జర్నీ ఆఫ్ ఏ టీచర్ -9 - అచ్చంగా తెలుగు
 జర్నీ ఆఫ్ ఏ టీచర్ - 9
                                                                               చెన్నూరి సుదర్శన్

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)
మా ఆఫీసులో కేవలం  ఇద్దరు రికార్డు అసిస్టంట్స్ తో నడుస్తోండి. వారిలో ఒకరు కాలేజీ ప్రయోగశాలల్లో.. పరీక్షవిభాగంలో సహాయకారి. మరొకరు కాలేజీ బిల్లులను కాపీలు చెయ్యడం. ఒరిజినల్ బిల్స్ అన్నీ పాపారావు చేసే వాడు. నేను ఆఫీసు పనుల్లో కావాలనే తలదూర్చాను. నేను చేసిన బిల్స్ చూసి పాపారావు అభినందించి  తాను తప్పుకున్నాడు.  అలా ఆఫీసుకు మరింత చేరువయ్యాను.
ఒక రోజు స్టాఫ్ పర్సనల్ ఫైల్స్ తీసి ముందుగా విద్యాసాగర్ ప్రిన్సిపల్ ఫైల్  తీసి చదివాను. అతడు  యమ్మే (ఆంగ్లం) థర్డ్ క్లాస్.. లెక్చరర్ ఉద్యోగానికే అర్హుడు కాదు. కాని జూనియర్ కాలేజీ కొత్తగా ఏర్పడినప్పుడు అత్యవసరంగా స్టాఫ్ అవసరమై ప్రభుత్వం కొంత మందికి సడలింపు ఉత్తర్వులిచ్చింది.
ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపాల్‍గా పనిచేసే అర్హత లేదు. ఒరిజినల్ ప్రిన్సిపల్ పోస్టింగులో ఎవరూ నియమించబడలేదు. ఇక్కడున్న స్టాఫ్‍లో సీనియర్ అని గుడ్డిగా విద్యాసాగర్‍కు పట్టం గట్టింది ఇంటర్ మీడియట్ బోర్డు. 
ఈ విషయంలో పాపారావు విద్యాసాగర్‍ను బ్లాక్‍మెయిల్ చేస్తున్నాడేమోననే..   అనుమానం కలిగింది.
పాపారావు లెక్చరర్ ఫైల్ తీశాను. అతడు ఎమ్మే (తెలుగు) సెకండ్ క్లాసు.. టీచర్ నుండి ప్రమోషన్ పొందాడు.. కాని లెక్చరర్ సర్వీసులో అందరికంటే జూనియర్.
బాటనీ లెక్చరర్  క్రాంతి కుమార్ ఫైల్ చూసాను. అతడు అన్ని విధాలా అర్హుడు.. అతడు ప్రిన్సిపల్ ఇంచార్జ్ ఇష్టం లేదంటూ రాసిచ్చాడు.
ప్రిన్సిపల్ మారితే కాలేజీ కాస్తా చక్కబడే అవకాశం లేక పోలేదనుకున్నాను.
ఇంతలో పోస్ట్ మాన్ వచ్చి ఆఫీసుకు వచ్చిన ఉత్తరాలు బట్వాడా చేసాడు. అందులో నాపేర ఒక ఇన్ లాండ్ లెటర్ ఉందంటూ ఆఫీసు ఇన్ వార్డ్ రికార్డ్ అసిస్టెంట్ నాకిచ్చాడు. నేను ఆశ్చర్య పోయాను. సాధారణంగా నాకు ఉత్తరాలు ఇంటికి వస్తాయి. ఆఫీసుకెవరు రాసారా అని అనుమానపడుతూ ఫ్రం అడ్రస్ చూసాను.
అది నాగమణి రాసిన ఉత్తరం. మరింత ఆశ్చర్యపోతూ ఉత్తరం ఓపెన్ చేసాను.
గౌరవనీయ సూర్యపకాష్ మ్యాథ్స్ లెక్చరర్ గారికి,
నమస్కారములు.
నేనిక్కడ క్షేమంగా వున్నాను. మీరూ క్షమమే అనితలుస్తాను. మీరిక్కడ పట్టుమని పదిహేను రోజులు పనిచేయకున్నా మీ జ్ఞాపకాలు పదికాలాలు నిలిచి వుంటాయి. ముఖ్యంగా ఉత్తరం రాయడానికి కారణం..
