ప్రధాన మంత్రిగారి మరో స్కీము - అచ్చంగా తెలుగు

ప్రధాన మంత్రిగారి మరో స్కీము

Share This
 ప్రధాన మంత్రిగారి మరో స్కీము
  “ శారదా తనయ “

ఆనందరావు ఒక మధ్య తరగతి మనిషి. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో క్లర్కుగా పనిచేసి ఎక్కడా ఏ రిమార్కూ లేకుండా రిటైరయ్యి, తన స్వంత ఇంట్లో భార్యతో పాటు ఉంటున్నాడు. రిటైరయ్యాక చేతికందిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాచుటీ మొత్తాలనుండి పిల్లల కిచ్చేది ఇచ్చి మిగిలిన మొత్తం పైన బ్యాంకునుండి వచ్చే వడ్డీ, బ్యాంకు వారిచ్చే పెన్షన్లతో మర్యాదగానే తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి, ప్రశాంతి పెద్దది. ఆమెను ఇంజనీరింగ్ చదివించి, ఆమె ఉద్యోగం లో చేరాక వచ్చిన మంచి సంబంధం తాలూకు అబ్బాయితోనే పెళ్ళి జరిపించి ఒక బాధ్యత నెరవేర్చుకున్నాడు. అబ్బాయి ప్రణీత్ కూడా ఇంజనీరింగే చదివి, పై చదువుల కోసం అమెరికా వెళ్ళి, ఉద్యోగం సంపాదించుకుని అక్కడే ఉండిపోయాడు. తన చదువుకు తగిన ఉద్యోగం రాలేదనీ, వచ్చిన ఉద్యోగం తాలూకు జీతం తన ఖర్చులకే సరిపోవడం లేదని ఫోన్లో చెబుతూ, నాలుగేళ్ళయినా ఇండియా రాలేదు. ఇంకా పెళ్ళి కాలేదు. ఇదీ ఆయన ప్రస్తుత కుటుంబ పరిస్థితి.

తనకు నెలా నెలా వచ్చే పింఛను డబ్బులు ఇల్లు గడుపుకోవడానికి సరిపోయేవి. బ్యాంకు నుండి వచ్చే వడ్డీ సొమ్మును అనిరీక్షిత ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఆయన రిటైరయ్యేటప్పటికి ఉన్న వడ్డీ రేట్లతో నెలానెలా వచ్చే మొత్తం ఎలాగోలా సరిపోయేది. కాని ఇటీవలి కాలంలో బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు తగ్గించేసరికి నెలా నెలా వచ్చే వడ్డీ మొత్తం తగ్గింది. దాంతో ఆనందరావుకు కంగారు ప్రారంభమయ్యింది. ధరలేమో పెరిగి పోతున్నాయి, ఇలాగే వడ్డీ రేట్లు తగ్గి తనకు నెలనెలా వచ్చే మొత్తం తగ్గిపోతే ఎలా అనే దిగులు పట్టుకుంది.

ఈ డబ్బుల్ని ఎక్కడయినా ఎక్కువ వడ్డీలు వచ్చే చోట పెట్టాలన్నా భయం. ఎక్కడ డబ్బులు ఇరుక్కుపోతాయో లేదా గల్లంతవుతాయో అని గాభరా.  బ్యాంకులో అయితేనే సురక్షితం అనిపించి అక్కడే కొనసాగించాడు. కాని, వడ్డీ మొత్తం తగ్గిపోయి డబ్బులకు కటకట కాసాగింది.

తనకు తెలిసిన బ్యాంకింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఇలా వడ్డీ రేట్లు తగ్గడానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం అని ఆయన నమ్మసాగాడు. ప్రభుత్వాన్ని, దాని ఆర్థిక విధానాలను తిట్టుకోసాగాడు. అదీగాక, రిటైరైన తన సహోద్యోగుల అమెరికాలో ఉన్న పిల్లలు, నెలనెలా వారి అమ్మానాన్నలకు డబ్బు పంపి ఆదుకునేది ఆయనకు తెలుసు. దానివలన వారి జీవన విధానాలు మెరుగై, వారికి కావలసింది కొనగలగడం, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిరావడం చూసిన ఆనందరావుకు తన స్థితి పైన ఇంకా చిరాకు పెరగసాగింది. తన కొడుకు వద్ద నుండి డబ్బు రాకపోయె. ఎంత సంపాదిస్తున్నాడో కూడా తెలీదు. వీడికి ఇక్కడే ఉద్యోగం వచ్చుంటే బాగుండేది. అసలు ఈ ప్రభుత్వం మన దేశంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించింది ? ప్రతి పక్షాలవాళ్ళంతా తిట్టిపోస్తున్నారు. నిజమే మరి. వాడిక్కడే ఉండుంటే తాము వాడితోనే ఉండేపని. కొంతమంది తన స్నేహితులు అలా పిల్లలతో ఉంటూ మంచి మంచి అపార్ట్ మెంట్లలోని అన్ని రకాల సౌకర్యాలు అనుభవించడం చూశాక అతనిలో అసంతృప్తి ఇంకా పేరుకోసాగింది. ’అయినా పెరిగి పెద్దవాళ్ళయిన పిల్లలు తలిదండ్రులను దగ్గిర పెట్టుకొని తీరాలి. తమ యవ్వనాన్నంతా ధారపోసి పిల్లలని పెంచలేదా ఏమిటి ? తాము అప్పుడు ఎన్ని సుఖాలను వదులుకున్నాం ! తనైతే పిల్లలకు దూరం అవుతానని ప్రమోషన్ తీసుకోకుండా ఉత్త క్లర్క్ గానే రిటైరయ్యాడు. లేకపోతే తను కూడా మేనేజర్ అయ్యేవాడు.’ అని ఎప్పుడూ ఆలోచించేవాడు.

