినప్పటికంటే వాతావరణం తేలికపడినట్టు అనిపించసాగింది లలితకి. అత్తగారూ, మామగారూ బాగానే మాట్లాడారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. అప్పటికే ప్రొద్దు పోవడం వలన వారినుండి ఎలాంటి ప్రస్తావనా రాలేదు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు.
మరుసటి రోజు టిఫిన్ తర్వాత దంపతిలిద్దరూ హాల్లో కాఫీ తాగుతున్నారు. అప్పుడు లలిత అత్తగారు, మామగారు వచ్చి వీళ్ళతో పాటు కూర్చున్నారు. భర్త పక్కనే ఉన్నాడు. అత్తగారే మాట కదిపింది. “ చూడమ్మాయ్ లలితా ! అవని కలలు భగ్నమైన సంగతి నీకు తెలుసు కదా. ఆ విషయంగానే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఇందులో నీకు కూడా భాగం ఉంది కాబట్టి నీ అంగీకారం తరువాతే అలా చేద్దామనుకుని మిమ్మల్నిద్దరినీ రమ్మన్నాం.” అంటూ పీఠిక వేసింది.
“ అదేంటి అత్తగారూ? చెప్పండి. మీరంతా కలిసి నిర్ణయించారు అంటే అదేదో మంచి నిర్ణయమే అయుంటుంది. ఏంటి అవనిని హైదరాబాద్ పంపాలనుకున్నారా ? మా ఇంట్లో కొద్ది రోజులు ఉంటే వాతావరణం మార్పు అయినట్టుగా ఉంటుంది “ అంది లలిత.
“ అది కాదులేమ్మా ! అవనికేం ఇప్పుడు బానే ఉంది. బాగానే తేరుకుంది కూడా . అయినా వాళ్ళ ఇంట్లో జరగనివి, దొరకనివి మీ ఇంట్లో ఏం దొరుకుతాయనీ ? దానికి కాదులే కానీ, అవనికి అబార్షన్ అయిన సంగతి నీకు తెలుసు కదా. కానీ, నిన్న తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే, తన గర్భసంచే చాలా వీకట. ఇప్పటికప్పుడే మళ్ళీ గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నారట. అది విన్న తర్వాత అవని చాలా క్రుంగిపోయింది. తనను ఎలా ఓదార్చాలో మాకైతే అర్థం కావడం లేదు.” అంటూ ఆపింది.
వెంటనే లలిత “ అందుకే అత్తగారూ ! అవనిని హైదరాబాద్ పంపండి అన్నది. అక్కడైతే పెద్ద ఆస్పత్రులున్నాయి. ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మంచి ఆరితేరిన డాక్టర్లు ఉంటారు. అక్కడ అవనిని పరీక్ష చేయిద్దాం. ఈ రోజుల్లో ఎంతో మందికి మంచి ఫలితాలు వస్తున్నాయి. అక్కడ కనుక్కుని చూద్దాం. “ అంది.
“ అయ్యో అవన్నీఅయ్యాయమ్మా ! నిన్న మొగుడూ పెళ్ళాలిద్దరు హైదరాబాద్ వెళ్ళి పరీక్ష చేయించుకుని వచ్చారు. వాళ్ళు చెప్పిన మాటే ఇద్. అందుకేగా చెప్తోంది “ అంది నిష్టూరంగా.
“ ఆయితే ఏమిటి అత్తగారూ ! ఇప్పుడు క్రొత్త పద్ధతి వచ్చింది కదా, సరొగసి. వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకోవడం. అక్కడి డాక్టర్లకు అలా గర్భాన్ని మోసేవారు తెలిసుంటారు. కనుక్కోవచ్చు. “ అంది లలిత.
“ అవన్నీ కుదరవు అన్నాడమ్మా మా అల్లుడుగారు. తన సంతతి ఎవరో గర్భంలో పెరగడమన్నది ఊహించుకోలేకపోతున్నాను, నా కలాంటివి అక్కర్లేదు అన్నారు. “
“ మరైతే ఎలా ?”