మీరు కంజీర జూనియర్ కాలేజీ గురించి చేసిన హితోపదేశం బాగా పనిచేసిందని.. కాలేజీ గాడిన పడిందని.. అదే ఊళ్ళోని ఒక కళ్యాణ మండపంలో కళాశాల నిర్వహిస్తున్నారని.. ఆ విషయం మీకు తెలిజేయాల్సిందిగా ఇక్కడి ఫిజిక్స్ లెక్చరర్ కోరడంతో ఈ ఉత్తరం రాస్తున్నాను.
మీలా చొరవ తీసుకునే వారు చాలా అరుదు. మీరు మునిపల్లి కాలేజీని సైతం చక్కదిద్దాలని కోరుతున్నాను.
సెలవు..
మీ సోదరి సమానురాలు,
నాగమణి,
మ్యాథ్స్ జూనియర్ లెక్చరర్. 
ఉత్తరం కాసేపు నన్ను శూన్యంలోకి తీసుకెళ్ళింది. కొద్ది క్షణాలు అలాగే వుండి పోయాను. అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోయే  లెక్చరర్లు కంజీర కాలేజీని చక్కదిద్దారంటే నా మనసు ఒకింత ఆనందంతో  ఊయాలలూగింది.
నాగమణి ఉత్తరం నా వెన్నుతట్టింది.. నాలోని ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది.
కార్యోన్ముఖుణ్ణయ్యాను..   
జూనియర్ లెక్చరర్ హేండ్ బుక్ తీసి క్షుణ్ణంగా  ప్రభుత్వ ఉత్తర్వులు చదివాను. వాటిని పేర్కొంటూ కమీషనర్, డైరెక్టర్ గార్లకు ఉత్తరాలు రాసాను.
కాలేజీ పరిస్థితులను వివరిస్తూ విద్యార్థుల సంతకాలతో ఒక ఉత్తరం పోస్ట్ చేయ్యుమని సుధాకర్‍కు సలహా ఇచ్చాను.
ఈ విషయం విద్యాసాగర్‍కు తెలిసింది. అతడికీ కమీషనర్ కార్యాలయంలో తెలిసిన వారుండకపోరు.
నాతో మాట్లాడడం మానేసాడు విద్యాసాగర్. అయినా నేను భయపడ లేదు.
సుధాకర్ నాకు మద్దతుగా  విద్యార్థులతో మంచి పునాది వేసాడు.
పాపారావు ఉడికి పోతున్నాడు. విద్యాసాగర్‍ను భయపడకు నేనున్నాను. అంటూ అభయమిచ్చాడు. విద్యాసాగర్  వద్ద అధిక మొత్తంలో డబ్బులు పట్టించాడు. 
సెలవు పెట్టి డైరెక్టరేట్ ఆఫీసుకు వెళ్లి సీరియస్‍గా ప్రయత్నాలు కొనసాగించాడు.  కాని అతడి పప్పులుడుకలేదు.
పదిహేను రోజుల్లోనే కొత్త ప్రిన్సిపల్ రఘురామయ్య వచ్చి జాయినయ్యాడు. 
విచిత్రమేంటంటే పాపారావుకూ బదిలీ ఉత్తర్వులొచ్చాయి. నాకు ఆశ్చర్యమేసింది. ఇది సుధాకర్ నాయకత్వంలో రాసిన ఉత్తర ఫలితమనుకున్నాను.
రఘురామయ్య ప్రిన్సిపల్ అనుభవజ్ఞుడు.. జిల్లాలో మంచి పేరున్నవ్యక్తి. 
సాధారణంగా ప్రిన్సిపల్ ఎవరైనా ఒక కాలేజీకి బదిలీ అయినప్పుడు దాని జాతకమంతా కనుక్కొని వస్తుంటారు.
రఘురామయ్య కాలేజీలో జాయిన్ కాగానే డైరక్టర్‍కు వినతి పత్రం పంపాడు.         
తాను ప్రస్తుతం తాత్కాలికంగా కాలేజీ చార్జ్ తీసుకుంటున్నట్లు.. కాలేజీ ప్రారభం నుండి ఎటువంటి ఆడిటింగ్ జరుగలేదని పేర్కొన్నాడు. పూర్తిస్థాయిలో అక్కౌంటంట్ జనరల్ సిబ్బందిచేత ఆడిటింగ్ జరిపిస్తే బాగుంటుందని వివరిస్తూ రాసాడు.
