పుష్యమిత్ర - 31
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్తాడు. మనదేశ ప్రస్తుత రాజకీయాలు ఆయనకు అవగాహనకు వస్తాయి. తన కాలంలో యవనులు లాంటి ముష్కరుల దండయాత్రలకు భయపడి కొన్ని వేల మణుగుల బంగారాన్ని భూగర్భంలో ఒక సొరంగంలో దాచిన విషయం చెప్తాడు పుష్యమిత్ర. ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉండడం వలన ఆలోచనలో పడతారు. ఆర్ధిక శాఖామాత్యుడైన పంచాపకేశన్ దాన్నిఎలాగైనా అపహరించాలని పన్నాగాలు వేస్తుంటాడు. పాకిస్థాన్ వెళ్ళిన పంచాపకేశన్ బృందాన్ని దిల్లీలో సీ.ఐ.డీ డిపార్ట్మెంటు పట్టుకోడానికి వల వేస్తారు. (ఇక చదవండి)
పాకిస్థాన్ నుండి ఎలాగోలా దిల్లీ విమానాశ్రయం బయటకు చేరుకున్న ఆరుగురి బృందానికి నాయకుడైన వెంకటేశన్ చాలా టెన్షన్ గా ఉన్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలేదు. అన్నీ సైగల ద్వారానే జరుగుతున్నాయి. పంచాపకేశన్ చెప్పిన అపరిచిత వ్యక్తి వచ్చి వారికి ఆరు చెన్నై టిక్కెట్లు ఇచ్చాడు. వారి ఫ్లైట్ కు ఇంకా రెండు గంటల సమయం ఉంది. అంతా ఏదో తెలీని భయానికి గురవుతున్నారు. సెక్యూరిటీ చెక్ కు ఇంకా గంట టైం ఉంది. వారు టికెట్స్ చూపించి లోపలకు వెళ్ళారు. రెస్టారెంటుకు వెళ్ళి భోజనాలు అయిందనిపించారు. రెస్టారెంట్ నుండి వారు బయటకు వస్తుండగా నలుగురు సెక్యూరిటీ బృందం వారిని చుట్టు ముట్టారు.
"యూ గైజ్... వేర్ ఆర్యూ గోయింగ్?"
" వుయ్ ఆర్ లీవింగ్ ఫర్ చెన్నై సర్" లోపల ఎంత టెన్షన్ ఉన్నా నవ్వుతూ సమాధానమిచ్చాడు వెంకటేశన్.
"వేర్ ఫ్రం యు ఆర్ కమింగ్?"
"దిల్లీ దేఖ్ నేకే లియే ఆయా సాబ్"
"నో యు ఆర్ లైయింగ్. టెల్ మీ ది ట్రూత్"
"నో సచ్ హై"
"దెన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యు కం ఎలాంగ్ విత్ మి"
ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద సమావేశ గదిలోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సోఫాలలో కూర్చోమని చెప్పి వాళ్ళు లోనకు వెళ్ళారు. ప్రతి గుమ్మం వద్ద నలుగురు సెక్యూరిటీ బృందం ఉన్నారు. "భగవంతుడా! ఏమి చెయ్యాలి? దొరికిపోయామా?" అని వెంకటేశన్ భయపడుతుండగా మైక్ లో "రిలాక్స్ జెంటిల్మెన్. ప్లీజ్ సీ దిస్ ఫొటో ఆల్బం జస్ట్ ఫర్ టైం పాస్" అని వినబడ్డ ఒక నిముషం తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద వారు పాకిస్తాన్ లో దిగినప్పటినుండి ఖెవ్రా మైన్స్ లో తిరగడం తిరుకడయూర్ అల్లాబక్ష్ ఇంట్లో ఉండడం అంతా ఫొటోస్ ప్రదర్శన సీరియల్ లా సాగుతోంది. వెంకటేశన్ బృందానికి ఏ.సీ. రూంలో కూడా ముచ్చెమటలు పట్టాయి. వారు రకరకాల మార్గాల ద్వారా దిల్లీ చేరుకోవడం అన్నీ కనిపించాయి. ఫొటోస్ డిస్ప్లే ముగిసిన వెంటనే నలుగురు ఏ.కే-47 గన్స్ తో లోపలికి వచ్చారు. ఆ తర్వాత ఇందాక రూం లోకి తీసుకుని వచ్చిన నలుగురు ఆఫీసర్లు లోపలికి వచ్చారు.
“నిజం చెప్పండి? మీరెవరు? పాకిస్థాన్ ఎందుకు వెళ్ళారు? మీకూ ఆ సాల్ట్ మైన్స్ కు సంబందం ఏమిటి?" ప్రశ్నలు తూటాల్లా దూసుకొచ్చాయి.
వెంకటేశన్ గొంతు సవరించుకుని "జస్ట్ ట్రావెలర్స్ గా చూడడానికి వెళ్ళాం సార్!" అన్నాడు.
వెంటనే ఒక ఆఫీసర్ చెంప ఛెళ్ళు మనిపించాడు. "వుయ్ వాంట్ ట్రూత్!" అని అరిచాడు.