“ ఆయన ఇంకేమీ చేయడు. మనమే వాళ్ళిద్దరి మనస్సులను సమాధాన పరచాలి అంతే. “
“అయితే ఏం చేద్దాం అత్తగారూ ?చెప్పండి. “
“ చూడమ్మా లలితా ! ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు బాధాకరమైనదే. కానీ మనమంతా అవనికి దగ్గరివాళ్ళంకదా ? ఆమె మనసుకు నచ్చే విధంగా నడుచుకోవడం మన కర్తవ్యం కదా ?” అని డొంకతిరుగుడు మాటలు మొదలు పెట్టింది అత్తగారు.
లలితకు ఆమె చెప్పబోయేదేంటో అర్థం కాలేదు. అవని కుటుంబంలో వచ్చిన సమస్యకు, అదీ ఇంత పర్సనల్ సమస్యకు, తనవద్దనుండి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందని వీరు అనుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు. అదే అనింది.
“ అత్తగారూ ! నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. కాస్త విడమరచి చెప్పండి. “
అత్తగారు అభిజిత్ వైపు చూశారు. అతను చూపులు తిప్పేశాడు. మామగారు బిగువుగా కనిపించారు. వారిద్దరూ మాట కదపరని అర్థమైనాక అత్తగారు తానే కొనసాగించారు.
“ చూడు లలితా ! అవనికి జరిగిన ఈ ప్రమాదం మమ్మల్నందరినీ కృంగదీసింది. ఏం చేద్దామా, ఏం చేస్తే బావుంటుంది అని బుర్రలు బ్రద్దలు కొట్టుకున్నాం. చివరికి నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పరిష్కారమే ఆమె మనస్సుకు ఊరట కలిగిస్తుందని మా నమ్మకం. మేమిద్దరం దీని గురించి చర్చించాము. అభిజిత్ కూడ ఒప్పుకున్నాడు. ఇక నీ నిర్ణయమే మాకు కావాలి. దీనివల నీ మనసు గాయపడుతుందని మాకు తెలుసు. కానీ, నువ్వు మెట్టిన ఈ ఇంటి నెమ్మది కోసం నువ్వు దీన్ని సహించాలి. మనందరికీ తెలుసు. భారతనారి తన కుటుంబానికై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందని. నువ్వు కూడా ఆ దారిలోనే నడుస్తావని నా అభిప్రాయం. “
“ ఇంతకీ విషయం ఏమిటి అత్తగారూ ? తొందరగా చెప్పండి. “
“ ఏం లేదమ్మా ! అవనికి లేని మాతృత్వపు అదృష్టం నీకు కూడా ఉండరాదు. అంటే నువ్వు కూడా తనలాగే ప్రస్తుతానికి పిల్లలు లేకుండా ఉంటే అదే దాని మనసుకి ఊరట కలిగిస్తుంది అని మా అందరి అభిప్రాయం. లేకుంటే అదలా పిల్లలు కలగకుండా ఉన్నప్పుడు, నువ్వు కడుపుతో ఇంట్లో తిరుగుతుంటే, నీ పిల్లలు ఇంట్లో ఆడుకుంటే దానికి ఎలా ఉంటుంది చెప్పు ? తను అలా దుఃఖపడుతుంటే మనమంతా సంతోషంగా ఎలా ఉండగలమో చెప్పు ? వీడు దానికి ముద్దుల తమ్ముడు. ఆ పరిస్థితిని ఊహించుకోవడమే వీడికి చేతకావడం లేదు. వాడికి పిల్లలే వద్దంటున్నాడు. వీరిద్దరూ ఇలా ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలమో చెప్పు ? అందుకే నేను, కాదు కాదు, మేము చెప్పడమేమంటే ప్రస్తుతానికి నువ్వు ఈ కడుపు తీయించేసుకో. భవిష్యత్తులో మళ్ళీ నువ్వు పిల్లల్ని కనవచ్చు. అదో పెద్ద సమస్య కాదు. దీనికి నీ అంగీకారం కావాలి. ఆపరేషన్ చెయ్యడానికి నీ అంగీకారం అవసరమట కదా ! అందుకే చెప్తున్నాను “ అంటూ లలిత మొహం వైపు చూసింది.