రఘురామయ్య కాలేజీలో జాయిన్ అయిన మరునాడు స్టాఫ్ మీటింగ్ పెట్టాడు. విద్యాసాగర్, పాపారావులు అనామకుల్లా ఓ మూలకు ఒదిగి కూర్చున్నారు. నేను స్టాఫ్ తరఫున పుష్పగుచ్చ మిచ్చి ఆహ్వానం పలికాను.
అన్ని విభాగాలకు ఇంచార్జ్ అయిన పాపారావు లేచి కాలేజీ గత సంవత్సర ఫలితాలు చెప్పాడు. ఇరవై శాతానికి మించి లేదు. పేరికగన్న మాల్ ప్రాక్టీసు సెంటర్ కదా.. మరింత ధారుణంగానా.! ఫలితాలని ఆశ్చర్యమేసింది.
రఘురామయ్య ఇదే విషయాన్ని నిగూఢంగా ప్రస్తావించాడు. ఇంచార్జీల పర్వం కొనసాగింది. నాకు పరీక్షల విభాగం.. క్రాంతికుమార్‍కు స్కాలర్షిప్ విభాగం.. హిస్టరీ లెక్చరర్‍కు లైబ్రరీ విభాగం కేటాయింపు జరిగింది.
పాపారావు రిలీవై వెళ్తే గాని కొత్త లెక్చరర్ మా కాలేజీకి వచ్చే అవకాశం లేదు. వెంటనే చార్జ్ అప్పగించాలంటూ పాపారావుకు ఆఫీసు ఆర్డర్ పంపించాడు రఘరామయ్య.
పరీక్షల విభాగం నేను పరిశీలిస్తే ఎలాంటి ఉత్తర్వులు లేకుండా కాలేజీ స్పెషల్ ఫీ నుండి పరీక్షల నిర్వహణ కోసం పదివేలు డ్రా చేసినట్లుంది. ఖర్చుల వివరణలతో బిల్లు బోర్డుకు ఇంకా పంపలేదు.
కాలేజీ గ్రంథాలయంలో పుస్తకాలన్నీ స్టాక్ రిజిస్టర్ ప్రకారం అప్పగించాలని హిస్టరీ లెక్చరర్ కోరే సరికి పాపారావు కుడితిలో పడ్డ ఎలుకలా గిల, గిలా కొట్టుకున్నాడు. ప్రతీ సంవత్సరం కొన్ని పుస్తకాలు చెదలు తిన్నాయని రద్దు చేసే అధికారం ప్రిన్సిపల్ కుంటుంది. విద్యాసాగర్ అలాంటి  సాయం చేసినా పాపారావు దాదాపు ముప్పది వేలు రూపాయలు బాకీ తేలాడు.
పైకి రాస్తే సస్పెండ్ అవుతావు.. మంచి మాటగా చెబ్తున్నాను. డబ్బులన్నీ కాలేజీ అక్కౌంట్‍లో కట్టేసి రిలీవ్ కమ్మన్నాడు రఘురామయ్య.
చేసేదేమీ లేక రఘురామయ్య చెప్పినట్లు చేసి రిలీవై పోయాడు పాపారావు.
ఒక శని గ్రహం వదిలిందని.. విద్యాసాగర్ కుడిభుజం విరిగిందని  సంతోషించాను.
అక్కౌంటంట్ జనరల్ సిబ్బంది వచ్చి కాలేజీని పూర్తిస్థాయిలో తనిఖీ చేసి వెళ్ళారు. దాదాపు పది రోజులు పట్టింది.
కొద్ది రోజులకు రిపోర్ట్స్ వచ్చాయి.. ఫలితంగా విద్యాసాగర్ సస్పెండయ్యాడు.  విద్యాసాగర్  ముఖం కళావిహీనమయ్యింది..
ఎవరు చేసుకున్న పాపం వారు అనుభవించక తప్పదనుకున్నాను.
అతడి పిల్లలు గుర్తుకు వచ్చి జాలి కలిగింది. కాని విద్యాసాగర్ వల్ల కాలేజీకి జరిగిన అన్యాయం క్షమించరానిది.
ఆరోజు కాలేజీ సమయమనంతరం మైదానంలో విద్యార్థులతో ఒక సభ నిర్వహించాడు సుధాకర్. కాలేజీకి పట్టిన శని గ్రహాలు తొలగి పోయాయని దీపావళి పటాసులు కాల్చారు పిల్లలు. 

No comments:

Post a Comment

Pages