అప్పుడు వచ్చింది, డీమానిటైజేషన్. ఉన్నట్టుండి అందరి వద్ధ ఉన్న అయిదొందలు, వేయి రుపాయాల నోట్లు ఒక ప్రకటనతో రద్దయి పోయాయి. రెండో రోజునుండి వాటిని బ్యాంకులో వేసి మార్చుకుని తీసుకుని రావడానికి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఆనందరావు తన సర్వీసు చివరి దశలో ఎక్కడో దూరపు బ్రాంచిలో పనిచేశాడు. దగ్గరగా ఉన్న తన బ్యాంకు శాఖలో ఎవరి పరిచయమూ లేక డబ్బు తీసుకోవడానికి, పెద్ద నోట్లు మార్చుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. దాంతో ప్రభుత్వ మీదా ఎక్కడలేని కోపం వచ్చింది ఆనందరావుకి. తరువాత కూడా ఎ టి ఎం లలో డబ్బు దొరకక నానా అవస్థలు పడాల్సి రావడంతో ఆ కోపం ఇంకా ఎక్కువయిపోయింది. “ఎందుకు ఏదో సుఖంగా సాగి పోయే అందరి బ్రతుకుల్ని ఈయన కష్టాల పాలు చేయాలి ? ఏం అధికారముంది ఈ ప్రభుత్వానికి ఇలా చేయడానికి ? ఇన్ని సంస్కరణలు అమలులోకి తెస్తామనే ఈ ప్రభుత్వం మాలాంటి సీనియర్ సిటిజన్ల కోసం ఏం చేస్తోంది ? ఇలా ముసలితనంలో కొడుకుల మీదో, కొడుకులు లేకపోతే కూతుళ్ళ పైనో, కాకపోతే ఇంకొకరి మీదో ఆధారపడి బ్రతకాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రభుత్వం తరఫునుండి సహాయం అందించే దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు ? అదేదో రాష్ట్ర ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసిందట, ప్రభుత్వ నౌకర్లు తమ తలిదండ్రులను తప్పనిసరిగా చూసుకుని తీరాలనీ, అలా చూసుకోక పోతే వారి మీద తగిన చర్య తీసుకో బడుతుంది అని చదివాడు తను. ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేయడం వరకైతే ముదావహమే కానీ, అమలు జరుగుతోందా లేదా అని పర్యవేక్షించేది ఎవరు ? మన దేశంలో ఎన్ని ఇలాంటి చట్టాలు లేవు సరిగ్గా అమలు కానివి. అందుకే ఇంతటి అరాజకం ! అమెరికాలాంటి దేశాలలో అదేదో సోషల్ సెక్యురిటీ అనే సౌకర్యం కల్పించారట. ఒక వయస్సు దాటిన పెద్దవారికి ప్రభుత్వ తరఫు నుండి ఆర్థిక సహాయం లభిస్తుందట. వారు ఎవ్వరి పైనా ఆధారపడక్కర్లేదట. అలా మన దేశంలో కూడా ఏవైనా పద్ధతులు ప్రవేశపెడితే బాగుణ్ణు. “ అనుకుంటూ రోజులు గడపసాగాడు.
**************

