తామర (చర్మవ్యాధి) లేదా రింగ్ వార్మ్ - గురించి తెలుసుకోవలసిన విశేషాలు
అంబడిపూడి శ్యామసుందర రావు.
గజ్జి ,తామర వంటి చర్మ వ్యాధులతో చాలా మంది భాధ పడుతూ ఉండటం చూస్తూవుంటాము పైపెచ్చు ఈ వ్యాధులు అంటువ్యాధులు చాలా త్వరగా ఒకరి నుండి మరొకరి వ్యాపిస్తాయి కాబట్టి ప్రస్తుతము తామర అనే చర్మవ్యాధి ఎలావస్తుంది ఎలా వ్యాప్తి చెందుతుంది వస్తే ఆ రోగానికి చికిత్స ఏమిటి ఇంట్లో ఎవరికైనా వస్తే ఇతరులకు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను తెలుసుకుంటే ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు.ఎందుకంటే ఈ వ్యాధి చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి .
తామరను ఇంగ్లీషులో "రింగ్ వర్మ్" అంటారు వర్మ్ అంటే పురుగు అని అర్ధము కానీ ఇది ఒక పురుగు కాదు చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్ ఒక రకము శిలింద్రము వల్ల సంక్రమిస్తుంది. ఈ శిలింద్రము వెంట్రుకలు, చర్మము,గోళ్ల కు సంబంధించిన మృత కణాలలో నివసిస్తాయి కొన్నీ సందర్భాలలో మాడుపైన కూడా చేరుతుంది.
రింగ్ వర్మ్ ను గుర్తించటము :- ఈ వ్యాధి లక్షణాలు ఏభాగములో ఇన్ఫెక్షన్ జరిగింది అన్న దాని మీద ఆధార పడి ఉంటాయి ఎక్కువగా చర్మము ఇన్ఫెక్షన్ చెందటం వల్ల ఈ వ్యాధి రావచ్చు అప్పుడు కనిపించే లక్షణాలను తెలుసుకుందాము. మొదట ఎర్రటి దురద పెట్టే పొలుసు లాగా లేదా దద్దర్లు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ దద్దర్లు పుండ్లుగా ఏర్పడి రసి కారుతూ ఉంటుంది ఈ దద్దుర్ల చుట్టు ఎర్రటి వలయము రింగ్ లాగా ఏర్పడుతుంది కాబట్టి దీనిని రింగ్ వర్మ్ అంటారు. గోళ్లలో డెర్మటోఫైటోసిస్ డెవలప్ అవుతుంటే అంటే గోళ్లు మందముగా అయి రంగు వెలిసినట్లు అయి,గోళ్ళపైన పగుళ్లు కనిపించటం జరిగితే తామర వ్యాధి వచ్చినట్లే మాడుపైన తామర ఇన్ఫెక్షన్ గనుక వస్తే ఆ ప్రదేశములో జుట్టు ఊడి బట్టతల లాగా ప్యాచెస్ ఏర్పడతాయి .
రింగ్ వర్మ్ లోని రకాలు :-1. టినియా బార్బె -ఈ రకము తామర ముఖము, మెడ ప్రాంతాలలో వస్తుంది.వాపు దురద తో ప్రారంభమవుతుంది ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాలలో జుట్టు ఉంటే అది పోతుంది.సాధారణముగా మగవాళ్ళు క్షౌరశాల(మంగలి షాపు) కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువ అందుకనే దీనిని బార్బర్స్ ఇచ్ అంటారు.
2. టీనియా కార్పొరిస్ :-శరీరం పైన దద్దర్లు చుట్టూ ఎర్రటి వలయాలతో ఏర్పడటం ఈ వ్యాధి లక్షణము.
3. టీనియా క్రూసిస్:- ఇది గజ్జల్లో ,పిరుదుల పైన,తొడల లోపలి వైపు వచ్చే ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా మగవారిలో మరియు యుక్తవయస్సు మగ పిల్లలో కనిపిస్తుంది.
4. టీనియా పెడీస్ :- ఇది పాదాలలో వచ్చే తామర ఇది బహిరంగ మల విసర్జనకు చెప్పులు లేకుండా వెళ్లే వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే అపరిశుభ్రమైన ప్రదేశాలలో కాళ్లకు సులభముగా ఇన్ఫెక్షన్ జరుగుతుంది అంతే కాకుండా లాకర్ రూమ్స్,షవర్స్, స్నానాలు చేసే చెరువులు లేదా స్విమ్మింగ్ పూల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో అంటే ఎక్కువ మంది తిరిగే ప్రదేశాల్లో ఈ రకమైన ఇన్ఫెక్షన్ జరిగే అవకాశము ఉంది కాబట్టి బయట తిరిగేటప్పుడు వీలైనంతవరకు చెప్పులతో తిరగటం శ్రేయస్కరము.