లలిత మొహం పాలిపోయింది. మెదడులో వెయ్యి డైనమైట్లు బ్రద్దలైనట్టనిపించింది. కోపం ఉబికి రాసాగింది. ఏమని బదులు చెప్పాలో తోచలేదు. అభిజిత్ వైపు చూసింది. అతడు తల వంచేసి కూర్చున్నాడు. మామగారైతే ఆమె వైపే తీక్ష్ణంగా చూస్తున్నారు ఎలా రియాక్ట్ అవుతుందో నని.
లావాలా ఉబికి వస్తున్న తన కోపాన్ని, దుఃఖాన్నీ అదిమి పెడుతూ అభిజిత్ వైపు తిరిగి “ ఏమండీ ! మీకు ఇది ఇష్టమేనా ? మీకు పిల్లలు అక్కర్లేదా “ అని వణుకుతున్న గొంతుతో అడిగింది.
అతడు మొహం గంటు పెట్టుకుని “ఇప్పటిదాకా అమ్మ చెప్పిందేంటి, మేమంతా దీనికి ఒప్పుకున్నామనే కదా ! మళ్ళీ అడగడం ఎందుకు ? అవును. నా అభిప్రాయం కూడా అదే. మనిద్దరికీ ఇప్పుడే పిల్లలు లేనంత మాత్రాన ఏం నష్టం లేదు. తరువాత మళ్ళీ ప్రయత్నిద్దాం. “ అన్నాడు.
“ నాకేంటండి అంత ఖర్మ ? నాకు దేవుడు మాతృత్వాన్ని కటాక్షించినప్పుడు నేనెందుకు అక్కర్లేదనుకోవాలి ? అవని గురించి నేను చెప్పటం లేదు. అది ఆమె దురదృష్టం. ఆమె పైన నాకు జాలి ఉంది. కానీ ఆమె సమస్యను నాకెందుకు అంటగట్తారు ? మీకు తెలీదా ప్రతి ఆడదానికీ మాతృత్వం అనేది ఎలాంటి వరమోనని ? దానికోసం అలమటించే వాళ్ళను అడగండి దాని విలువేమిటో ? ఎన్ని కష్టాలు పడతారో ? అలాంటిది నాకు ఆ అదృష్టం తనుగా వస్తే కాదనడమా ? మీ మాటలు బట్టి చూస్తే అవనికి అసలు పిల్లలు పుట్టకపోతే నేను గర్భవతినే కాకూడదు అనేలా ఉన్నారు. నేనైతే దీనికి సుతరామూ ఒప్పుకోను. ఇది నా బిడ్డ. దీన్ని ఏ పరిస్థితుల్లోనూ నేను చంపుకోను. ఆపరేషన్ చేయించుకోను. “ దాదాపు అరచినట్టే చెప్పింది లలిత.
ఇలా అంటుందని ముందుగానే అనుకున్నట్టుగా లలిత అత్తగారు “ ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా ! దీని గురించి మీరిద్దరూ ఆలోచించి మాకు రేపు చెప్పండి. సరేనా ? అభీ, నీ పెళ్ళాన్ని ఒప్పించే పూచీ నీది. ఆమెతో మాట్లాడు. నేనైతే నా కూతురి దుఃఖాన్ని చూస్తూ సహించలేను “ అంటూ తన భర్తను కూడ రమ్మని సైగ చేసింది. ఆయన కూడా లేచి వెళ్ళిపోయాడు. లలిత అభిజిత్ ను అక్కడే వదిలేసి తమ గదికి ఏడుస్తూ వెళ్ళిపోయింది. తల బ్రద్దలయి పోతుందనిపించింది.