వెంకటేశన్ కు పంచాపకేశన్ గతంలో చెప్పిన మాటలు 'మీరు ఈ ఆపరేషన్ లో ఏదైనా సమస్యల వలన మరణిస్తే మీ కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తాను. నిజం మాత్రం ఎట్టి పరిస్థితులలో పొక్కకూడదు ' అన్న మాటలు చెవుల్లో రింగులు తిరుగుతున్నాయి. ఒకవేళ నిజం చెబితే పంచాపకేశన్ చంపించేస్తాడు. అప్పుడు డబ్బులు కూడా ఉండవు. ఏమి చెయ్యాలి? మధన పడుతున్నాడు.
"ప్లీజ్ టెల్ మీ. డోంట్ వేస్ట్ టైం" హూంకరించాడు అధికారి.
"నిజం సార్. మాకు ట్రెక్కింగ్ చాలా ఇష్టం. అందుకే వెళ్ళాం. దగ్గరలో మైన్స్ బావున్నాయంటే చూడ్డానికి వెళ్ళాం."
"వేర్ ఆర్ యువర్ పాస్పోర్ట్స్?" అందరూ పరిశీలించిన అనంతరం
"వై యు హావ్ నాట్ గాన్ బై ఫ్లైట్?"
"హిమాలయాలు ఎక్కాలని"
"మీరు గతంలో ఏ ఏ పర్వతాలు ఎక్కారు? రికార్డ్స్ ఉన్నాయా?"
సమాధానం లేదు. మౌనంగా ఉన్న వెంకటేశన్ కు ఏ.కే -7 గురిపెట్టి అడిగారు.
"నిజం చెబితే వదిలేస్తాం. చెప్పండి"
ఎంతకూ సమాధానం రాకపోయే సరికి వారి దగ్గర పాస్పోర్ట్లు, సెల్ఫోనులు లాక్కొని దిల్లీ లో ఒక
పాడుబడ్డ గృహంలో బంధించారు.
* * *
"సార్! వీళ్ళు నిజం చెప్పడంలేదు. బంధించి మన అబాండండ్ ఆఫీసర్స్ క్వార్టర్స్లో బందీలుగా ఉంచాం"
తల పంకించాడు పీ.ఎం.
"ఎట్టిపరిస్థితులలోను వారిని వదలకండి. ఎలా ఐనా సరే! వాళ్ళ చేత ఎవరు వాళ్ళను సాల్ట్ మైన్సు కు పంపించారో తెలుసుకోవాలి. చాలా సీక్రెట్ ఆపరేషన్. ఎవరి దగ్గరా నోరు జారకండి. చాలా ప్రమాదం.
* * *
"మీరు ఊహించినది నిజమే! మన ఎఫ్.ఎం. సామాన్యుడు కాదు"
"నాకు ఆరోజు మైన్స్ లో అతని వ్యవహారం చూస్తేనే అర్ధమయింది"
"వాళ్ళ బృంధం పాకిస్థాన్ వెళ్ళి వచ్చారు. మైన్సును ఆల్రెడీ చెక్ చేసి వచ్చారు"
"భగవంతుడా! దేశంకోసం ఆరోజుల్లో ప్రాణాలు ఇచ్చేవారు. ఇప్పుడిలా తయారయింది"
"వాళ్ళ ప్లాన్ ఏమిటో అర్ధం కావడంలేదు"
"మీరు అనవసరంగా భయపడకంది ప్రధాన మంత్రిగారూ! అది అంత సులభంగా తెరవలేరు వాళ్ళు"
"ఎందువల్ల?"
"ఆ గుహకు నాగబంధం (నాగపాశం) వేయించాను"
"అవునా? ఆశ్చర్యంగా ఉంది."
"అవును"
"వివరంగా చెప్పండి పుష్యమిత్రాజీ"
"వినండి. నేను వేదాలను సమగ్రంగా చదివి చక్రవర్తి నయ్యాను. వేద కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. "అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో..." కశ్యపునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్టి యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు. తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు. ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి. తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. క్రైస్తవ మతంలో కూడా.. తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం, ఈవ్లను దేవుడు ఈడెను తోట నుంచి బహిష్కరించి వారిని అందుకు పురికొల్పిన సాతాను సర్పాన్ని... నీవు నీ పొట్టపై పాకుతూ, మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులగుదురు గాక! నీవు వారి కాలిపై కాటు వేస్తావు, వారు నీ తలపై గాయపరుస్తారు అని ఆజ్ఞాపించారు.
ప్రాచీన కాలం నుంచి సర్పం సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.
1. దేవునిగా- తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.
2. తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. మీకాలం నాటి నవీన శాస్త్రజ్ఞుడు 'కెకూలే' ఈ చిహ్నాన్ని కల గని 'బెంజిన్' అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని నేను ఒక పుస్తకంలో చదివాను.
3. పునరుజ్జీవనానికి, పునర్ యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతిపాత్రమై, సర్పం వైద్యరంగానికి చిహ్నమైంది.
4. గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం. అది అలెగ్జాండర్ దండయాత్రలప్పుడు మనకు అవగతమైంది కదా!