“ నా ప్రియమైన దేశవాసులారా ! “ తొమ్మిది గంటల వార్తలు వింటున్న ఆనందరావు గుండె వార్తల మధ్యలో వినబడిన ప్రధాన మంత్రి గొంతు విని గుభేలుమంది. “ఇంతకు ముందు కూడా డీమానిటైజేషన్ రోజు ఇలాంటి సంబోధనే కొంపముంచింది. ఇక ఇప్పుడేం కష్టాలు తేనున్నాడో ఈయన “ అనుకుంటూ టివి చూడసాగాడు. “ నా ప్రియమైన దేశవాసులారా ! మన భారతదేశం ఎంతో భవ్యమైన పరంపర కలిగింది. మన దేశ ప్రజలు ఎన్నో త్యాగాలు చేసి ఈ భరతభూమిని కాపాడుకున్నారు. ఈ రోజు మనం ప్రపంచంలో ఒక స్వతంత్ర దేశంగా, ఒక స్వతంత్ర ప్రజానీకంగా మనగలుగుతున్నాం అంటే అది ఒకరి, ఇద్దరి త్యాగాల వలన కాదు. దేశ ప్రజలంతా ఇలాంటి ప్రజా ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని కటిబద్ధులై, ఎన్నికలలో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని, తమకు నచ్చిన నాయకులను ఎన్నుకుంటున్నారు. “ ఇలా సాగింది ప్రధాని ఉపన్యాసం. “ చాలు స్వామీ ! ఈ పొగడ్తలు చాలు. ఇంకా ఏ కష్టాలు పడమంటావు మమ్మల్ని. ఈ ముందరి కాళ్ళ బంధాలు చాలు. అదేదో చెప్పి చావు “ అని కసిగా అనుకున్నాడు ఆనందరావు.

“ మనందరికీ తెలిసినట్టుగానే మన దేశం నుండి ఇతర దేశాలకు వలస వెళ్తున్న యువత పెరుగుతున్నారు. వారి తలిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు. వారు పెద్దవాళ్ళవడం వలన వారిని చూసుకోవడానికి ఎవరూ లేరు. వీళ్ళు ఆ దేశాలకు వెళ్ళి ఉండలేరు. వీసా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడి జీవన విధానాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతున్నారు. దాంతో ఇక్కడి వృద్ధుల సమస్యలు దేశ సమస్యలుగా మారుతున్నాయి. వారికి సరిగ్గా తిండి అందదు, వైద్యకీయ సహాయం అందదు, అంత వరకూ ఎందుకు, వారితోమాట్లాడడానికి కూడా ఎవరూ ఉండరు. ఒంటరి జీవితం గడుపుతూ ఉంటారు. ఎందరో కోటీశ్వరులు తమ ఆస్తులను పిల్లలకు పంచి, వారు అనాథలుగా జీవితం గడిపుతున్నటువంటి వాస్తవాలు కూడా సోషియల్ మీడియాలో మనం చూస్తున్నాము. కాబట్టి దీనిని ఒక సామాజిక సమస్యగా తీసుకుని మా ప్రభుత్వం దానిని పరిష్కరించే దిశగా అడుగులు కదుపుతోంది.