ఈ తామర వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకుందాము. ఇది చాలా వేగముగా వ్యాప్తి చెందే అంటు వ్యాధి అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికీ, తాకటం లేదా వ్యాధిగ్రస్తులు వాడిన బట్టలు వాడటం వల్ల ఆరోగ్యవంతులకు కూడా వస్తుంది. పెంపుడు జంతువుల ద్వారా కూడా వస్తుంది కాబట్టి పెంపుడు జంతువులను పట్టుకున్నాక చేతులు శుభ్రముగా కడుక్కోవాలి ఇది ఆవులలో చాలా సామాన్యముగా ఉంటుంది. ఈ శిలింద్రాలకు సంబంధించిన సిద్ధబీజాలు మన బట్టలపైనా బ్రష్ లపైనా ఇతర ఇంట్లోని వస్తువులపైనా మనకు కనిపించకుండా అతుక్కుని వాటిని మనము తాకినప్పుడు మనకు ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. పొలాల్లో లేదా ఇతర మట్టి ప్రదేశాలలో పనిచేసే పనివారు కాళ్లకు చెప్పులేకుండా పని చేస్తుంటారు కాబట్టి మట్టి నుండి ఈ శిలింద్రాల ఇన్ఫెక్షన్ రావచ్చు.
మనకు తామర వ్యాధి వచ్చినట్లు ఎలా తెలుసుకోవటము ? తామర లేదా ఇతర చర్మ వ్యాధులు వచ్చినప్పుడు డాక్టరును సందర్శించే ముందు మనము కొన్ని లక్షణాలను బట్టి మనకు వచ్చింది తామరా? కాదా ? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు డాక్టరు ఎలాగూ అది ఏ వ్యాధో నిర్ణయిస్తాడు అనుకోండి. డాక్టర్ ఆ వ్యాధి తామర అవునో కాదో తెలుసుకోవటానికి చర్మాన్ని బ్లాక్ లైట్ ఉపయోగిస్తాడు. ఈ బ్లాక్ లైట్ ఉపయోగించినప్పుడు తామర కు కారణమైన శిలింద్రము మంచి ప్రకాశముగా కనిపిస్తుంది.ఈ విధముగా బ్లాక్ లైట్ ఉపయోగించి శరీరములో ఏ భాగములో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నదో డాక్టర్లు తెలుసుకుంటారు. కొన్ని సందర్భాలలో డాక్టర్లు దురద లేదా పొలుసుగా వున్నా చర్మాన్ని గీరి మైక్రోస్కోప్ క్రింద పరిశీలిస్తారు.
ఇంక ఈ వ్యాధికి ట్రీట్ మెంట్ ఏమిటో తెలుసుకుందాము. సాధారణముగా దీనికి చికిత్స విషయములో డాక్టర్లు యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్ ను, క్రీమ్ ను,లోషన్ ను ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎక్కువగా వాడివి క్లొట్రిమజోల్, మరియు మైకోనజోల్ ఆయింట్ మెంట్లు ఈ మందులను సాధారణముగా 2 లేదా 4 వారాలు తప్పని సరిగా వాడాలి అలా వాడితేనే ఫంగస్ పూర్తిగా నిర్ములించబడుతుంది.మళ్లి తిరిగి రాదు. శరీరము మీద ఎక్కువ ప్రదేశాలలో ఈ వ్యాధి వున్నప్పుడు యాంటీ ఫంగల్ ఆయింట్ మెంట్లు సరిపోవు వీటికి తోడు డాక్టర్లు నోటిద్వారా తీసుకోవటానికి కొన్ని మందులను కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు అవి కేటోకన్ జాలో ,టర్బినఫైన్ లేదా గ్రిసోఫుల్విన్ మొదలైనవి వివిధ ప్రాంతాలలో వీటి వ్యాపార పేర్లు భిన్నముగా ఉంటాయి.ఈ యాంటీ ఫంగల్ ఆయింట్ మెంట్, మందులు మొదలైన వాటితో పాటు డాక్టర్లు ఇంటి దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా చెపుతారు వీటి వల్ల ఇంటిలోని ఇతరులకు ఈ వ్యాధి సోకదు. పైగా మందులు త్వరగా పనిచేసి వ్యాధి త్వరగా నయము అవుతుంది. ఆ జాగ్రత్తలు ఏమిటి అంటే ఇన్ఫెక్షన్ సోకినా ప్రాంతానికి ఇబ్బందికలిగించే దుస్తులు వేసుకోకూడదు. రాపిడి వల్ల నొప్పి దురద లాంటివి ఎక్కువ అయి తగ్గటం ఆలస్యము అవుతుంది. వీలైనంత వరకు ఇన్ఫెక్షన్ సోకినా ప్రాంతాన్నిబ్యాండేజ్ తో కవర్ చేయాలి. వేసుకొనే బట్టలు పక్క బట్టలు రోజు ఉతకాలి లేకపోతె ఇన్ఫెక్షన్ తగ్గదు. చర్మాన్ని క్రమము తప్పకుండా శుభ్రము చేసుకుంటూ పొడిగా ఉంచాలి
తామర కు కారణమైన ఫంగస్ ను నిరోధిస్తే దాని వ్యాప్తిని బాగా తగ్గించవచ్చు ఈ ఫంగస్ వ్యాప్తి చెంద కుండా చర్మాన్ని పొడిగాను శుభ్రము గాను ఉంచుకోవాలి.బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు స్లిప్పర్లు వాడాలి. వాడే సాక్స్ బట్టలు టవళ్ళు ప్రతి రోజు మార్చాలి. ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు వారి బట్టలు సాక్స్ టవళ్లు వాడ కూడదు. పెంపుడు జంతువులతో ఆదుకున్న తరువాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధమైన జాగ్రత్తలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వ్యాధికి దూరముగా ఉండవచ్చు. ఈ వ్యాధి వచ్చిన భయపడవలసిన ప్రమాదం ఏమిలేదు మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు పాటిస్తే త్వరగా తగ్గుతుంది.
***
No comments:
Post a Comment