***************
ఆ రోజు పొద్దున తను విన్నవిషయాన్ని తలచుకుని లలిత దిగ్భ్రమ చెందింది. దాని గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం తన్నుకు వస్తోంది. కోపం, ఆవేశం కలగలిపి ఆమెను చుట్టుముట్టాయి.
అభిజిత్ తనను ఓదారుస్తాడని కానీ, ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడని కానీ లలిత ఆశించలేదు. తన వంతు అభిప్రాయాన్ని అతడు అప్పుడే వాళ్ళ అమ్మానాన్నల ముందే చెప్పేశాడు. మళ్ళీ మార్చుకుంటాడనే ఆశ లేదు. శతృవుల మధ్య పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టయింది లలితకు. తమ ఇద్దరి నిర్ణయాన్ని రేపు చెప్పమని అత్తగారు చెప్పారు. హు ఇద్దరిదెక్కడ, ఇది తన నిర్ణయం మాత్రమే అనిపించింది లలితకు. అభిజిత్ దాని గురించి ఇక పట్టించుకోడని కూడా తెలుసు. అసలు గదిలోకి రాలేదు. భోజనానికి రమ్మంటే ఆకల్లేదు అని చెప్పేసింది.
అభిజిత్ తన అమ్మానాన్నలతో పాటు భోంచేసి, సినిమాకు వెళ్ళిపోయాడు. వాళ్ళమ్మకు చెప్పడం విన్నది. ఇక తనకు దిక్కెవరు అని పాలుపోలేదు లలితకు. చాలా సేపు మంచం పైన పడుకుండి పోయింది.
మూడు గంటలకు లేచి వంటింట్లోకి ఉన్న అత్తగారితో తను పుట్టింటికి వెళ్తానని చెప్పింది. అది కూడా ముందే ఊహించినట్లుగా ఆమె ఏ అభ్యంతరమూ చెప్పకుండా “ అభీని కూడా రానియ్యమ్మా ! ఇద్దరూ వెళ్దురుగానీ “ అంది.
“ లేదత్తగారూ ! నేనొక్కదాన్నే వెళ్ళాలి. ఆయన వస్తే హైదరాబాద్ కి వెళ్ళిపొమ్మని చెప్పండి. నేను అక్కడినుండి వస్తానని చెప్పండి. “ అన్నది. లలిత.
“ మరి మేము ప్రొద్దున చెప్పిన విషయాన్ని గురించి ?” అంటూ రాగం తీసింది అత్తగారు.
“ అత్తగారూ ! ఇది మా అమ్మా నాన్నలకు కూడ సంబంధించిన విషయం కదా ! వారి చెవిని కూడా ఒక మాట వేసి తరువాత తెలుపుతాను “ అని చాలా నెమ్మదిగా చెప్పింది లలిత.
“ ఒక్కదానివే వెళ్ళడం ఏం బాలేదమ్మా అయినా సరేలే ! అలాగే ! అక్కడికి చేరిన తర్వాత ఫోన్ చెయ్యి “ అన్నారు.
తన బట్టలన్నీ సర్దేసుకుని తమ ఊరికి ప్రయాణమయ్యింది లలిత. రాత్రప్పటికి ఊరికి వచ్చిన తమ అమ్మాయిని చూసిన మహేశ్, శాంతిలకు విషయమేమిటని అర్థం కాలేదు. అత్తగారింటికి ఏదో మాట్లాడి రావాలని వెళ్ళిన అమ్మాయి తమకేమీ చెప్పకుండా ఊరికెందుకు వచ్చిందో అర్థం కాలేదు. మొహం కాంతివిహీనంగా కనిపించింది. అందుకే ఏ మాటా కదపకుండా భోజనం పెట్టేసి, తాము తిని పడుకున్నారు.