దీనిలోని భాగంగా నేను ఈ రోజు ఈ విధంగా ప్రకటిస్తున్నాను. రేపటి నుండి బ్యాంకులలో 20 లక్షల దాకా ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్ల కు పరిమితం చేస్తున్నాము. అలాగే సీనియర్ సిటిజన్ వయో పరిమితిని ౫౦ సంవత్సరాలకు తగ్గిస్తున్నాము. అంటే ఎవరైనా కానీ తమ డిపాజిట్లలో మొదటి ౨౦ లక్షలు పెద్దవారి పేరిట చేశాకే మిగతాది తమ పేరిట పెట్టుకోవచ్చు. పెద్దల పేరిట డిపాజిట్లు తండ్రి పేరు పైన కానీ తల్లి పేరు మీద కానీ, లేదా వారిద్దరి పేర్ల పైన కానీ ఉండవచ్చు. ఆ డిపాజిట్లకి వడ్డీ రేట్లు ఇవాల్టి రోజున ౮.౦౦ శాతం అని నిర్ణయస్తున్నాను. మిగత డిపాజిట్లపైన  వడ్డీ ౪ శాతం మాత్రమే ఉంటుంది. తమ తలిదండ్రులు కాలం చేసిన తరువాతే ఈ డిపాజిట్లు పిల్లల పేరిట మారతాయి. తాము తమ తలిదండ్రల పేరిట ౨౦ లక్షలు డిపాజిట్ చేశామని బ్యాంకులకు కానీ మరే ఇతర సంస్థలకు గానీ చూపించాకే మిగతా డబ్బు తమ పేరిట వేసుకోవచ్చు. అంతకంటే తక్కువ మొత్తం ఎప్పుడూ పెద్దలకే చెందుతుంది.  తలిదండ్రులిద్దరూ చనిపోతే దానికి తగిన ఆధారం చూపించాకే ఆ సొమ్ము వీరి పేరు మీద జమా చేయబడుతుంది. అలా జమా చేయబడిన సొమ్ముకు మళ్ళీ పెద్దల డిపాజిట్ల వడ్డీ రాదు.   ఇలా చేయడం వలన ప్రభుత్వం పెద్దల ఆర్థిక సంబంధమైన అస్థిరతను దూరంచేయాలని తలపెట్టింది. ఇది మా ప్రథమ ప్రయత్నం మాత్రమే. ఇంకా పెద్దలకు ఇలాంటి మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నది మా ప్రభుత్వ ఆశయం.  ఈ ఉత్తర్వులు రేపటినుండే జారీకి వస్తాయి. బ్యాంకులకు తగిన ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇంతకు ముందు ప్రభుత్వం ప్రకటించిన డీమానిటైజేషన్ సమయంలో తమ సహాయ సహకారాలు అందించిన బ్యాంక్ సిబ్బంది మొత్తం మా ఈ సదుద్దేశాన్ని అర్థం చేసుకుని ఈ ప్రయత్నానినికి కూడా ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా పిలుపునిస్తున్నాను. అలాగే ఇంకా ఇంకా ముందు వయో వృద్ధులకు మా ప్రభుత్వం అనేక విధాల చేయూత నిచ్చే ప్రణాళికలను జారీ చేసే ఆలోచనలోఉంది. వారి శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. దేశ యువత ఈ దేశం యొక్క శక్తి అయితే, వయసయిన వారు ఈ దేశం యొక్క అనుభవాల ఖజానా అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను.  జై హింద్ “ అంటూ తన ప్రసంగాన్నిముగించారు ప్రధాని. తరువాత ఈ వార్త గురించిన ప్రతిపక్షాల వ్యాఖ్యలు, విసుర్లు,  మిత్ర పక్షాల మెచ్చుకోళ్ళ పర్వం కొనసాగింది. తరువాత దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల అబిప్రాయాలు, అభిశంసల మధ్య టివి చానెళ్ళు కిటకిటలాడసాగాయి.

ప్రసంగమంతా విన్న ఆనందరావుకు ఇంతవరకూ ప్రభుత్వం పైన పేరుకున్న కోపం పోయి, దాని స్థానే మెచ్చుకోలు కనిపించసాగింది. తలిదండ్రులను పట్టించుకోని పిల్లలకు తగిన శాస్తి జరిగింది. ఇక మీద వాళ్ళ డిపాజిట్ల పైన వడ్డీ రావాలంటే వాళ్ళ పెద్దల పేర్ల పైన వేయాల్సిందే. అది వాళ్ళ పేరున ఉంటుంది కాబట్టి వాళ్ళ సంతకాలు లేనిదే సొమ్ము తీయడానికి రాదు. అలా కాకుండా తమ పెద్దలకు డబ్బులు ఇవ్వకూడదనుకుంటే తమ పైకాన్నంతా తక్కువ వడ్డీకి  ఉంచాలి. ఇదేదో ఈ ప్రధాన మంత్రిగారి స్కీము బావున్నట్టుందే అనుకుంటూ మురిసిపోసాగాడు.
******************
“ఏమండీ! ఏమండీ ! ఏమిటా మొద్దు నిద్ర ? టైమెంతయిందో తెలుసా ? పొద్దెక్కి పోయింది. లేవండి. ఎంతకీ లేవకపోయే సరికి ఎంత భయపడ్డానో తెలుసా ? లేవండి. లేవండి “ అంటూ ఆనందరావు భార్య అతడిని లేపసాగింది. కళ్ళు తెరచిన ఆనందరావుకు మళ్ళీ తన మామూలు ఇల్లు, భార్య కనిపించే సరికి “ ఇప్పుడు టైమెంతయింది ?” అని అడిగాడు. “ పొద్దున ఎనిమిదైంది. మామూలుగా ఆరున్నరకల్లా లేచేవారు. వచ్చి చూస్తే గురక పెట్టి నిద్రపోతున్నారు. రాత్రి నిద్ర పట్టిందో లేదో పడుకున్నారు లే అనుకుని మళ్ళీ లేపలేదు. తీరా చూస్తే ఎనిమిదయింది. “ అన్నదామె. తను కలగన్నానని అర్థమయింది ఆనందరావుకు. తనకు వచ్చిన ఈ ఐడియా ప్రధాన మంత్రికి వచ్చి, దేశమంతటా దీన్ని వర్తింపజేస్తే ఎంత బావుంటుంది అనిపించింది. తనలో తనే నవ్వుకుని, కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయలుదేరాడు ఆనందరావు.
************* 


1 comment:

  1. చాలా బాగుంది.నిజంగా అలా చేస్తే బాగుంటుంది.

    ReplyDelete

Pages