మిగిలి పోయే మౌనం
భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.
భ్రమలో ఉన్న ఆనందం
నిజంలో కనిపించదేమి?
నిజంగా నువ్వు దూరమైనా
నాకలా అనిపించదేమి?
చేరుకోలేని తీరానివే ఐనా
చెంతనే ఉన్నట్లనిపిస్తున్నావు.
కోరుకోలేని కోరికవే ఐనా
చింతనే మరపిస్తున్నావు.
నిన్నటి నా వేదనలన్నీ
నీ పలకరింపుతో తేలికౌతున్నాయి.
నాలోని విరక్తులన్నీ
ఈ పులకరింపుతో దూరమౌతున్నాయి.
నీవు నిజంగా ఎండమావివే ఐనా
నిన్ను అందుకొని పొందాలని అనిపిస్తుంది.
నీవు నా భ్రమలో నీటి బావివే ఐనా
ఒక్కగుక్క నీరైనా త్రాగాలని అనిపిస్తుంది.
ఈ అనిపించడాలకు, కనిపించడాలకు
కారణమైన ఆశ నన్నిలా ఆడిస్తోంది.
వీటన్నిటినీ ఆవహించుకొని ఉన్న నిరాశ
నీవే కావాలన్న ప్రతిసారి నన్ను ఓడిస్తోంది.
నీవు నన్ను చేరుకున్నా,
నీ వియోగాన్ని నేను కోరుకున్నా,
ఈ ఆట ఆగి పోతుంది,
రగిలి ఉన్న నా హృదయం
మిగిలి ఉన్నమౌనమై సాగి పోతుంది.
***
No comments:
Post a Comment