***********
మరుసటి రోజు ఉదయం ముగ్గురూ కాఫీ త్రాగుతూ కూర్చున్నప్పుడు సంగతంతా వివరంగా చెప్పింది లలిత. వాళ్ళు కూడా గాబరా పడిపోయారు. దిక్కు తోచని పరిస్థితి. లోకేశ్ కు ఫోన్ చేసి అభిజిత్ తో మాట్లాడమన్నారు. సాయంత్రానికి ఫోన్ వచ్చింది తన మాట ఖాతరు చెయ్యడం లేదని. వియ్యపురాలితో ఫోన్ చేసి మాట్లాడింది శాంతి. ముక్తసరి బదులు వచ్చింది. అమ్మాయి అంతా చెప్పే ఉండాలే అదే మా నిర్ణయం అని. వియ్యంకుడు ఫోన్ ఎత్తుకోలేదు. ఇంట్లో మ్లానమైన వాతావరణం నెలకొంది. కూతురి తొలిచూలు సంబరం ఇలా అవుతుందని కలలో కూడ అనుకోని తలితండ్రులు బెంబేలు పడసాగారు. ఈ పరిస్థితిని ఎలా నిభాయించాలో, కూతురిని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు వారికి.
లోకేశ్ ని ఊరికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి చర్చించి నిర్ధరిద్దాం అనుకున్నారు. లోకేశ్ రాగానే స్నేహితుడి మీద మండిపడ్డాడు. “ దగుల్బాజీవెధవ ! నువ్వు పడే ఈ బాధ అంటే లెక్కే లేనట్టుంది వాడికి. ఏమంటున్నాడో తెల్సా ? నువ్వు ఇక్కడికి రావడానికి వాడి అనుమతి తీసుకోలేదట. వాళ్ళ నాన్నగారికి అసలు చెప్పలేదట. పెద్దవాళ్ళంటే నీకు ఖాతరే లేదట. అంత చెప్పరాని విషయమేం చెప్పామని అలా వెళ్ళిపోయింది , తన ఆడపడుచు బాధను అర్థమే చేసుకోలేదు అని ఎగిరెగిరిపడ్డాడు. నేను చాలా నిదానంగా వాడిని సర్దాలని ప్రయత్నించాను నాన్నా ! కానీ మాటే వినిపించుకోడు. ఒకటే మొండి పట్టు. తన అక్కకు లేనిది తనకు వద్దట. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా పెరిగారో, ఒకరంటే ఇంకొకరికి ఎంత ప్రేమో అని చెప్పుకొచ్చాడు. అక్కడికి మా అన్నా చెల్లెళ్ళకి అసలు ప్రేమే లేనట్టు. ఏం చేద్దాం నాన్నా ? నాకైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దామో తెలియడమే లేదు. వీళ్ళు ఇలాంటి నిర్దయులనుకోలేదు. “ అని బాధపడ్డాడు.
ఇలాంటి జటిల సమస్యలకు ఎవరి దగ్గర మాత్రమేం రెడీమేడ్ పరిష్కారాలు ఉంటాయి ? అందరూ దీర్ఘాలోచనలో మునిగిపోయారు. అందరి మనసులలోనూ ఆందోళన, కోపం, బాధ. అందరూ శూన్యం లోకి దిట్టిస్తున్నారు.
లలితకు మాత్రం ఒక విషయం అర్థమయింది. ఇది తన సమస్య. వీరంతా దీనితో ముడిపడి ఉన్నారు తప్ప వీరు సమస్యలోని భాగం కాదు. ఇది తన భవిష్యత్తు కాబట్టి ఎవరు ఏం సలహా చెప్పాలన్నా జంకుతారు. నిర్ణయం తను తీసుకోవాలి. వీళ్ళని ఆసరాగా ఉండమని అడగాలి. అంతే. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి చెప్పసాగింది.