5. జ్ఞానానికి కూడా చిహ్నం.
6. దెయ్యాలకు, సైతానుకు కూడా సర్పాలే గుర్తు.
మన నాగరికత కంటే ముందు ఎన్నో వేల యేళ్ళ క్రితం...ఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కాననైట్లకు, మధ్యధరా ప్రాంతం వారికి, ఉగ్రాయిట్లు, సుమేరియన్లకు సర్పాలు సరప్ (మంట పుట్టించేవి), నాహాస్, పెటెన్, బెటెన్, నాగులుగా సుపరిచితమే. గిల్గామేష్ అనే కధ మీరు విన్నరో లేదో తెలీదు. ఆ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవనీ లతను సర్పం అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పని సరి చేస్తుంది. ఉదంకుని దగ్గరి కుండలాలపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణ భూతుడవుతాడు. ఇవన్నీ... గ్రీకు ఇతిహాసాలకు మన ఇతిహాసాలు చాలా దగ్గర పోలికలను తెలియ జేస్తున్నాయి. ఈజిప్షియన్లకు నాగ దేవతలున్నారు. యురియస్ సర్పం రక్షణకు, ఎపెప్ కీడుకు, ఎనెప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్లు ఎక్కువ. జూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. ప్రస్తుతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో ఒకప్పుడు నాగజాతి వారు సంచరించే వారు.
ఒక గ్లాసు మంచినీరు త్రాగి నిట్టూర్చి మళ్ళీ చెప్పనారంభించాడు. అందువల్ల నాగశక్తి ని పట్టి బంధించి నాగబంధం వేశాం. దాన్ని ఎవరూ తెరవలేరు. వరుసగా గుహ ద్వారాలకు గరుడబంధం-మండూకబంధం-వృశ్చికబంధం-గంధర్వబంధం ఇలా నవ బంధాల్ని ప్రయోగించి చివరగా నాగబంధం వేశాము. ఆ బంధాలు వేదమంత్రోక్త సుస్వరముతో కాకుండా తొందరపడి తాళం తెరిచే ప్రయత్నంచేస్తే నెత్తురుకక్కుకు చస్తారు. ఆ చావు చాలా ఘోరంగా ఉంటుంది. మీ అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్తాను. దానికి వేద మంత్రాలు తెలిసినవారు. ఒక మాసం రోజులు కఠిన దీక్ష వహించాలి. ఆశ్లేష నక్షత్రంతో ఆరంభించి మరలా ఆశ్లేష నక్షత్రం వచ్చే వరకూ ఉపవాసంతో యోగ సాధన చెయ్యాలి. అతి పవిత్రమైన వేదవేత్త గాని లేదా అతి శక్తివంతమైన మాంత్రికుడి వల్ల మాత్రమే అవుతుంది. అది కూడా నాగబంధనాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి, ఆలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గరుడమంత్రాన్ని పట్టించాలి. ఇలా తప్ప ఆ ద్వారాన్ని, ఇంకే విధంగా ఎవ్వరు తెరవలేరు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెరవాలని ప్రయత్నిస్తే ఉపద్రవాలు జరుగుతాయి. అందువల్ల మీరు నిశ్చింతగా ఉండండి. సామాన్య మనుష్యుల వల్ల ఈ పని ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఒకవేళ నేను తెరిపించాలన్నా ఒక మాసం దీక్ష వహించాలి. వేద మంత్రాలు మళ్ళీ పునశ్చరణ చేసుకుని తయారుగా ఉండాలి" అని తన సుదీర్ఘ ఉపన్యాసం ముగించాడు పుష్యమిత్రుడు.
ఆశ్చర్య పోయాడు ప్రధాన మంత్రి. అందువల్లనే ఆ మధ్యన తిరువనంతపురం లోని రహస్య గదిని తెరవడానికి సాహసం చెయ్యలేదన్న విషయం చెప్పాడు. పుష్యమిత్రుడు నవ్వి నిజమే! వేదాలలో ఉన్న సర్పమంత్రాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. తెరిచేటప్పుడు భయంకర విషసర్పాలు వస్తే వాటిని ఎలా అదుపు చెయ్యాలో తెలిసి ఉండాలి. ఈ విషయాలన్నీ నేను మా గురువు సుదర్శన భట్టు వల్ల నేర్చుకో గలిగాను. ఆయన వద్దకు చుట్టుపక్కల దేశాలనుండి వచ్చి వేదాలను అభ్యసించేవారు. అని సాయం సమయం అవడంతో ఒక్క సారి సోఫా దిగి నేలపై కూర్చొని సంధ్యను ఉపాసించి "చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభంభవతు కాశ్యప, అవత్సర, వశిష్ట త్రయార్షేయ ప్రవరాన్విత ద్వైముష్యాయన గోత్రః అపస్తంబసూత్రః కౌతుంబ సామవేద శాఖాధ్యాయి పుష్యమిత్ర శర్మ అహంభో అభివాదయే" అని నమస్కరించగానే ముఖ్యమంత్రి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ( సశేషం)
No comments:
Post a Comment