సుబ్బుమామయ్య కబుర్లు - పని చెయ్యండి - అచ్చంగా తెలుగు

సుబ్బుమామయ్య కబుర్లు - పని చెయ్యండి

Share This

ఇంట్లోను, బయటా చిన్న చిన్న పనులు పనిచేయండి!

పిల్లలూ ఎలా ఉన్నారర్రా! బావున్నారా!!
మీరేమో బడిలో చక్కగా మాస్టార్లు చెప్పే పాఠాలు విని అప్పటికప్పుడు బడిలోనే చెయ్యమని చెప్పే క్లాస్ వర్కులు చేసుకుంటారు. అలాగే ఇంట్లో చేసుకుని రమ్మనే హోంవర్క్ లు ఇంటికొచ్చి సొంతంగా లేదా అమ్మానాన్నల సహాయం తీసుకుని పూర్తిచేసుకుంటారు. మరేమో మీరు చదువుకుంటుంటే అమ్మానాన్నలు మిమ్మల్ని డిస్ట్రబ్ చేయరు. ఎందుకంటే తమ పిల్లలు చక్కగా చదువుకోవాలని కదూ! సరే, చదువుకోవడం పూర్తయ్యాక ఏం చేస్తారు? ఆడుకోడానికి వెళతారు. అవునా?
ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అమ్మానాన్నలకి చిన్న చిన్న పనులు చేసిపెట్టండి. అది వాళ్లకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అమ్మ అన్నం వండుతున్నప్పుడో, గిన్నెలు కడుగుతున్నప్పుడో చిన్న చిన్న సహాయాలు చేయండి. అలాగే నాన్నగారేమన్నా బజారు పనులు చేసుకు రమ్మంటే చేయండి. ఎందుకు?
అమ్మ ఎంత కష్టపడితే ఇల్లు అంత చక్కగా ఉంటోందో, కమ్మటి పదార్థాలు వండి పెడుతోందో తెలుస్తుంది. నాన్నగారు బజారుకు పంపించినప్పుడు కూడా వస్తువుల ధరలు ఎలా ఉంటున్నాయో ఎంత ఖరీదుపెట్టి ఇంటికి కావాలసినవి కొంటున్నారో తెలుస్తుంది. అంతేకాదు ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో. వెల ఎలా ఉంటుందో, బేరాలెలా ఆడొచ్చో అన్నీ తెలుస్తాయి. మీరు కొనెప్పుడు అదే షాపుకు వచ్చే మిగతా కొనుగోలుదారులు వస్తువులు కొనేప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుస్తుంది. ఒకే వస్తువు కొనేప్పుడు షాపుకు షాపుకు ఉన్న వ్యత్యాసం అర్థమవుతుంది. కల్తీ నివారణ కోసం అసలైన బ్రాండ్ లను లోగోలు చూసుకుని కొనడం. ముఖ్యంగా తినే వస్తువులను ఎక్స్పైరీ డేట్ (తేదీ) తప్పకుండా చూసి కొనడం అలవాటవుతుంది.
పన్నులంటే ఏమిటి? అవి ఎలా వేస్తారు? G S T అంటే ఏమిటో, అది వివిధ వస్తువులకు ఎలా చెల్లించాలో తెలుస్తుంది.
అలాగే ఈమధ్య ఆన్ లైన్లో అమ్మకాలు పెరిగాయి. సెల్ ఫోన్, లేదా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ద్వారా వస్తువుల ఆర్డర్ ఎలా ఇవ్వాలో, వస్తువులను తెప్పించుకోడంలో ఎలా ట్రాక్ చెయ్యాలో తెలుసుకోండి.
ఇదంతా లోకజ్ఞానమర్రా!
కొనుగోలుదారులుగా, వినియోగదారులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనం చెల్లించే ధరకి సరైన వస్తువును తెచ్చుకున్న వాళ్లమవుతాం.
ఇదంతా చదువుకుంటే రాదు. బయట తిరిగితే వస్తుంది. పిల్లలైనా ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదేనర్రా!
మరి తల్లిదండ్రులకు సహాయం చేస్తారు కదూ! చేస్తారు. నాకు తెలుసు ఎందుకంటే మీరు మంచి పిల్లలు కదా!
ఉంటానర్రా మరి.
మీ సుబ్బుమామయ్య.


No comments:

Post a Comment

Pages