నే రాయని కవిత - అచ్చంగా తెలుగు
demo-image
నే రాయని కవిత
పారనంది శాంతకుమారి

నే రాయని కవిత నన్నడిగింది ఇలా...
“ఏవేవో చూస్తున్నావు,ఏవేవో రాస్తున్నావు
నావైపెందుకు చూడటంలేదు
నన్నెందుకు రాయటం లేదు” అని.
“నీవు సహజత్వానికి దూరంగాఉన్నావు
అందుకే నన్ను ఆకర్షించలేకపోతున్నావు.
నా భావనకు భారంగా ఉన్నావు
అందుకే నిన్ను అక్షరాలలోకి
అనువదించలేకపోతున్నాను”అన్నాను.
“కల్పనే కమనీయంగా కవ్విస్తుందని,
ఊహే తీయగా ఊరిస్తుందని తెలియదా”అంది.
“తత్వమే నన్ను తపింప చేస్తుందని,
సత్యమే నన్ను స్పందింపచేస్తుందని”చెప్పేను.
“కలలు అలలుగా స్పర్శించినా
తలపులు తన్మయత్వాన్నివర్షించినా  అవి క్షణికమే.
కానీ,సహజత్వం సాటి లేనిది,
వాస్తవం విలువైనది”అన్నాను.
“ఆస్వాదించటం,ఆనందించటం
నీకు రాదులే”అంది నిర్వేదంగా.
అర్ధంచేసుకోవటం,ఆశీర్వదించటం
నీకు తెలియదులే”అన్నాను నిస్సంకోచంగా.
“మరి నా గతేమిటి?ఈ మతేమిటి?
నన్ను పట్టించుకోవా?నీ బాట పట్టించలేవా?”అంది చివరికి నిరాశగా.
“కలల్లోంచి ఇలలోకి రా,ఊహలోంచి వాస్తవానికి రా,
నిన్ను చేరదీస్తాను, నీకు చేవనిస్తాను “అన్నాను సాదరంగా.
ఆ కవిత నే చెప్పిన మార్పును స్పందించింది,
నాకు తన వందనాన్ని అందించింది,
మారిన మనసుతో చిరునవ్వులు చిందించింది.
***

Comment Using!!

Pages