“ నాన్నా, అమ్మా అన్నయ్యా ! నాకు తోచింది మంచిదనిపించింది చెప్తాను. మీరు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మీ ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆత్మాభిమానం దెబ్బ తినకుండా, మన కుటుంబ మర్యాదకు భంగం రాకుండా ఒక నిర్ణయం చెప్తాను. ఇది నాకు చాలా బాధ కలిగించేదే అనుకోండి. కానీ, పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంత కన్న మార్గం కనిపించడం లేదు. మీరంతా ఏం చెప్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు. అది కరక్టే. పరిస్థితులను ఎదుర్కోవలసిన దాన్ని నేను. “ అంది.
వెంటనే మహేశ్ “ అమ్మా ! నువ్వు ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటావని నాకు తెలుసు. నా పెంపకం పైన నాకు అంత నమ్మకం ఉంది. అదేంటో చెప్పమ్మా ! అందరూ ఆలోచిద్దాం “ అన్నాడు. శాంతి కూడా తలూపింది. లోకేశ్ ఏమీ మాట్లాడకపోయినా కుతూహలంగా చూశాడు.
“ అయితే వినండి నాన్నా ! నేనింక ఆ ఇంటికి వెళ్ళను. అభిజిత్ ను కూడా కలవను. నా వద్ద ఇంటి డూప్లికేట్ తాళంచెవి ఉంది. అతడు ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి నా సామాన్లన్నీ తెచ్చుకుని అతడికి చెప్పేస్తాను ఇక వాళ్ళింటికి రానని. అక్కడి స్కూలుకు రాజీనామా పంపుతాను. ఇక్కడ నేను ఇంతకు ముందు పని చేసిన స్కూల్లో జాయిన్ అవుతాను. బెడ్ రెస్ట్ అని చెప్పారు డాక్టరుగారు, అందుకే తొందరగా తీసుకొచ్చేశామని మీరు అందరికీ చెప్పవచ్చు. ఇక్కడే ఉండి అమ్మ దగ్గర పురుడు పోసుకుంటాను. నా బిడ్డను నేను ఉద్యోగం చేస్తూ పెంచుకుంటాను. మంచికీ చెడుకూ నాకు మీరు అండగా ఉండండి. పాప డెలివరి అయ్యాక నేను మరో ఇల్లు తీసుకుని ఉంటాను. అప్పుడప్పుడు మీరూ వస్తూ ఉండండి, నేనూ వస్తూ ఉంటాను. పాప పెంపకానికి అమ్మసాయం చేస్తుంది. నేను ఆర్థికంగా నిలదొక్కుకునే దాకా అవసరమయితే మీరు నాకు సహాయం చెయ్యండి. అంతేకాని నా ఈ మాతృత్వాన్ని మాత్రం నేను వదులుకోను. నా మాతృత్వపు భవిష్యత్తు ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధార పడడం నాకు ఇష్టం లేదు. సరేనా ?“ అని ఖచ్చితంగా చెప్పింది.
తలిదండ్రులు, లోకేశ్ కూడా తమ మద్దతు తెలిపారు.
ప్రకృతి మగవాడికిచ్చిన వరాలను హక్కుగా ఎలా అనుభవిస్తాడో అలాగే ఆడదానికిచ్చిన వరాన్ని కూడా తను కోల్పోరాదని దృఢంగా నిర్ణయించుకుంది లలిత. ఎందరో సింగిల్ పేరెంట్స్ గా ఉంటూ తమ పిల్లలని పెంచి పెద్దచేస్తున్నారు. వాళ్ళలో తను కూడా ఒకటవ్వాలని గట్టిగా అనుకుంది. మనసు తేలిక పడింది.
***
ఇదెక్కడి న్యాయం.?
ReplyDeleteనేనోప్పుకొని..!
నాకిది సుతరామూ ఇష్టం లేదు.!
రచయిత గారు కూడా నాకే ఓటు వేశారు.!
ఇందులో రెండు విషయాలు కనిపిస్తున్నాయి.!
ఒకటి అభ్యుదయవాదం, రెండోది సనాతన ధర్మం.!
ఎవరి మనస్తత్వాల్ని బట్టి వాళ్ళది ఎంచుకోవడమే.!